ఆంధ్రలో 1179 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో  2 లక్షలకు పైగా ఉన్న యాక్టివ్‌ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయి.. రికవరీ రేటుకూడా గణనీయంగా మెరుగుపడింది. మే 7న 84.32శాతంగా ఉన్న రికవరీ రేటు, ప్రస్తుతం దాదాపు 90శాతానికి చేరిందని ఈ  రోజు ముఖ్యమంత్రి జగన్ జరిపిన సమీక్షలో అధికారులు తెలిపారు.

కాల్ సెంటర్ కు  మే 3న 19,175 కాల్స్‌ 104కు రాగా, మే 29న 3,803 కాల్స్‌ నమోదయ్యాయని, కేసుల సంఖ్య తగ్గిందనడానికి ఇదొక సంకేతమని అన్నారు. అన్ని జిల్లాల్లో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.

ఇక బ్లాక్ ఫంగస్ కు సంబంధించి  రాష్ట్రంలో 1179 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయని, ఇందులో 1068 మందికి వైద్యం అందుతోంది అధికారులు చెప్పారు.  97 మందికి బ్లాక్ ఫంగస్ నయం అయ్యింది.

ఈ వ్యాధితో  14 మంది మరణించారని చెబుతూ కోవిడ్‌ లేకున్నా  బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని వారు వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిన వారిలో 1139 మంది కోవిడ్‌ సోకినవారు కాగా, 40 మందికి కోవిడ్‌ రాకపోయినా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిందని వారు తెలిపారు.

డయాబెటిస్‌ ఉన్నవారికి అధికంగా వస్తోందని, బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి ఉంచుకోవాలని   సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని, మాత్రలను అవసరమైనంత మేర సిద్ధంచేసుకుంటున్నామని, అలాగే ప్రత్యామ్నాయ ఇంజక్షన్లుకోసం కూడా కృషిచేస్తున్నామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *