ట్రాన్స్ ఫ్యాట్స్ మీద WHO హెచ్చరిక ఎందుకంటే?

 

 ఇంగ్లిష్ మూలం : డాక్టర్. కె.శ్రీనాథ్ రెడ్డి,న్యూఢిల్లీ,  

  అనువాదం: డాక్టర్. యస్. జతిన్ కుమార్ 

[“ ట్రాన్స్ ఫాట్స్ మీ గుండె నాళాలను దెబ్బతీస్తాయి. అవి ప్లేట్ లెట్ల క్రియాశీలతను పెంచి,సమీకరణ ద్వారా రక్తం గడ్డ కట్టే ధోరణిని పెంచుతాయి. అవి రక్త నాళాల లోపలి పొరను విచ్చిన్నం చేస్తాయి. అందువల్ల గుండె జబ్బులు వస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని, ప్రపంచంలో 500 కోట్ల మంది ప్రజలు వాటి బారిన  పడివున్నారని  డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) కూడా  ఆందోళన చెందుతోంది”  అని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి అంటున్నారు] 

ఆహారంలో తినే కొవ్వు ఆమ్లాలపై ఒక చలనచిత్రం నిర్మిస్తే, దానికి 1966 నాటి క్లింట్ ఈస్ట్ వుడ్ చిత్రం “ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ” అనే పేరు సరిగ్గా సరిపోతుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలను మంచివి గా, సంతృప్త కొవ్వు ఆమ్లాలను చెడ్డవిగా, ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లా (trans-fatty acids)లను వికృతమైనవిగా విభజించవచ్చు. అథెరోస్క్లెరోసిస్ (కొవ్వు పేరుకోవ డం వల్ల రక్త నాళాలు గట్టిపడటం), థ్రోంబోసిస్ (రక్తంలో గడ్డలు కట్టడం) ద్వారా శరీరంలోని  ధమనులకు అవి చేసే నష్టం ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది. 

ఇది చాలా సరళంగా కనిపిస్తుంది, కానీ వాస్తవంలో మోనో లేక పాలీ-అసంతృప్త కొవ్వు ఆమ్లాలన్నీ కూడా ఎంతో కొంత  హాని కలిగిస్తాయి. కొవ్వుల నిర్మాణంలో తేడాలు ఉన్నందున వివిధ ఫాటీ ఆమ్లాల వల్ల ధమనులలో జరిగే నష్టం, నష్ట స్వభావం, పరిధి విభిన్నంగా వుంటుంది. పాలీ-అసంతృప్త కొవ్వు ఆమ్ల సమూహంలో టెర్మినల్ డబుల్ బంధం స్థానం ఆధారంగా ఎన్-3 (ఒమేగా -3),ఎన్ -6 (ఒమేగా-6) కొవ్వు ఆమ్లాల నిష్పత్తి మారుతుంది. అలాగే, సంతృప్త కొవ్వు ఆమ్ల సమూహంలో చిన్న గొలుసు ఆమ్లాలు-పొడవు గొలుసు ఆమ్లాల మధ్య తేడాలు ఉన్నాయి. ఏదేమైనా, ప్రతికూల ఆరోగ్య ప్రభావాల పరంగా ట్రాన్స్-ఫ్యాట్స్ కొవ్వు ఆమ్లాలను  అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించాలీ. అవి రక్తనాళాలకు చేసే నష్టం దృష్ట్యా ఇలాంటి సూక్ష్మవివరాల లోతుకు వెళ్లనవసరం లేదు.

రక్త నాళాలపై ప్రమాదకరమైన దాడి చేసే ట్రాన్స్ ఫ్యాట్స్ పై అనేక అధ్యయనాలు అవి “దోషి” అన్న తీర్పును ధృవీకరిస్తున్నాయి. ఇవి  ఎల్. డి.ఎల్ కొలెస్ట్రాల్ యొక్క రక్త స్థాయిలను గణనీయంగా పెంచుతాయి. రక్తనాళాలను కాపాడే హెచ్. డి. ఎల్. కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. ఇవి  సాధారణంగా సంతృప్త కొవ్వుల కంటే చాలా ఎక్కువ నష్టం కలిగిస్తాయి. అవి ప్లేట్ లెట్ల క్రియాశీలతను, సమీకరణ ద్వారా రక్తం గడ్డకట్టే ధోరణిని పెంచుతాయి. రక్త నాళాల లోపలి పొరను విచ్చిన్నం చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. హృద్రోగాలకు ఇదంతా చాలా  అనువైన పరిస్థితి.

 శరీరంలోని ప్రతి  చోటా ధమనుల మీద దాడి జరుగుతుంది. అయితే కొరోనరీ ధమనులలో వచ్చిన మార్పు గుండె పోటుకు దారి తీస్తుంది. అదేవిధంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు స్ట్రోక్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీ వంటి ఇతర  అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కూడా దెబ్బతింటాయి. అందువల్ల  క్రమంగా అనేక అవయవాలు దెబ్బతినే ఆస్కారం వుంది . 

ట్రాన్స్-ఫ్యాట్స్ సహజంగా జంతువుల పేగులలో ఉత్పత్తి అవుతాయి. పాలు మరియు మాంసంలో కనిపిస్తాయి. ఏదేమైనా, మానవ ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఇప్పుడు ఎక్కువగా పారిశ్రామిక ప్రక్రియల నుండి తయారు అవుతు న్నవి. నూనె గింజల నుండి  ద్రవ రూపంలో తీసిన నూనెలను ఘనీభవింప చేయటానికి పాక్షికంగా హైడ్రోజనేట్ చేస్తారు.వాటిని ఉపయోగించి వండిన  ఆహార ఉత్పత్తుల రుచి పెరుగుతుంది. ఆహార పదార్ధాల ఆకృతిని ఆకర్షణీ యంగా చేస్తాయి.  వాటిని ఉపయోగించిన ఆహారాల షెల్ఫ్ జీవితం [నిల్వ వుంచే కాలం] పెరుగుతుంది. దురదృష్ట వశాత్తు, అవి తరచుగా తినే వారి జీవితకాలాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

పేస్ట్రీలు, కొన్నిరకాల బిస్కెట్లు, శీతలీకరణతో నిలువ చేసిన  పిజ్జాలు, మార్గరీన్లు, ఇతర స్ప్రెడ్ లు, డోనట్స్ వంటి వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫాట్స్ (trans fats) ఎక్కువగా వుంటాయి. పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాట్స్ రక్త నాళాలపై సహజమైన ఆహారాలలో ఉన్న వాటి కంటే ఎక్కువ హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. గత అర్ధశతా బ్దం నుండి మాత్రమే మన శరీరాలపై దాడి చేసిన ఈ పారిశ్రామిక ఉత్పత్తులకు మానవ శరీరధర్మశాస్త్రం అలవాటు పడలేదు.

గుండె రక్తనాళాల జబ్బులు, ప్రధానంగా కొరోనరీ హార్ట్ డిసీజ్ మరియు స్ట్రోక్ గా వ్యక్తమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇవి ప్రధాన కారణం. ఈ భారం ధనిక దేశాలలో మాత్రమే కాకుండా మధ్యస్తాయి, తక్కువ ఆదాయం గల దేశాలలో కూడా వేగంగా పెరుగుతోంది. 

గుండెజబ్బులు, మధుమేహం నివారణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అనేక ఆరోగ్యకరమైన సహజ ఆహారాల కలయికగా వైవిధ్యమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి. ఆహార విధానాలు వ్యక్తిగత ఎంపికలపై ఆధారపడి ఉన్నప్పటికీ, సహజమైన ఆహారానికి బదులుగా పారిశ్రామిక ప్రాసెసింగ్ వల్ల తయారయిన ఆహారం తీసుకోవటం మంచిది కాదు.  వాటిలో హాని కలిగించే మూలాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. మనం మంచి కొవ్వుల వినియోగాన్ని ప్రోత్సహి స్తూ, చెడు కొవ్వుల వినియోగాన్ని తగ్గించటంతో పాటు, మన ఆహార పదార్ధాలలోమూర్ఖంగా ప్రవేశపెట్టిన వికృత కొవ్వులను తొలగించవలసిన ఆవశ్యకత చాలా వుంది .

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ తో   ఏటా 50 లక్షల మంది అకాల మరణాలకు గురవుతున్నారు. అయినప్పటికీ పారిశ్రామికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాల నుండి వాటిని తొలగించడానికి జాతీయ విధానాలు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు ట్రాన్స్ ఫాట్స్ వల్ల ఆరోగ్యాన్నినష్టపోతూనే వున్నారు. 

ఆహార ఉత్పత్తుల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలను తగ్గించడం లేదా తొలగించ డం తప్పనిసరి చేసే విధానాలను భారత్  తో సహా పలు దేశాలు కొంత ప్రారంభించాయి. అయితే, చాలా దేశాలు ఆ మార్గాన్ని అనుసరించలేదు. 2023 నాటికి ట్రాన్స్ ఫ్యాట్స్ ను నిర్మూలించాలన్న డబ్ల్యూహెచ్ వో పిలుపును అవసరమైన స్థాయిలో రాజకీయ నిబద్ధతతో పట్టించుకోలేదు. అటువంటి నిబద్ధత లేకుండా, ఆహార పరిశ్రమలోని ఆధిపత్య వర్గాలు తమ పద్ధతిని మార్చడానికి పూనుకోవు. గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఇది అన్ని దేశాలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. 

విధాన నిర్ణేతలు కూడా ఈ మధ్య కోవిడ్-19 మహమ్మారిపైనే  దృష్టి సారించారు. ఇప్పుడు మహమ్మారి ముప్పు తగ్గుముఖం పడుతుండటంతో, ఈ కొవ్వుల ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా గట్టి పూనిక తో చర్యలు మొదలవుతాయా? ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని తొలగించడానికి దేశాలు ”ట్రాన్స్“ [నిద్రావస్థ] నుండి బయటకు రావాల్సిన సమయం ఆసన్న మయ్యింది. 

 

( డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి, డిల్లీ లో ప్రముఖ హృద్రోగ నిపుణుడు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా గౌరవ విశిష్ట ఆచార్యుడు, 24 జనవరి 2023 న ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  How do trans-fats damage your heart vessels? Why is WHO worried about 5 billion people exposed to them? అన్న వారి ఇంగ్లీష్  వ్యాసానికి తెలుగు అనువాదం ]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *