ఇది 800 సం. నాటి గణేశ విగ్రహం

పెద్దగోల్కొండలో 12వ శతాబ్ది గణేశ విగ్రహం
 800 ఏండ్లనాటి దంటున్న తెలంగాణా చరిత్ర బృందం

 

హైదరాబాద్, సెప్టెంబర్ 16:
నగరశివారులో ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొనివున్న పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణీ చాళుక్యుల కాలపు గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు.

చరిత్ర పరిశోధకుడు డా.ఎస్. జైకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్, బీవి భద్రగిరీశ్ శనివారం నాడు షంషాబాద్ మండలం పెద్దగోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం, ఆంజనేయాల్లోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు.


శివాలయం ముందు మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల మందంతో నల్లశానపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం, కుడుము ఉన్నాయని, తలపై చిన్నకిరీటం, లలాటహారం, ఉదరబంధం, నాగయజ్ఞోపవీతం, బాహువలయాలు కంకణాలు, కాళ్ళకు కడియాలు ధరించి, లలితాసనంలో కూర్చొని ఉన్నాడని ప్రతిమాలక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం, క్రీ.శ.12వ శతాబ్దికి చెందిన కళ్యాణీ చాళుక్య శిల్పశైలికి అద్దం పడుతుందని వారన్నారు.

గణేశుని విగ్రహం పక్కన కాకతీయ స్తంభం, కప్పురాయి, శిఖరశిథిలాలు, గ్రామంలోని ఆంజనేయాలయంలో క్రీ.శ.13వ శతాబ్దికి చెందిన చక్కటి ఉమామహేశ్వర శిల్పం, అద్భుతంగా అలంకరించిన నంది విగ్రహాలున్నాయని వీటిని శివాలయం నుంచి ఇక్కడికి తరలించారని స్థానికులు బాణాల శ్రీనాథ్, శివలింగం గౌడ్ లు తెలిపారని వారు చెప్పారు.

పెద్దగోల్కొండలో గుర్తించిన గణేశ, ఉమామహేశ్వర, నంది విగ్రహాలు కళ్యాణీ చాళుక్య, కాకతీయుల కాలానికి చెందినవని, ఇవి హైదరాబాద్ నగర చరిత్రను మరో నాలుగువందల సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నాయని, చారిత్రక ప్రాధాన్యతగల ఈ శిల్పాలపైనున్న రంగులను తొలగించి, పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో ఫలకాలను ఏర్పరచి, భద్రపరిచి భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి, హరగోపాల్, భద్రగిరీశ్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *