బ్రౌన్ గ్రంథాలయానికి వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం- అందుకున్న యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి ప్రకటించిన డా. వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మునగల సూర్యకళావతి అందుకున్నారు
ఈరోజు ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వైయస్సార్ పురస్కార ప్రధాన కార్యక్రమంలో ఆం.ప్ర. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రొ. సూర్యకళావతి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
పురస్కారానికిగాను 10 లక్షల రూపాయల నగదు, వైయస్సార్ కాంస్యవిగ్రహం, యోగ్యతా పత్రం అందజేశారు. డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సి.ఆర్.కృష్ణస్వామి, సి.కె. సంపత్ కుమార్, డా. పి.ఎల్. సంజీవరెడ్డి, జంధ్యాల హరినారాయణ తదితరులు గొప్ప కృషితో కడపలో ‘తెలుగు సూర్యుడు’ సి.పి. బ్రౌన్ గతంలో తెలుగు భాషా సాహిత్యాలను పునరుద్ధరించడానికి పూనుకున్న ప్రదేశంలో ఆయన పేరిట స్మారక భవనాన్ని నిర్మించి గ్రంథాలయాన్ని నెలకొల్పారు. వై.యస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని యోగి వేమన విశ్వవిద్యాలయానికి గ్రంథాలయ బాధ్యతను అప్పగించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రంథాలయం భాషా పరిశోధన కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఆచార్య మునగల సూర్యకళావతి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టింది మొదలు బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికి కంకణబద్ధులయ్యారు. ఉపకులపతి నేతృత్వంలో 2020 నవంబరు 29,30 తేదీలలో సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాలు శతాధిక కవిసమ్మేళనం, గ్రంథావిష్కరణలు, సాహితీ సదస్సులు, అష్టావధానం, సంగీతావధానం వంటి కార్యక్రమాలతో రెండురోజులపాటు ఘనంగా నిర్వహించబడ్డాయి. సి.పి. బ్రౌన్ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం విస్తరణకు వీలుగా స్థలదాతలు సి.ఎస్.అమృతవళ్ళి, సి.ఎస్.సుప్రజల నుండి 5 సెంట్ల స్థలాన్ని సేకరించారు. ఆ తర్వాత 9.7.2021న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పరిశోధన కేంద్రాన్ని సందర్శించి పరిశోధన కేంద్రంలో సి.పి.బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పరిశోధన కేంద్రం విస్తరణకు అవసరమైన స్థలసేకరణకు, నూతన భవన నిర్మాణానికి 5.5. కోట్లు మంజూరుచేసి శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉపకులపతి పర్యవేక్షణలో సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవ ప్రత్యేక సంచికతోపాటు తాళ్ళపాక తిమ్మక్క, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజభూషణుడు అనే విమర్శ వ్యాససంపుటాలు, వేమన పద్యాలు (వ్యాఖ్యాన సహితం), ముడుమాల సిద్ధయ్యగారి మఠంలోని తాళపత్ర గ్రంథం ఆధారంగా పరిష్కరింపజేసిన వేమన పద్యాలు అనే గ్రంథాలు బ్రౌన్ పరిశోధన కేంద్రం ద్వారా ప్రచురింపబడ్డాయి. ఈ నవంబరు 10న సి.పి.బ్రౌన్ 223వ జయంతి సందర్భంగా వేమన పద్యాలు (సి.పి.బ్రౌన్ 1839 నాటి సంకలనం), మాసీమ కవులు (డా॥ జానమద్ది హనుమచ్ఛాస్త్రి) అనే మరో 2 గ్రంథాలు ఆవిష్కరింపబడనున్నాయి.