(రాఘవశర్మ)
హోరెత్తుతున్న జలపాతం!
దానికి వేకువాలేదు, వెన్నెలా లేదు!
దివా రాత్రులు అదే హోరు! అదే పోరు!
ఎత్తైన కొండపై నుంచి ఒక పెద్ద రాతి గుండంలోకి దుముకుతోంది!
చుట్టూ నీటి ముత్యాలను చిమ్ముతూ, జల సంగీతాన్ని వినిపిస్తోంది!
రెండు రాతి కొండల నడుమ నీటి గుండాల్లోపడి, పొంగి పొర్లి ముందుకు సాగిపోతోంది!
ఆ జలపాతానికి ఎన్ని స్వరాలో! ఎన్ని రాగాలో!
అవి తనకే సొంతమైనట్టు గారాలు పోతోంది !
గుంజనను చూడాలన్న చిరకాల స్వప్నం ఎంతకాలానికి సాకారమైందో!
ఒక మహా దృశ్యం మా కళ్ళ ముందు ఇలా సాక్షాత్కరించింది!శేషాచలం కొండల్లో గుంజన ఒక మహాద్భుత జలపాతం.
తల కోన తరువాత ఇదే అతి పెద్దది.
దాని దరిచేరడం అంత తేలిక కాదు.
ఆ దరిదాపుల్లోకి ఎన్ని సార్లు వెళ్ళినా, ఆ సాహసం చేయలేకపోయాను.
యుద్ధగళను సందర్శించినప్పుడు, గుంజన హోరును దూరం నుంచే విన్నాను.
కానీ, గుంజన లోయలోకి దిగలేకపోయాను.
దాని పైభాగపు నీటి గుండాల్లో ఎన్నో సార్లు మునిగి తేలాను.
కానీ, దాని హొయలను కళ్ళారా చూడలేకపోయాను.
***
తిరుపతి నుంచి శనివారం రెండు బృందాలుగా గుంజనకు బయలుదేరాం.
మధు ఆధ్వర్యంలోని ఇరవై మంది డేర్ డెవిల్ ట్రెక్కర్లు ఉదయమే వెళ్ళారు.
భూమన్, ప్రభాకర రెడ్డి తదితరులతో కలిసి మరో పదిమందిమి మధ్యాహ్నం బయలుదేరాం.
గుంజన వెళ్ళడానికి ప్రకృతి బాట నుంచి పుల్లుట్ల దారి ఉంది.
భారీ వర్షాలకు ఆ దారంతా కొట్టుకుపోయి, గండ్లు పడింది.
మరొక దారి కోసం కడపజిల్లా కోడూరుకు రెండు కిలోమీటర్ల ఈవల కుడివైపున సూర్రాజుపల్లెకు చేరాం.
అక్కడి నుంచి శేషాచలం కొండలలోకి దారితీశాం.
చుట్టూ అరటి , బొప్పాయి తోటలు.
మధ్యలో మెలికలు తిరిగిన రోడ్డు!
ఇవ్వన్నీ ఒకప్పుడు ఎద్దుల బండి బాటలే.
పక్కనే గుంజన ఏరు, ఎంత పెద్దదో!
ఏరంతా గుండ్రటి గులకరాళ్ళ తో నిండి ఉంది.
అక్కడక్కడా నీళ్ళు కనిపిస్తున్నాయి.
కుడివైపున రైల్వే వంతెన కింద నుంచి ఏరు ప్రవహిస్తోంది.
ఏటికి ఆవల ఎడమవైపున గంగరాజు పోడు.
మా వాహనాలు కుడివైపున సాగాయి.
కొంత దూరం వెళ్ళాక అటవీ శాఖ గేటు దాటుకుని ముందుకు సాగాం.
అంతా దట్టమైన అడవి. రకరకాల చెట్లు, తీగలు.
చుట్టూ పచ్చని కొండలు.
కొండ అంచుల నుంచి మా ప్రయాణం సాగుతోంది.
వెనక్కి తిరిగి చూస్తే దూరంగా నాగేటి చెరువు.
గుంజన నుంచి వచ్చిన నీళ్ళు నాగేటి చెరువులోకి వచ్చిపడతాయి.
సాయంత్రానికి దొంగల చెలకు చేరుకున్నాం.
పదిహేడు కిలోమీటర్ల అటవీ మార్గంలో ప్రయాణించడానికి రెండుగంటలుపట్టింది.
దొంగల చెల దగ్గర మా వాహనాలు నిలిపేసి నడక మొదలుపెట్టాం.
దూరంగా పైనుంచి గుంజనలోకి వస్తున్నఏటి ప్రవాహం.
ఎటు చూసినా అడవి గోగులు.
పచ్చని అడవి అంతా తెల్లని గోగు పూలతో సింగారించుకుంది.
కొండపైనుంచి ఎడమవైపున ఏటవాలుగా దిగడం మొదలు పెట్టాం.
ఎదురుగుండా మరొక ఎత్తైన కొండ.
రెండు కొండల నడుమ పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తున్నవిశాలమైన గుంజన ఏరు.
గుంజన ఏరంతా గులకరాళ్ళతో నిండిఉంది.
ఎక్కడెక్కడినుంచో కొట్టుకు వచ్చిన బండ రాళ్ళు.
ఏటి ప్రవాహానికి వేళ్ళతో పెకిలించుకుపోయిన వృక్షాలు.
మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని బోద.
తిరుపతి జ్ఞాపకాలు – 48
రెండు కొండల నడుమ ఉన్న ఏరంతా తిరుగాడాం.
పడమరనుంచి తూర్పునకు ప్రవహిస్తున్న గుంజనలోకి ఎన్ని ఏర్లు వచ్చి చేరాయో! మొగిలిపెంట , యుద్దగళ, కంగుమడుగు, విష్ణుగుండం, మూడేర్ల కురవ, ఎనమలేటి కోన; ఇలా చాలా ఏర్లు వచ్చిన గుంజనలో కలిసిపోయాయి.
అసలు వర్షాకాలంలో చూడాలి దీని అసలు స్వరూపం.
గుంజన ఒక పెద్ద పోటెత్తిన నదిలా ప్రవహిస్తుంది.
చీకటి పడబోతోంది.
పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి.
ఏటిలో తూర్పు వైపునకు నడకసాగించాం.
మాకంటే ముందుగా బయలుదేరిన ట్రెక్కర్లు ఏటి మధ్యలో గుడారాలు వేస్తున్నారు.
మరొక పక్క రాత్రి వంటలు ప్రారంభించారు.
పవర్ బ్యాంక్‌లతో కర్రలకు లేట్లు ఏర్పాటు చేశారు.
పక్కనే ప్రవహిస్తున్న ఏరు.
ఏటికి అటు ఇటు పరుచుకున్న విశాలమైన రాతి నేల.
కొందరు ఏటిలో ఈదులాడారు.
చిరుతిళ్ళు మొదలయ్యాయి.
అలసి సొలసిన శరీరాలకు విశ్రాంతి అవసరమవుతోంది.
ఆకలిగొన్న కడుపులకు వేడి వేడి వంటకాలతో విందు భోజనం.
మెల్లగా చలి మొదలవుతోంది.
చలిమంటల చుట్టూ చేరి కబుర్లు, పాటలు, సరదాలు.
ఆ అడవిలో అర్ధరాత్రివరకు ఆనందం తాండవమాడింది.
అక్కడ చిన్నపెద్దతారతమ్యాలులేవు.
అంతా సమానం. ఒకరికొకరు సహకారం.
ఒకరొకరు తమ తమ గుడారాలలోకి దూరుతున్నారు.
చలిపెరుగుతోంది.
ఎప్పుడు నిద్రలోకి జారుకున్నామో తెలియదు.
రాత్రంతా ఏటి ప్రవాహం జోలపాడుతూనే ఉంది.
తెలతెలవారుతుండగా మళ్ళీ పక్షుల పలకరింపులు.
రెండు కొండల నడుమ ఏటిలో ఎన్ని అందాలో!
నిదానంగా స్నానాలు, అల్పాహారాలు ముగిశాయి.
ఎండెక్కుతోంది. ఏరు ప్రవహిస్తున్న తూర్పునకు మా నడకమొదలైంది.
ఆ ఏటిలోనే రాళ్ళను ఎక్కుతూ దిగుతూ, చిన్న చిన్న సెల ఏళ్ళను దాటుతూ సాగుతున్నాం.
ఆ ఏటికి ఎన్ని మలుపులో! ఎన్ని రూపాలో! ఎన్ని రాగాలో!ఎన్ని అందాలో! ఎంత లోతైన గుండాలో!
ప్రవహిస్తున్న ఏరు కిందకు దుముకుతున్న శబ్దాలు.
ఆ ఏటిలో అదే చివరి నడక.
అక్కడి నుంచి కిందకు దుముకుతున్న జలపాతం!
ఆ జలపాతపు హోరు.
ఎడమవైపున కొండ ఎక్కడం మొదలు పెట్టాం.
చెట్ల మధ్యలో ఏటవాలుగా ఎక్కుతున్నాం.
ఒక్కొక్క దగ్గర నిటారుగా కూడా ఎక్కాల్సి వస్తొంది.
వెనక్కి తిరిగి చూస్తే, ఈ కొండలో ఇంతదూరం ఎలా నడిచి వచ్చామన్న ఆశ్చర్యం.
కొండ కొసగకు చేరాం.
కుడివైపున గుంజన లోయలోకి దిగాలి.
అతి కష్టంపైన అడుగులుపడుతున్నాయి.
మాలో సగం మంది ఆగిపోయారు.
వాహనాలు నిలిపిన దొంగల చెల దగ్గరకు వెళ్ళిపోయారు.
సగం మందిమే గుంజన లోయలోకి దిగుతున్నాం.
రాళ్ళు రప్పలు, చెట్ల కొమ్మలు పట్టుకుని ఒకరి వెనుక ఒకరు దిగుతున్నాం.
పట్టు దొరకనప్పుడు కూర్చుని పాకుతున్నాం.
మరికొన్ని చోట్ల దేకుతున్నాం.
కొండ అంచులో ఒక రాయి కింద నుంచి వెల్లకిలా పడుకుని జారుతూ సాగాం.
తలెత్తితే రాయి తగులుతుంది.
అదిగో గుంజన జలపాతపు హోరు.
యువకులు చేతులందిస్తూ కొత్త వారికి సాయపడుతున్నారు.
సేదదీరడానికి మధ్యలో కాసేపు ఆగిపోయాం.
“ఒక కొత్త వేరియంట్ వచ్చిందంట. దానికి మందేకాదు, వ్యాక్సినూ పనిచేయదంట” అన్నారు మధు.
“అడవిలో ఆర్నెల్లు గడిపితే చాలు అది మననేం చేయలేదు” అంటూ పరిష్కారం కూడా తానే చెప్పేశారు.
“బియ్యము, బేడలు(పప్పులు) తెచ్చుకుంటే చాలు ఇక్కడే బతికేయచ్చు” అన్నారు మరొకరు.
“అవి అయిపోయాక ఆకులు, కందమూలాలు తిని బతికేయడానికి అలవాటు పడిపోతాం” అన్నారు ఇంకొకరు.
“మనమంతా అడవికి వచ్చేస్తే సెల్‌ఫోన్లు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. పట్టణాలు, నగరాలు కూడా అడవికి వచ్చేస్తాయి.
అడవి కాస్తా మాయమైపోతుంది” మరొకరిముక్తాయింపు.
సరదా సంభాషణతో అందరిలో నవ్వులపువ్వులు.
ఆ మాటలతో మనసుకు కాస్త ఊరట.
శరీరం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది.
వీళ్ళకు అడివంటే ఎంత ఇష్టం! ఎంత ఆశ!
దారి పొడవునా కబుర్లు.
దిగేటప్పుడు రాళ్ళుగానీ, చెట్ల కొమ్మలు కాని పట్టుదొరకడం లేదు.
ఒక బలమైన చెట్టుకు తాడు కట్టి కిందకు వదిలారు.
ఆ తాడు పట్టకుని జాగ్రత్తగా దిగుతున్నాం.
ఒక్కొక్క సారి పట్టు తప్పి కాళ్ళు జారినప్పుడు, బరువంతా చేతులే భరించాలి.
కాళ్ళంత బలంగా చేతులూ ఉండాలి.
తాడు పట్టుకుని కొందరు దిగేశారు.
కాస్త దూరమే ఉంది. పట్టు దొరకడంలేదు. ఎలా దిగాలి?
మరొకమిత్రుడు చెట్టుకు తాడు కట్టి కిందకు వదిలాడు.
ఆతాడు పట్టుకుని అతి కష్టంపైన కిందకు దిగాం.
విశాలమైన ఒక పెద్ద బండ పైనుంచి అతి కష్టంపైన కిందకుదిగతున్నాం.
కాలు పెట్టడానికి బెత్తెడు అంచు కూడా లేదు. ఎదురుగా ఎత్తైన కొండనుంచి దుముకుతున్న గుంజన జలపాతం.
గుంజను చూడాలన్న చిరకాలవాంఛ నెరవేరిందిలా.
అర్రచంద్రాకారంలో ఒక పెద్ద రాతి కొండ.
ఆ కొండ మధ్య నుంచి దుముకుతున్న జలపాతం.
ఆ జలపాతం ఆకాశం నుంచే దుముకుతున్నట్టుంది.
కింద ఉన్న నీటి గుండంలో పడి, పక్కనే ఏటవాలుగా ఉన్న బండలపై నుంచి జాలువారుతూ, మరొక నీటి గుండంలోకి జారుకుంటోంది.
అలా నాలుగైదు నీటి గుండాలలో దూకి జలధార ముందుకు సాగిపోతోంది.
మొదటి నీటి గుండంలోకి అంతా దూకాం.
అది ఎంత లోతుందో తెలియదు!
ఈదుకుంటూ ఈదుకుంటూ జలపాతం కిందకు వెళ్ళాలని ప్రయత్నించాం.
జలపాతపు దూకుడుకు తట్టుకోలేకపోయాం.
మధు, భాస్కర్,మరికొందరు ఏటవాలుగా ఉన్న బండలపై నుంచి జారుతూ కింద ఉన్న నీటి గుండంలోకి దిగారు.
ఆ సాహసం చేయలేకపోయాను.
గుంజన జలపాతంలోకి దిగడమే ఒక పెద్ద సాహసం.
ఈ జన్మకు ఇది చాలు .
ఆ మహోన్నతమైన జలపాతానికి నమస్కరించాను.
గుండం గట్టున కూర్చుని దాని సౌందర్యాన్ని వీక్షించాను.
ఆ సంగీతాన్ని ఆస్వాదించాను.
జలపాతం విసురుతున్న నీటి ముత్యాలలో తడిసి తన్మయం చెందాను.
ఈ జలపాతానికి కాలం తెలియదు, అలుపు సొలుపు లేకుండా రాత్రిం బవళ్ళు దుముకుతూనే ఉంది.
ఇటుచంద్రుణ్ణి చూస్తుంది,అటు సూర్యుణ్ణీ చూస్తుంది.
మబ్బులతో మాట్లడుతుంది.
అడవితో ఎప్పుడూ కబుర్లాడుతుంది.
జలపాతం మీదుగా ఎగిరే పక్షులు దాని అందాలకు ఎంత పరవశించిపోతాయో!
మధ్యాహ్నం దాటింది. సూర్యుడు పడమటి దిక్కుకు పయనమయ్యాడు.
జలపాతం పైన ఎండపొడ తగ్గింది.
తిరుగు ప్రయాణం కాకతప్పదు.
మళ్ళీ ఎత్తైన బండను ఎక్కడానికి ప్రయత్నించాను.
ఒక్కడిగా నాకు సాధ్యం కాలేదు.
ఆ బండ నిటారుగా ఉంది. పట్టు దొరకడం లేదు.
మరొక ఇద్దరు సాయం చేస్తే తప్ప బండ ఎక్కలేకపోయాను.
మరొకరి సాయంలేకుండా చివరికి వచ్చిన వారు ఎలా ఎక్కారో తెలియదు!
గుంజనను చూడడం ఇదే తొలిసారి, ఇదే చివరిసారి.
మళ్ళీ తాడుపట్టుకుని ఎక్కడం మొదలుపెట్టాం.
పళ్ళ బిగువున అడుగులుపడదున్నాయి.
పట్టుకోసం రాయి పట్టుకుంటే ఊడి చేతికొచ్చేసింది.
ఒకకొమ్మ పట్టుకుంటే అది కూడా విరిగి చేతికి వచ్చేసింది.
ఒక చెయ్యి పట్టుతప్పితే మరొక చెయ్యి పట్టుంది. బతికిపోయాం.
కిందకు జారిపోతుంటే మరికొందరు కింద నుంచి నిలదొక్కుకునేలా చేశారు.
పై నున్న వాళ్ళు చేతినందించారు.
మళ్ళీ వచ్చిన దారినే పైకి ఎక్కుతున్నాం.
లోయలోకి దిగడం ఎంత కష్టమో, ఎక్కడం మరింత కష్టం.
ఏ తీర్థానికీ ఇంత కష్టపడలేదు.
ఏ తీర్థానికీ ఇంత సాహసం చేయలేదు.
ఏ తీర్థమూ ఇన్ని అందాలను సొంతం చేసుకోలేదు.
మొత్తానికి కొండ ఎక్కాం.
అంతా అడవి.
దారెటో తెలియడం లేదు.
దిక్కులూ తెలియడం లేదు.
సూర్యుడు కొండలమాటుకు చేరుకున్నాడు.
మా ముందు నడిచిన వాళ్ళు గడ్డిని తక్కుకుంటూ వెళ్ళిన ఆనవాళ్ళను బట్టి ముందుకు సాగుతున్నాం.
దారి తప్పుతున్నామేమో? అన్న సందేహం.
గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టు ఎలాగోలా వాహనాలు నిలిపిన దొంగల చెలకు గుడ్డిగా చేరిపోయాం.
మాకోసమే ఎదురు చూస్తున్న భూమన్, ప్రభాకర రెడ్డి మమ్మల్ని చూసి ఊపిరి పీల్చుకున్నారు.
ఏమైపోయామోనని ఖంగారుపడిపోయారు.
అడవి అందాలను చూసుకుంటూ సాయంత్రానికి తిరుగు ప్రయాణమయ్యాం.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)