సండే ట్రెక్: గుంజన జలపాతానికి సాహస యాత్ర

జీవితంలో ఎన్నో సత్యాన్వేషణ మార్గాలుంటాయి. ఇందులో నడక అనేది  ఒక గొప్ప సత్యాన్వేషణ మార్గం అని నా శేషాచలం అడవి ట్రెక్  అనుభవం చెబుతూ ఉంది. 
-భూమన్
ఈ దఫా అన్నమాచార్య మార్గంలో ట్రెకింగ్ చేశాక,  రెన్నెళ్ల తర్వాత ఒక పెద్ద సాహసోపేతమయిన ట్రెకింగ్ ను ఎంచుకున్నాం. అదే గుంజన జలపాతానికి శేషాలచం అడవుల్లో సండే ట్రెక్.   అదిరెండురోజుల ట్రెక్.  శనివారం తిరుపతి నుంచి బయలుదేరాం.
తిరుపతి నుంచి  దగ్గిర దగ్గిర రెండు గంటల ప్రయాణం చేసిన తర్వాత గుంజన అనే ప్రాంతం చేరుకున్నాం . ఈ ప్రాంతానికి, మామండూరు, బాలపల్లి చెక్ పోస్ట్ తర్వాత సూరపరాజు పల్లె  మీదుగా చేరుకోవాలి.
ఇలా కొండలు ఎక్కుతూ పైకి చేరుకోవాలి
ట్రెక్ లో అలసినపుడు బండరాళ్ల మీద కునుకు ఒక గొప్ప అనుభూతి
సూరపరాజు పల్లెగుండా పోయేటపుడు మొదట గుంజన ఏరు వస్తుంది. ఆయేటి వెంట ప్రయాణం చేస్తూ అడవిలోకి చేరుకున్నాం. గంజన జలపాతం అనేది శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే చాలా గొప్ప జలపాతం, ఎత్తయిన జలపాతం. కొంత భయాన్ని కూడా కల్గించేంత ఎత్తయిన జలపాతం.

ఆ జలపాతం దూకేటువంటి స్థావరాన్ని చూసినపుడు  కళ్లు తిరుగుతాయి. అక్కడ ‘దొంగలబండలు’ అనే ప్రాంతం  చేరుకుని, మా వాహనాలు ఆపి, ఒక కిలోమీటర్ దూరం లోయలో ప్రయాణించాం. రాత్రి విడిది చేయాల్సిన ప్రదేశం చేరుకున్నాం. అక్కడ రాత్రి బస చేశాం. వంట  చేసుకున్నాం. బసకోసం గుడారాలు వేసుకున్నాం. హాయిగా ఉండే ప్రదేశమది. ఆహ్లాదకరమయిన వాతావరణం. రాత్రి మంచులేదు. చలిలేదు. రాత్రి చక్కగా సాగింది. నిద్ర ఉపక్రమించాం. రాత్రంతా అడవిగురించి ట్రెకింగ్ గురించి మాట్లాడుకున్నాం. మరుసటి రోజు పొద్దునే కంగుమడుగులో స్నానం చేసి అల్పాహారం తర్వాత మళ్లా ట్రెక్ కొనసాగించాం. కంగుమడుగు దారిలో ఉన్న వింతలన్నీ చూశాం. రెండు కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఒక మహత్తర ప్రకృతి సౌందర్య ఉట్టిపడుతూ ఉంటుంది.  రెండు కిలోమీటర్లు ప్రయాణించి గుంజన జలపాతం దూకే ప్రాంతం  చేరుకున్నాం. ఇది చాలాకష్టమయిన ట్రెక్. ఇక్కడి కొండను ఎగబాకడం చాలా సాహసోపేతమయిన యాత్ర అని చెప్పాలి.
రాత్రి అడవిలో బస
ఆహ్లాదకరమయన రాత్రి
అలా ఒక కిలోమీటర్ పైకెక్కిన ప్రాంతం, కుడివైపు నుంచిలోయలోకి దిగాం. మరికొందరు అక్కడి నుంచి అయిదారు కిలోమీటర్లు ప్రయాణించి పితృగడ అనే ప్రాంతం చేరుకున్నారు. ఈ పితృగడ విశేషమేమంటే, అక్కడ కొండగోడల మీద ఆదిమ మానవుడు గీచి రేఖాచిత్రాలు ఉన్నాయి. దీనినే కేవ్ ఆర్ట్ అని కూడా అంటారు. ఎపుడో క్రీపూ రెండు మూడు వేల ఏళ్ల కిందట గీచిన చిత్రాలివి.
కేవ్ అర్ట్ గుంజన జలపాతం
ఆదిమ మానవుడు గీచిన చిత్రాలు
పితృగడ తీర్థంలో చాలా గుండాలున్నాయి. అయిదుగుండాలదాటిన తర్వాత ఆరోగుండం చేరుకున్నాం. అదొక అద్భతమయిన ప్రదేశం. ఆ గుండంలో తనివితీరా ఈదులాడాం. తర్వాత తిరిగి ‘దొంగలబండలు’ చేరాం. అక్కడి నుంచి మళ్లీ తిరుపతి బయలుదేరాం.
మొత్తానికి ఈ యాత్ర మర్చిపోలేని అనుభూతి మిగిలించింది. లోయల్లో ప్రయాణించడం, కొండలను ఎగబాగడం,దిగడం, రాత్రి అడవిలో బస చేయడం గొప్ప అనుభూతి.
యాత్ర అయిపోయాక ఒక సారి మననం చేసుకుంటే, ఎంత సాహసం చేశామో అనిపిస్తుంది. ఎందుకంటే, ఎంతో జాగ్రత్తగా, ఏమరపాటు లేకుండా కొండలెక్కాం. దిగాం. దాదాపు ఇరవై అయిదు మంది  ‘గుంజన జలపాతం ట్రెక్’ లో పాల్గొన్నా, అందరిలో ఇద్దరం మాత్రమే అరవై పబడిన వాళ్లం. నేనూ, జర్నలిస్టు మిత్రుడు అలూరు రాఘవ శర్మ. శర్మ నాకంటే అయిదారేళ్లు చిన్న వాడు. మా బృందంలో  మిగతా వాళ్లంతా  నలభై లోపు వారే.  మొత్తం టీమ్ లో పెద్ద వాడిని నేనే.
ఇలా లోయలోకి జారుతూ దిగాలి… ఇదొక సాహసం
ప్రతి అడుగూ సాహసయాత్రే
అడవిలో గొడ్డలి… చందనపు స్మగ్లర్ల దేనా. ఈ మధ్య మిషన్ రంపాలు వచ్చాయి. గొడళ్లు వాడటం లేదు
ఈ యాత్ర తర్వాత నేను శర్మ యాత్ర గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి ప్రమాదకరమయిన యాత్రలలో చాలా జాగ్రత్త అవసరమని అనుకున్నాం. అయితే, ఈ శ్రమకోర్చి, సాహసం చేసి గుంజన జలపాతం చేరామన్న ఆనందం   భవిష్యత్తు సాహసాల మీద మరింత ఉత్సుకత రేకెత్తించింది.
అడవిలో లోయల్లో, కొండల మీద సాగిన ఈ యాత్ర, గుంజన జలపాతం కళ్లకు మహదానందం కలిగించాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా జలపాతాలే. ఈ మధ్య మంచి వర్షాలు కురిసినందున జలపాతాలు ఫుల్ గా దూకుతూ కనువిందు చేశాయి.
జలపాతాలను చాలా బాగా చూడగలిగాం. ఈ జలపాతం కిందికి దూకే చోట వాగేరు అనే ప్రాంతం ఉందని చాలా మంది మాకు చెప్పారు.ఈ వాగేట్లో ఇపుడు నీళ్లు చాలా  ఎక్కువగా ఉన్నాయి. ఏండాకాలంలో వాగేరు ఎండిపోతుంది. అపుడు ఈ వాగేటి వెంబడి నడచుకుంటూ వచ్చినట్లయితే, గుంజన జలపాతం దూకే చోట ఏర్పడిన ఐదారు గుండాలను చూడవచ్చని చెప్పారు. ఇది కూడా గొప్పయాత్ర అవుతుందని చెప్పారు. ముందు ముందు తప్పక ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించాం.
చెప్పదలచుకున్నదొక్కటే, జీవితంలో రకరకాల సత్యాన్వేషణ మార్గాలుంటాయి. ఇందులో నడక అనేది  ఒక గొప్ప సత్యాన్వేషణ మార్గం అని నా శేషాచలం అడవి  అనుభవం చెబుతూ ఉంది. అడవిలో నడుస్తూ పోతున్నపుడు ప్రకృతిలోకి ప్రవేశించగలుగుతాం. ఎన్నో చారిత్రక అవశేషాలను చూడగలుగుతాం. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.
మనతో కలసి కాకపోయినా,  ఈ అడవుల్లో కొండల్లో ఉన్న ఈ పక్షులు, జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎపుడొచ్చాయి, ఎట్లా వచ్చాయి, ఆ వచ్చిన తీరేమిటి? ఆ కాలం ఎట్లా వుండేది? ఆ కాలంలో వీటి మధ్య మనుషులు ఎలా ఉండినారు, వారు ఈ  గుహల్లో, కొండల మీద గీచిన ఈ చిత్రాల అర్థమేమిటి? వాళ్లెందుకు ఆ ఎద్దుల బొమ్మలు, ఏనుగుల బొమ్మలు గీచారు? వారీ బొమ్మలు గీచారంటే, ఈ ప్రాంతంలో వారు నివాసం ఏర్పరుచుకున్నట్లే లెక్క గదా?
Gunjana Waterfall
గుంజ‌న జ‌ల‌పాతం
ఇక్కడ నీళ్లున్నాయి సమృద్ధిగా. అందువల్ల నాటి మానవులు ఈ ప్రాంతాన్ని తన నివాసానికి యోగ్యమయినది భావించారా? అంటే నీళ్లున్న చోట్ల మనిషి నివసించడం, అక్కడే నాగరిత ఉద్భవించడం జరిగిందనే విషయం ఇక్కడ  మరొకసారి ప్రత్యక్షమవుతుంది. భాష లేని రోజుల్లో, రాత కనిపెట్టని రోజుల్లో మన పూర్వీకులు ఈ రేఖాచిత్రాల ద్వారా చెప్పదల్చుకున్నదేమిటి?
వాళ్లజీవన విధానం కొంతయినా ఇందులో నిక్షిప్తమయి ఉందనిపిస్తుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే నడకయే మార్గం. ఈ నడక ద్వారా ఇలాంటి సూదూర ప్రాంతాల్లోకి ప్రవేశించి ఈ సత్యాన్ని కళ్లారా చూడవచ్చు. ఇది ఎంత గొప్ప విషయైం! అందుకే ఈ సారి గుంజన జలపాతం ట్రెక్ చాలా ఆసక్తికరంగా, ప్రయోజనకరంగా, విజ్ఞానదాయకంగా ఉందనిపించింది.
మా ట్రెకింగ్ లో కనిపించే ఒక గొప్ప విశేషమేమిటంటే, మా ట్రెకర్స్ మధ్య ఉన్నసహజీనం కూడా గొప్ప సందేశాత్మకయిందనిపిస్తుంది. మా టీమ్ లో ఎవరికైనా ఏదయిన సమస్య వస్తే, వెంటనే స్పందించే స్వభావం ఈ ట్రెకింగ్ వల్ల సభ్యులందరిలో అలవడింది. కుల, మత, వయసు తేడాలు లేకుండా అందరు కలసిమెలసి ఉంటున్న జీవన విధానం ఈ ట్రెకింగ్ అలవర్చింది.
రెండు మూడు రోజుల ఇలా సాహస యాత్ర చేసి  అటవీ ప్రాంతాల్లో బస చేసే అవకాశాన్నిచ్చే ఇలాంటి ట్రెక్స్ ని పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో విశాల దృక్పధం ఏర్పడుతుంది.వాళ్లలో  ప్రకృతి గురించిన  కొత్త కొత్త ఆలోచనలు వచ్చేలా చేయవచ్చు.  గుంజన జలపాతం, పితృగడల ఆదిమ మానవ అవాసాలు మాకీ అనుభవాలను మిగిలించాయి.  మరొక పదిహేనురోజుల్లో మరొక ట్రెక్ కోసం ప్లాన్ చేద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *