మా కలల ప్రపంచం రామాటాకీస్, జగదీష్ టాకీస్

(వనపర్తి ఒడిలో-15)

రాఘవ శర్మ

‘సినిమాల కెళితే చెడిపోతారు’ అనేది మా శేషమ్మత్తయ్య
మా నాన్న ఆమెకు వంత పలికేవాడు.
సినిమాలకు వెళితే చదువు చట్టుబండలవుతుందనేది ఆయన ఆలోచన.
‘చెడిపోవడానికి మనమేమన్నా కూరగాయలమా!?’ అనుకునే వాణ్ణి నేను.
మా మేనత్త నోటికి భయపడి మా నాన్నకూడా చెప్పకుండా ఫస్ట్ షో నిమాకెళ్ళొచ్చేవాడు. గుడ్డలుతికేటప్పుడు చొక్కా జేబులో సినిమా టికెట్టు చూసి మా అమ్మ గమనించేది.
అయినా నోరెత్తేది కాదు.
నాకు మాత్రం తెలిసిపోయేది.
మా అత్తయ్యకు ఏ మాత్రం తెలిసేది కాదు.
ఆమె చాలా పాతకాలం మనిషి.
ఒక సూర్యాకాంతం, ఒక ఛాయా దేవి కలిసినా ఒక్క మా మేనత్త ముందు బలాదూరే.
వనపర్తిలో ఉన్నంత కాలం మా అమ్మ మాత్రం సినిమాలు చూసిన పాపాన పోలేదు.
కాలేజీ ఆడిటోరియంలో వేసే సినిమాలకు అభ్యంతరాలు ఉండే వి కాదు.
ప్యాలెస్ లో కాకుండా ఊళ్ళో ఉన్నప్పటి మాట ఇది.
భోజనాలవగానే ఎత్తైన కాంపౌండ్ గేటుకు తాళం వేసేసేవాడు మా నాన్న.
మా రాంగోపాల్ బాబాయి, మా రాధ మావయ్య మిద్దె పైన పడుకునే వాళ్ళు.
మిద్దెపై నుంచి నిచ్చెన వేసుకుని బైటకు దిగే వాళ్ళు.
ఎవ్వరికీ తెలియకుండా సిగరెట్లు కాలుస్తున్నట్టుగానే, ఎవ్వరికీ తెలియకుండా రెండవ ఆట సినిమాకు వెళ్ళి వచ్చే వాళ్ళు.
సినిమా అయిపోయాక , ఏ అర్ధరాత్రో బైట రహస్యంగా పెట్టుకున్న నిచ్చెనతో మళ్ళీ మిద్దెపైకెక్కి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి పడుకునే వాళ్ళు. ఎలిమెంటరీ స్కూల్లో చదివే రోజుల నుంచే హరికథలు, నాటకాలు చూసేవాణ్ణి.
హరికథలు వింటుంటే పౌరాణిక గాథలు కళ్ళ ముందర కదలాడేవి.
ఆడిటోరియంలో నాటకాలు సామాజిక స్థితిగతులను, హస్యాన్ని మేళవించేవి.
హైస్కూలు కొచ్చాక సినిమాలు చూడడం మొదలైంది.
వాటి గురించి ఇక చెప్పనవసరం లేదు.
సినిమాలు చూడ్డానికి డబ్బులుండేవి కాదు.
‘సినిమాకెళ్ళాలమ్మా’ అంటే చాలు, మా అమ్మ పోపుల డబ్బాలో దాచిన చిల్లర నుంచి అర్ధరూపాయి తీసిచ్చేది.
బహుశా నా కోసమే దాచే దేమో!
అంతకు మించి మా అమ్మకు డబ్బులు దాచాల్సిన అవసరం ఏముంది?
‘పాండవ వనవాసం’ ‘నర్తన శాల’ వంటి పౌరాణిక సినిమాలకు ఎక్కువగా వెళ్ళేవాడిని.
హరికథల్లో పౌరాణిక దృశ్యాలను ఊహించుకుంటే, సినిమాల్లో ఆ దృశ్యాలు కళ్ళ ముందు కదలాడేవి.
అలాగే ‘దేవత’ వంటి సాఘిక సినిమాలూ.
యుగళ గీతాలకు హీరో హీరో యిన్ల అభినయాలు.
చెట్టా పట్టాలేసుకుని పార్కుల వెంట, రోడ్ల వెంట పరుగులు.
ఇలాంటి దృశ్యాలు నిజ జీవితంలో ఎక్కడా కనిపించేవి కావు.
ఆ దృశ్యాలు కలల ప్రపంచంలో విహరింప చేసేవి.
ఆరోజుల్లో వనపర్తిలో రెండే రెండు సినిమా టాకీసులు.
ఒకటి రామా టాకీస్, రెండవది జగదీష్ టాకీస్.
మా నాన్నకు తెలియకుండా మా అమ్మ నెలకొక అర్ధరూపాయి ఇచ్చేది.
స్కూలు నుంచి రాగానే కాళ్ళూ చేతులు కడుక్కుని సినిమాకు పరుగోపరుగు.
ప్యాలెస్ నుంచి రామాటాకీస్ కు దాదాపు కిలో మీటరున్నర దూరం. జగదీష్ టాకీస్ అయితే దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం. ఎక్కువగా జగదీష్ టాకీస్ కు వెళ్ళే వాణ్ణి.
ఆరోజు ల్లో నేల 40 పైసలు, బెంచి డెబ్బై పైసలు, కుర్చీ 90 పైసలు, పాటల పుస్తకం 10 పైసలు.

ఆ సినిమాలో పాటలు బాగున్నాయంటే ముందు పాటల పుస్తకం కొనుక్కుని మరీ వెళ్ళేవాణ్ణి.
మిగిలిన నలభై పైసలతో నేల టికెట్టు కొనుక్కనే వాణ్ణి.
పాటలు అంతగా బాగుండ లేదనుకుంటే, ఆ పదిపైసలు పెట్టి వేయించిన పల్లీలు కొనుక్కుని హాలులోకి వెళ్ళే వాణ్ణి.
నాతో పాటు ఒకరిద్దరు స్నేహితులు కూడా వచ్చేవారు.
వారిలో మా గుండాచారి సార్ కొడుకు, మరొకరు లక్ష్మణాచార్యులు.
వారిద్దరూ ఎలిమెంటరీ స్కూలు నుంచి నాకు క్లాస్ మేట్లు.
అందరికంటే ముందుగా వెళ్ళి కూర్చునేవాళ్ళం.
ముందుగా వెళితే నేల టికెట్టులో చివరన గోడకు ఆనుకుని కూర్చోవచ్చు.
కాళ్ళు పారజాపుకుని మరీ పల్లీలు తింటూ న్యూస్ రీలు చూడచ్చు. ఆలస్యమైతే న్యూస్ రీలు మిస్సవుతామేమోనన్న బాధ.
ఇచ్చిన నలభై పైసలకు పూర్తిగా న్యాయం చేకూర్చాలన్నది ఆలోచన.
ఎప్పుడన్నా ఆలస్యమైందంటే, ఏదో నష్టపోయినట్టు బాధపడేవాళ్ళం. న్యూస్ రీ ల్లో స్వాతంత్ర్యోద్య ఘట్టాలను చూపించేవారు.
గాంధీ, నెహ్రూలను చూడగానే ఒళ్ళు పులకించిపోయేది.
‘బెంగాల్, బీహార్ ను వరదలు ముంచెత్తాయి’ అని బ్యాక్ గ్రౌండ్ వాయిస్తో వినిపించేది.
గంభీరమైన గొంతు కోసమైనా న్యూస్ రీలు అంతా చూడాలనిపించేది.
ఆ గొంతు అంత బాగుండేది!
సినిమా మొదలయ్యిందంటే అన్నీ మర్చిపోయేవాణ్ణి.
ఇంటర్వెల్ వచ్చేవరకు ఏమీ పట్టించుకునే వాణ్ణి కాదు.
ఒక్కొక్క సారి న్యూస్ రీలు సమయంలో కాకుండా ఇంటర్వెల్లో పల్లీలు కొనుక్కునే వాణ్ణి.
పల్లీలు తొందరగా అయిపోతాయేమోనన్న బాధ.
నిదానంగా తింటూ సినిమాలో లీనమైపోయేవాణ్ణి.
సినిమా అయిపోతోందంటే ఉసూరుమనిపించేది.
సినిమా అయిపోగానే జాతీయగీతం వినిపించేది.
జాతీయ గీతం వినిపిస్తున్నా సరే ఇంటికి పరుగు లాంటి నడక.

 

ఒకనాటి జగదీష్ టాకీస్ ప్రాంతంలో వెలిసిన కాంప్లెక్స్

ఇంటర్లో కొచ్చాక నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ప్రమోషన్ వచ్చింది.
సినిమా హాలులో కూడా నేల టికెట్టు నుంచి బెంచీకి ప్రమోషన్ వచ్చింది.
నేల టికెట్టు వాళ్ళంటే నల్లులకు ఎంత ప్రేమో!
ఒక్కటి కూడా కుట్టేది కాదు.
బెంచీపైన కూర్చుని సినిమా చూస్తుంటే, వెనుక నుంచి నల్లులు తెగ కుట్టి చంపేవి.
మధ్యతరగతి అంటే నల్లులకు ఎందుకంత కోపమో!?
కుర్చీలో కూడా నల్లులు కుట్టేవట.
నల్లులతో కుట్టించుకోవడానికి ఎక్కడ కూర్చుంటే ఏమిటి?
అందుకని మా నాన్న బెంచి టెకెట్టుకొనుక్కునే వాడు.
బెంచీ, కుర్చీ టికెట్టుకొనుక్కుంటే ఒకటే సిగరెట్ల వాసన.
నేల టికెట్టులో కూర్చుంటే సిగరెట్ల వాసన ఉండేది కాదు.
ఎవరో ఒకరు బీడీలు తాగేవారు.
బీడీ తాగే వాళ్ళు మన పక్కన కూర్చోకపోతే చాలు సినిమా చక్కగా చూడచ్చు.
బీడీ తాగే వాళ్ళు ఒక వేళ పక్కన కూర్చుంటే వేరే దగ్గర కెళ్ళి కూర్చునే వాళ్ళం.
గోడకు ఆనుకునే అవకాశం పోయేది.
ఆరోజుల్లో సిగరెట్లు తాగడం ఒక ఫ్యాషన్.
ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు సిగరెట్లు తాగే సినిమాలే ఎక్కువగా ఉండేవి.
ఎస్వీ రంగారావైతే చుట్టలు కాల్చేవాడు.
గుమ్మడి, త్యాగరాజుకూడా చుట్ట లే.
సిగరెట్టు తాగితే సినిమా హీరో అయిపోతాం అనుకునే వాళ్ళు.
కాసేపు అలాగే ఫీలయ్యే వాళ్ళు.
సిగరెట్టు తాగడం పురుష లక్షణం.
ఎందుకంటే, మహిళలు తాగరు కనుక.
మా బాబాయి, మా మావయ్య సిగరెట్లు తాగేవాళ్ళు.
సిగరెట్లు తాగుతున్నప్పుడు మా నాన్న దూరంగా కనిపించాడంటే చాలు, ఎంత ఖంగారు పడిపోయే వాళ్ళో!
వెంటనే సిగరెట్టు పారేసేవాళ్ళు.
మనసు ఊసూరుమనిపించేది.
కాలే కాలే సిగరెట్టు పారేయడానికి మనసొప్పేది కాదు.
అరచేతికి నిప్పు తగలకుండా చేతిలో దాచుకుని, ఆ చేతిని వెనక పెట్టుకునే వాళ్ళు.
ఒక్కో సారి ఆ చేతిని జేబులో పెట్టుకునేవాళ్ళు.
ఒక సారి మా నాన్నను దాటి పోయాక మా బాబాయి చూసుకుంటే, సిగరెట్టు దెబ్బకు జేబు కాస్తా కాలి, తొడపై చురుక్కుమంది.
వీళ్ళిద్దరూ సిగరెట్టు తాగుతారని మా నాన్నకూ తెలుసు.
కానీ తెలియనట్టే ఉంటాడు.
మానాన్నకు తెలుసన్న విషయం వీరిద్దరికీ తెలుసు.
అయినా తెలియదన్నట్టే ఉంటారు.
పెద్దవారి ముందర సిగరెట్టు తాగకపోవడమే గౌరవం!?
మా నాన్న కూడా అదే అనుకుంటాడు.
‘తప్పు చేయనప్పుడు తండ్రికి కూడా భయపడకు’
మా తెలుగు టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చేది.
మా నాన్నకు కూడా చిన్నప్పుడే సిగరెట్లు అలవాటైంది.
వాళ్ళ అమ్మ, నాన్న ముందర సిగరెట్లు తాగే వాడు కాదు.
సిగరెట్లు తాగే వారికి గురజాడ గొప్ప ఇన్స్పిరేషన్.
‘ఖగపతి యమృతము తేగా, భుగభుగమని చుక్కపొంగి భూమిని వ్రాలెన్, పొగ చెట్ట యి జన్మించెను, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’
కన్యాశుల్కం నాటకంలో గిరీశం చేత గురజాడ చెప్పించిన పద్యం ఇది.
వెంకటేశానికి గురువు గిరీశం చుట్టలు తాగడం నేర్పిస్తాడు.
చుట్టలు తాగడం నేర్చుకున్నావనుకో, నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి వా డిని చేస్తా నన్నాడు గిరీశం.
‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అన్న మాట మాత్రం బాగా వాడుకలోకొచ్చింది.
గురజాడను గుర్తు చేసుకున్నారు కానీ, జార్జి బెర్నార్డ్ షాను మరిచిపాయారు.
‘సిగరెట్టు ఒక కొన నిప్పుతో ఉంటుంది. మరొక కొన మూర్ఖుడి పెదాల మధ్య ఉంటుంది’ అన్నాడు షా.
రామా టాకీస్ ఒకప్పుడు రైస్ మిల్లు.
రైస్ మిల్లునే సినిమా టాకీస్ గా మార్చారు.
జగదీష్ టాకీస్ కప్పు ఎత్తుగా ఉండేది.
రామాటాకీస్ కప్పు తక్కువ ఎత్తులో ఉండేది.
మ్యాట్నీ చూద్దామని రమాటాకీస్ కు వెళ్ళామా, గాలి ఆడేది కాదు.
ఫ్యాన్లు సరిగా పనిచేసేవి కావు.
వాటికి స్టార్టింగ్ ట్రబుల్.
సినిమా మొదలవ్వగానే ‘ఫ్యాన్లు, ఫ్యాన్లు’ అని అరిచేవారు.
ప్రేక్షకుల మధ్యలో వెదురు బొంగు తీసుకొచ్చి ఫ్యాన్లు తిప్పే వారు.
కాస్త తిప్పగానే ఫ్యాన్లు తిరగడం మొదలయ్యేవి.
వెదురు బొంగుతో ఫ్యాన్లు తిప్పేటప్పుడు ప్రేక్షకులు అరిచేవాళ్ళు.
సినిమాకి అడ్డం వస్తే, ఆ నిమిషం సినిమా చూడలేకపోతున్నామని.
రామా టాకీస్ కు మ్యాట్నీకి వెళ్ళే వాళ్ళం కాదు.
జగదీష్ టాకీస్ ఇప్పుడు మూతపడింది.
దాని స్థానంలో కాంప్లెక్స్ వెలిసింది.
రామాటాకీస్ మాత్రం శ్రీ రామా టాకీస్ గా ఇప్పటికీ ఆడుతోంది.
సామాన్యుడు పొందలేని అనుభూతులను హీరో రూపంలో చూపిస్తారు.
ప్రేక్షకుడు హీరోను చూస్తూ, తామే హీరో అన్న ఆనుభూతిని పొందుతున్నట్టు సినిమాలో లీనమైపోతాడు.
ఇప్పటికీ అదే జరుగుతోంది.
అందుకే సినిమా ఒక కలల వ్యాపారం.
చాలా మందికి ఒక వినోదం, కాస్త కాలక్షేపం.
సినిమా ఒక కలల ప్రపంచం కనుక.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

One thought on “మా కలల ప్రపంచం రామాటాకీస్, జగదీష్ టాకీస్

  1. చాలా బాగుంది మీ కలల ప్రపంచం. ఒకనాటి రంగుల ప్రపంచం. దాదాపు మన తరం వాళ్ళందరిది ఇదే అనుభవం. వనపర్తి తీసేసి జమ్మలమడుగు అని రాస్తే అది ‘నా జ్ఞాపకాలు’ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *