పోలవరం ప్రగల్భాల వెనక నిజాలివి…

(బాబ్జీ)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కొత్త కొత్త హోమాలు ప్రభుత్వం జరిపిస్తుంది. దానికి అభివృద్ధి మంత్రాలు జపిస్తుంది.

2004 సంవత్సరం నుండి ఈ పరంపర కొనసాగుతోంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పోర్టుల విస్తరణ, దేశ – విదేశ కంపెనీలకు విస్తారమైన సముద్రమును, వ్యవసాయ భూములను, ఇండ్లను ఇచ్చి మరీ ఈ నిర్వాసిత హోమాలను జరిపిస్తున్నారు.

దీనికి పాలక వర్గాలు జపించే మంత్రాలు అభివృద్ది. మంత్ర గాళ్లు బ్యూరో క్రాట్స్, ప్రజాప్రతినిధులు.

2004 సం. లో అధికారం లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు 68 ఎస్. ఇ. జెడ్ లు నోటిఫై చేశారు. మొత్తం 103 కు ఆమోదం పొందారు. ఆగస్టు 2009 నాటికి దేశంలో రెండవ స్థానం. అలాగే పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ప్రతీ చోట లక్షలాది మంది కి ఉద్యోగాలు వస్తాయని, తెలిపారు కానీ ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో లెక్కలు ఏ పార్టీ తరపున కూడా ప్రజలకు చెప్పరు.

అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం అవసరమైన లక్షల ఎకరాలు తీసుకున్నారు. కానీ వాటిపై ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలు పడే కష్టాల గురించి ఎవరికీ పట్టదు. ఇండ్లు,భూములు కోల్పోయిన వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క పార్టీ తరపున పోరాడరు.

అభివృద్ధి గురించి చాలా మామూలుగా మొదలైన చర్చ అతి త్వరలోనే, నిరుద్యోగ యువత, నిర్వాసిత కుటుంబాలకు హక్కులూ గురించి మౌలిక ప్రశ్నల వైపు మళ్ళింది. నిర్వాసితుల అనుభవాల ను, అభివృద్ధి అణచి వేస్తుంది.

దీన్ని చర్చించే ముందు,నిర్వాసిత హోమం – అభివృద్ధి గురించి కొంచెం చెప్పాలి. ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం ప్రజల నుండి ఆశించినంతగా భూములు, వనరులు రాబట్టుకొలేనప్పుడు, వారిని ఖాళీ చేపించాలను కున్నప్పుడు, అభివృద్ధి మంత్రాలు జపిస్తారు. దానికి బలయ్యే వారిని త్యాగ దనులని కీర్తిస్తారు. బయట సమాజం విస్తార మైనదని దానికోసం కొద్ది మంది త్యాగం చేయక తప్పదు అని ప్రచారం చేస్తారు. ఇది ఒక అద్భుతమైన ప్రభుత్వ పాలసీగా చెప్తారు.
ప్రణాళిక ప్రకారం ప్రజల కోసం మాట్లాడే వారి గురించి అభివృద్ధి నిరోధకులు గా ప్రచారం చేస్తారు. దానికి మీడియా కూడా విస్తృత ప్రచారం కల్పిస్తుంది.
ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అసలు ఆ ప్రాంత ప్రజలు బాగా వెనుక పడి పోయారని, ఇటువంటి వారి కోసం అవసరమైన అభివృద్ధి లో భాగమే ఈ ప్రాజెక్టు లని చెప్తారు.

దీనిని క్రమ బద్దీక రించటానికి హేతుబద్ధ ఉద్యోగ స్వామ్యం ముందుకు వస్తుంది. వారే బ్యూరో క్రాట్లు. ప్రపంచ చరిత్ర ఘటనలు చూస్తే పాలకు లకు ఈ ఉద్యోగ స్వామ్యులే మార్గ నిర్దేశనం చేశారు. కానీ, వారి పాత్రను ప్రజలు గ్రహించక పోవడం గమనార్హం.
వీరు తీసుకునే చర్యలు ప్రజావ్యతిరేక విధానాలు.

భూసేకరణ చట్టం కింద చర్యలు చేపట్టరు. ప్రజల అభ్యంతరాలు పట్టించు కోరు. భాధ్యత ఉన్న అధికారులు గ్రామ సభలకు రారు.జవాబుదారీతనం ఉండదు. వీరి తప్పులు కప్పి పుచ్చుకోవడానికి , ప్రజలను రెచ్చగొడుతున్నారు అనీ అణచి వేత చర్యలకు దిగుతారు. ఆ విధంగా నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేసి వారి లక్ష్యాల ను చేరుకుంటారు.

అభివృద్ధి సమాజం లో మనిషి జాలి అనే సహజ గుణం నుంచి దూరమయ్యాడు. అతని సహజ లక్షణం నుండి అతణ్ని దూరం చేసే బ్లూ ప్రింట్ ను తయారు చేసి, చర్చల్లో పెట్టేది బ్యూరోక్రాట్లే.

హిల్బర్గ్ అనే విమర్శకుడు ఈ బ్యూరో క్రాట్ల గురించి మాట్లాడుతూ వాళ్ళు తమ డెస్క్ దగ్గర కూర్చొని మొత్తం ప్రజలని ద్వంసం చేయగలరంటాడు (బహు అరుదుగా దొరికే ఎస్. ఆర్. శంకరన్, ఎన్. పి. సక్సేనా, బి. ఎన్. యుగంధర్ లాంటి వారు మినహాయింపు.)

తాము చేయాలను కున్న పనినీ, వేరొకరి ద్వార చేయించే క్రమానికి ఈ అభివృద్ధి ఉద్యోగ స్వామ్యం నాంది పలికింది.
అందుకే భూసేకరణ జరిగే గ్రామ సభలకు క్రింది స్థాయి అధికారులు వస్తారు. వారు నిర్వాసితుల నుండి ఆర్జీలు తీసుకుంటారు. కానీ, నిర్ణయం మా చేతిలో లేదని చెప్తారు. అటువంటప్పుడు వారిని ఎందుకు పంపుతున్నారో అర్థం కాదు.

అభివృద్ధి నమూనా లో క్రమాన్ని నిర్దేశించే పనిని బ్యూరో క్రాట్ లు తీసుకుంటారు. ఈ అధికారులు ఏమి చేయవచ్చో, ఏమి చేయకూడదో, వాళ్ళ హక్కులూ, అధికారాల గురించీ, బాధ్యత ల గురించి రాసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను అన్ని రకాలుగా నియత్రిస్తున్నారు.

ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. శాసన వ్యవస్థ కు లోబడి కార్య నిర్వాహక వ్యవస్థ ఉండాలి.
ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజానుకూల మైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో అలా జరగటం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని ప్రజావ్యతిరేక, జీ. ఓ. లు పరిశీలిస్తే అర్థం అవుతాయి.

ప్రజల హక్కులు కా లరాయడంలోఓకే వ్యక్తి మొదటి నుంచీ చివరి వరకు ఉండటం జరగదు. అదే విధంగా నిర్వాసితుల హోమం లో కూడా వివిధ వ్యక్తులు వివిధ రకాల పాత్రను విడివిడిగా నిర్వహిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ది మంత్రం తో భూమి పూజలు చేస్తే, మీడియా దానికి విస్తృత ప్రచారం కల్పించింది. ప్రజా ప్రతినిధులు ప్రజల ను అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విభజించారు. క్యాంపు లు ఏర్పాటు చేశారు. పోలీసులు నిఘాలు పెట్టీ, కొన్ని సార్లు అరిస్తే జయిళ్లకు పంపారు.భూసేకరణ  అధికార్లు భూములు తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేశారు. అందువల్ల చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వాసిత హోమం నకు సహకరించారు.

పై వారికి నిర్వాసితలకు జరుగుతున్న అన్యాయాల పట్ల కించిత్తు బాధ లేక పోవడం విచారకరం. వీరు తీసుకునే చర్యలు వలన ఎన్ని లక్షల మంది భవిష్యత్ లేకుండా నిరాశ్రయులయ్యారు. దీని కోసం ప్రజలు ఆలోచించాలి. ఆ హోమం లో నేడు వేరొకరు ఉండవచ్చు కానీ అది రేపు మనవంతు వచ్చి అందులో మనం దహించ పడుతూ ఉంటే మన కోసం మాట్లాడే వారు కనపడరు.

(బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి, అడ్వకేట్
ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారులు యూనియన్
9963323968)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *