ఓటేయడమే కాదు, ఓటర్  చైతన్యాన్ని కాపాడుకోవాలి..

 

-కన్నెగంటి రవి,

2023 నవంబర్ 28.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇదే చివరి రోజు. ఈ రోజు సాయంత్రానికి మైకులన్నీ మూగబోతాయి. వేలాది మందితో జరిగిన సభలు, సమావేశాలు ఆగిపోతాయి. ఆయా నియోజక వర్గాలలో ప్రచారానికి బయట నుండీ వెళ్ళిన నాయకులు వెనక్కు తిరుగుతారు.

నిజానికి గత నెల రోజుల పాటు, రణ గొణ ధ్వనులతో, పాటల, ఉపన్యాసాల హోరుతో, మారుమోగిన తెలంగాణలో ప్రజలకు చివరి రెండు రోజులు ఎన్నికల ప్రచార సరళి, పార్టీల హామీలు, నాయకుల ఉపన్యాసాలు, మానిఫెస్టో లు, తమ నిత్య జీవిత సమస్యలకు పార్టీలు చూపించిన పరిష్కారాలు ,తదితర అంశాలను బేరీజు వేసుకుని, తమలో తాము , కుటుంబ సభ్యులతో, తోటి కుటుంబాలతో కూడా చర్చించుకుని, ఓటు పై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన ప్రశాంత వాతావరణం రాష్ట్రంలో ఉండాలి.

కానీ, ఆ పద్ధతికి తావు లేకుండా, చివరి రోజుల్లో పార్టీలు, అభ్యర్ధులు ప్రజలను ప్రలోభ పెట్టడానికి మరింత వేగంగా గ్రామాలు,బస్తీలు తిరుగుతారు. డబ్బులు, మద్యం ప్రవహిస్తాయి. ఓటుకు ధర నిర్ణయం అవుతుంది. మద్యం మత్తులో ప్రమాణాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ప్రక్రియను తప్పు అనుకోవడం లేదు. వీటిని చాలా సాధారణంగా మార్చేశాయి. ప్రజలు కూడా ఈ క్రీడలో క్రియాశీల భాగస్వాములు అయిపోతున్నారు. తమ నుండీ సంవత్సరాలుగా దోచుకున్న డబ్బులే పార్టీలు పంచుతున్నాయి కనుక , తీసుకోవడంలో తప్పు లేదని ప్రజలు భావిస్తున్నారు.

ఎన్నికల ముందు రోజు రాత్రుల్లో ఓటర్లకు ఎవరు, ఎన్ని వేలు పంచారు అన్నది మరుసటి రోజు దిన పత్రికలలో వార్తలు గా వస్తాయి. ఎలక్షన్ కమిషన్ సహా , అందరికీ అన్నీ తెలుసు, ఈ ఎన్నికల నాటకంలో అందరూ ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తుంటారు. పోలీసు తనిఖీలు, వాహనాలు ఆపడాలు, నగదు స్వాధీనం చేసుకోవడాలు, అన్నీ ఆనవాయితీగా జరుగుతుంటాయి .

కానీ, మరి ఇప్పుడు పంచుతున్న ఇన్ని వందల కోట్ల నగదు గ్రామాలకు ఎలా చేరింది, ఎప్పుడు, ఎన్ని నెలల ముందు చేరిందో, అంత నగదు కనిపించకుండా పోయినా, బ్యాంకులు, ఎందుకు మౌనంగా ఉన్నాయో, కొన్ని లక్షల లీటర్ల మద్యం ముందుగానే రాజకీయ పార్టీల స్వంత గోదాములకు చేరిందో, అందరికీ తెలిసిన రహస్యమే. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, గెలుపు గుర్రాల పేరుతో, ఎందుకు శత కోటీశ్వరులకు మాత్రమే ఎక్కువ సీట్లు ఇస్తాయో ఈ రెండు రోజుల భాగోతం మనకు స్పష్టంగా అర్థం చేయిస్తుంది.

ఎన్నికల సభలలో రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఎదుటి పక్షం నాయకులపై వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా , అభ్యంతరకరంగా మారుతున్నదీ. తమ భాషా ప్రయోగంతో స్త్రీలనూ, అట్టడుగు వర్గాల కులాల ప్రజలనూ కించ పరుస్తున్నామనే స్పృహ ఈ నాయకులకు ఉండడం లేదు. నైతిక విలువల పరంగా, తాము దిగజారడమే కాదు, ప్రజలను కూడా అధమ స్థాయికి తీసుకు వెళ్ళడం వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది .

ఎవరైనా, తమ పార్టీ ఎన్నికల మానిఫెస్టో గురించి చెప్పుకోవడం తప్పు లేదు కానీ, ప్రధాన పార్టీల నాయకులు, భారీ అబద్దాలు కూడా అలవోకగా ఆడేస్తున్నారు. ఎదుటి పక్షంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కూడా చాలా సాధారణంగా మారిపోయింది. గత 40 ఏళ్లలో ఎన్నికలలో గెలిచిన పార్టీ ఏదీ, తాము అధికారంలోకి వచ్చాక , ఎన్నికల సందర్భంగా ఎదుటి పార్టీపై తాము చేసిన ఆరోపణల నిగ్గు తేల్చడానికి, అవినీతిని ఋజువు చేయడానికి, దోషులను శిక్షించడానికి అవసరమైన నిష్పాక్షిణ విచారణ చేసిన దాఖలాలు చాలా తక్కువ.

