చేనేత అభ్యున్నతి… రాజకీయాధికారంతోనే సాధ్యం

మంగళగిరిలో విజయవంతమైన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్-2023

 

-వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధనలో భాగస్వామ్యులుకండి

-వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి, సభ్యులు రమేష్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల వినతి

మంగళగిరి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వరల్డ్ కాన్ఫరెన్స్-2023కు ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆర్.ఆర్. కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన సదస్సులో చేనేతల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా అందుకు రాజకీయ సాధికారత సాధించాల్సిన ఆవశ్యకతపై నిర్వాహకులు, ముఖ్యఅతిథులు, వివిధ సంఘాల ప్రతినిధుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా కొనసాగాయి.

సదస్సులో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి (అమెరికా), వ్యవస్థాపక సభ్యులు రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో)లు ఈ సంస్థ ఎందుకు ఏర్పడిందీ.. దాని లక్ష్యాలను సవివరంగా వెల్లడించారు. ‘‘అమెరికాలోని న్యూజెర్సీలో 2021 మే నెలలో ఆవిర్భవించిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ కు అంజన్ కర్నాటి (అమెరికా), డాక్టర్ హరనాథ్ పోలిచర్ల (డెట్రాయిట్), రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో), సారధి కార్యంపూడి (డల్లాస్) వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అనుకోని కారణాల వల్ల డాక్టర్ హరనాథ్, సారథి సదస్సుకు హాజరుకాలేదు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద వృత్తిగా ఉన్న చేనేత అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేతలకు అండగా నిలవాలంటే.. చే‘నేత’లందరూ ఐక్యంగా ముందుకు కదలాల్సిన ఆవశ్యకతను గుర్తించి.. చేనేతల్లోని అన్ని సామాజికవర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి చేనేతల అభ్యున్నతికి పాటుపడాలనే ప్రధాన లక్ష్యంతో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను నెలకొల్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నివసిస్తున్న చేనేత కుటుంబాలను కలుపుకోవడం ప్రధాన లక్ష్యం. చేనేత కుటుంబాలకు ఆసరగా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టడం. అందుకు మన చేనేతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సామాజిక సంఘాలు ప్రభుత్వ సహకారంతో చేనేతల సాధికారత కోసం కృషిచేయాలి. ఇక చేనేత కుటుంబాల్లో ప్రతిభావంతులకు కొదవలేదు. మేధో సంపత్తిలో ఇతరులకు ఏమాత్రం తీసిపోరు. అయితే, చేనేత వృత్తుల్లో ఉన్న కుటుంబాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడం. కొత్తగా విదేశాలకు వెళ్లినవారు అక్కడ కుదురుకునేవరకు అవసరమైన సహకారం… ఇమ్మిగ్రేషన్ సూచనలు, సహాయం… ఆరోగ్య సంరక్షణ అవగాహన సెషన్స్/ వెబినార్లు/ శిబిరాలు. వృత్తిపరమైన సహాయం, వ్యాపార అవకాశాలు- పరస్పర సహకారం అందించడం. వివాహ ప్రయోజనాలు కల్పించడం. చేనేతలు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత స్థితికి ఎదగాలి. అందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఎవరు ఏ రంగంలో ఎదుగుతున్నారో.. వారు ఆ రంగంలో మరింత ఉన్నత స్థితికి వెళ్లేందుకు గల అవకాశాలను మెరుగుపరుకునేందుకు కృషి జరగాలి. అన్నింటికి మించి ప్రధానంగా రాజకీయ సాధికారత సాధనకు అందరూ సహకరించుకోవాలి’. ఇవీ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రధానలక్ష్యాలు. వీటి సాధన కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులందరూ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధన కోసం సహకరించాలని ఈ సదస్సులో వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి, సభ్యులు రమేశ్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల విన్నవించారు.

ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ లతోపాటు వివిధ రంగాలకు చెందిన చేనేత ప్రముఖులు హాజరయ్యారు.

ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేతలు రెండు కోట్ల జనాభావున్నారని ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచే వీరి మూలాలు వున్నాయని తెలిపారు. నాయకులు ఏ రాజకీయపార్టీకి అనుబంధంగా ఉన్నా చేనేతల సమస్యలపై, చేనేతలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనమందరం ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతలు ప్రతిభాశాలురని, చేనేత వృత్తిలోనే కాకుండా అనేకరంగాల్లో నిష్ణాతులున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేనేతల్లో ఐక్యత సాధించేదిశగా మనలో స్ఫూర్తిరావాలని ఎంపీ సంజీవ్ కుమార్ సూచించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి మాట్లాడుతూ తాను 2001 బ్యాచ్ ఐఏఎస్ నని, తన సాధారణ కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సివిల్స్ , గ్రూపు వన్ ప్రధానపరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థికసహాయం అందించాలని.. 8, 9, 10 తరగతుల్లోనే విద్యార్థులు సివిల్స్ దిశగా లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని సూచించారు. ప్రధానం రాజకీయ వ్యవస్థలో మన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం వుందన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ తనకు రాజకీయంగా దివంగత ఎన్టీరామారావు అవకాశమిస్తే చేనేత బిడ్డ నాయకుడిగా ఉన్నానంటే అందుకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పుణ్యమేనని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరిలోనూ సర్వీసు చేయాలనే భావన ఉండాలని, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అందుకు పరస్పర సహకారం అవసరమని ఎల్.రమణ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో చేనేతలకు బలమైన నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని, అందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా చేనేత పిల్లల్లో కూడా మనం బాగా చదువుకోవాలని.. అటువంటివారికి వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందనే విధంగా సంస్థ వ్యవస్థాపకులు కృషిచేయాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ మనవాళ్లందరికోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం గొప్పవిషయంగా పేర్కొన్నారు. అందుకు ఎన్నారైలు ముందుకు రావడం ముదావహమన్నారు. చేనేతలు అంటే సౌమ్యంగా ఉంటారని, ఎవరి జోలికి వెళ్లరని వారి పని వారుచేసుకుంటారనే పేరుందని చెబుతూ ఇటీవలి ధర్మవరం చేనేత వస్త్రవ్యాపారులపై దారుణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బాధితులకు అండగా చేనేతలు ఐక్యంగా ఉండబట్టే కొంతమేరకైనా న్యాయం జరిగిందన్నారు. కాలంమారింది.. సౌమ్యంగా ఉంటే కుదరదు.. న్యాయం కోసం ఫైటింగ్ చేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మన రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మనమే పోటీచేసేవిధంగా చైతన్యం రావాలని, ఆ దిశగా మనల్ని మనం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగురాష్ట్రాల్లో చేనేతలు రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని సునీత కోరారు.

ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ తాము పుట్టిన జాతికోసం సహాయపడాలనే సదుద్దేశంతో ఎన్నారైలు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. చేనేతలు బలహీనులుకాదని, సమాజానికి నాగరికత నేర్పిన జాతి అని గుర్తుచేశారు. చేనేతలు అన్ని రంగాల్లో రాణిస్తూ గతంకన్నాకొంత మెరుగ్గా వున్నారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని చెబుతూ, చేనేత నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత చేనేతలపై వుందన్నారు. చేనేతలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుండాలని, స్వార్థాన్ని పక్కనబెట్టి చేనేత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో చేనేత జాతి బలమైన నాయకత్వం వహించి సీట్లు సాధించుకోవాలని సూచించారు.

మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ చేనేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు గతంలో కూడా కృషిజరిగిందన్నారు. నాయకుల్లో ఎవరు గొప్ప అనే అంశం పక్కనబెట్టి నాయకత్వం కావాలని కోరుకోవాలని సూచించారు. చేనేతల్లో ఉపకులాల ప్రస్తావన తేకుండా ఐకమత్యంతో వుంటే రాజకీయపార్టీలను మనం శాసించవచ్చని నిమ్మల పేర్కొన్నారు. అలాగే మనం గెలవగలిగే సీట్లలో మన నాయకులను ప్రోత్సహించాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ ఇలాంటి సభలు పెట్టడం చాలా గొప్ప విషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహక ఎన్నారైలకు అభినందనలు తెలిపారు. మనం రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడమేనన్నారు. చేనేతలు అంటే ఒకేకులం.. ఒకేబాటలో నడవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. చేనేత కులాలు ఐక్యంగా వుండి ముందుకు వెళ్లగలిగినప్పుడే ఈ సభల ప్రయోజనం నెరవేరుతుందన్నారు. రాజకీయాల్లో ముందుకువెళుతున్న నాయకులను వెనక్కి లాగే ప్రయత్నాలు మంచి పరిణామం కాదన్నారు. చేనేత ఉపకులాల మధ్య వివాహాలను ప్రోత్సహించాలని సూచిస్తూ.. అలా ముందుకు వెళ్లగలిగినప్పుడు ఉపకులాల మధ్య అంతరాలు, విభేదాలు వైదొలుగుతాయని ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా కమల పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య మాట్లాడుతూ ఐకమత్యం, ఎడ్యుకేషన్, ఆర్థికాభివృద్ధి, రాజ్యాధికారం వంటి ప్రధాన అంశాలు చేనేతల ఎదుగుదలకు దోహదం చేస్తాయన్నారు. ఏ కులం నీదంటే.. చేనేత కులం అని చెప్పుకునే స్థాయికి చేనేతలు ఎదగాలని సూచించారు. చిన్నచిన్నవిషయాలకే కోపతాపాలకు పోయి సంఘాలు పుట్టుకొస్తున్నాయని ఇది మంచి పరిణామం కాదన్నారు.

ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేతలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను ఒక వేదికగా భావించి చేనేతలందరూ భాగస్వామ్యం వహించాలని సూచించారు.

ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా చేనేత నాయకులను ఒక వేదికపైకి తీసుకురావడం గొప్పవిషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. చేనేతలకు సంబంధించి దీర్ఘకాలికసమస్యలున్నాయని చెబుతూ వాటిని సాధించడం కోసం రాజకీయపార్టీలకతీతంగా చేనేతనాయకులు లాబీయింగ్ చేయాలని సూచించారు.

సదస్సు తీర్మానాలు

ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

శాసనసభ స్థానాలు చీరాల, మంగళగిరి, రాజమండ్రి రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం,

పార్లమెంట్ స్థానాలు
హిందూపురం, కర్నూలు, రాజమండ్రి కేటాయించాలని సదస్సు తీర్మానించింది.

చేనేత వుత్పత్తులపై, చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్ హండ్లూమ్ బోర్డ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థల్ని పునరుద్ధరించాలని, 1985 చేనేత రిజర్వేషన్ యాక్ట్ ను పటిష్టం గా అమలు చేయాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని సదస్సు తీర్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *