(వడ్డేపల్లి మల్లేశము)
ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీలు చూసుకోవాలి కాని ప్రభుత్వాలు కాదు. ఈ విషయం ప్రభుత్వాలకు తెలియక నా? కాదు అధికారం, ఆధిపత్యం, గెలుపు కోసమే పనిచేస్తున్న నేటి ప్రభుత్వాలు కలలో కూడా ఎన్నికలు, ప్రచారాలు, గెలుపును ఊహించుకుంటే నిజ జీవితంలో ఆ ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం సాధ్యమేనా?
ఎన్నికల పట్ల ప్రభుత్వాల, రాజకీయ పార్టీల విధానంలో గత రెండు మూడు దశాబ్దాలుగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల నుండి, సామాన్య ప్రజానీకం నుండి ఎన్ని విమర్శలు వచ్చినా అధికార పార్టీని ఎంత దూషించిన తమ పద్ధతులు మాత్రం మార్చుకోవడం లేదు.
ఇటీవల కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ప్రధానమంత్రి ,మంత్రులు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని, ప్రజల శ్రేయస్సు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు హరించే నట్లే !!!
హుజురాబాద్ ఉప ఎన్నిక దేనికి సంకేతం
2021 జూన్ 4వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పైన ప్రభుత్వం చేసిన ఆరోపణల కారణంగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇక్కడ టిఆర్ఎస్ అధినేతను దిక్కరించి ఆత్మగౌరవం పేరుతో తెరాస పార్టీ నుండి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఆత్మ రక్షణ కోసం బీజేపీ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసినదే.
గత ఆరు సార్లు ఈ ప్రాంతము నుండి టిఆర్ఎస్ పక్షాన శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజేందర్ వ్యక్తిత్వం వల్లనే పార్టీకి ప్రతిష్ట పెరిగిందని కానీ పార్టీ ప్రతిష్ట వల్లనే అతడు గెలిచాడు అనేది అబద్ధమని స్థానిక ప్రజానీకం గొంతెత్తి నినదించి నది.
ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్, దుబ్బాక వంటి చోట్ల ఉప ఎన్నికలు జరిగినప్పటికీ హుజూరాబాద్ ఉప ఎన్నిక పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత దృష్టి పెట్టడం సహజంగా జరిగే ఎన్నికలకు రాజకీయ రంగు పులిమి నట్లే అవుతున్నది.
ఈ విషయంలో తెరాస పార్టీ తో పాటు ఆ పార్టీ ప్రభుత్వము కూడా తోడయ్యి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడంతో పాటు గత మూడు నాలుగు మాసాల నుండే మంత్రులు ఇక్కడ తిష్టవేసి ఎన్నికల కోసం ఇంటింటి ప్రచారం తో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో తాత్కాలికంగా కొన్ని అభివృద్ధి పనులు చేయడం వలన రాజీనామా వల్ల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే అపోహ పెరిగిపోయింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు నెల రోజులుగా నియోజకవర్గంలోనే తిష్టవేశారు.ఆయన వూరూర తిరగడమే కాదు, కులాలవారీగా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. హామీ లు గుప్పిస్తున్నారు. గతంలో బహుశా ఏ ఉపఎన్నికలను చేయనంత ఉధృతంగా టిఆర్ ఎస్ హుజూరాబాద్ ప్రచారం చేస్తున్నది. కులాలకు నిధులు ప్రకటిస్తున్నారు,భవనాలు ప్రకటిస్తున్నారు,రోడ్లు హామీ ఇస్తున్నారు. ఇది చూస్తే టిఆర్ ఎస్ ప్రచారంలాగా లేదు,ప్రభుత్వమే టిఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రచారం చేస్తున్నదా అనిపిస్తుంది. ప్రచారం ఏదో ఒక స్థాయిలో జూలైలో మొదలయింది. ఆగస్టు 16న జమ్మికుంట ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఈ ప్రచారం తారాస్థాయి నందుకుంది. దేశంలో అత్యంత ఖరీదయిన సంక్షేమ పథకం ‘దళిత బంధు’ కేవలం హుజూరాబాద్ లో టిఆర్ ఎస్ విజయం కోసమే తెచ్చారనేది సర్వత్రా వినపడుతున్న విషయం. ఒక చిన్నఉప ఎన్నికను తెలంగాణ మహా ఉద్యమ నేత అయిన కెసిఆర్ ఇంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ఉందా?
ఈ కారణంగానే అనేకచోట్ల తమ శాసన సభ్యులను ప్రజలు “మీరు రాజీనామా చేస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉప ఎన్నికల వేళ ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం ఉన్నది కనుక రాజీనామా చేయండి” అని ఒత్తిడి చేసిన చరిత్ర మన రాష్ట్రానికే దక్కింది. ఇక రాజకీయ పార్టీలు మాత్రమే చూసుకోవాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల మధ్య ప్రచారం ప్రభుత్వం దాకా వెళ్లడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసి పరిపాలనను విస్మరించడం, మంత్రులు ఈ ప్రాంతానికే పరిమితం కావడం చరిత్రలో మనకు ఏ రాష్ట్రంలోనూ కనిపించదు.
ఉప ఎన్నికకు ఇంత ప్రాధాన్యత అవసరమా?
పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో అక్కడి ప్రభుత్వం పార్టీకి తోడుగా కొంత పరిధిలోనే పని చేసింది. ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య న వివాదాలు తగువు లాటలు జరిగినవి కానీ అధికార దుర్వినియోగం ఇక్కడంతా జరిగినట్లు అక్కడి ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించలేదు.
రాజకీయ పార్టీలు , పార్టీ నాయకులు మాత్రమే పాల్గొనే విధంగా హుజరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు హుజరాబాద్ ఉప ఎన్నికలలో ప్రవేశించకుండా కట్టడి చేసి రాజకీయ పార్టీలకు కొత్త సందేశాన్ని అందించిన వలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి ఉంటే విచ్చలవిడిగా జరుగుతున్న అధికార దుర్వినియోగం, డబ్బు ,మద్యం వంటి అంశాలపైనా ఉక్కుపాదం మోపాలి. ఇది కేవలం హుజురాబాద్ కు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరంలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగిన వ్యయాన్ని పరిమితం చేసి అధికార దుర్వినియోగానికి కట్టడి చేయడం ద్వారా కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టాలి.
ఉద్యమ నాయకుడిగా రెండు దశాబ్దాల పాటు అధికార పార్టీ అభివృద్ధి మనుగడలో క్రియాశీల పాత్ర పోషించిన ఈటల రాజేందర్ ను పార్టీ నుండి పంపించడం అంటే చిత్తశుద్ధి గల నాయకులను సాగనంపి తే ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చుననే ప్రభుత్వం భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా లేకపోలేదు. ఉద్యమ సమయంలో ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు లోనూ తెరాస వెంట నడిచిన వేలాది మంది కార్యకర్తలు వందలాది మంది నాయకులు పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ, ప్రభుత్వంలోనూ కనబడడం లేదు. ఉద్యమకాలంలో ఉద్యమకారుల పైన విధ్వంసానికి పాల్పడిన తెలంగాణ ద్రోహులు ఇవాళ చట్టసభలలో ఊరేగుతూ రాజ్యమేలుతున్నారు ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం?
వ్యక్తిత్వం కూడా గెలుపును నిర్ణయిస్తుంది
ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 28 వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. గత నాలుగు మాసాలుగా ఏదో ఒక మూల నిరంతరము ప్రచార హోరు కొనసాగినప్పటికీ దళిత బంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక వర్గాన్ని మచ్చిక చేసుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ జర్నలిస్టుల ఇంటర్వ్యూలలో కొత్త కోణాలు బయటపడుతున్నవి.
అనేక చోట్ల జరిగిన ప్రజలతో చర్చా కార్యక్రమంలో ఓటర్లు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలుపుతూ తమ ఓటు ఈటల రాజేందర్కెకే నని తమ కష్టసుఖాలలో వెన్నంటి ఉన్న అతని వ్యక్తిత్వం పార్టీ కంటే కూడా గొప్పదని అనేకమంది సామాన్య ప్రజానీకం తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా స్వయానా ఆర్థిక మంత్రి హరీష్ రావు వీణవంక లో ఓటర్లను పలకరిస్తూ తమ ఓటు ఎవరికి అని అడిగితే తనను తాను పరిచయం చేసుకున్న ప్పటికీ తమ ఓటు పువ్వు గుర్తుకే అని పరోక్షంగా ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని చెప్పడాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి?
ఇక్కడ బిజెపి పార్టీ యొక్క గొప్పతనం గురించి మాట్లాడడం లేదు. ఒక శాసన సభ్యుడు లేదా అభ్యర్థి ఆ ప్రాంతానికి చేసే సేవ, వ్యక్తిత్వం ,సమర్థత, కలుపుగోలుతనం గెలుపును నిర్ణయిస్తుంది అనే విషయం తేటతెల్లమవుతుంది. అందుకే అక్కడి ప్రజలతో మమేకమై పోయిన ఈటెల రాజేందర్ యొక్క సుదీర్ఘ సేవ రాజకీయాలకు, రాజకీయ నాయకులకు, శాసనసభ్యులకు గుణపాఠం కావలసిన అవసరం ఎంతో ఉన్నది.
రాజకీయాలను రాజకీయం చేస్తున్న నేటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని, అధికార ప్రయోజనాన్ని, రాజకీయ లబ్ధిని హుజురాబాద్ ఎన్నిక నుండైనా విరమించుకోవాలని నేటి సమకాలీన పరిస్థితులు హెచ్చరిస్తున్నవి. స్థానిక ప్రజలు అనేక సందర్భాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఎక్కడినుండో మంత్రులు శాసనసభ్యులు తమ ప్రాంతానికి రావాల్సిన అవసరం లేదని తమ అభ్యర్థిని గెలిపించుకోవడం లో పని చేయగలిగిన వారు ఎవరో తమకు బాగా తెలుసునని అధికార పార్టీకి చురకలు అంటిస్తూ ఉన్నారు.
ఇక్కడ బిజెపి పార్టీ ఒక వేదిక గా ఉండవచ్చు. కానీ పార్టీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ యొక్క వ్యక్తిత్వం, సామాజిక సేవ, సమర్థత రాజకీయ చతురత ఆయనను తిరిగి ఎన్నుకోవడానికి కీలక మవుతున్న విషయాలను రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఉప ఎన్నికలు రావాలని కోరుకునే అటువంటి సంప్రదాయం, ప్రజలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు రావడానికి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో బాధ్యత వహించాలి అని విశ్లేషకులుగట్టిగా చెబుతున్నారు.
రాజకీయ పార్టీలు కూడా సమర్ధవంతమైన పాత్రను పోషించని కారణంగా ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో తెలియనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న మాట వాస్తవం. జాతీయ పార్టీగా ఉండి ఇటీవలికాలంలో రాష్ట్ర రాజకీయాలను కొంతమేరకు ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ తన అభ్యర్థిని ప్రకటించకపోగా తన వ్యూహాన్ని కూడా పరిచయం చేయకపోవడం నానబెట్టే ధోరణికి అద్దం పడుతుంది . ఈ ధోరణి పార్టీ కార్యకర్తలకూ కూడా కొంత నిరాశనే మిగిల్చింది అనడంలో సందేహం లేదు. రాజకీయ పార్టీలు నిబద్ధత గా, సేవా భావంతో, నిజాయితీగా ఉన్నప్పుడే కార్యకర్తలు నాయకులు కూడా నిజాయితీపరులు అవుతారు. ప్రజలకు నీతివంతమైన రాజకీయాలను నేర్ప గలుగుతారు. అవినీతితో కుళ్ళి కంపుకొడుతున్న రాజకీయ పార్టీలు కొన్ని అక్రమ పద్ధతులకు పాల్పడడంతో పాటు అధికార పార్టీ ప్రభుత్వo తో జతకట్టడం వలన ప్రజలు నిక్కచ్చిగా ప్రశ్నించే పరిస్థితి దాపురించింది.
మార్పు రావాలి
తనను దిక్కరించిన ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందు కోసం ఎంతకైనా తెగించడం ఆత్మవంచనే అవుతుంది. పెద్దరికం తో వ్యవహరించే రాజకీయ పార్టీలు గెలుపు ఓటములను హుందాగా స్వీకరించి పరిపాలన పైన దృష్టి పెట్టి విమర్శలకు జవాబు చెప్పాల్సింది పోయి నిత్యం విమర్శల పాలు కావడం ఈ రాష్ట్ర ప్రజానీకం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమే అవుతుంది. అధికార పార్టీతో పాటు రాజకీయ పార్టీలు చేసే ప్రలోభాలను ఎండగట్టి, తిప్పికొట్టి ప్రతిభ ఆధారంగా మాత్రమే ఓట్లు వేసి జ్ఞానోదయం కలిగించాలి. అతిగా ప్రచారానికి నెలల ముందే ప్రజల మధ్యన అడుగుపెట్టే సంప్రదాయానికి మంగళం పాడాలి. మంత్రుల, శాసనసభ్యుల అధికార దుర్వినియోగాన్ని, ప్రచారాన్ని ప్రతిఘటించే నూతన విలువలకు అంకురార్పణ జరగాలి. ఎన్నికల అభ్యర్థులు చేసే వ్యయంపైన ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, E. D. వంటి సంస్థలు కళ్లెం వేయాలి. కఠినంగా శిక్షించాలి. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ వెయ్యి కోట్ల ఖర్చుకు సిద్ధపడినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో E. D. కి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తున్నది.
ఎంత స్థాయిలో హుజురాబాద్ ఉప ఎన్నిక విస్తృత ప్రచారం అయిందో అంతే స్థాయిలో ఈ ఎన్నికల ద్వారా భారతదేశంలో తర్వాత కాలంలో జరగబోయే ఎన్నికల సందర్భంలో కఠిన నిబంధనలు అమలు అయ్యేలా అన్ని వర్గాలు చూడాలి. అప్పుడు ప్రపంచ స్థాయి ని ఆకర్షించిన హుజురాబాద్ ఉప ఎన్నికకు సార్థకత చేకూరినట్లుగా దేశమంతా సంతోషపడుతుంది .ఆ వైపుగా అన్ని వర్గాల లో అడుగులు పడాలి. తడబాటు లేకుండా ప్రజలు ప్రశ్నించి తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే కొత్త విధానం రావాలి. అధికార దుర్వినియోగానికి కళ్లెం పడాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)