తిరుమలలో తన్నీర్ అముదు ఉత్సవం

 

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల, 2023 జ‌న‌వ‌రి 15:

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 22 వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

ఆదివారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు.

ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో ఆదివారం నాడు ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేశారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకొచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.

అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

————————————————————————

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *