అప్పర్ భద్రకు జాతీయ హోదా, సీమ నీటికి ముప్పు

*అప్పర్ భద్రకు జాతీయ హోదాతో సీమ నీటి భద్రతకు పొంచి ఉన్న ముప్పు.

*అధికార పక్షం నిర్లక్ష్యం వీడాలి.

*కర్ణాటక ప్రాజెక్టుకు నిధులిచ్చిన కేంద్రం గుండ్రేవుల – సిద్దేశ్వరం ను విస్మరించడం అన్యాయం.

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర పై నిర్మిస్తున్న అప్పర్ భద్ర ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తూ 5300 కోట్లు కేటాయించింది.అదే సమయలో తుంగభద్రపై రాయలసీమలో సుదీర్ఘ కాలం ప్రతిపాదనలలో ఉన్న గుండ్రేవులను విస్మరించడం వెనుకబడిన రాయలసీమకు అన్యాయం చేసినట్లే !

బచావత్ అవార్డు అయిన గుండ్రేవులను విస్మరించడం తగదు.

కర్ణాటక , రాయలసీమ సరిహద్దుల్లో ప్రవహించే తుంగభద్ర కృష్ణకు ఉపనది. వాస్తవానికి కృష్ణలో వరద తక్కువ ఉన్నా తుంగభద్రలో వరద బాగుంటుంది. తుంగభద్ర నుంచి కృష్ణకు కేటాయించినది 31. 45 TMC లు మాత్రమే. అదనంగా పదుల సంఖ్యలో TMC ల నీరు కృష్ణలో కలుస్తుంది. రాయలసీమలో గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయకపోవడం, HLC , LLC పూడిక వలన పుష్కలంగా లభిస్తున్న తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రాంతం అందుకోలేని దుస్థితి. ఈ నేపథ్యంలో తుంగభద్ర మీద గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మాణం చేయాలని అందుకు గాను 29 TMC నికరాజలాలను కేటాయించినది బచావత్. దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్ భద్రకు నీటి కేటాయింపులు ఉన్నా బ్రిజేష్ ట్రిబ్యునల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ విడుదల కానీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి 5300 కోట్లు బడ్జెట్లో కేటాయించిన కేంద్రం బచావత్ అవార్డు అయిన రాయలసీమలోని గుండ్రేవుల ప్రాజెక్టును విస్మరించడం అన్యాయం.

తుంగభద్రలో దాదాపు 70 TMC ల నీటి కేటాయింపులు ఉన్నా HLC , LLC పూడిక , గుండ్రేవుల పూర్తి చేయకపోవడం వల్ల హక్కుతో కూడిన వినియోగించుకోలేక రాయలసీమ కరువుతో అల్లాడుతుంది. కర్ణాటకలో వెనుకబడిన జిల్లాల నీటి సమస్య పరిష్కారానికి అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజన చట్టం ప్రకారం ప్యాకేజి , కడప ఉక్కు , నీటి ప్రాజెక్టులకు సాయం ఉన్నా గుండ్రేవులను గుర్తించకపోవడం దుర్మార్గపుచర్యగా భావించాలి.

అధికార పార్టీ నిర్లక్ష్యం తగదు.

ఈ విషయంలో అధికార వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది క్రితమే కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్రకు జాతీయ హోదా కావాలని కోరింది. రాయలసీమ మేధావుల ఫోరం అభ్యంతరం తెలపాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కదలిక లేకుండా పోయింది. నాడు అభ్యంతరం తెలిపి ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రయోజనాల కోసం అప్పర్ భద్రకు నిధులివ్వడానికి నిర్ణయం తీసుకున్న కేంద్రం గుండ్రేవులకు నిధులు ఇచ్చిఉండేది. కేంద్రం అడిగినా నిధులు ఇవ్వదు అలాంటిది ఏపీ ప్రభుత్వం అడగకపోతే నిధులు మంజూరు చేస్తుందా ?

బడ్జెట్ సమావేశాలలో అధికార పార్టీ స్పందించాలి.

విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు , రాయలసీమ ప్యాకేజి ఇవ్వకుండా అవార్డు కానీ అప్పర్ భద్ర కు 5300 కోట్లు కేటాయించిన సందర్భంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ప్రమాదకరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. నీటి కేటాయింపులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కానీ అప్పర్ భద్ర కు జాతీయ హోదా ఇవ్వడం పై అభ్యంతరం తెలపాలి. అదే సమయంలో కర్నాటక లో తుంగభద్ర పై లిఫ్ట్ పథకానికి నిధులు మంజూరు చేస్తున్నారు కనుక అదే తుంగభద్ర పై బచావత్ అవార్డు అయిన గుండ్రేవులను , రాయలసీమకు కేటాయించిన నీటిని కూడా వినియోగించే పరిస్థితులు లేని కారణంగా మరియు శ్రీశైలం పూడిక ఏర్పడిన కారణంగా సిద్దేశ్వరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండు చేయాలి. పార్లమెంట్ సమావేశాలు జరుతుంది కనుక ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత అధికార పార్టీదే.

సిద్దేశ్వరం , గుండ్రేవులను పూర్తి చేయకుండా కర్నాటకలో ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమ భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. అధికార పార్టీ నిర్లక్ష్యం విడనాడాలి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నించాలి. రాయలసీమ ప్రజలు తమ ప్రజాప్రతినిధులు పై ఒత్తిడి తీసుకురావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *