శ్రీశైలం డ్యామ్ నుంచి 120 tmc నీళ్ళ చోరి

 

నీటి దొంగలు ఎవరో కనిపెట్టండి : నంద్యాల జిల్లా S.P కి ఫిర్యాదు చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అద్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు శ్రీశైలం రిజర్వాయర్లో నీటి దొంగతనం గురించి నంద్యాల ఎస్ పి శ్రీ రఘువీరారెడ్డి గారికి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బొజ్జా దశరథ రామి రెడ్డి నీటి దొంగతనం గురించి ఎస్ పి గారికి సవివరంగా వివరించారు.‌

కృష్ణా, తుంగభద్ర నదులు ద్వారా సుమారు 2017 టి ఎం సి లో నీరు గత నీటి సంవత్సరం అనగా జూన్ 1, 2022 నుండి మే 31, 2023 వరకు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరిందని బొజ్జా ఎస్ పి గారికి తెలిపారు. నీటి కేటాయింపులకు అదనంగా శ్రీశైలం రిజర్వాయర్ కు నీరు చేరిన సందర్భంలో కనీస నీటిమట్టం 854 అడుగుల పైన 60 టి ఎం సీ ల క్యారీ ఓవర్ రిజర్వుగా నీరు నిలువ ఉంచాలని చట్టం ఉందన్న విషయాన్ని వివరించారు. రాబోయే నీటి సంవత్సరంలో వర్షాలు ఆలస్యమైన, నీరు తక్కువగా వచ్చిన త్రాగు నీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా, వ్యవసాయ పనులకు అవాంతరాలు కలుగకుండా ఉండటానికి ఈ చట్టం చేసారని వివరించారు.‌ఈ చట్టం ప్రకారం మే 31, 2023 నాటికి శ్రీశైలం రిజర్వాయర్లో 873 అడుగులు స్థాయిలో సుమారు 150 టి ఎం సీ ల నీరు నిలువ ఉండాలని గుర్తు చేసారు. కాని మే 31 2023 నాటికి రిజర్వాయర్ 808 అడుగుల స్థాయిలో 34 టి ఎం సీ ల నీరు ఉన్న వాస్తవ పరిస్థితిని తెలియచేసారు. రిజర్వాయర్ లో ఈ స్థాయిలో నీరు ఉంటే రాయలసీమ నీటిని పొందడానికి అవకాశం ఉండదన్న విషయాన్ని వివరించారు.

చట్ట ప్రకారం ఉండాల్సిన నీటి నుండి సుమారు 120 టి ఎం సీ ల నీరు దొంగతనం జరిగిందని ఎస్ గారికి బొజ్జా ఫిర్యాదు చేశారు. ఈ నీరు దొంగ తనం జరగకుండా కాపాడటానికి సర్వోన్నత అధికారుల ఆధ్వర్యంలో సాగునీటి శాఖ పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ, ఈ నీటి దొంగతనం జరిగిందని తెలిపారు. ఈ నీరు ఎవరు దొంగతనం చేసారు, ఎలా చేసారు అని తేల్చడంలో సాగునీటి శాఖ సర్వోన్నత అధికారులు అయోమయంలో పడినట్టున్నారని తెలిపారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆ దొంగలను కనిపెట్టి, నీటి దొంగతనాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి, జీవన హక్కైన త్రాగు నీరు రాయలసీమ ప్రజానీకం పొందేలాగా చేయాలని ఎస్ పి గారికి విజ్ఞప్తి చేసారు.‌ అదేవిధంగానే భవిష్యత్తులో నీటి దొంగతనాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాడానికి జలవనరుల శాఖ సర్వోన్నత అధికారులకు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, వై.యన్.రెడ్డి, వెంకటేశ్వరనాయుడు, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *