మంచులా కరిగిపోయిన కాలేజీ జీవితం

వనపర్తి ఒడిలో-22

-రాఘవశర్మ

టెన్త్ పాసై సర్టిఫికెట్లు చేతికొచ్చాయి.

తరువాత ఏం చదవాలి? ఏం చేయాలి?
ఏదారెటు పోతుందో తెలియని జీవితపు చౌరస్తాలో నిలబడ్డాను.
బొమ్మలు వేయడం ఆపేశాను.
వినడమే తప్ప పాడడమూ మానేశాను.
‘సృజన’ నాపై అలిగి వెళ్ళిపోయింది.
నాది జనరల్ మేథమెటిక్స్.
మా నాన్నకు పాలిటెక్నిక్ లో ఉద్యోగం.
నాది కాంపోజిట్ కాకపోవడంతో పాలిటెక్నిక్ సీటు చేజారింది.
నేనప్పుడు చాలా బాధపడ్డాను.
నాకంటే మా నాన్న ఎక్కువగా బాధపడ్డాడు.
ఆ బాధ ఆయన తిట్లలో ప్రతిఫలించింది.
మా ఇంట్లో ఉండి పాలిటెక్నిక్ చదివిన వాళ్ళను చూశాను.
మా బాబాయి, మా మేన మామ ; ఇలా చాలా మంది పాలిటెక్నిక్ చదివారు.
వారి జీవన విధానాన్ని చూశాను.
ఉద్యోగానికి పనికొచ్చే చదువు.
ఆర్థికంగా నిలదొక్కుకోవడానికీ పనికొచ్చే టెక్నిక్.
ఉద్యోగంలో చేరడం, పెళ్ళి చేసుకోవడం, ఆస్తుల్ని సంపాదించడం, పిల్లల్ని కనడం, యాంత్రికంగా బతకడం!
సైన్స్ చదువుకోవడం, మూఢనమ్మకాలను విశ్వసించడం, సామాజిక స్పృహలేకుండా జీవించడం, ఇదేనా జీవితం!
ఇందుకు కొందర్ని మినహాయించవచ్చు.
అన్ని విలువలను ఒదిలేయడమే జీవిత పరమార్థమైపోయింది.
సృజనాత్మకతకు చోటుండదు.
చదువంతా యాంత్రికం.
జీవితమూ యాంత్రికం.
డీసీపీ లెక్చరర్ చంద్రమౌళి నా గురువు, (బ్యాంట్ మింటన్లో) నా మిత్రుడు, నా హితైషి,
డీసీపీలో చేరడానికి మా నాన్న ససేమిరా ఒప్పుకోలేదు.
ఇక ఇంటర్మీడియట్లో చేరాలి.
నాకొచ్చిన మార్కులకు రెండవ ప్రాధాన్యత సీఈసీ వచ్చింది.
కామర్స్ వద్దాన్నాడు మానాన్న.
చదివితే ఎంపీసీ, లేకపోతే బైపీసి.
ఏం చదవాలి, ఏం చదవకూడదో అన్నిటికీ మా నాన్నే శాసన కర్త.
నాకు ఇష్టా అయిష్టాలుండ కూడదు.
నాగర్ కర్నూలులో బైపీసీలో సీటొచ్చింది.
బైపీసి సీటుతో పాటు టైఫాయిడూ వచ్చింది.
అది తగ్గాక టీసీ తీసుకుని వనపర్తిలో చేరాను.
ఇంటర్మీడియట్ మొదలయ్యాక మాది రెండవ బ్యాచ్.
అంతకు ముందు హైస్కూల్లో దాన్ని 11వ తరగతి, 12వ తరగతి అనేవారు.
బైపీసీలో మాది బీ సెక్షన్.
క్లాసంతా పిల్లల్తో కిటకిటలాడేది.
మెయిన్ బిల్డింగ్లో ఆర్ట్స్, కామర్సు కోర్సులు జరిగేవి.
మెయిన్ బిల్డింగ్కు కాస్త దూరంగా సైన్స్ బిల్డింగ్ ఉండేది.

జూనియర్ కాలేజీ సైన్స్ బిల్డింగ్ లో లేబొరేటరీ గది

మా ప్రిన్సిపాల్ పర్వత రాజులు.
కాస్తలావుగా, ఎత్తుగా కదలాడే పర్వతంలా ఉండేవారు.
తెలుగు చెప్పేవారు.
మెయిన్ బిల్డింగ్ నుంచి సైన్స్ బిల్డింగ్ కు నిదానంగా నడుచుకుంటూ వచ్చేవారు.
పాఠం చెప్పాల్సిన పుణ్యకాలం నడకలోనే గడిచిపోయేది.
క్లాసు కొచ్చి పాఠం మొదలు పెట్టేవారో లేదో కాసేపటికే బెల్ మోగేది.
తెలుగు సిలబస్ పూర్తయ్యేది కాదు.
ఈ విషయం తెలిసి మా నాన్న ఆయన పైన ఫిర్యాదు చేశాడు.
ఇంటర్ ఆయిపోయాక ఆ ఫిర్యాదు నా కొంప ముంచింది.
ఇంటర్ పాసయ్యాక తిరుపతి వెళ్ళిపోతే, నా సర్టిఫికెట్లు రాకుండా తొక్కిపట్టాడు.
నిజానికి పర్వతరాజులు తప్పేమీ లేదు.
బోధనతోపాటు ప్రిన్సిపాల్ పాలనా బాధ్యతలు అదనం!
తగినంత మంది లెక్చరర్లు ఉంటే ఆయన క్లాసుకు రావలసిన అవసరం లేదు.
బైపీసీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు కాంపోజిట్ మేథమెటిక్స్ కూడా పెట్టారు.
ఎనిమిదవ తరగతి నుంచి చెపితేనే కాంపోజిట్ అర్థమవుతుంది.
జనరల్ మేథమెటిక్స్ నుంచి వచ్చిన విద్యార్థులకు కాంపోజిట్ ఏమర్థమవుతుంది!?
కాంపోజిట్ చెప్పడానికి కంఠీరవాచారి ఉండేవారు.
ఆయన లెక్కలు చెప్పడంలో మహాదిట్ట.
ఎంపిసి వాళ్ళకు వెళ్ళే వారు.
వరంగల్లో కొంత కాలం పనిచేసి, వనపర్తికి  ట్రాన్స్ వర్ పై వచ్చారు.
చాలా బాగా చెప్పేవారని పేరు.
నా క్లాస్మేట్ లక్ష్మణాచారికి స్వయానా చిన్నాయన.
లక్ష్మణాచారి సీఈసీలో చేరాడు.
కంఠీరావాచారి కాకుండా లెక్కలకు మరొక లెక్చరర్ మాకు వచ్చేవారు.
ఆయన చెప్పేవి ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు.
లెక్కల్లో మౌలిక విషయాలు(బేసిక్స్) తెలిస్తేగా అర్థమవడానికి!
పై అంటే 22/7 అని చెప్పాడు.
‘పై అంటే 22/7 అనే ఎందుకు అనుకోవాలి?
2/7 అని ఎందుకు అనుకోకూడదు?’ అని ప్రశ్నించాను.
వివరించి చెప్పలేకపోయాడు.
క్లాసులో అంతా ఘోల్లుమన్నారు.
ఆయనకు అవమానం అనిపించింది.
లెక్కల్లో మా అజ్ఞానానికి ఆయన విస్తుపోయాడు.
బైపిసిలో లెక్కలు తీసేయాలని ఆందోళన చేశాం.
మేథమెటిక్స్ లో వచ్చిన మార్కులతో సంబంధం లేదని ప్రభుత్వం చెప్పేసింది.
అయినా మేథమెటిక్స్ తీసేయాలని పట్టుబట్టాం.
ఆందోళన ఫలితంగా సెకండ్ ఇయర్ నుంచి మేథమెటిక్స్ తీసేశారు.
నిజానికి కాంపోజిట్ మ్యాథమెటిక్స్ బైపీసీ వారికి కూడా అవసరం.
ఆ లెక్కలు ఫిజిక్స్ లో ఉపయోగపడతాయి.
కాంపోజిట్, జనరల్ అని విభజించడమే తప్పు.
ఇప్పుడు ఆ విభజనను తీసేశారు.

జువాలజీ లెక్చరర్ సత్యనారాయణ రెడ్డి

జువాలజీకి సత్యనారాయణ రెడ్డి వచ్చేవారు.
కప్ప, వానపాము డిసెక్షన్ చేయాల్సి వచ్చింది.
వాన పామును నిట్టనిలువునా చీల్చాలి.
ఇరు వైపు లా చర్మం ను
వెడల్పు చేసి గుండు సూదులతో గుచ్చాలి.
దాని లోపల భాగాలను వివరించి చెప్పాలి.
చేజేతులారా ఒక జీవిని చంపడం చాలా బాధనిపించింది.
మరొక సారి కప్ప డిసెక్షన్ వచ్చింది.
దాని నోట్లోకి క్లోరోఫామ్ ఇచ్చి మత్తులోకి పంపించాలి.
ఒక నీళ్ళ ట్రేలో కప్పను వెల్లకిలా పడుకోబెట్టి, నాలుగు కాళ్ళను కదలకుండా గుండు సూదులతో గుచ్చాలి.
కత్తి తీసుకుని దాని పొట్టపై చర్మాన్ని నిలువుగా, అడ్డంగా చీల్చాలి.
దాని పొట్ట లోపలి భాగాలను గుర్తించాలి.
నేను చేయలేకపోయాను.
నాక్లాస్ మేట్ ఒకరు చేసి సిద్ధం చేశాడు.
దాని పొట్టను కత్తితో చీలుస్తున్నప్పుడు మత్తులో ఆ కప్ప ఎంత విలవిల్లాడిపోయిందో!
నా మనసు కూడా అంతే.
దాని పొట్టలోపలి భాగాలను గుర్తించాను.
క్లోరోఫాం మత్తులోనే ఆ కప్ప కన్నుమూసింది.
ఇంటి కెళితే ఆ రోజు అన్నం తినబుద్ది కాలేదు.
కూర కలుపుకుంటున్నా కప్ప పొట్టలోపేగులే కనిపించాయి.
పప్పు కలుపుకుంటున్నా అలాగే అనిపించింది.
అన్నం తినలేక లేచేశాను.
నేను ఎందుకు తినడం లేదో మా అమ్మకు అర్థం కాలేదు.
చెబితే తానుకూడా తినకుండా వాంతికి చేసుకుంటుందని చెప్పలేదు.

నలభై తొమ్మిదేళ్ళ తరువాత వనపర్తిలో కనిపించిన జువాలజీ లెక్చరర్ సత్యనారాయణరెడ్డికి రచయితను పరిచయం చేస్తున్న క్లాస్ మేట్ సీసీ రెడ్డి

నాలుగు నెలల క్రితం వనపర్తి వెళ్ళాను.
నా క్లాస్ మేట్ సి.సి. రెడ్డి, నేను నడుచుకుంటూ వెళుతున్నాం.
‘మన సత్యనారాయణ రెడ్డి సార్. జువాలజీకి వచ్చేవారు. అదిగో’ అన్నాడు సి.సి.
ఎదురుపడి పలకరించి ఒక నమస్కారం పెట్టాను.
నన్ను ఎలాగూ ఆయన గుర్తుపట్టలేరు.
సిసి చెప్పకపోతే నేను కూడా ఆయన్ని గుర్తుపట్టలేకపోయేవాణ్ణి.
సత్యనారాయణ రెడ్డి ముఖంలో ఎంత ఆనందం!
నలభై తొమ్మిదేళ్ళ తరువాత సత్యనారాయణ రెడ్డి ని చూడడం!
మా ముగ్గురి ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.
రామిరెడ్డి కెమిస్ట్రీకి వచ్చేవారు.
కర్నూలుకు చెందిన వారనుకుంటా.
సన్నగా పొడుగ్గా, నవ్వుతూ ఉండేవారు.
అప్పటికి పెళ్ళికాలేదు ఆయనకు.
ప్రతి ఆదివారం మాతోపాటు కప్పగంతుల బావికి ఈతకు వచ్చేవారు.
అక్కడే బట్టలు ఉతుక్కునే వారు.
రామిరెడ్డిని చూసే నేను బట్టలు ఉతుక్కోవడం నేర్చుకున్నాను.
కెమిస్ట్రీ ల్యాబ్లో వాసన.
రామిరెడ్డి నవ్వు ముఖం ఆ వాసనను మైమరిపించేది.
కృష్ణా జల్లాకు చెందిన ప్రసాద రావు బాటనీకి వచ్చేవారు.
పొట్టిగా, తెల్లగా, టక్ చేసుకుని ఉండేవారు.
‘నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం’ అన్నట్టు.. అక్కినేని నాగేశ్వరరావులా చాలా అందగాడు.
ఒక సారి క్లాసులో విద్యార్థులంతా మాట్లాడుతున్నారు. ‘మీ తోకలు నా చేతిలో ఉన్నాయి. కత్తిరించేస్తా’ అన్నాడు. తోకలంటే ప్రాక్టికల్ మార్కులు.
భయపడి చచ్చాం.
అంతా నిశ్శబ్దం.

ఇంటర్మీడియట్ క్లాస్ రూమ్ ముందు వ్యాస రచయిత.

ఫిజిక్స్ కు రఘునాథరెడ్డి వచ్చేవారు.
అనంతపురం జిల్లాకు చెందిన వారు.
‘వచ్చిన్యాము. తెచ్చిన్యాము’
అనంతపురం మాండలిక ఉచ్ఛారణ ఆయన నోటి వెంట అలా దొర్లేది.
మాలో మేం గుసగుసలాడే వాళ్ళం.
పాఠాలు చాలా ఓపిగ్గా చెప్పేవారు.
కో ఎడ్యుకేషన్.
క్లాసులో ఒక పక్క ఆడ పిల్లలు, మరొక పక్క మగ పిల్లలు.
ఆడ పిల్లల సంఖ్య తక్కువ.
పుస్తకాల మోత హైస్కూలుతోనే అయిపోయింది.
కాలేజీ అంటే పుస్తకాల మోత ఉండేదికాదు.
ఒక నోటు పుస్తకం పుచ్చుకుని సోగ్గా వెళ్ళి వచ్చే వాళ్ళం.
నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ప్రమోషన్.
ప్యాంట్లేసుకుంటే నాకు తెలియ కుండానే ఒక పెద్దరికం వచ్చేసింది.
చుట్టూ ఉన్న లోకం కూడా అలాగే గుర్తించే సింది.

కాలేజీలో స్టూడెంట్ ఎన్నికలొచ్చాయి.
సైన్స్ రికార్డుల తయారీలో నాదే పై చేయి.
బొమ్మలు వేసే అలవాటు అలా ఉపయోగపడింది.
మా క్లాస్మేట్ జయప్రకాష్ అధ్యక్షుడిగా నిలబడ్డాడు. జయప్రకాష్ ఎత్తుగా, తెల్లగా ఉండే వాడు.
చాలా మృదువుగా మాట్లాడేవాడు.
మంచితనమే తప్ప నిజానికి అతనికి బలం లేదు.
జయప్రకాష్ వెనుక తిరుమలయ్య ఉండేవాడు.
తిరుమలయ్య తెలుగోళ్ళ కులానికి చెందిన వాడు.
పొట్టిగా, లావుగా, నల్లగా బలంగా ఉండేవాడు.
రోజూ వ్యాయామం చేసేవాడు.
ఇంటర్ మొదటి సంత్సరం పరీక్షలు రాయడానికి మెయిన్ బిల్డింగ్ లోకి వెళుతున్నాం.
బైట తిరుమలయ్యకు ఎదురుగుండా వచ్చిన వ్యక్తి కదలకుండా బలంగా వాటేసుకున్నాడు.
మరొక వ్యక్తి వచ్చి తిరుమలయ్యను ఇష్టమొచ్చినట్టు కొట్టాడు.
తిరుమలయ్య కదలలేక, ప్రతిఘటించలేక పోయాడు.
నోటి లోంచి నెత్తురుకారుతోంది.
తిరుమలయ్య నిస్సహాయుడైపోయాడు.
చొక్కాతో నెత్తురు తుడుచుకుంటూ పరీక్ష హాలులోకి వెళ్ళి పోయాడు. నేను అక్కడే ఉన్నాను.
తిరుమలయ్యను ఒక్కడుగా వచ్చి కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంత బలంగా ఉండేవాడు.
ఆ కొట్టిన వ్యక్తి టెన్త్ లో మా క్లాస్ మేటే, తిరుమలయ్యకు స్నేహితుడే. అందరూ కలిసి వ్యాయామం చేసి కండలు పెంచుకునేవారు. పెంచుకున్న కండలను ఏం చేయాలి.
ఎవరో ఒకర్ని ఇలా కొట్టాలి కదా!
తిరుమలయ్యను కొట్టడం నాకు చాలా బాధనిపించింది.

ఇంటర్మీడియట్ మెయిన్ బిల్డింగ్ మధ్య లో వ్యాస రచయిత

తిరుమలయ్య కడుపులో కసిపెట్టుకున్నాడు.
తిరుమలయ్యను కొట్టిన వ్యక్తి ఎన్నికలో నిలబడ్డాడు.
అతనికి పోటీగా మా క్లాస్ మేట్ జయప్రకాష్ ను తిరుమలయ్య నిలబెట్టాడు.
అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారం.
ఇరు పక్షాల వారు విడి విడిగా రాత్రిపూట మా ఇంటికి వచ్చారు.
‘మీకే ఓటేస్తాను’ అంటూ ఇద్దరికీ చెప్పాను.
పదేహేడేళ్ళకే నాలో ఎంత లౌక్యం!
ఎంత అందంగా, అమాయకంగా అబద్దమాడానో!
ఎన్నికలు నేర్పిన గుణపాఠం.
దేశంలో సగటు ఓటరు మనస్తత్వం.
సైన్స్ ఓట్లు తక్కువ, ఆర్ట్స్ ఓట్లు ఎక్కువ.
జయప్రకాష్ అనామకుడు.
జయప్రకాష్ లో కాస్త ఆడవాళ్ళ హావభావాలుండేవి. అమ్మాయిలంతా జయప్రకాష్ కే ఓటేశారు.
నా ఓటుకూడా జయప్రకాష్ కే.
కాదు తిరుమలయ్యను నిలబెట్టిన జయప్రకాష్ కే.
ఓటు వేసే దగ్గర జయప్రకాష్ కనిపించలేదు.
తిరుమలయ్యే కనిపించాడు.
తిరుమలయ్యను ఏకాకిని చేసి కొట్టడమే కనిపించింది.
అది కూడా పరీక్ష జరగడానికి ముందు.
తిరుమలయ్య మద్దతుతో జయప్రకాష్ అఖండ మెజారిటీతో గెలిచాడు.
జయప్రకాష్ మెడలో ఎన్ని దండలు వేశారో!
జయప్రకాష్ ను తిరుమలయ్య తన బుజాల పైన కూర్చోబెట్టుకుని మరీ ఊరేగించాడు.
తిరుమలయ్యను కొట్టిన వ్యక్తి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు.
అకారణంగా తిరుమలయ్యను కొట్టిన వ్యక్తికి ఓటు ద్వారా పరాభవం.
కాలేజీ జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు!
ఎన్ని మధురానుభూతులు!
ఆ జీవితం ఒక కలగా మిగిలిపోయింది.
రెండేళ్ళ జీవితం మంచులా కరిగిపోయింది.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

One thought on “మంచులా కరిగిపోయిన కాలేజీ జీవితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *