ఆనందయ్య మందు పంపిణీకి త్వరలో తేదీ ఖరారు

అమరావతి, మే 31 : మూడు రకాల ఆనందయ్య మందులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, అయితే ఈ మందులను ఆయుర్వేదంగా గుర్తించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వాటిని సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకోవొచ్చునని ఆయన చెప్పారు.

కరోనా బాధితులు ప్రభుత్వమందిస్తున్న రెగ్యూలర్ ట్రీట్ మెంట్ పొందుతూ సప్లిమెంట్ గా ఆనందయ్య మందును వినియోగించుకోవచ్చునని సింఘల్ తెలిపారు.

ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా క్యూలో కరోనా పేషెంట్లు నిల్చోవొద్దని, బంధువుల ద్వారా తెప్పించుకుని వాడుకోవాలని స్పష్టం చేశారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింఘల్ మాట్లాడారు.

Anil Kumar Singhal

ఆయన చెప్పిన విషయాలు:

ఆనందయ్య మందులో పీ,ఎన్.ఎఫ్, కే తో పాటు కంటిలో వేసే మందు.. ఇలా అయిదు రకాలున్నాయి.. కే శాంపిళ్లు ఇవ్వలేదు, కంటి లో వేసే మందు తక్కువ మందికే ఇచ్చామని ఆనందయ్య తెలిపారు. కే మందు మెటీరియిల్ లేకపోవడంతో తయారీవిధానం పరిశీలకులు చూడలేకపోయారు.

పీ, ఎల్, ఎఫ్ మందులు సంతృప్తికరంగా ఉన్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనడానికి ఆధారాలు కనిపించలేదు.  ఈ మూడు రకాలు వినియోగానికి పనికొస్తాయని నిపుణులు కూడా తెలిపారు.

ఈ మందులతో కొవిడ్ నయమవుతుందనడానికి ఆధారాలు లభించలేదు. అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయనడానికి కూడా ఆధారాల్లేవు.

వాటన్నింటినీ పరిగణలోకి తీసుకునే పీ.ఎల్.ఎఫ్ మందుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కంటిలో వేసే మందుపై రిపోర్టులు మూడు వారాల్లో రావొచ్చు. డాక్టర్లు ఇచ్చే  మందు వాడుతూనే ఆనందయ్య మందును తీసుకోవచ్చు.

ఇదే విషయం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పీ, ఎల్, ఎఫ్ మందుల వినియోగానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిలో వేసే మందు, కే మందుపై వివరాలను త్వరలో కోర్టుకు అందజేస్తాం. ఆనందయ్య మందును ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. జిల్లా అధికారులు, ఆనందయ్యతో చర్చించిన తరవాత మందు పంపిణీ తేదీని ప్రకటిస్తాం

మందు పంపిణీలో కొవిడ్ పేషెంట్లు క్యూ నిల్చొవొద్దు…

ఈ మందు పంపిణీ సందర్భంగా కొవిడ్ పాజిటివ్ పేషెంట్లు క్యూలో నిలబడ కూడదని, వారివల్ల అదే క్యూలో ఉండే మిగిలిన వారికి కరోన సోకే ప్రమాదముందని సింఘల్ తెలిపారు.

కొవిడ్ కేర్ సెంటర్లు, హోం ఐసోలేషన్లలో ఉన్న వారు తమ బంధువులతో తెప్పించుకుని వినియోగించుకోవాలన్నారు.

ఆయూష్ తరఫున ఆనందయ్య మందు తయారీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ మందు వినియోగంపై క్లినికల్ ట్రయల్స్ జరగలేదని, అందువల్ల ఆనందయ్య మందుతో ఎంత లాభం ఉంటుందో తెలియదని ఆయన స్పష్టం చేశారు. మందు పంపిణీ తేదీపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆయనతెలిాపారు.

ఆయూష్ కమిషనర్ రాములు

ఈ నెల 21, 22 తేదీల్లో ఆయూష్ టీమ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుల వివరాలను, శాంపిళ్లు సేకరించామని ఆయూష్ కమిషనర్ రాములు తెలిపారు.

సేకరించిన శాంపిళ్లను ల్యాబ్ లకు పంపించి వివిధ టెస్టులు నిర్వహించామని  ఇందుకు కేంద్ర సంస్థ సాయం కూడా తీసుకున్నామని ఆయన తెలిపారు.

ఆనందయ్య మందు తీసుకున్నవారి వివరాలను, వారి అభిప్రాయాలను సేకరణకు కేంద్ర సంస్థ సహాయం తీసుకున్నామన్నారు. ల్యాబ్ రిపోర్టులు, కేంద్ర సంస్థ నివేదికలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రంగా చర్చించారన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *