వనపర్తి ఒడిలో: పలకరింపుల పరిమళాలు

వనపర్తి ఒడిలో-26

 

-రాఘవ శర్మ

‘వనపర్తి ఒడిలో” ఎక్కడికెక్కడికో పయనించింది.

అనేక వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.

ఏడు ఖండాలను, సప్త సముద్రాలను దాటేసింది.

భూగోళానికి ఆవల ఉన్న అమెరికాను తాకింది.

గల్ఫ్ తీరాలకూ చేరింది.

ఎందరినో కదిలించింది.

వారి హృదయ కవాటాలను తెరిచింది.

భళ్ళున తెల్లారినట్టు, దశాబ్దాల మౌనాన్ని బద్దలు కొట్టింది.

పెళ్ళున ఎండ కాసినట్టు, వారి మనసులో మాటలను మన మనసు లోగిళ్ళలో గుమ్మరించింది.

మది పొరల్లో దాగున్న జ్ఞాపకాలను ఎన్నాళ్ళని దాచుకుంటాం!

పదుగురితో పంచుకోడానికి ‘వనపర్తి ఒడిలో’ ప్రేరేపించింది.

మన హృదయం నుంచి వారి హృదయాలలోకి డైరెక్ట్ గా పంపింగ్ చేయడానికి ఇదొక యంత్రంలా అవతారమెత్తింది.

‘వనపర్తి ఒడిలో” కదిలించిన వారి గుండె లబ్ డబ్ ల ను ఇలా విందాం రండి.

“వనపర్తి ఒడిలో” అయిపోతోందంటే చాలా బాధగా ఉంది.

చాలా ఆసక్తి కలిగించారు.

ఏం రాయబోతున్నారోనన్న ఉత్సుకతను కలిగించారు.

పాఠశాల జీవితాన్ని ఒక చిత్రంలా చిత్రించారు.

ఆ జీవితాన్ని ఆసక్తిగా చదువుతూ ఆనందిస్తున్నాను.

పరిశీలన, వ్యాఖ్యానం ఎన్నదగింది.

జ్ఞాపకాలు చదువుతుంటే, వాటిలో నన్ను నేను ఊహించుకుంటున్నాను” అని ప్రముఖ చరిత్ర కారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ (86) అన్నారు.

‘వనపర్తి ఒడిలో’ ప్రతి భాగాన్నీ చదువుతూ, ఆశ్చర్యకరంగా వెంటనే తన వ్యాఖ్యానాన్ని ఇంగ్లీష్ లో వాట్సాప్ ద్వారా పంపుతూ వచ్చారు.

” ‘వనపర్తి ఒడిలో’ చదువుతుంటే కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి.

మా అమ్మ (చెల్లెమ్మ టీచర్) నాలుగేళ్ళక్రితం పోయింది.

మీరు ఎంత అదృష్ట వంతులు!

మేం పుట్టకముందే మా అమ్మను చూశారు.’

మా చెల్లెమ్మ టీచర్ కుమార్తె విజయశ్రీ అన్న మాటలివి.

తిరుపతి సమీపంలోని పుదిపట్లలో ఉంటున్న విజయశ్రీ ఈ మధ్యనే అనూహ్యంగా మా ఇంటికి వచ్చారు.

“వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో సాయంకాలం పాటల ఆనవాయితీ అనంతరపురం ఇంజినీరింగ్ కాలేజీ నుంచి వచ్చింది.

ఏ.వి. ఆచారి, నేను, రామిరెడ్డి, సోమసుందరం, ఆకాలేజీలో బి.ఇ. చేశాం.

సాయంకాలం ఆ పాటలే మాకు కాలక్షేపం.” అని కె.ఎల్.నరసింహం (86) గుర్తు చేశారు.

వనపర్తి పాలిటెక్నిక్ లో సివిల్ విభాగాధిపతిగా (1961-1975) తొలి రోజుల్లో పనిచేసిన వీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ డెప్యూటీ డైరెక్టర్గా రిటైరై, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.

“వనపర్తిలో వరదలు వచ్చినప్పుడు ఆస్పత్రిలో పేషెంట్లను కాలేజీలో (ప్యాలెస్ నేల మాళిగలో)నే ఆశ్రయం కల్పించాం.

వనపర్తిలో 14 ఏళ్ళు ఉన్నా తిరుమలయ్య గుట్టను చూడలేకపోయా.

విశాఖ ఉక్కు, జై తెలంగాణా ఉద్యమ వీరావేశాలు ఎలా ఉన్నా, వారికి మా పట్ల గౌరవంతో కూడిన వినయ విధేయతలు, వారి పట్ల మాకు వాత్సల్యం ఉండేది.

జై తెలంగాణా ఉద్యమ సమయం చాల క్లిష్టసమయం.

హార్డ్ కోర్ ఉద్యమ కారులు తప్ప మిగతా వారితో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.

రెండు నెలల పాటు వనపర్తి వదిలేసి కర్నూలులో ఇల్లు తీసుకుని ఉన్నాను.

డాక్టర్ బాల కృష్ణయ్య గురించి మీరు రాసింది రెండు వందల శాతం నిజం.

మెడికల్ లిటరేచర్ ను అప్డేట్ ఉంచుకునే వారు.

మేం అక్కడ ఉన్నప్పుడు మీ నాన్న గుండు బావి పింపింగ్ ఇన్చార్జి గా చేసారు.

కమ్మరి కిష్టయ్యను, మా ఇంట్లో పనిచేసే శేషమ్మను గుర్తు చేశారు.

అప్పయ్య శాస్త్రులు మా ఇంటికి కూడా వచ్చేవారు.

చెవిలెంటికల రామిరెడ్డి, బర్రెల రామిరెడ్డి నాకంటే పెద్దవారు.

ఉంటే వారికి నా నమస్కారాలు చెప్పండి ” అంటూ కె.ఎల్. నరసింహం అమెరికా నుంచి తన జ్ఞాపకాలను, అనుభూతులను వాట్సాప్ ద్వారా పంచుకున్నారు.

‘వనపర్తి ఒడిలో’ చదువుతుంటే ఆనాటి సామాజిక పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి.

కాలం బహు క్రూరమైంది.

ఆ నాటి ప్రకృతి ఇప్పటికీ గుర్తుంచుకోవడం ఆశ్చర్యకరం.

పౌరహక్కుల ఉద్యమంలో డాక్టర్ బాల కృష్ణయ్యతో పరిచయం కలిగింది.

అలాగే భారత-చైనా మిత్ర మండలిలోనూ కలిసి పనిచేశాం.

వనపర్తి తరువాత కాలంలో జ్ఞాపకాలు కొనసాగించండి’ అని రచయిత, సాహిత్య ఉద్యమ కారులు కొత్తపల్లి రవిబాబు అన్నారు.

‘ఎవ్రీ పీస్ ఆప్ మెమొరీస్ ఈజ్ ఏ మాస్టర్ పీస్’ అని వ్యాఖ్యానించారు.

“కేవలం గుర్తు మీదే ఇన్ని కబుర్లు చెబుతున్నారంటే, జీవితాన్ని ఎంతగా ఆస్వాదించారో తెలుస్తోంది.

ఆ జీవితాన్ని తిరిగి జీవిస్తూ, మాకు చూపిస్తున్నారు.

మీ ప్రజ్ఞకు శతదా వందనం” అని సాహితీ వేత్త, హైదరాబాద్ లో ప్రముఖ ఆర్తో సర్జన్ డాక్టర్ జతిన్ కుమార్ అన్నారు.

“బావుంది. అందరి జీవితాలనూ మీటారు’ అని జర్నలిస్టు పున్నాకృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

“వనపర్తితో మీకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను చాలా హృద్యంగా, మంచి తూకంతో చెప్పారు.

నేను 1964-67 మధ్య వనపర్తి పాలిటెక్నిక్లో చదువుకున్నాను” అని జనసాహితీ కార్యదర్శి దివికుమార్ అన్నారు.

“జై తెంగాణా ఉద్యమ కాలాన్ని నేను హైదరాబాదులో రుచి చూశాను.

గ్రాంఫోన్ పాటలు మూడేళ్ళూ అక్కడ విన్నాను.

అంతకు ముందు హిందీ పాటల గురించి దాదాపు తెలియదు.

పుస్తకావిష్కరణ కోసం జనజ్వాల రమ్మంటే చాలా కాలం తరువాత వనపర్తి చూశాను.

నా జ్ఞాపకాలను తట్టి మేల్కొలుపుతున్న మీ వనపర్తి జ్ఞాపకాలకు కృతజ్ఞతలు.” అని దివికుమార్ వ్యాఖ్యానించారు.

“ఇంత మందితో ప్రయాణం ముగించారు.

నన్ను మాత్రం వనపర్తిలోనే వదిలేశారు” అని శ్రీరామ్ కిశోర్ చమత్కరించారు.

హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం సాయంత్రం స్ప్రెడింగ్ లైటర్స్ తార్నాక ఆధ్వర్యాన జూమ్ మీటింగ్లో పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

‘చెన్నారెడ్డి కారు పైన రాయి విసరడం జీవితంలో అదే తొలిసారి, అదే చివరి సారి” అని నేను రాస్తే, “యువర్ రియలైజేషన్ ఈజ్ క్లాసిక్ చేంజ్” అని శ్రీరాం కిశోర్ వ్యాఖ్యానించారు.

“కథలో కథ, వీధిలో వీధి, లోగిళ్ళలో ఇల్లు, మనిషిలో మనిషి, మనసులో మాట, పదంలో ప్రపంచం, పరిచయంలో ప్రవాహం, జ్ఞాపకాల్లో జగన్నాటకం, ఇప్పుడు వనపర్తి మా ఊరు” అని కూడా శ్రీరాం కిషోర్ భావేద్వేగానికి గురయ్యారు.

“ఉత్తేజకరమైన, ఆసక్తి కరమైన, ఆనందదాయకమైన వనపర్తి విశేషాలు” అని చిత్రకారుడు, కవి , సాహితీ వేత్త గుండోజి యాదగిరి వ్యాఖ్యానించారు.

“1962-65 మధ్య వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నాను.

వనపర్తిని మర్చిపోలేం” అని అమెరికాలో ఉన్న ఆలూరు వెంకటేశ్వరరావు (మా పెదనాన్న కుమారుడు) గుర్తు చేసుకున్నారు.

“వనపర్తి ఒడిలో” చదువుతుంటే నా బాల్యమంతా గుర్తుకొచ్చింది.

ఆప్రాంతాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాను.

ఎంఎస్సీ చదివాను.

కొంతకాలం లెక్చరర్ గా పనిచేశాను.

ఆర్టీసీలో డివిజనల్ మేనేజర్ ఉద్యోగవిరమణ చేశాను” అని చెవిలెంటికల రామిరెడ్డి కుమారుడు వెంకట నరసింహారెడ్డి తెలిపారు.

తనను ‘చెవిలెంటికల రామిరెడ్డి కుమారుడు’ అని చెబితే సమాజంలో చాలా మంది తనను గుర్తిస్తారని చెప్పారు.

“మీ ‘వనపర్తి ఒడిలో’ వ్యాసాలు నా బాల్యంలోకి తీసుకెళుతున్నాయి. వనపర్తితో సంబంధం ఉన్న వారందరినీ కదిలించాయి.

ఇవ్వన్నీ చూస్తుంటే ప్రాణాలు లేచి వస్తున్నాయి.

వనపర్తి వదిలి 1983లో మహబూబ్ నగర్ వెళుతుంటే వెక్కి వెక్కి ఏడ్చాం.” అని శ్యామల అన్నారు.

పాలిటెక్నిక్ లో లెక్చరర్ గా తొలి రోజుల్లో పనచేసిన కృష్ణమాచారి కుమార్తె శ్యామల ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు.

“ప్యాలెస్ ఫోటో చూస్తుంటే చాలా బాధ కలిగింది.

ఒక నాడు ఒక వెలుగు వెలిగిన రాజసౌధం ఇది.

మన పాలకుల అలసత్వానికి నిదర్శనం.

నేల మాళిగలో ఇప్పటికీ మ్యూజియం ఉందా? తెలపండి” అంటూ వనపర్తిలో న్యాయవాదిగా చేస్తున్న పురుషోత్తం అడిగారు.

“మీరు రాసిన తిరుమలయ్య మా పెదనాయన కొడుకు.

మీరు చెప్పే వరకు తిరుమలయ్య ఇంటర్మీడియట్ చదివాడని నాకు తెలియదు.” అని రాశారు ఉపాధ్యాయని, పురుషోత్తం సతీమణి రాధ.

“వనపర్తి మీ మదిలోనే ఉంది. మీ అనుభవాలను నేను కూడా అనుభవించినట్టే ఉంది’ అని శేషు తెలిపారు.

తొలి రోజుల్లో మా నాన్నతో పాటు ఇన్స్ట్రక్టర్ గా చేసిన ముత్యాలప్ప కుమారుడు శేషు ప్రస్తుతం వనపర్తిలోనే ఆర్టీసీలో చేస్తున్నారు.

“ఆనాటి సంగతులు జ్ఞప్తికి తెస్తున్నారు” అని పాలిటెక్నిక్ లో అలనాటి సైన్స్ లెక్చరర్ రాజశేఖరం కుమార్తె అమృతలక్ష్మి అన్నారు.

ప్రస్తుతం ఆమె, చెల్లెలు, తల్లి వేదవతి హైదరాబాదులో ఉంటున్నారు.

“మీరు రాసిన మంగలి దాయమ్మ చేతుల మీదుగానే నేను కూడా ఈ లోకంలోకి వచ్చాను.

వనపర్తి వాసిని, వనపర్తిలో పాలిటెక్నిక్లోనే చదువుకున్నాను” అని హైదరాబాదులో బిల్డర్ రాజేష్ అన్నారు.

“డాక్టర్ బాలకృష్ణయ్య గురించి మీరు రాసింది 99 శాతం కరెక్ట్.

వారు తెలుగు దేశం పార్టీలో చేరడంపై మీ కామెంట్ తప్పు అని నా అభిప్రాయం” అని ముక్తాయించారు.

“వనపర్తి వదిలిపెట్టినప్పుడు మీకు కలిగిన బాధ మీ రచనలో స్పష్టంగా కనిపిస్తోంది.

లాంగ్ స్టాండింగ్ కింద 1983లో చాలా మందిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా వారి బాధ వర్ణనాతీతం.

పాలిటెక్నిక్ బిల్డింగ్ ను, చెట్లను, సింహపు బొమ్మలను పట్టుకుని కన్నీళ్ళు కార్చారు.

వీరభద్రాచారి, కృష్ణమాచారి, శ్రీనివాసన్, రామ్మోహన్ రావు, సత్యనారాయణ శాస్త్రి తదితరులు పడిన బాధ నాకళ్ళారా చూశాను.” అని సుభాష్ చంద్ర గౌడ్ గుర్తు చేశారు.

“ఎవరు కాదన్నా వనపర్తి మీ స్వంతం.

ఒక ప్రాంతంతంతో ఇంత అనుబంధం పెంచుకుని, ఇన్నేళ్ళ తరువాత కూడా అదే అభిమానంతో పాలిటెక్నిక్ గురించి, అప్పటి మనుషుల గురించి రాస్తుంటే నేను కూడా ఆరోజుల్లోకి వెళ్ళిపోతున్నాను.

మీ సరళమైన భాష, చెప్పే విధానం అద్భుతంగా ఉంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్టీసిలో డీవీఎంగా రిటైరైన వారి సోదరుడు మురళీధర్ గౌడ్ కూడా ‘వనపర్తి ఒడిలో” చదివి
స్పందించారు.

జర్నలిస్ట్ నిమ్మగడ్డ శ్రీనివాస్ రాస్తూ, “గుండె బరువెక్కి పోయింది సార్.

నేనే వనపర్తిని వదులుతున్న భావోద్వేగం కలిగింది.

వనపర్తి మట్టి పరిమళాన్ని గుబాళింప చేశారు.

మీ జన్మ ధన్యం.

బహుశా ఎవరూ ఇలా ఏ ఊరును నెమరేసుకుని ఉండరు.

ఒక్క మాటలో చెప్పాలంటే శర్మసార్ మాల్గుడి డేస్” అని వ్యాఖ్యానించారు.

“మనిషిని మహితాత్ముల్ని చేసిన మట్టికి ప్రణమిట్టడం మన సంస్కారంలో భాగం అని రచయిత శివరావు రామినేని గోత్రస్య వ్యాఖ్యానించారు.

మా పెద నాన్న కొడుకు ఆలూరు వెంకటేశ్వరరావు ఆరు దశాబ్దాల తరువాత తాను చదువుకున్న పాలిటెక్నిక్ ముందు మోకరిల్లిని దృశ్యాన్ని చదివిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు.

“నీవు లేవు, నీ పాట ఉన్నది అన్నట్టు గా ఉంది” అని న్యాయవాది, రచయిత అవధానం రఘుకుమార్ వ్యాఖ్యానించారు.

“నేను కూడా జై తెలంగాణ ఉద్యమంలో గొంతు విప్పాను.

చాలా మంది పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు.

నేను పొలాల్లో దాక్కున్నాను” అని కృపానందం గడ్డం గుర్తు చేసుకున్నారు.

“నేను కూడా వనపర్తి పాలిటెక్నిక్ విద్యార్థినే.

‘వనపర్తి ఒడిలో చదవడంతో కాలేజీ ఆవరణలో విహరించే అవకాశం కలిగింది.

స్నేహితులతో కలిసి మొన్నా మధ్య వనపర్తి వెళ్ళివచ్చాను” అని మద్దాల వేణు మాధవ రావు అన్నారు.

“ఇది మా బడి అనుకోకుండా ఉండలేకపోయా!

రంగా చార్యుల వారు ప్రతి బళ్ళో ఉండేవారు.

తొడపాశం, కోదండం, చింత బరికెలు, కోదండం కింద రేగి కంప, ‘నాలుగుపీకండి’ అని చెప్పే తండ్రి; ఈ పీనల్ కోడ్ అంతా బళ్ళలో అమలయ్యేది.

స్టిల్ లైఫ్ మెమరీస్,గ్రాఫిక్ మాయాజాలం. చదువుతుంటే చదువుకున్న బడి తాలూకు జ్ఞాపకాలు” అని విశ్రాంత ఉపాధ్యాయులు విజయకుమార్ గుర్తు చేసుకున్నారు.

“బార్ బార్ఆతీహై..ముజ్కో.. సుభద్రకుమారి చౌహాన్.. మంగలి దాయమ్మలు.. ఇమ్లీ తెప్పించుకునేహిందీ మేడమ్.. లెక్కల మాస్టారు. చదివిన ప్రతి ఒక్కరికీ ఆనాటి మరుగున పడిన జ్ఞాపకాలు” అంటూ విజయకుమార్ హృద్యంగా చెప్పారు.

“చిక్కటి కవిత్వం సార్’ అని రచయిత శైలకుమార్ వ్యాఖ్యానిస్తే, “వనపర్తి నాకూ రిలేషన్, 4,5 తరగతులు అక్కడనే” అని బెంగుళూరులో ఉంటున్న రచయిత ఎ.ఎన్ నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.

“పసితనపు జ్ఞాపకాలు చేదైనా మధురమే” అని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యనించారు.

“దృశ్య కావ్యం. వర్ణన అద్భుతం” అంటూ ప్రజాశక్తి మాజీ మేనేజర్ చంద్రశేఖర్ ఉప్పల పాడియం వ్యాఖ్యానించారు.

“ఆరోజుల్లోకి మమ్మల్నికూడా తీసుకుపోయారు.

బాల్యాన్ని గుర్తు చేసుకోవడంకంటే ఆనందం ఏముంటుంది?” అని జర్నలిస్టు సోదుం రమణా రెడ్డి వ్యాఖ్యానించారు.

“మా బాల్యంలో ర్యాలీ, పెద్ద వాళ్ళకు హంబర్, కాలేజీ పిల్లలకు రిట్జి’ ‘ అంటూ నెల్లూరుకు చెందిన సాహితీ వేత్త కాళిదాసు పురుషోత్తం తన చిన్ననాటి సైకిళ్ళను
గుర్తుకు తెచ్చుకున్నారు.

“తప్పు చేయకుంటే తండ్రికి కూడా భయపడకూడదు అని గుర్తు చేశారు’ అంటూ నిత్య విప్లవకాంక్షాపరుడు చెలికం కొండా రెడ్డి అన్నారు.

“మీ మధురమైన స్మృతులనుంచి ఎన్నెన్నో విషయాలు తెలియచేశారు” అని మరో విప్లవాభిమాని అచ్యుత సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

“మాచిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి.

మీరు ప్రస్తావించిన కమ్మరి కిష్టయ్య మాకు దగ్గర బంధువు.

ఇరవై ఏళ్ళ క్రితం మరణించాడు.

ఆయన కుమారుడు ప్రస్తుతం పాలిటెక్నిక్ లో పనిచేస్తున్నాడు.” అని ఎస్. వసంత కుమార్ తెలిపారు.

‘దిశ’ దిన పత్రికలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ రాజు రాస్తూ, ‘వంటిల్లు ఒక నిత్య ప్రయోగ శాల.

మన అమ్మలంతా శాస్త్ర వేత్తలు.

మన అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, అవ్వలు, స్త్రీ మూర్తులైన వారి పూర్వీకులు శాస్త్ర వేత్తలే.

వేలాది సంవత్సరాల వారి ప్రయోగ ఫలితాలే ఈ రోజు మనం తింటున్న రుచికరమైన తిండి” అని రాశారు.

మీ ఆర్టికల్ ఒక ఎత్తయితే, పై వాక్యం ఒక్కటీ ఒక ఎత్తు.

వంట చేసే సంచిత జ్ఞానానికి మారు పేరైన స్త్రీ మూర్తులే శాస్త్ర వేత్తలు.

ఎంత గొప్పమాట!

మన దరిద్రపు అర్థ శాస్త్రం వంట పని అనుత్పాదక శ్రమగా వ్యాఖ్యానించబట్టే మహిళల వంటపని ఎందుకూ కొరగానిదై పోయింది సమాజందృష్టిలో.

మనది తల్లకిందుల సమాజం అని మార్క్స్ ఎప్పుడో చెప్పాడు.” అంటూ సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు.

“వనపర్తి తీసేసి జమ్మలమడుగు అని పెడితే అది నా జ్ఞాపకాలవుతాయి” అని కవి, రచయిత, జర్నలిస్టు జింకా నాగరాజు అన్నారు. నా కాలమ్ తొలి పాఠకుడు నాగరాజు.

“మధుర మంజుల చిననాటి మది దొంతరల సొదల సూదులు రాఘవ శర్మ తలపులు ధన్యోస్మి” అంటూ రిటైర్డ్ విద్యుత్ ఎస్. ఈ దేవేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“బర్రెల రామిరెడ్డికి పెద్ద గూడెం రామిరెడ్డి అని మరో పేరు ఉంది” అని బండారు చిన్నయ్య శ్రీనివాస్ గుర్తు చేశారు.

“చదువుతుంటే బాధనిపించింది.

తిరిగిరాని జ్ఞాపకాలు, మరపు రాని జ్ఞాపకాలు” అంటూ హైదరాబాదుకు చెందిన, వరుసకు మా మేనకోడలు అయిన నాగమణి, ఉరఫ్ అమ్మన్న, పెద్ద పాప వ్యాఖ్యానించింది.

“మీ గుండు బావి గురించి చదివి చాలా ఆనందించాను.

మీ వర్ణన చాలా అందంగా ఉంది.

మీ ముగింపు వ్యాసం వాస్తవ జీవితాన్నిచూపింది.

అది రచనా శిల్పం” అంటూ సాహితీ వేత్త, విశ్రాంత ఆచార్యులు పి.నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు.

వీరే కాదు, పాండురంగారావు, పుష్పలత, అమరనాథ్, గోపాలరావు, గుంటి గోపి, ప్రభాకర్, మా చంద్రమౌళి సార్ కుమారుడు డాక్టర్ దేవన్ పాండే ; ఇలా అనేకానేకమంది ‘వనపర్తి ఒడిలో’ చదివి తమతమ అభిప్రాయాలను ఫోన్ ద్వారా తెలిపారు.

సౌదీ అరేబియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న కరీంనగర్ వాసి, రచయిత ఇర్ఫాన్ కూడ ఫోన్ చేశారు.

నా అయిదేళ్ళ వయసులో మా ఇంటికి వచ్చే గోరెమ్మ గురించి రాస్తే, ఆమె మేనల్లుడు సయ్యద్ జమీల్ ఫోన్ చేసి మరీ మాట్లాడారు.

గోరెమ్మ, ఆమె భర్త పాకిస్థాన్ వెళ్ళిపోయారని, అక్కడే మరణించారని చెప్పారు.

ఆమెతో పాటు ఉండే సుభాని వనపర్తిలోనే మృతి చెందిందని చెప్పారు.

‘వనపర్తి ఒడిలో’ ఎంత మందిని పరిచయం చేసింది!

ఎంత మందితో మాట్లాడేలా చేసింది!

ఎంత మందిని ఒకరికొకరు మాట్లాడుకునేలా చేసింది!

‘వనపర్తి ఒడిలో’ ఎందుకు రాయాల్సి వచ్చింది!?

వనపర్తి నుంచి తిరుపతి వచ్చి యాభై ఏళ్ళవుతోంది.

రెండు మూడేళ్ళ క్రితం ‘తిరుపతి జ్ఞాపకాలు’ మొదలు పెట్టాను.

అవి 64 భాగాలయ్యాయి.

అవి అనంతం.

వీటిని చూసిన పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి చాలా రోజుల క్రితం ఒక మాటన్నారు.

రాఘవాచారి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో మానసిక వైద్యుడు వంటి వారు.

ఆ వైద్య విధానంలో తలపైన సూదులు గుచ్చి శరీరంలో ఎక్కడున్న నొప్పినైనా తొలగిస్తారు.

అలాగే రాఘవాచారి కూడా ఒక మాటతో నా మెదడులో ఇలా గుచ్చారు.

“ప్రతి ఊరికి మీ లాంటి ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుంటుంది!

స్థానిక చరిత్ర బైటికి వస్తుంది.

తిరుపతి జ్ఞాప కాలలాగానే వనపర్తి జ్ఞాపకాలు రాయచ్చుకదా!” అని.

దాంతో నా బద్దకాన్ని ఒదిలించుకుని ఈ ఏడాది (2023) జనవరి ఒకటిన ‘వనపర్తి జ్ఞాపకాలు’ మొదలు పెట్టాను.

వనపర్తిలో నా సహ విద్యార్థి, జర్నలిస్టు సి.సి. రెడ్డి కూడా ‘మీ వనపర్తి జ్ఞాపకాలు రాయచ్చు కదా!’ అని అనేక సార్లు అడిగారు.

నిజమే కదా!

తిరుపతి కంటే ముందు నా జ్ఞాపకాలు వనపర్తితోనే మొదలయ్యాయి.

రాయడంలో అలసత్వాన్ని ప్రదర్శించాను.

‘వనపర్తి జ్ఞాపకాలు’ మొదలు పెట్టాను.

సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజులు చక్రధర్ సూచనతో ‘వనపర్తి ఒడిలో’గా అవి రూపాంతరం చెందాయి.

‘వనపర్తి ఒడి లో ‘ రాసిన ప్రతి భాగాన్ని మా అమ్మ ఆలూరు విమ లా దేవి(91) చదవమని చెప్పేది . నేను చదువు తుం టే 17 భాగాలు మాత్రమే విన్నది. ఆ తరువాత గత మార్చి 17 న శాశ్వతంగా కన్ను మూ సింది.

ఊహించని విధంగా పాఠకుల ఆదరణ పొందింది.

‘వనపర్తి ఒడిలో’కి ఎందుకింత స్పందన!

నాకే ఆశ్చర్యమేసింది.

రోజు రోజుకూ సామాజిక జీవితం సంక్లిష్టమవుతోంది.

మానవ సంబంధాలను ఆర్థిక స్థితిగతులు నిర్దేశిస్తూ, మాట్లాడ కుండా నోటికి తాళాలు వేస్తున్నాయి.

పలుకు బంగారమైపోతోంది.

పక్కింటి వారితో మాట్లాడడమే కరువైపోతోంది.

పక్కనున్న మనిషితో నూ మాటల్లేవ్.

కుటుంబంలో పలకరింపులు ల్లేవ్.

పిల్లలను రెసెడిన్షియల్ స్కూళ్ళలో కి, పెద్ద వాళ్ళను వృద్ధాశ్రమాల్లోకి!

పెద్ద పెద్ద ఇళ్ళలో ఒకరిద్దరే!

ఎవరి లోకంలో వాళ్ళు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు.

ఈ సంక్షుభిత సమయంలో ‘వనపర్తి ఒడిలో’ ఎందరినో పలకరించింది.

దానికి స్పందనగా వారి పలుకులు ఇలా పరిమళించాయి.

ఆ పరిమళాల్ని కొనసాగిద్దాం.

‘వనపర్తి ఒడిలో’కి ఇక సెలవు.

3 thoughts on “వనపర్తి ఒడిలో: పలకరింపుల పరిమళాలు

  1. మీ వనపర్తి ఒడికి ఎంత చక్కటి ముగింపు నిచ్చారండి. ఇంతమంది మీ వనపర్తి జ్ఞాపకాలలో ఓలలాడారంటే మీ వ్యాసాలు కచ్చితంగా చారిత్రక ప్రాధాన్యమున్నవే అవుతాయి. ఎెంత త్వరగా మీ జ్ఞాపకాలను పుస్తకరూపంలోకి తెస్తే అంత మంచిది. ఎదురు చూస్తుంటాము అందరమూ…. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చిన క్షణం వనపర్తి పరవశించిపోతుంది. తన చరిత్రను తాను తల్చుకుంటూ…

    1. రాజశేఖర్ రాజు గారు మీ లాంటి సహృదయుల సహకారం తో నే వనపర్తి ఒడిలో పాఠ కాద రణ పొందింది.

  2. వనపర్తి ఒడిలో
    1987 ssc pass ఆయన సందర్భంగా ఆరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్లో కూర్చొని ఎంతో అహల్లాదానికి గురయ్యా. ఆరోజు తలుచుకుంటే ఆ ఆనందమే వేరు నరసింహ రాజు కేడిఆర్ నగర్
    ప్రస్తుతం ఇప్పుడు కువైట్ లో ఉన్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *