నాకు ఇంగ్లీష్ నేర్పిన సార్ కన్నుమూత

-రాఘవ శర్మ

వనపర్తిలో నాకు ఇంగ్లీషు చెప్పిన గురువు చంద్రమౌళి గారు నిన్న ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు నారాయణ్ ఖేడ్ లో కన్ను మూశారు.
నేను 1973లో వనపర్తి వదిలిపెట్టాక మళ్ళీ వారిని కలవలేదు.
యాభై ఏళ్ళ తరువాత , గత మేలో హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి కాలనీలో కలిశాను.
‘నేను రాఘవశర్మని’ అనగానే నన్ను గుర్తు పట్టారు.
ఎదురుగుండా కుర్చీలో కూర్చుంటే, వచ్చి తన పక్కన మంచంపైన కూర్చోమన్నారు.
మంచం మధ్యలో బాసీపెట్లేసుకుని తెల్లని పిట్టలా కూర్చున్న ఆయన కళ్ళలో ఒక జీవన వెలుగు తళుక్కుమంది.
గతంలోకెళ్ళి పోయి, వనపర్తి విషయాలు చాలా సేపు ముచ్చటించారు.
వనపర్తిలో నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు రాత్రి పూట వాళ్ళింటికెళ్ళి ఇంగ్లీష్ చెప్పించుకునే వాణ్ణి.
ఇంటర్ చదివేటప్పడు సాయంత్రం వారితో బాల్ బ్యాట్ మింటన్ ఆడేవాణ్ణి.
మళ్ళీ కలుస్తానని చెప్పాను కానీ, కలవలేకపోయాను.
ఇంతలోనే నిన్న ఉదయం నా సెల్ ఫోన్ కు వారి నిష్ర్కమణ వార్త మెసేజ్ లో వచ్చింది.
సుభాష్ గౌడ్ నాకు ఫోన్ చేశారు.
నేను ట్రెక్కింగ్ లో ఉండడం వల్ల వాటిని సాయంత్రం వరకు చూసుకోలేకపోయాను.
గత మే నెలలో నేను కలిసిన తరువాత వారు నారాయణ్ ఖేడ్ వెళ్ళిపోయారు.
మళ్ళీ హైదరాబాద్ తిరిగి రాలేదు.
గడిచిన మూడు నెలలుగా ద్రవాహారం పైనే జీవిస్తున్నారు.
జీవితానికి తెరపడడం సిద్ధమైనట్టు వారికి అర్థమైపోయినట్టుందని వారి కుమారుడు పాండే ఫోన్ లో మాట్లాడుతూ అన్నారు.
వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసిన తొలితరం అధ్యాపకులు ఒకరొకరు ఇలా నిష్ర్కమిస్తున్నారు.
సాంకేతిక విద్యాశాఖలో డెప్యూటీ సెక్రెటరీ హోదాలో చంద్రమౌళి గారు పాతికేళ్ళ క్రితం రిటైరయ్యారు.
చంద్రమౌళి గారి స్వస్థలం నారాయణ్ ఖేడ్.
మాతృభాష కన్నడమైనా, నిజాం పాలనలో ఉండడం వల్ల ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.
తరువాత తెలుగు నేర్చుకున్నారు.
వనపర్తి పాలిటెక్ని కళాశాల కామర్స్ లెక్చరర్ గా 1966లో చేరారు.
కామర్స్ విభాగాధిపతిగా పనిచేశారు.
వనపర్తిలోనే ఇరవై ఏళ్ళు పనిచేశారు.
వారి వయసిప్పుడు 85 ఏళ్ళు.
చంద్రమౌళి గారి అంత్యక్రియలు నారాయణ్ ఖేడ్ లోనే ఆదివారం ఉదయం పదిగంటలకు జరిగాయి.

 

భార్య , కుమారుడి తో చంద్ర మౌళి

వారి సతీమణి చాలా కాలం క్రితమే మృతి చెందారు.
వీరికి ఇద్దరు కుమారులున్నారు.
చంద్రమౌళి గారు తెల్లగా, కాస్త పొట్టిగా, గిరజాల జుట్టుతో, నవ్వు ముఖంతో, చాలా చలాకీగా ఉండే వారు.
గత మేనెలలో చూసిన ప్పుడు శరీరం శుష్కించింది.
చాలా సన్న పడి పోయారు.
వినికిడి సమస్య ఏర్పడింది.

గత మే నెలనాటి ఫోటో…

వనపర్తి కాలేజీ లో చేస్తున్న మా నాన్న తో చంద్రమౌళి సార్ కు మంచి స్నేహం ఉండేది.
మంచి స్నేహం మా నాన్న తో మాత్రమే కాదు, అందరితోనూ ఆయనకు అదే స్నేహం!
అందరి తో నూ అదే మంచితనం.
చంద్రమౌళి గారు ఒక మంచి మనిషి, నిగర్వి, నిరాడంబరుడు, నిస్వార్థ జీవి, అజాత శత్రువు; ఇలా ఎన్ని విశేషణాలు చెప్పినా ఆయన గురించి తక్కువే.
గత మేనెలలో నాకళ్ళ ముందు కనిపించిన నిలువెత్తు మనిషి జీవితం నుంచి నిష్ర్కమించారన్న వార్త నిజంగా బాధించింది.
వారికివే అక్షర నివాళులు.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్: 9493226180)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *