తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్న ‘యాధుమ్ ఊరే యావరుమ్ కెలిర్’ టీజర్ వదిలారు. అయితే దర్శకుడికి తెలియకుండా వదిలారు.
దర్శకుడు ముప్పావు గంట తర్వాత మీడియాలో చూసుకుని షాక్ తిన్నాడు. ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుతూండగా, తనకి తెలియకుండా ఈ టీజర్ ఎలా వచ్చిందబ్బా అని కన్ఫ్యూజ్ అయిపోయాడు. స్టూడియాలోంచి సినిమాల సీన్లు లీక్ అవడం తెలిసిందే గానీ, ఇలా ఒక టీజరే దర్శకుడికి తెలియకుండా మరీ తయారై, అఫీషియల్ గా రిలీజ్ అవడం, నిమిషాల్లో వైరల్ అయిపోవడం కనీవినీ ఎరుగని సంఘటన. ఈ కనీ వినీ ఎరుగని సంఘటనకి విజయ్ సేతుపతియే శ్రీకారం చుట్టాడు. సినిమాని దర్శకుడికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో, ఇనుమడించిన ఉత్సాహంతో దర్శకుడున్నాడనే విషయమే మర్చిపోయి, టీజర్ కట్ చేయించి మీడియాలోకి వదిలేశాడు. ఇదేమని అడగలేడు కొత్త దర్శకుడు వెంకట కృష్ణ రోఘనాథ్. కొత్త దర్శకుడికి ఇలాటివి ఇంకెన్నో వుంటాయి తప్పదు.
టీజర్ థ్రిల్లింగ్ గా వుంది. సేతుపతి శ్రీలంక తమిళ ఈలం టైగర్ పాత్ర పోషించాడు. టీజర్ ఓపెనింగ్ లో బురద తీసి నుదుటికి రాసుకుని, పోరాటానికి సిద్ధమవుతాడు. అప్పుడంటాడు, ‘మొదటి సారి నేను తమిళ నాడుకి వచ్చినప్పుడు తమిళం మాట్లాడాను, నన్ను అరెస్ట్ చేశారు’ అని. ఈ డైలాగు తర్వాత సేతుపతిని పట్టుకోవడానికి ఓ గుంపు వెంటాడుతుంది. గుంపు పట్టుకోగానే తన గుర్తింపు దాస్తాడు. ఇతనెవరో తెలియక ఆందోళన చెందుతారు. చివరికి పోలీసులు అరెస్ట్ చేసి, ‘నువ్వు తమిళుడివి’ అనగానే సేతుపతి స్థిరంగా చూస్తాడు. సే తుపతి లక్ష్యమేమిటో, ఏం చేయడానికి వచ్చాడో అన్న సస్పెన్సుని క్రియేట్ చేస్తుంది ఈ టీజర్. ఈ టైటిల్ కి అర్ధం, అన్ని ప్రదేశాలు, అందరు ప్రజలూ మనకు పరాయి కావనే భావం మనకు అంతర్లీనంగా వుంటుందని.