ఎన్నికలు పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు ఏమీ జరగనట్లుగా, ఏమీ ఆరోపణలు చేసుకోనట్లుగా మౌనమై పోతారు. అవినీతిని తేల్చేదీ లేదు, తిన్న సొమ్మును కక్కించేదీ లేదు. వాటిని ప్రజలకు పంచేదీ లేదు. అవినీతికి పాల్పడిన వాళ్ళే కొత్త అధికార పార్టీలో చేరి మళ్ళీ పదవులను ఆక్రమిస్తారు. ప్రజలను వంచిస్తారు. దశాబ్ధాలుగా ఈ ప్రక్రియను చూసి ప్రజలు విసుగెత్తిపోయారు.
ఈ నేపధ్యంలో ఈ సారి, ఈ ఎన్నికల సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి రాజకీయ ధోరణులకు భిన్నంగా పూర్తిగా ప్రత్యామ్నాయ సంస్కృతితో ఈ కార్యక్రమం సాగింది. గత దశాబ్ధ కాలంగా ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలన సాగించిన భారత రాష్ట్ర సమితి ,బీజేపీ పార్టీలను అసెంబ్లీ ఎన్నికలలో ఓడించాలనీ, ప్రజల నిజమైన ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు ఎన్నికల మానిఫెస్టో లు ప్రకటించాలనే నినాదాలతో, తెలంగాణ పౌర సమాజం ప్రజలను చైతన్య పరిచే లక్ష్యంతో ఉమ్మడి కార్యాచరణకు సిద్దమైంది.

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(TPJAC), జాగో తెలంగాణ, ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ సమాఖ్య,తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక, భారత్ బచావో లాంటి సంస్థలు ఉనికి లోకి వచ్చి, గత నెల రోజులుగా విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళాయి. అన్ని జిల్లాలలోనూ వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. జిల్లా సదస్సులు, ప్రెస్ మీట్ లు, రౌండ్ టేబుల్ సమావేశాలు, బస్సు యాత్రలు, కరపత్రాలతో ప్రచారం సాగింది.

ప్రొఫెసర్ హరగోపాల్ కన్వీనర్ గా ఉన్న TPJAC లో భాగస్వాములుగా ఉన్న అనేకమంది మేధావులు, రిటైర్డ్ టీచర్లు, ప్రొఫెసర్లు, క్రియాశీల సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల బాధ్యులు, న్యాయవాదులు, డాక్టర్లు, కార్మిక సంఘాల బాధ్యులు గత రెండు నెలలుగా 15 జిల్లాలలో సదస్సులు నిర్వహించడంతో పాటు, విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు.

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కన్వీనర్ గా జాగో తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 31 నియోజక వర్గాలను కవర్ చేస్తూ బస్ యాత్ర చేపట్టింది. వందలాది సమావేశాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముస్లిం డిక్లరేషన్ విడుదల చేయడంతో పాటు, రాష్ట్ర సదస్సు, జిల్లాలలో 17 చోట్ల సదస్సులు ప్రత్యేకంగా ముస్లిం ప్రజలతో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలకు వ్యతిరేకంగా ముస్లిం ప్రజల అభిప్రాయాలను కూడగట్టారు.

పౌర ,ప్రజాస్వామిక సంస్థలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ప్రచారాన్ని గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి , ప్రజలలో భావజాల వ్యాప్తి చేసి, అధికార పార్టీ నిరంకుశ పాలనా ధోరణులను ఎండ గట్టాయి. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే కార్యక్రమాన్ని తన వేదిక ద్వారా కొనసాగించింది. మానవ హక్కుల వేదిక, పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ , తెలంగాణ రైతాంగ సమితి, మహిళా ట్రాన్స్ జండర్ సంఘాల జేఏసీ లాంటి సంస్థలు కూడా తమదైన శైలిలో ప్రజల లోకి అధికార పార్టీ అరాచకాలపై, ప్రజల హక్కులపై జరిగిన దాడిని నిరసిస్తూ ప్రచారం సాగించాయి.

కారణమేదైనా, ప్రతిపక్ష పార్టీలుగా అధికార పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నికలలో ఐక్యంగా పోటీ చేయాల్సిన రాజకీయ పార్టీల మధ్య సరైన అవగాహన ఒప్పందాలు కుదరలేదు . తెలంగాణ జన సమితి (TJS) ప్రజల ఆకాంక్షలను నిర్ధిష్టంగా కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టి, కాంగ్రెస్ కు మద్ధతు ప్రకటించి, ఎన్నికలలో పోటీ నుండీ తప్పుకుంది. ప్రొఫెసర్ కోదండ రామ్ విస్తృతంగా రాష్ట్రమంతా తిరగుతూ, కాంగ్రెస్ పార్టీకి మద్ధతు కూడగడుతున్నారు. సిపిఐ పార్టీ, ఒక్క స్థానంలో కాంగ్రెస్ మద్ధతుతో పోటీ చేస్తూ , మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ కు మద్ధతు ప్రకటించింది. ఇవన్నీ అధికార పార్టీకి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాయి.

మరో వైపు CPM పార్టీ కాంగ్రెస్ తో ఒప్పందం కుదరక, స్వంతంగా 19 స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తానని చెప్పింది. బిఎస్పి పార్టీ స్వంతంగా 119 స్థానాలలో పోటీ చేసింది. M-L పార్టీలు తమకు బలముందని అనుక్కున చోట, స్వంతంగా పోటీ చేస్తున్నాయి. ఈ పరిణామాలు ఆయా నియోజకవర్గాలలో ఓట్ల చీలికకు దారి తీసి, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు వస్తే కానీ, దీని ప్రభావం స్పష్టం కాదు.

అధికార భారాస పార్టీకి వ్యతిరేకంగా , తమకు జరిగిన అన్యాయంపై తమ గొంతు ప్రజలకు వినిపించడానికి కొంతమంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా పోటీలో ఉన్నారు. మల్లన్న సాగర్ భూ సేకరణ బాధితులు , గల్ఫ్ కార్మికుల ప్రతినిధులు , నిరుద్యోగ యువతి శిరీష @ బర్రెలక్క , అవినీతి రాజకీయాలతో విసిగిన ఉన్నత విద్యావంతులు కొందరు కూడా ఇలా స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. గెలుపు వతములతో సంబంధం లేకుండా, వారు కొన్ని ఆశయాలతో ముందుకు వచ్చిన ఇటువంటి వారికి తప్పకుండా అబినందనలు చెప్పాలి. నిజాయితీ కలిగిన ఆ గొంతులను భవిష్యత్తు కోసం కాపాడుకోవడానికి అండగా నిలబడాలి.

ఇప్పటికే రాష్ట్ర వ్యాపితంగా , అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలలో అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం అవుతున్నది. ఈ అసంతృప్తి తారాస్తాయికి చేరడంలో TSPSC లో పేపర్ లీకేజీల వల్ల, 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం ముఖ్య కారణం. అధికార పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ యువత, నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి చేస్తున్న ప్రచారం కూడా అధికార పార్టీ అబద్దపు హామీలను ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తున్నది.

ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుని , అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి, ఆ పార్టీని ఓడించడ మొక్కటే తక్షణ కర్తవ్యం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయం కాదని ప్రజలు గుర్తించాలి. బిజేపి పార్టీకి ఓటు వేయడం ద్వారా, రాష్ట్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా వేసే ఓట్లలో చీలిక వస్తుందని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే ఇతర కొన్ని పార్టీల వైఖరి వల్ల, ఏ పద్ధతి లోనూ. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రజలు చూసుకోవాలి.
రాబోయే రెండు రోజులూ అత్యంత కీలకమైనవి. మద్యం, డబ్బులు విపరీతంగా ప్రవహించే సమయం.

వీటి ప్రలోభాలకు గురి కాకుండా, ప్రజలు రాజకీయంగా చైతన్యంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. “అందరి దగ్గరా డబ్బులు తీసుకోండి, మాకే ఓటు వేయండి” అనే అనైతిక పిలుపును ప్రజలు తిరస్కరించాలి. పార్టీలు పంచే డబ్బులు, వస్తువులు, మద్యం మన భవిష్యత్తును నాశనం చేయకుండా చూసుకోవాలి. ఈ సమయానికి కావలసింది మన భవిష్యత్తు పట్ల స్పష్టత . రాజకీయ చైతన్యం మాత్రమే.

ఈ ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. పౌర సమాజం పోషించిన పాత్ర ఇందులో ఎంతో కీలక పాత్ర పోషించబోతున్నది. కానీ పౌర సమాజం ఇంతటి తోనే సంతృప్తి చెందకూడదు . మన పాత్ర ముగిసిందని భావించకూడదు. రాబోయే కాలమంతా పౌర సమాజ సంస్థలు క్రియాశీలంగా ఉండాలి.హామీల అమలు కోసం, కొత్త హక్కుల సాధన కోసం ప్రజల పక్షాన పోరాడే సంస్థలుగా ఈ సంస్థలు మారాలి.

2024 మధ్యలో జరిగే పార్లమెంటు ఎన్నికలు కూడా అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికలలో బీజీపీ ఫాసిస్టు కూటమిని,దాని మిత్రులను ఓడించడం కూడా మన బాధ్యత. దేశాన్ని, ప్రజలను, మత సమరస్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇది తక్షణ అవసరం. అందుకోసం పౌర సమాజ సంస్థల మధ్య ఐక్యతను కాపాడుకుని , మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముంది.

*కన్నెగంటి రవి, తెలంగాణ పీపుల్స్
జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *