గుంటూరు – న్యూఢిల్లీ కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు: లావు అభ్యర్థన

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించాలని  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానాన్ మాల్యా కు  నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు.

పల్నాడు వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానాన్ మాల్యాను కోరారు.

గురువారం విజయవాడ లోని, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ( రైల్వే కార్యాలయంలో) జీఎం ఆధ్వర్యంలో జరిగిన రైల్వే సమావేశంలో ఆయన ఈ మేరకు వినతిప్రతం సమర్పించారు. సమావేశంలో ఏపీ లోని ఎంపీ లు పాల్గొన్నారు.

లావు శ్రీకృష్ణదేవరాయలు లేవనెత్తిన అంశాలు

* ప్రస్తుతం ఉన్న గుంటూరు– గుంతకల్లు మార్గానికి అనుసంధానించే న్యూపిడుగురాళ్ల– శావల్యాపురం మధ్య కొత్త లైన్‌ పూర్తి దశలో ఉంది. ఈ కనెక్షన్‌లో మిగతా విద్యుదీకరణ పనులు త్వరగా పూర్తి చేసి లైన్‌ను ప్రారంభించాలని కోరారు.

* గద్వాల్‌– మాచర్ల లైన్‌ ముంబైకి మరియు ఈ మార్గంలో ముఖ్యమైన ప్రదేశాలకు దూరం తగ్గిస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు.

* నల్లపాడు– పగిడిపల్లి మధ్య ఉన్న లైన్‌ను డబుల్‌ లైన్‌ చేయాలని కోరారు.

* అలాగే జిల్లాలోని చిట్టచివరి స్టేషన్ల అయిన మాచర్ల, రేపల్లె నందు ..పిట్‌లైన్స్‌ ఏర్పాటు చేయాలని, మెయింట్‌నెట్‌ కోసం వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. గుంటూరు జంక్షన్‌ నుండి న్యూఢిల్లీ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టండి

* పల్నాడు ప్రాంతం మిర్చి తదితర వాణిజ్య పంటలకు కేంద్రంగా, పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతుంది. కానీ, ఇక్కడి నుండి ఢిల్లీకి వెళ్లాలంటే రైలు కోసం విజయవాడ, సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితులు. అందువల్ల పల్నాడు ప్రాంతం గుంటూరు నుండి న్యూఢిల్లీకి అన్ని తరగతుల డైరెక్ట్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని అభ్యర్థించారు.

* గుంటూరు నుండి నరసరావుపేట, మార్కాపురం, నంద్యాల ప్రాంతం మీదుగా వారణాసికి నేరుగా వారానికి ఒకసారి ఎక్స్‌పెస్‌ రైల్‌ను ప్రవేశపెట్టాలని అభ్యర్థించారు.

* నరసరావుపేట నుండి గుంటూరు, విజయవాడ మధ్య రైళ్లు తక్కువగా ఉన్నాయని, దీన్ని పరిష్కరించాలని కోరారు. నరసరావుపేట జిల్లాగా మారుతున్న నేపథ్యంలో గుంటూరు నుండి నరసరావుపేటకు మరియు గుంటూరుకు ఎక్స్‌ప్రెస్‌ రైల్‌ను ప్రవేశపెట్టాలని కోరారు.

* మాచర్ల నుంచి గుంటూరు మధ్య ప్యాసింజర్‌ రైళ్ల సదుపాయం తక్కువగా ఉందని, మాచర్ల నుండి ఉదయం 5.30గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు మాత్రమే రైలు ఉందని, మధ్యాహ్న సమయంలో గుంటూరు నుండి మాచర్లకు ఎటువంటి కనెక్టివిటీ లేదని పేర్కొన్నారు. గుంటూరు నుండి మాచర్ల మధ్య.. గుంటూరు నుండి మద్యాహ్నం 2గంటలకు బయలుదేరి 4.30గంటలకు చేరుకునేలా, ఇదే రైలు మాచర్ల నుండి సాయంత్రం 6గంటలకు ప్రారంభమై రాత్రి 10గంటలకు గుంటూరుకు చేరుకునేలా ఇంటర్ సిటీ రైల్ ను పెట్టాలని అభ్యర్థించారు.

* ప్రజలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల స్థానంలో అవసరమైన చోట ఆర్‌యుబిలు, ఆర్‌ఓబీల నిర్మాణాలు చేపట్టాలని అభ్యర్థించారు.

* సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి మీదుగా నడుస్తున్న ఉద్యోగుల ప్రత్యేక రైలు(02795) ఎక్కడా ఆగటం లేదని, ఈ రైలు నడికుడి జంక్షన్‌లో ఆగితే పల్నాడు ప్రాంతానికి సాయంత్రం సమయంలో సికింద్రాబాద్‌ చేరుకోవడానికి మెరుగైన కనెక్టవిటీ ఉంటుందని తెలిపారు.

* ఫలక్‌నూమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(02704) సత్తెనపల్లిలో ఆగేలా చూడాలని కోరారు

* నరసరావుపేట జిల్లా కేంద్రంగా మారబోతున్నందున.. ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ పొడవును పొడిగించాలని, జిల్లా కేంద్రాల నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలను అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉందని, స్టేషన్‌ వాతావరణాన్ని పచ్చని ప్రదేశాలతో సహా అందంగా తీర్చిదిద్దాలని అభ్యర్థించారు.

* పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట పెద్ద వ్యాపార కేంద్రంగా ఉందని, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా నరసరావుపేట యార్డును మరింత అభివృద్ధి చేయాలని అభ్యర్థించారు.

*సత్తెనపల్లి స్టేషన్‌ లో మరుగుదొడ్లు, వెయిటింగ్‌ హాల్‌లతో అదనపు భవనాలు అవసరం ఉందని వెల్లడించారు.

* పిడుగురాళ్ల స్టేషన్‌ లో:ప్రధాన రహదారి నుండి స్టేషన్‌ రోడ్డు విస్తరణ, ప్లాట్‌ఫాం నెం .2 వద్ద టాయిలెట్ల నిర్మాణం, రైలు నంబర్‌ డిస్‌ప్లే బోర్డులు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు గురించి వివరించారు. భావనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ 17203/17204 ఈ స్టేషన్‌లో నిలుపుదల గురించి విజ్ఞప్తి చేశారు.

* నడికుడి జంక్షన్‌ లో : ఉద్యోగులకు సంబంధించిన ప్రత్యేక ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ 02795/02796 నడికుడి జంక్షన్‌ వద్ద ఆపాల్సిన అవసరం ఉందని, రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ను పునర్‌ నిర్మించాలని మరియు స్టేషన్‌లోని అన్ని మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు రైల్వే డివిజన్‌ ప్రాంతంలో ప్రతిపాదించిన నాలుగు రైల్వే విశ్వవిద్యాలయాల్లో ఒకటి అత్యవసరంగా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *