ఆంధ్రాలో ‘వర్క్ ఫ్రం హోం’ టౌన్లు వస్తున్నాయ్

ఒక వైపుతెలంగాణ ప్రభుత్వం ఐటి ఉద్యోగులు క్రమంగా కార్యాలయాలకు రావాలని ప్రతిపాదిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ‘వర్క్ ఫ్రం హోం టౌన్లు’ (WFHT)లను  ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఇపుడు సొంతవూర్లలో ఉంటూ ఇళ్ల దగ్గిర నుంచి పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతులతో ఐటికంపెనీని పోలిన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. కనీసం పార్లమెంటు నియోజకవర్గాని కొక పట్టణాన్ని WFHT గా డెవెలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి చర్యలు మొదలు పెట్టింది కూడా.

కోవిడ్ అనంతరం ఏర్పడిన పరిస్థితులలో  వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగుతుందని,దీనిని పట్టణాభివృద్ధికి వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇలాంటి  టౌన్ల ఏర్పాటుపై  ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించింది.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల ఏర్పాటు చేయాలని ఈ రోజు జరిగిన  ‘వర్క్ ఫ్రమ్ హెమ్ టౌన్ కమిటీ’ వర్చువల్ సమావేశం సమావేశంలో నిర్ణయించారు. సమావేశానికి ఐటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షత వహించారు.

తొలుత 25 చోట్ల పైలట్ ప్రాతిపదినక WFHT లను ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు.  ఈ ప్రాజక్టును అమలుచేసేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను లోతుగా అధ్యయనం చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది.

సమావేశానికి   ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎన్ఆర్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి , ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తదితరులు హాజరయ్యారు.

ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి నేతత్వంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.

డిమాండ్, సర్వే, ఇంటర్ నెట్, 24 గంటల విద్యుత్, సెక్యూరిటీ, ప్రైవసీ వంటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

వర్క్ స్టేషన్లకు అవసరమైన భవనాలను ఇప్పటికే గుర్తించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధి తెలిపారు. సకల వసతులతో 25 కేంద్రాలు సిద్ధంగా ఉన్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు వెల్లడించారు. 3 దశల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లను నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం  ఐ.టీ శాఖ చేసింది.

30 మంది  కలిసి పని చేసుకునేలా కో-వర్కింగ్ ఫెసిలిటీ సెంటర్ లను ఈ టౌన్లలో ఏర్పాటు చేస్తారు. సొంత గ్రామాల నుంచి పనిచేసుకునే విధంగా ఉద్యోగులకు, కంపెనీలు వెసులుబాటు కల్పించాలని సమావేశం అభిప్రాయపడింది. వాటికి అయ్యే వ్యయం, స్పేస్,ఒక్కో ఉద్యోగి, వర్క్ స్టేషన్ కి అయ్యే ఖర్చులపై  ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

కాస్ట్‌ టు కాస్ట్‌ విధానంలో వీటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలిన సమావేశం అభిప్రాయపడింది.

3 నెలల్లోగా పైలట్ ప్రాజెక్టు అమలు చేసి అవసరాలు, కొరతలు, సదుపాయాలపై స్పష్టత  తెలుసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.

‘వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్’ ల వల్ల ఐ.టీ కంపెనీలు, ప్రభుత్వం, ఉద్యోగులకు ఉండే లాభాలపై  ఐ.టీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు.

కాకినాడ, విశాఖలలోని ఏపీ ఇన్నోవేషన్ సెంటర్లు , విలేజ్ డిజిటల్ సెంటర్లు , ఇంజనీరింగ్ కాలేజీలు, కోవర్కింగ్ స్టేషన్లుగా మలుచుకునేందుకు ప్రతిపాదించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు, వర్కింగ్ స్టేషన్లుగా జిల్లాలలోని ఏపీఐఐసీ భవనాలు, ఈఎస్ సీలను మలుచుకునే దిశగా మ్యాపింగ్ చేయాలని మంత్రి మేకపాటి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *