అది ఓ పూరిపాక. చుట్టూ టెంకాయ పట్టల దడి. పైన రేకుల కప్పు. ఆ కప్పు కింద రెండు ఎత్తైన మట్టి దిమ్మెలు. ఓ చెక్క టేబులు. నాలుగు చెక్క బల్లలు. ఓ రెండు కడప నాపరాతి టేబుళ్లు.
ఓ మట్టిదిమ్మె పైన గణగణ మండుతున్న రెండు కట్టెల పొయ్యిలు. అందులో ఒకదానిపై సత్తు ఇడ్లీ పాత్ర.మరో పొయ్యి పై పాతకాలం నాటి దోసె పెనుము. వీటికి తోడు చెక్క టేబుల్ పై మూడు గిన్నెలలో వేరుశెనిగ గింజల గట్టిచట్నీ, ఎర్రకారం, మరో గిన్నెలో కొన్ని కలిపిన చట్నీ.
ఆ టేబుల్ కు ముందు ఆధునికుల అవసరాల కోసం కూల్ డ్రింకులు, నీళ్లసీసాలు చల్లబరచడానికి ఉంచిన చిన్న సద్దిపెట్టె (అదే నండి బాటిల్ కూలర్). ఇదండీ ఆ రాజమ్మ హోటల్ అవతారం.
అయితే ఆ పాక ముందు బారులు తీరిన కార్లు, పాకలో నిలుచోవడానికి చోటు దొరక్క గిజగిజలాడుతున్న జనం సందడి, తొందర. అందరి కోరికలు, ఆకలి అవసరాలు తీర్చడానికి సవ్యసాచిలా పని చేస్తున్న రాజమ్మను చూడాలంటే, ఆమె చేతి కారం దోశె తినాలంటే మీరు పీలేరు- తిరుపతి మార్గంలోని చిన్నగొట్టిగల్లుకు సమీపంలో ఉన్న ఎడంవారి పల్లెకు వెళ్లక తప్పదు.
పీలేరు- తిరుపతి మార్గంలో పీలేరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడంవారిపల్లె రెండు అంశాలకు ప్రసిద్ధి. అందులో ఒకటి రాజమ్మ హోటల్ కాగా ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో నిర్వహించే మహాభారత యజ్ఞం రెండోది.
ఆ పల్లెలో పెద్దలు ధర్మరాజు ఆలయం నిర్మించి గత 20 ఏండ్లుగా ప్రతి సంవత్సరం మహాభారత యజ్ఞం నిర్వహిస్తూ చుట్టూ ప్రక్కల ప్రజల కళాతృష్ణ తీరుస్తుండగా, రాజమ్మ హోటల్ గత 40 సంవత్సరాలుగా ఆ దోవన వెళ్లే యాత్రికుల ఆకలి దప్పులు తీరుస్తుంటుంది.
“ఇడ్లీ, సాంబారు, చట్నీ, దోశ-చట్నీ, కారం దోశ, గుడ్డు దోశ, ఎర్ర కారం- చట్నీ” అడిగినవారికి లేదనకుండా ఏది కావాలంటే అది అందివ్వడం రాజమ్మ ప్రత్యేకత.
ఆ హోటల్ ను గురించి తెలిసిన వాళ్ళు, ఆ మార్గంలో వెళితే మాత్రం ఖచ్చితంగా రాజమ్మ చేతి తిండి తినే వెళతారు. అక్కడెక్కళ్ల కుండా ముందుకు పోవడం కష్టం. ఉదయం 6. 30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు ఈ హోటల్ అతిధులకు ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. రాజమ్మ గానుగలా తిరుగుతూనే ఉంటుంది.
ఈ హోటల్ ను గురించి రాజమ్మను పలకరిస్తే ఎన్నో గాధలు, బాధలు తన్నుకొస్తాయి. అభంశుభం తెలియని చిన్న వయసు (19 ఏండ్లలో) మెట్టినింట అడుగు పెట్టిన రాజమ్మకు ఒక రెండు సంవత్సరాలు జీవితం అర్థం కాలేదంటుంది. ఉన్న కొద్దిపాటి భూమిలో వచ్చే ఆదాయం ఉమ్మడి కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడం, భర్తకు ఇంకా కుర్రతనం అలవాట్లు పోకపోవడం కొంత ఇబ్బందిగానే జీవితం గడిచింది అంటూ గతం లోకి వెళ్ళింది రాజమ్మ.
రెండు సంవత్సరాల తర్వాత మెరుగైన జీవనం సాగించడం కోసం ఈ హోటల్ ను ప్రారంభించి నడుపుతున్నానని ఆమె వివరించింది.
ఈ మధ్యలో వయసులో ఉన్న ప్రతి ఆడపిల్లకు వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నానని, అలాగే పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూడటం లాంటి పనుల వల్ల అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డానని ఆమె అంటారు.
అయితే మొదట్లో హోటల్ వ్యాపారాన్ని వ్యతిరేకించిన అత్తా, భర్త కూడా సహకరించడంతో తాను ఈ వ్యాపారంలో నిలదొక్కుకోగలిగానని ఆమె అంటున్నారు.
వానొచ్చినా, వంగడొచ్చినా, ఆరోగ్యం బాగా లేకున్నా తన హోటల్ కు ఆశతో వచ్చే వారిని ఇబ్బంది పెట్టలేదని, అతి తక్కువ సందర్భాలలో మాత్రం హోటల్ మూశానని, గత 40 సంవత్సరాలుగా హోటల్ ఎదో ఒక పద్దతిలో నిరంతరాయంగా హోటల్ నడిపానని ఆమె అంటున్నారు.
లెక్క జమ లేకుండా అడిగిన వారికి అన్నీ అందిస్తున్నావు. బిల్లులు లెక్కవేయడంలో, తీసుకోవడంలో ఇవ్వడంలో తేడాలు ఉండవా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ “ఇది లోకం నాయనా. అన్ని రకాల మనుషులు ఉంటారు. నూటికి 95 మంది సక్రమంగానే బిల్లులు ఇస్తారు. కొంత మంది మోసగాళ్లు ఉంటారు. పట్టుకుంటే పొరపాటు అంటారు. లేకపోతె పోతుంది.” అయినా దేవుడిచ్చినంత, ప్రాప్తమున్నంత అంటూ వేదాంత ధోరణిలో సమాధానమిస్తుంది రాజమ్మ
ప్రస్తుతం జీవితం బాగుందని, ఇల్లు-వాకిలి, భూమి-పుట్రా ఏర్పరుచుకున్నానని, బిడ్డలు బాగున్నారని, అందరికీ పెళ్లిళ్లు చేశానని అంటూ తన కోడలు హోటల్ నిర్వహణలో తనకు అన్ని రకాల సహకరిస్తున్నదని ఆమె సంతృప్తిగా చెబుతారు.
ఉదయం 4. 30 కు నిద్ర లేస్తే రాత్రి 11 గంటలకే తిరిగి నిద్ర పోవడం జరుగుతుందని, హోటల్ మూసిన తర్వాత మరుసటి రోజుకు సంబారాలు సిద్ధం చేసుకొంటామని, ఉదయం నిద్ర లేచిన వెంటనే పిండి రుబ్బడం, చట్నీలు తయారు చేసుకోవడంతో దినచర్య ప్రారంభం అవుతుంది.
రోజుకు 10 వేలకు పైగా వ్యాపారం ఉంటుందని, గ్రామస్తులు కూడా ఇళ్లలో ఉపాహారం చేసుకోకుండా తన గుడిసెకు రావడం వారికి తనపైన ఉన్న అభిమానానికి నిదర్శనమని, అది తన అదృష్టమని అంటున్నారు రాజమ్మ.
ముందు రోజు మిగిలినవి మరుసటి రోజు వాడక పోవడం, వచ్చిన వారిని అభిమానంతో పలకరిస్తూ వారు కోరిన విధంగా వారి ఆకలి తీర్చడం తన విజయ రహస్యంగా రాజమ్మ చెపుతున్నారు.
తన ఒంట్లో శక్తీ ఉన్నంత వరకు హోటల్ నడుపుతానని ఘంటాపథంగా ఆమె ప్రకటించారు. ఇదండీ రాజమ్మ హోటల్ సంగతి. మీరు కూడా ఆ దారిలో వెళితే రాజమ్మను పలకరించండి. ఆమె చేతి వంట 40 యేళ్ల రహస్యమేమిటో కనుకొనండి.