ఇద్దరు రైతు బంధువుల మృతి

 

ఈ రోజు ఇద్దరు రైతు బంధువులు చనిపోయారు. ఇందులో ఒకరు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కాగా మరొకరు ఆంధ్రప్రదేశ్ రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్.

98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. 1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు.

రైతు బాంధవుడు, రైతు నేత యెర్నేని నాగేంద్రనాద్ (చిట్టిబాబు) గారు కొద్దిసేపటి క్రింద (28 సెప్టెంబర్ 2023 గురువారం)  స్వగ్రామం కలిదిండి మండలం కొండూరు గ్రామం లో స్వర్గస్తులైనారు. వీరి సతీమణి యెర్నేని సీతా దేవి రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా NTR క్యాబినెట్ లో సేవలు అందించారు.

వారికి  టి లక్ష్మీ నారాయణ నివాళి.

స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటు!

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు, డా.ఎం.ఎస్. స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన కృషి చరిత్ర పుటలకెక్కింది. రైతుల కష్టాలకు కారణాలు, రైతుల ఆత్మహత్యల నివారణ, వ్యవసాయ ఉత్పాదకత, భూ సంస్కరణలు, నీటిపారుదల, రుణ సదుపాయం, పంటల భీమా, ఆహార భద్రత, ఉపాధి, తదితర అంశాలపై డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని “నేషనల్ కమీషన్ ఆన్ ఫార్మర్స్” లోతైన అధ్యయనం చేసి, అత్యంత కీలకమైన సిఫార్సులతో నాటి యు.పి.ఏ. ప్రభుత్వానికి 2006 అక్టోబర్ 4న నివేదికను సమర్పించింది. 17 సంవత్సరాలు గడచిపోతున్నా ఆ నివేదికలోని రైతాంగం యొక్క ప్రయోజనాలతో ముడిపడిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.

వ్యవసాయ ఉత్పత్తులకు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా కనీస మద్దతు ధర(MSP)ను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేస్తే, అదే డా.ఎం.ఎస్.స్వామినాథన్ గారికి ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుంది.

ప్రముఖ రైతు నేత ఏర్నేని నాగేంద్రనాథ్ గారికి జోహార్

ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్ గారు మరణించారన్న వార్త నమ్మలేక, వారి మొబైల్ నంబరుకు ఫోన్ చేశాను. రింగ్ అయ్యింది. ఎత్తలేదు. తర్వాత నాగేంద్రనాథ్ గారి కుమారుడు ఫోన్ చేసి, మాట్లాడారు. నెల రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని, చికిత్స చేయించుకొంటున్నారని, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించారని చెప్పారు. చాలా విషాదకరమైన వార్త. దిగ్భ్రాంతి కలిగించింది. నాగేంద్రనాథ్ గారి కుమారుడికి సంతాపం తెలియజేశాను.

కృష్ణా – గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్స్ తీర్పులను లోతుగా అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల కోసం, నీటి పారుదల ప్రాజెక్టుల సాధన కోసం అంకితభావంతో పోరాడిన ప్రముఖ రైతు నాయకుడు నాగేంద్రనాథ్ గారు. ప్రత్యేకించి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుపై అమరజీవి కొల్లి నాగేశ్వరరావుగారితో కలిసి ఒక చిరుపుస్తకాన్ని ప్రచురించారు. రైతాంగం పక్షాన నికార్సుగా నిలబడి, నిస్వార్థంగా, చిత్తశుద్ధితో రైతు సమస్యలపై గళమెత్తిన నేత.

నాగేంద్రనాథ్ గారు వయసు రీత్యా నాకంటే చాలా పెద్ద. మా మామగారైన కొల్లి నాగేశ్వరరావుగారితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి, ఐక్యఉద్యమాలు నిర్వహించారు. కొన్ని సంవత్సరాల క్రితం, నేను హైదరాబాదులో నివాసం ఉన్నప్పుడు నాగేంద్రనాథ్ గారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి కలిశారు. నదీ జలాల సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించుకొన్నాం. అదే నాకు వారితో తొలి పరిచయం. అంతకు ముందు వారిని గురించి విన్నానే కానీ, ప్రత్యక్షంగా కలిసిన సందర్భం లేదు. నాటి నుండి అనేక సార్లు కలిసి మాట్లాడుకున్నాం. పోలవరం మరియు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులు, నది జలాల సమస్యలపై కలిసి కొన్ని కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించాం. వారి ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికల్లో పాల్గొన్నాను. వారంటే నాకు అత్యంత గౌరవం.

నాగేంద్రనాథ్ గారి మరణం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల సాధన ఉద్యమానికి తీరని నష్టం. నాగేంద్రనాథ్ గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

(టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన కేంద్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *