హైదరాబాద్ లో మన ‘అందరి ఇల్లు’ ఇది

జ్ఞానగవాక్షం ఆనంద నిలయం

-రాఘవ శర్మ

అదొకజ్ఞాన గవాక్షం.
దాని పేరు ‘ఆనంద నిలయం’.
దానికి ప్రహరీ గోడ లేదు.
ఆ గవాక్షం నుంచి లోనికి ఎవరైనా ప్రవేశించవచ్చు.
దానికి కులం లేదు, మతం లేదు.
ఇది అందరి ఇల్లు.
ఈ సరస్వతీ నిలయం పదివేల పుస్తకాలతో అలరారుతోంది.
అది విజ్ఞానాన్ని అందిస్తోంది.
ఎందరికో జ్ఞాన తృష్ణను తీరుస్తోంది.
హైదరాబాదు శివారులోని కుత్బుల్లాపూర్ చింతల్లో ఇలా కొలువై ఉంది.
కరోనా లాక్ డౌన్ లో ఈ ‘ఆనంద నిలయం’ పుట్టింది.
దీని వయసిప్పుడు మూడేళ్ళు.
ఇది మూడేళ్ళ శిశువైనా దేశ వ్యాప్తంగా దీనికి 105 శాఖలున్నాయి.
ఒక్క హైదరాబాదులోనే 74 ఉన్నాయి.
ఈ మూడేళ్ళ శిశువు ఇప్పుడెలా ఉంది?
ఒక్క సారి వీక్షిద్దాం.

 

‘ఆనంద నిలయం’ రెండతస్తుల భవనం.
దానికి ప్రహరీ గోడ లేదు.
లోపలికెళితే విశాలమైన హాలు.
అంతా నిశ్శబ్దం.
హాలులోనే చుట్టూ షెల్ఫుల నిండా పుస్తకాలు.
ఓ టేబుల్ పై ఎనిమిది తెలుగు , ఇంగ్లీషు, తెలుగు దినపత్రికలు.
కుర్చీల్లో కూర్చుని చదువుకుంటున్న పాఠకులు.
కొందరు పాఠకులు వస్తున్నారు.
వాళ్ళకిష్టమైన చోట కూర్చుని, ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నారు.
చదవడం అయిపోగానే వెళ్ళిపోతున్నారు.

ఆనంద నిలయం హాలులో…

ఆ హాలులోనే ఒక అందమైన సభా వేదిక.
ఆ హాలులో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు.
సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
డబ్బూ కట్టాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు తప్ప.
అంతా ఉచితం.
మొదటి అంతస్తులో విశాలమైన హాలు.
నాలుగు గదులు.
అలాగే రెండవ అంతస్తులో కూడా.
ఎవరైనా సరే, ఎన్ని రోజులైనా సరే, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు.
తమ వంట తామే ఒండుకుని తినవచ్చు.

మొదటి అంతస్తు…

ఆ భవనం డాక్టర్ సూర్యప్రకాశ రావుది.
ఎంతో ఖరీదైన భవనం ఆనంద నిలయానికి ఇవ్వడం చిన్న విషయమా!?.

ఆనంద నిలయం వెనుక చాలా మంది గుప్త దాతలు ఉన్నారు.
తమని తాము దాతలని చెప్పుకోవడం వారికి ఇష్టం లేదు. అందరం కలిసి నిర్వహిస్తున్నాం అంటారు.
ఎనిమిది దినపత్రికలు తెప్పించేది శ్రీరాం కిషోర్.
ఆనంద నిలయం పేరుతోనే ప్రతి శనివారం బుక్ ఫ్లూయిన్స్ నిర్వహిస్తారు.
శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి ఏడున్నర వరకు ఈ కార్య క్రమం.
ఒక మంచి పుస్తకం గురించి దాని రచయిత చేత దాదాపు 50 నిమిషాలు మాట్లాడిస్తారు.
తరువాత చాలా మంది వేసిన ప్రశ్నలకు రచయిత సమాధానం చెపుతారు.
ఇదంతా ఆన్లైన్ వెబినార్ జరుగుతుంది.
పుస్తకాలను పరిచయం చేయడం, పఠనాన్ని పెంచడం దీని ఉద్దేశ్యం.
ఒక మంచి వాతావరణాన్ని కల్పించడం.
పిల్లలకు, మహిళలకు చిన్న చిన్న పోటీలు నిర్వహించడం.
వంద పుస్తకాలు చదివానని ఎవరైనా చెబితే వారికొక చిరు బహుమతిని ఇవ్వడం.
ఈ ఆనంద నిలయంలోనే మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇస్తారు.
మధ్యాహ్నం 2 నుంచి, సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ ఉంటుంది.
పాతిక మంది మహిళలకు మూడు నెలల శిక్షణ.
ఆనంద నిలయంలో ఏం పుస్తకాలున్నాయి?
కథలు, నవలలు, వ్యాసాలు, కంప్యూటర్ సైన్స్ నుంచి అన్ని రకాల విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు న్నాయి.
అలాగే చరిత్ర, రాజనీతి శాస్త్రగ్రంథాలు, తాత్విక గ్రంథాలు ఉన్నాయి.
నారాయణ గురు, రమణ మహర్షి, అరబిందో వంటి వారి రచనలు కూడా ఉన్నాయి.
గాంధీజీ రచనలు వంద వాల్యూముల వరకు ఉన్నాయి.

ఆనంద నిలయం  లైబ్రరీలో పాత పుస్తకాలు…

ఎవరికి ఏమిష్టమైనవి వారు చదువుకోవచ్చు.
ఆనంద నిలయానికి పుస్తకాలు ఇవ్వవచ్చు.
ఆదివారం మధ్యాహ్నం డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పుతారు.
ఒక్కో ఆదివారం ఒక్కో అంశంపైన ప్రసంగాలూ ఉంటాయి.
ఆనంద నిలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
ఇది ఒకరు ఏర్పాటు చేసింది కాదు.
సమిష్టి కృషి.
మూడేళ్ళ క్రితం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.
2002లో మార్చి 24 సాయంత్రం లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. లాక్ డౌన్లో ప్రజలు ఖాళీగా ఉండి ఏం చేయాలి!?
వారి కోసం ఆనంద నిలయం పెట్టాలని ఓ అయిదుగురికి ఆలోచన వచ్చింది.
ప్రజలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలనుకున్నారు.
ఆ ఆలోచన వచ్చిందే తడువుగా డాక్టర్ సూర్య ప్రకాశరావు తనకు వారసత్వంగా వచ్చిన భవనాన్ని ఇచ్చారు.
‘మెతుకు పోతే బతుకు పోతుందనుకునే’ పిసినారులు, పిశాచాలు ఉన్న ఈ రోజుల్లో ఇదెలా సాధ్యమైంది.
ఇది చిన్న విషయం కాదు.
రెండస్తుల భవనాన్ని ఆనంద నిలయానికి ఇవ్వడం మామూలు విషయం కాదు.
కొందరుకుర్చీలు, టేబుళ్ళు, పుస్తకాల బీరువాలు; ఇలా చాలా మంది ఇచ్చారు.
ఈ ఆనంద నిలయానిక చీఫ్ లైబ్రరియన్ గా డేవిడ్ వ్యవహరిస్తున్నారు.
ప్రతి పుస్తకానికి సంఖ్యనిచ్చి, క్యాట్లాగ్ తయారుచేశారు.
శాస్త్రీయ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తున్నారు.
ఆనంద నిలయానికి దేశ వ్యాప్తంగా 105 చిన్న చిన్న శాఖలున్నాయి.
ఒక్క హైదరాబాదులోనే 74 శాఖలున్నాయి.
ఒక్కొక్క శాఖలో 50 నుంచి 70 పుస్తకాలుంటాయి.
వీటిని ఆనంద నిలయం సభ్యులే నిర్వహిస్తారు.
ఎక్కడా డబ్బులావాదేవీలు లేవు.
సేవా దృక్పధమే అడుగడుగునా కనిపిస్తుంది.
ఆనంద నిలయానికి ఎవరైనా సరే పుస్తకాలి ఇవ్వవచ్చు.
ఆనంద నిలయం అందరి ఇల్లు.
దీనిలోకి ఎవరైనా రావచ్చు.

‘అందరి ఇల్లు ‘ పైన పోస్టల్ శాఖ విడుదల చేసిన కవర్

ప్రపంచ ఆవాస దినోత్సవం(వరల్డ్ హ్యాబిటట్ డే) సందర్భంగా హైదరాబాదు పోస్టల్ శాఖ ఆనంద నిలయం పోస్టల్ కవర్ ను విడుదల చేసింది.
ఆకలేసినప్పుడు అన్నం ఎంత అవసరమో, జ్ఞాన తృష్ణ తీర్చుకోడానికి చేతిలో పుస్తకం కూడా అంతే అవసరం.
వీరి ఉద్దేశ్యమేమిటి!?
‘మనం కాదు, మనం చేసే పనిమాత్రమే మిగలాలి’

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *