సీమ ఉద్య‌మ‌ సైర‌న్ ‘సిద్దేశ్వ‌రం’

(రాఘ‌వ‌శ‌ర్మ‌)

రాయ‌ల‌సీమ ఉద్య‌మానికి సిద్దేశ్వ‌ర ఉద్య‌మం సైర‌న్ ఊదింది.న‌ది పాయ‌లు పాయ‌లుగా చీలి స‌ముద్రుడిలో సంగ‌మించిన‌ట్టు, రాయ‌ల‌సీమ న‌లుమూలల నుంచి రైతులు కృష్ణ‌మ్మ ఒడిలోకి వ‌చ్చి చేరారు.

సంగ‌మేశ్వ‌రుడి సాక్షిగా సిద్దేశ్వ‌రం అలుగు నిర్మాణానికి అన్న‌దాత‌లే శంకుస్థాప‌న చేశారు.

చ‌రిత్ర‌లో ఇది అరుదైన సంఘ‌ట‌న‌.

క‌చ్చితంగా అయిదేళ్ళ క్రితం; 2016 మే 31వ తేదీ మంగ‌ళ‌వారం ఈ ఉద్య‌మం ఆవిష్ర్క‌త‌మైంది. ఈ ఉద్య‌మానికి సోమ‌వారంతో అయిదేళ్ళు పూర్త‌య్యాయి.

చిత్తూరు జిల్లా నుంచి నేను, భూమ‌న్‌, హైకోర్టు న్యాయ‌వాది శివారెడ్డి బ‌య‌లు దేరి సోమ‌వారం ఉద‌యానికే నంద్యాల చేరుకున్నాం. ఈ ఉద్య‌మ ర‌థ సార‌థి బొజ్జా ద‌శ‌ర‌థ‌రామిరెడ్డి ఇంట్లో పాత్రికేయ‌ల‌ స‌మావేశంలో మాట్లాడాక నందికొట్కూరు బ‌య‌లుదేరాం.నందికొట్కూరు శివారులోని ర‌బ్బాని వేర్ హౌస్‌లో ఉన్న మ‌బూసాబ్ గెస్ట్ హౌస్‌లో విదిడి చేశాం.

ఆరోజు మ‌ధ్యాహ్నం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేట‌ర్‌ను సంద‌ర్శించాం. కృష్ణాన‌ది నీళ్ళు రాయ‌ల‌సీమ‌లో ప్ర‌వేశించ‌డానికి ఈ హెడ్‌రెగ్యులేట‌రే ముఖ‌ద్వారం. నీళ్ళు లేక ఈ రెగ్యులేట‌ర్ నిరుప‌యోగంగా ప‌డి ఉండ‌డం మాకు దఃఖ్ఖాన్ని క‌లిగించింది.

ఈ రెగ్యులేట‌ర్ నుంచి ప్ర‌వ‌హించే నీళ్ళు బ‌న‌క‌చ‌ర్ల క్రాస్ వ‌ద్ద మూడు పాయ‌లుగా చీలుతుంది.ఒక పాయ శ్రీ‌శైలం కుడికాల్వ‌, మ‌రొక పాయ తెలుగు గంగ‌, ఇంకొక పాయ‌ కేసీ కెనాల్‌గా సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల్సి ఉంది.

కానీ, నీళ్ళు లేని ఈ కాల్వ‌లు ఖాళీగా ద‌ర్శ‌న మిస్తున్నాయి.

ఈ రెగ్యులేట‌రు ద్వారా వ‌చ్చే నీరు ప‌ద‌కొండువేల క్యూసెక్కుల సామ‌ర్థ్యాకి పెంచాల‌ని మూడున్న‌ర దశాబ్దాల క్రితం చేసిన పాద‌యాత్ర‌లకు ఈ తూములు మౌన సాక్షిగా మిగిలాయి.

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక దీని సామ‌ర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల‌కు పెంచుతూ మ‌రో ప‌ది తూములు నిర్మించారు.నిజానికి ఈ సామ‌ర్ఘ్యాన్ని 75 వేల క్యూసెక్కుల‌కు పెంచితే త‌ప్ప ఈ కాల్వ‌ల్లో త‌గినంత నీళ్ళు పార‌వు. నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీ దీనిని వ్య‌తిరేకించింది.

ఆ పార్టీ నాయ‌కుడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌కాశం బ్యారేజి పైన ఆందోళ‌న చేస్తే, తెలంగాణా నాయ‌కులు కూడా సామర్థ్యం పెంపును వ్యతిరేకించారు.

శ్రీ‌శైలంలో నీళ్ళు 834 అడుగుల‌కు చేర‌గానే దిగువ‌కు వ‌దిలేసే విధంగా తెలుగు దేశం ప్ర‌భుత్వం జీవో నెంబ‌రు 69ని తెచ్చింది. ఫ‌లితంగా 842 అడుగుల ఎత్తులో ఉన్న పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రాకుండా చేసింది.

రాయ‌ల‌సీమ నేల‌ను ఒరుసుకుంటూ పారుతున్న కృష్ణ‌లో చుక్క‌నీరు రాకుండా చేయ‌డం ఎంత దుర్మార్గం!? మిగులు జ‌లాల‌తో నిర్మించిన ఈ ప్రాజెక్టుల‌న్నీ వృథాయేనా!?

సిద్దేశ్వ‌రం వద్ద ఒక అలుగు న‌ర్మించిన‌ట్ట‌యితే ఈ స‌మ‌స్య కొంత వ‌ర‌కైనా ప‌రిష్కార‌మ‌వుతుంది.పోతిరెడ్డిపాడు నుంచి నందికొట్కూరుకు తిరుగు ప్ర‌యాణంలో ముచ్చుమ‌ర్రి మీదుగా కృష్ణ‌లోకి ప్ర‌వేశించాం.

దారి స‌రిగా లేదు. ముంపు పొలాల్లో వేసిన నువ్వు పంట‌ను కోసుకుని రైతులు ఇళ్ళ ముఖం ప‌డుతున్నారు.మా వాహ‌నం ఎన్నో మ‌లుపులు తిరుగుతూ, ఎగిరెగిరి ప‌డుతోంది.

సంగ‌మేశ్వ‌రాల‌యం స‌మీపాన చిన్న నీటి పాయ ద‌గ్గ‌ర మా వాహ‌నాన్ని నిలిపి న‌డ‌క ప్రారంభించాం. ఎదురుగా పురాత‌న‌మైన‌ సంగ‌మేశ్వ‌రాల‌యం.

ఆల‌యానికి ఆవ‌ల న‌దిలో రెండు కొండ‌ల న‌డుమ సిద్దేశ్వ‌రం వ‌ద్ద ఆన‌క‌ట్ట క‌ట్టాల‌న్న‌ప్ర‌తిపాద‌న‌ ఈ నాటిది కాదు.నాగార్జున సాగ‌ర్ నిర్మించ‌క ముందు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు క‌ట్టాల‌న్న‌ ప్రతిపాదన ఈ సిద్దేశ్వ‌ర వద్ద‌నే. దీనికి కేంద్ర జ‌ల‌వ‌న‌రుల సంఘం కూడా ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టును కోస్తా జిల్లా నాయ‌కులు చాలా తెలివిగా అట‌కెక్కించారు. నందికొండ‌కు ఎగువ‌న మ‌రొక ప్రాజెక్టు క‌ట్టాల‌న్న‌ప్పుడు కూడా మళ్ళీ సిద్దేశ్వ‌రం వ‌ద్దే క‌ట్టాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది.

దానిని కూడా ప‌క్క‌న పెట్టి, శ్రీ‌శైలం వ‌ద్ద ఆన‌క‌ట్ట క‌ట్టి, దాన్ని నాగార్జున సాగ‌ర్‌కు ఓవ‌ర్ హెడ్ ట్యాంకులా వాడుకుంటున్నారు.ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రానీయ‌కుండా అడ్డుత‌గులుతున్నారు. త‌ల‌గ‌డ‌నే నీళ్ళున్నా నోటికంద‌ని దైన్యం రాయ‌ల‌సీమ‌ది.

సూర్యుడు అస్త‌మిస్తున్నాడు.నందికొట్కూరుకు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యాం. అక్క‌డికొచ్చేస‌రికి చీక‌టిప‌డింది.మా గెస్ట్ హౌస్ ఉన్న వేర్ హౌస్‌ ద‌గ్గ‌రే పోలీసులు చెక్ పోస్టు పెట్టి వ‌చ్చిపోయే వ‌హ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు.

ఒక ఎస్ ఐ, ఒక ఏ ఎస్ ఐ, కొంద‌రు కానిస్టేబుళ్ళు మా వ‌ద్ద‌కు వ‌చ్చి, కృష్ణ లోకి వెళ్ళ‌కుండా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింద‌ని, గెస్ట్ హౌస్ దాటి రావ‌డానికి వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మేం ఊహించ‌ని ప‌రిణామం.కాసేప‌టికి సీఐ శ్రీ‌నాథ రెడ్డి వ‌చ్చారు.రైతు ఉద్య‌మం ప‌ట్ల చాలా సానుకూలంగా మాట్లాడారు.హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లేవీ జ‌ర‌గ‌వ‌ని, ఆంక్ష‌లు అవ‌స‌రం లేద‌ని ఇంటెలిజెన్స్ అధికారుల‌కు తాము ఎంత చెప్పినా విన‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ సీఐ రాత్రి ప‌డ‌కొండు గంట‌ల‌కు వెళ్ళిపోతూ ఒక కానిస్టేబుల్‌ను మా గెస్ట్ హౌస్ త‌లుపు వ‌ద్ద ఉంచి వెళ్ళారు. త‌లుపు తెరిస్తే చాలా న‌క్ష‌త్ర‌కుడిలా కానిస్టేబుల్ మ‌మ్మ‌ల్ని బ‌య‌ట‌కు వెళ్ళ నీయ‌కుండా అడ్డుకున్నాడు.

సీఐ వెళ్ళి పోగానే అన్ని ప‌త్రిక‌ల, చానెళ్ళ రిపోర్ట‌ర్లు వ‌చ్చారు.తెల్లారేస‌రికి మ‌మ్మ‌ల్ని గెస్ఠ్ హౌస్ అరెస్టు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. సిద్దేశ్వ‌రం వెళ్ళే ఉద్య‌మ కారుల వాహ‌నాల‌న్నిటినీ మేము బ‌స చేసిన‌ గెస్ట్ హౌస్ వ‌ద్ద ఆపేశారు.

క‌ర్నూలు నుంచి వ‌చ్చిన బాల‌సుంద‌రం, అనంత‌పురం నుంచి వ‌చ్చిన త‌రిమెల శ‌ర‌త్ చంద్రారెడ్డి త‌దిత‌రుల‌తో పాటు అనేక మంది ఉద్య‌మ‌నాయ‌కులను, రైతుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు వాహ‌నాల నుంచి దింపేశారు.

కృష్ణ‌లోకి వాహ‌నాలు వెళ్ళ‌నీయ‌కుండా ఎక్క‌డిక‌క్క‌డ గుంత‌లు త‌వ్వారు. ప్ర‌భుత్వ న‌ర్బంధాన్ని వ్య‌తిరేకిస్తూ, మేం బ‌స చేసిన గెస్ట్ హౌస్ ఎదురుగుండా రోడ్డుపై ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశాం.

ఒక బండ‌పై సిద్దేశ్వ‌రం అలుగు శంకుస్థాప‌న శిలాఫ‌ల‌కం అని రాసి దాన్ని రోడ్డుపైనే పెట్టాం.రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైలా వాహ‌నాలు పెద్ద ఎత్తున ఆగిపోయాయి. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసుల‌ను తోసేసుకుని ఉద్య‌మ‌కారులు కృష్ణ‌లోకి ప్ర‌వాహంలో వెళ్ళిపోతున్నారు.ఎంత మందిన‌ని వారు ఆప‌గ‌లుగుతారు!? ఒక‌రా ఇద్ద‌రా, ముప్ఫై వేల మంది రైతులు, ఉద్య‌మ‌కారులు కృష్ణ‌లోకి న‌లువైపులా ప్ర‌వాహంలా వ‌చ్చేశారు.

సాయంత్రం నాలుగ‌వుతోంది.

మేం కూడా కృష్ణ లోకి బ‌య‌లు దేరాం. దారి స‌రిగా లేక‌పోయినా జీపులు, ట్రాక్ట‌ర్లు, మోటారు సైకిళ్ళ లో కూడా సిద్దేశ్వ‌రం వ‌ద్ద‌కు చాలా మంది బ‌య‌లుదేరారు. పోలీసుల బ్యారికేడ్ల‌ను తోసుకుని మ‌రీ ఉద‌య‌మే చాలా మంది సిద్దేశ్వ‌రం వ‌ద్ద‌కు బ‌య‌లు దేరారు. మేం కూడా వారి వెంట న‌డిచాం.

పోలీసుల నుంచి ఫోన్ వ‌చ్చింది. ‘గృహ‌నిర్బంధంలో ఉన్న మీరు సిద్దేశ్వ‌రం వ‌ద్ద‌కు వ‌స్తే మిమ్మ‌ల్ని ఎలాగూ అరెస్టు చేస్తారు. మీకు కాప‌లాగా ఉన్న మా ఉద్యోగాలు పోతాయి’ అని వేడుకోలుగా ఆ ఫోన్‌లో వినిపించింది. మేం అరెస్టు అయినా న‌ష్టం లేదు కానీ, పోలీసుల ఉద్యోగాలు పోతాయ్‌! అదే జ‌రిగితే ఉద్య‌మం ప‌ట్ల వారికున్న సానుభూతి పోతుంద‌న్న భావ‌న‌తో మా అడుగులు ఆగిపోయాయి.

సూర్యుడు అస్త‌మిస్తున్నాడు.మా వాహ‌నం వెనుతిరిగింది.

(ఆలూరి రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

One thought on “సీమ ఉద్య‌మ‌ సైర‌న్ ‘సిద్దేశ్వ‌రం’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *