విజయవాడ ర్యాలీ సందేశమేంటో తెలుసా!

నవ్యాంధ్రలో కొత్త చరిత్ర సృష్టించిన తెల్లచొక్కా ఉద్యోగ వర్గాల ప్రదర్శన!
ఆర్ధికవాద పోరుగా ప్రారంభమై ప్రభుత్వ నిషేధాజ్ఞల్ని ధిక్కరించే ప్రజాతంత్ర పోరుగా మారింది ఈ ప్రదర్శన!
*పి. ప్రసాద్ (పిపి)
నవ్యాంధ్రప్రదేశ్ లో మున్నెన్నడూ జరగని రీతిలో నిన్నటి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల మహా ప్రదర్శన జరగడం ఓ జగమెరిగిన సత్యం! ముంజేతి కంకణానికి అద్దమేల అన్నట్లు దాని వివరాలు, విశేషాలు తిరిగి చెప్పనక్కర లేదు. దాని నుండి రేపటికోసం నేర్చుకునే కొత్తపాఠాల పై దృష్టిని సారిద్దా
సరళీకరణ యుగంలో ప్రధానంగా లంచ్ హవర్ ధర్నాలు, నల్ల బ్యాడ్జీల నిరసనల సంస్కృతికి అలవాటైన తెల్లచొక్కా ఉద్యోగుల మానసిక స్థితి కరగని శిల కాదు. భద్రజీవులుగా తమకు తామే ఊహించుకున్న స్వప్న సౌధాలు శాశ్వత కట్టడాల వంటివి కాదు. భౌతిక పరిస్థితి మారితే, మానసిక భావజాలపు నిర్మాణం పేకమేడ వలె కుప్ప కూలిపోతుంది. రాతి శిలల వంటి గత సంస్కృతి తేలిగ్గా కరిగి పోతుంది. నిషేధాజ్ఞల మధ్య జయప్రదమైన ర్యాలీ నిరూపించింది.
మనుషుల మానసిక స్థితి భౌతిక స్థితిగతుల్ని మార్చలేదు. అందుకు భిన్నంగా నాటి భౌతిక స్థితిగతే ఆ మనుషుల మానసిక స్థితిగతుల్ని మారుస్తుంది. ఇలాంటి చారిత్రక సూత్రాల కై మార్క్స్ గ్రంధాలను చదవనక్కర్లేదు. మన కళ్లెదుట ఆచరణయే నిరూపిస్తోంది. నేటి వరకూ భద్రజీవులుగా ఊహించుకున్న ఉద్యోగ వర్గాల మానసిక స్థితిని హఠాత్తుగా మార్పుకు గురిచేసిన పరిణామమే దీనికి సజీవసాక్ష్యం!
చరిత్రలో గత కాలపు విప్లవ, ప్రజాతంత్ర పోరాట ప్రజా వెల్లువలు తెల్సిందే! వాటి పూర్వ వైభవాన్ని స్తుతిస్తూనే మున్ముందు ఎప్పటికీ అవి పునరావృతం కావనే నిట్టూర్పుల్ని తరచుగా వింటుంటాం. “నాటి మనుషులు వేరు, నేటి మనుషులు వేరు, మనస్తత్వాలు కూడా మారాయి. పూర్వకాల వైభవం తిరిగిరాదు” అనే మాటల వెనక దాగిన నిరాశావాదం తెల్సిందే! ‘గుర్రం కడుపు మండితే, ఉలవ దాణా బదులు, గడ్డి తింటుంది’ సామెత తెలియనిది కాదు. భౌతికపరిస్థితి మారితే, సుఖమయ జీవితాలకు అలవాటైన భద్రజీవులు సైతం పాత స్థితికి స్వస్తి చెబుతారు. ఏ కష్టం భరించకుండా, టోకెన్ నిరసనల ద్వారా విజయాలు సాధ్యమని ఇన్నాళ్లూ నమ్మిన తెల్ల చొక్కా వర్గపు తియ్యని కల చెదిరింది. దీనికి భౌతిక స్థితిగతుల్లో మార్పు కారణం! గత భౌతిక స్థితి మారితే, శిలారూపంగా అగుపడే గత కాలపు మానసిక సంస్కృతి కూడా చెదిరి పోతుంది. పూలదారిలో పీ.ఆర్.సీ. ల్ని పొందిన మనుషుల్ని ఇక ముళ్ల బాటలో సాధించుకునే దారిలోకి నడిపిస్తుంది. ఎవరి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేనిది. ఇదో చారిత్రక నియమమే!
నేటివరకి లాకప్పులు, జైళ్లు అంటరానివనే మానసిక సంస్కృతికి వీరిని అలవాటు చేసింది. అది భౌతిక స్థితి మారనంత వరకు నిజమే! అది మారితే, భద్రజీవుల మనస్తత్వం సైతం మారుతుంది. అలవాటు లేని నిర్బంధ విధానం మధ్య తమ కోర్కెల్ని సాధించుకునే కొత్త మానసిక స్థితికి అలవడుతుంది. సుఖ జీవుల్లోనూ నిర్బంధాల్ని అధిగమించే మానసిక చైతన్యాన్ని కల్పిస్తుంది. గేటెడ్ కమ్యూనిటీల ఇంద్రభవనాల తాళాల్ని సైతం భౌతిక స్థితి రేపు బద్దలు కొట్టిస్తుంది. నేటి బడా కార్పొరేట్ వ్యవస్థ ఫాసిస్టు గమనం నేటి భౌతిక స్థితిగతులను మౌలిక మార్పులకు గురిచేసి తీరుతుంది.
వ్యవస్థలో మార్పుకై సాగే ఉద్యమలకే ఇది పరిమితం కాదు. రేపు వ్యవస్థ మౌలిక మార్పు కోసం సాగే విప్లవాలకి సైతం భౌతికపరిస్థితిలో మార్పులు కారకాలుగా పనిచేస్తాయి. ఈ చరిత్ర నియమాన్ని తెలిపేదే తాజా ప్రదర్శన దృశ్యం
ఇచ్చాపురం నుండి అనంతపురం వరకూ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, రన్నింగ్ రైళ్లు, రన్నింగ్ బస్సుల పై పోలీసు నిఘా, వేలాది ఉద్యోగ నేతల్ని గృహ నిర్బంధాల్లో ఉంచి, పదుల వేల మందిని దారిలో దింపి వేసిన నిషేధ వాతావరణంలో ఇలా అనూహ్యమైన సమీకరణ సరికొత్త చారిత్రక పాఠాల్ని బోధిస్తుంది. భౌతిక స్థితిగతులలో వచ్చే మౌలిక మార్పులు మనుషుల మానసిక స్థితిని సమూలంగా మార్చుతాయని చాటే చారిత్రక సత్యమిది.
నేడు తెరపై పాలించే నిరంకుశ రాజకీయ పాలకుల వెనక బడా కార్పొరేట్ వ్యవస్థ చోదకశక్తిగా (Driving force) ఉంది. వారిని పావులుగా మార్చుకొని అది ప్రజలపై ఓ యుద్ధం సాగిస్తోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్ని కబ్జా చేస్తోంది. గనులు, ఫ్యాక్టరీలే కాక, భీమా, బ్యాంకింగ్, టెలికామ్, విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్ని సైతం కబ్జా చేస్తోంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాల అసిత్వమే ప్రమాదంలో పడింది. ఈ సర్వరంగ సర్వవ్యాపిత దాడిలో అంతర్భాగమే నేడు ఉద్యోగులపై జగన్ ప్రభుత్వ దాడి! ఢిల్లీ ఫాసిస్టు పాలకుల ప్రోత్సాహంతో ఈ ఉద్యోగ వ్యవస్థలకు మరణ శాసనం రాసే పనిలో అది మునిగింది. బయటకు నిరంకుశ పాలకులకూ, బాధిత వర్గాల మధ్య పోరాట రూపంలో కనిపిస్తుంది. సారాంశంలో మాత్రం పెట్టుబడికీ, ప్రజలకూ మధ్య సంఘర్షణయే! తాజా ఉద్యోగుల పోరు మౌలికంగా తమ కోసం తాము చేపట్టే ఆర్ధిక పోరాటమే! కానీ అది ఫాసిస్టు శక్తుల అండతో బడా కార్పొరేట్ వ్యవస్థ చేపట్టే సర్వవ్యాపిత దాడిపై ఎక్కుపెట్టిన పోరాటాల జాబితాలో ఒకటిగా మారుతుంది
నిరంకుశ పాలకులు కార్పొరేట్ వ్యవస్థపక్షాన తమను ఎన్నుకున్న ప్రజలపై చేపట్టే యుద్ధ ఫలితమిది. ప్రజలు రగిల్చే ఉద్యమాగ్నిలో నిరంకుశ పాలకులకు అంతిమంగా రాజకీయ మరణశాసనం తప్పదు. ఆ వైపు దారిలో ప్రజల ప్రయాణానికి రాజకీయ ఉత్తేజమిచ్చేదే తాజా ఉద్యోగుల పోరాటం!
తెల్లచొక్కా ఉద్యోగ వర్గాలు స్వయంగా సామాజిక మార్పుకై పూనుకోక పోవచ్చు. తమకోసమే పోరాడ వచ్చు. కానీ సామాజిక మార్పుకోసం పోరాడే పునాది వర్గాల ప్రజలకి అది ఉద్యమస్ఫూర్తిని అందిస్తుంది. ఈనాటి నిర్దిష్ట రాజకీయ శూన్య స్థితిని బ్రేక్ చేయుటకు ఉపకరిస్తుంది. సమాజ గమనంలో ముమ్మాటికీ అదో ముందడుగే
నిజానికిది జానెడు స్థాయి ఆర్ధిక పోరాటం! నిరంకుశ విధానాల వల్ల తాజా ర్యాలీ మూరెడు స్థాయి ప్రజాతంత్ర పోరు గా మారింది. నిరంకుశ వైఖరి ఇలా కొనసాగితే, 7నుండి సాగే సమ్మె రాజకీయ రూపాంతరం చెందవచ్చు. నిరంకుశ పాలనా వ్యతిరేక పోరు నడిపించే సంకల్పం గల రాజకీయ వర్గాలకి అదో వేదికగా మారొచ్చు.
నిరంకుశ విధానాల పై ప్రజాతంత్ర పోరాటాలు బలహీనంగా ఉన్న కాలమిది. ఫలితంగా నేడు రాష్ట్ర రాజకీయ రంగంలో ఓ శూన్యత (political vocume) ఏర్పడి కొనసాగుతూ ఉంది. ఈ శూన్యస్థితిని మార్చేసి కొత్తపోరాటాల ఆగమన కాలానికి ఇదో కూత కావచ్చేమో!
నయా ఉదారవాద విధానాల ఫలితంగా రూపొంది బలపడ్డ సరళీకరణ రాజకీయ సంస్కృతి ఇటీవల కాలంలో తెల్లచొక్కా ఉద్యోగ వర్గాలకూ, పౌర సమాజానికీ మధ్య దూరాన్ని పెంచింది. ముఖ్యంగా శ్రామికవర్గ ప్రజలతో దూరాన్ని బాగా పెంచింది. ఆ దూరాన్ని చెరిపివేసే మానసిక ప్రక్రియ జరక్కుండా రేపటి సమ్మె విజయం కష్టం! ఉద్యోగులపై ప్రజల్ని రెచ్చగొట్టి రేపటి సమ్మె అణచివేతకి పూనుకునే నిరంకుశ సర్కార్ కి ఇది ఉపకరిస్తుంది. ఈ ర్యాలీ ప్రజాతంత్ర పోరుగా పరివర్తన చెందడంతో పైదూరాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. ఉద్యోగుల మానసిక వైఖరి మార్పు తెస్తుందని ఆశిద్దాం
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పరిరక్షణకై కేంద్రం పై పోరాడాల్సిన కర్తవ్యాన్ని విడిచి పెట్టి, ఢిల్లీ ఫాసిస్టు పాలక ముఠావద్ద సాష్టాంగపడి ఎన్నుకున్న ప్రజల మీదే జగన్ సర్కార్ యుద్ధం చేస్తోంది. ఫలితంగా దానికి రక్షణ ఉండదు. రాష్ట్ర ప్రజల అండతో కేంద్ర ఫాసిస్టు విధానాల పై యుద్ధం చేయడంలో రాజకీయ రక్షణ ఉంది. పోలీసు అండతో ర్యాలీ ని నియంత్రించడంలో విఫలమైనది. అలాంటి సర్కార్ రేపటి సమ్మెను ఎలా నియంత్రిస్తుంది?
మధ్యతరగతి వర్గాల మానసిక భావం పట్ల శ్రామికవర్గానికి స్పష్టత ఉండాలి. వెల్లువలా కదిలినంత మాత్రాన సమాజ గమనానికి అదో చోదకశక్తి అనే ఆశ వుండనక్కర లేదు. దాని పరిమితి దానికి ఉంది. ప్రజాపోరాటాలు, ప్రజాతంత్ర ఉద్యమాల పట్ల అది ఊగిసలాట గల మిత్ర వర్గంగానే వుంటుందనే రాజకీయ నియమం పట్ల సుస్పష్ట అవగాహన ఉండాలి. ర్యాలీ, సమ్మె విజయం సాధిస్తే, పొంగిపోయి వారి నుండి సామాజిక ఉద్యమ, విప్లవాత్మలు లభిస్తాయని ఆశలు పెంచుకోరాదు. అదే సమయంలో నిరంకుశ విధానాలపై పోరాడే రాజకీయ, ప్రజాతంత్ర కర్తవ్యాలకి ముమ్మాటికీ అది ఉద్యమ స్ఫూర్తిని అందిస్తుంది. ప్రభుత్వ నిషేధాజ్ఞల్ని ధిక్కరించి వారు సాగించే సమ్మెని విశాల సామాజిక దృష్ఠి తో ఆహ్వానిద్దాం. దాన్ని ఆస్వాదిద్దాం. అక్కడే ఆగక ఆ ఉద్యమంలో భాగస్వామ్యంతో దాని విజయం కై క్రియాశీల పాత్రని పోషిద్దాం!
రేపు 5వ తేదీ నుండి యాప్స్ నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు బయటికొచ్చి సహాయ నిరాకరణ ఆందోళన ప్రారంభిస్తున్నారు. 7వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. అండగా నిలుద్దాం.
ఏపీ ఆర్టీసీ కార్మికవర్గం ఇప్పటికే PRC సాధనా సమితిలో భాగస్వామి గా ఉంది. ఎప్పుడైనా అది సమ్మె బాట పట్టే అవకాశం వుంది. నిన్న సభలో ఆర్టీసీ సంఘాల నేతలు అదే చెప్పారు. అంగన్వాడీ, ఆశా వంటి స్కీం వర్కర్ల స్థితీ అదే! మున్సిపల్, విద్యుత్ వంటి రంగాలు కూడా ఆందోళనలో ఉన్నాయి. తెలంగాణలో నిరంకుశ జీవో నెంబర్ 317 పై ఉపాధ్యాయ సంఘాల ఐక్యపోరాటం ఇప్పటికే సాగుతోంది. ఫిబ్రవరి 9న హైదరాబాద్ లో మహాధర్నా ఉంది. ఈ తరహా సకల బాధిత వర్గాలకీ తాజా AP ఉద్యోగవర్గాల పోరాటం ఒక కొత్త కదలికని ఇస్తుందని ఆశిద్దాం
(*పి. ప్రసాద్ (పిపి)
ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు,భారత కార్మిక సంఘాల సమాఖ్య-ఇఫ్టూ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *