విశాఖ పవన్ సభ విశేషం ఏంటంటే..

పవన్ కళ్యాణ్ వైజాగ్ సభ!
 ఆత్మ రక్షణలో వైకాపా!
(వి. శంకరయ్య)
బిజెపి తో మైత్రి కొనసాగిస్తున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా సాగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వడం ద్వారా బిజెపిని ఇరుకున పెడతారని అందరూ భావించారు. క్రమేణా బిజెపికి దూరం అయ్యేందుకు ఈ సభ తొలి మెట్టు అవుతుందనే వ్యాఖ్యానాలు వెలు వడ్డాయి. అయితే ఆదివారం విశాఖలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం తద్భన్నంగా సాగింది. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి రాష్ట్రంలో అధికారంలో వున్న వైకాపా ప్రభుత్వాన్ని నిండు సభలో ముద్దాయిగా నిల బెట్టడంలో కృత కృత్యుడైనాడు. గతంలో పవన్ కళ్యాణ్ మైక్ ముందుకు రాగానే ఆవేశపడి ఉద్రేక పూరిత ప్రసంగాలు చేసే వారు. విశాఖ సభలో భిన్నంగా వ్యవహరించారు.
వాస్తవంలో కేంద్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు చేసేందుకు సిద్దమౌతోంది. అందరు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వేలెత్తి చూపు తున్నారు. ఇందులో సంశయం ఏమీ లేదు. కాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అధికారంలో వున్న వైకాపా గట్టిగా నిలబడితే ప్రైవేటు పరం కాకుండా నివారించ వచ్చని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా అందరి కన్నా ముందుండి పోరాటం చేయ వలసి వున్న బాధ్యత దానిదేనని చెప్పి సభికులను మెప్ఫించారు. ఇది పార్టీలకతీతమైన అంశమని రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల లోపు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి వైకాపాను ఆత్మ రక్షణలో పడేశారు. అంతే కాదు. రాష్ట్రంలో 22 మంది పార్లమెంటు సభ్యులు 151 మంది శాసనసభ్యులు గల పార్టీ మందుకు వస్తే తను కలసి కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పడం ద్వారా అందరూ ఊహించిన దానికి భిన్నంగా సమస్యను సరి కొత్త మలుపు తిప్పారు. తాము చెప్పినా లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వైకాపా వాదనను పవన్ కళ్యాణ్ చాక చక్యంగా పూర్వ పక్షం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న వివాదాస్పద చట్టాలకు మద్దతు ఇచ్చే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం అంశం ఎందుకు నిలదీయడం లేదని సమస్యను వైకాపా కోర్టులోనికి పవన్ కళ్యాణ్ నెట్టడంలో విజయ వంత మైనారు.
అంత వరకే పరిమితం కాకుండా ఒక వేళ బాధ్యత నిర్వర్తించ వలసిన వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందితే తర్వాత తన కార్యాచరణ ప్రకటించుతానని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించే పోరాటం రిజర్వులో వుంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి తను దాసోహమౌతాననే అనుమానం లేకుండా జాగ్రత్త పడ్డారు.
తను ఈ పాటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలసి దేశంలోని ఇతర పరిశ్రమలకు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధం లేదని ఇది రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో నిండి వుందని వివరించినట్లు చెబుతూ తనకు హోం మంత్రి ఏమి చూచి ఇంటర్య్వూ ఇచ్చారని కేవలం ప్రజాబలమే అండగా వుందన్నారు
తనకన్నా ఎక్కువగా పార్లమెంటులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవసరం బిజెపికి వుందని ఆయన ముందుండి పోరాడ వలసి వుందని చెప్పడం ద్వారా బాల్ వైకాపా కోర్టులోని నెట్టారు. విశాఖ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఫక్తు పరిణితి చెందిన రాజకీయ నేతలాగా సాగడం విశేషం.
-వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *