గ్రాంఫోన్ పాటల పూదోట ప్యాలెస్

వనపర్తి ఒడిలో-10

-రాఘవశర్మ

 

సాయంత్రమైతే చాలు చల్లని గాలి వీచేది.
ఆ గాలిలో సినీ పాటల సంగీతం కలగలిసి వ్యాపించేది.
గ్రాంఫోన్ రికార్డుల నుంచి హిందీ పాటలు వినిపించేవి.
ప్యాలెస్ లో ఏ మూల ఉన్నా అవి పలకరించేవి.

ఇంట్లో ఉన్నా చొరబడేవి.
సున్నితంగా స్పృశించి, అల్లరి చేసేవి.
అవి వినపడగానే ఎక్కడ లేని ఉత్సాహం! ఎక్కడ లేని ఆనందం!
పెద్ద, చిన్నా తేడాలేదు, అంతా మైమరచి పోయే వాళ్ళు.
ప్యాలెస్ ఆవరణంతా క్రీడా మైదానంలా ఉండేది.
విద్యార్థులు, అధ్యాపకులన్న తేడా లేదు.
వాలీబాల్, బ్యాస్కెట్ బాల్, టెన్నీస్, బాల్ బ్యాట్మింటెన్; ఒకటేమిటి ఎవరికి ఆసక్తి ఉన్న ఆటలో వారు లీనమై పోయేవాళ్ళు.
పిల్ల సైన్యాలు ప్యాలెస్ చుట్టూ తిరుగుతుండేవి.
ప్యాలెస్ ఎక్కేవాళ్ళు, ఫౌంటెన్లో దిగి ఆడుకునే వాళ్ళు.
ఈ పాటలు ప్యాలెస్ కు దక్షిణాన ఉన్న ఎలక్ట్రికల్, సివిల్ ల్యాబ్ ల వైపు నుంచి గ్రాంఫోన్ రికార్డుల ద్వారా వెలువడేవి.

గ్రామఫోన్ ద్వారా పాటలు వినిపిం చే సివిల్ ఇంజినీరింగ్ ల్యాబ్

ఆ పాటలన్నీ 1960-70 మధ్య వచ్చిన హిందీ సినీ ప్రేమ గీతాలు, ఉత్సాహం ఉరకలెత్తించే పాటలు.
మహ్మద్ రఫీ గొంత మమ్మల్ని మాయ చేసి, మైమరపించేవి.

“ యాహూ.. యాహూ..
చాహైకోయి ముజె జంగ్లీ కహే..
కెహెనె దొ జి కెహెతారహె..
హమ్ ప్యార్కె తుఫానోమె గిరీహై హమ్ క్యా కరే..
యాహూ…యాహూ..”
ఈ పాటలో మాటి మాటికీ మహ్మద్ రఫీ ‘ యాహూ..’ అని అరిస్తే మేం కూడా ‘ యాహూ..’ అని అరిచేవాళ్ళం.
ఒక్క ముక్క అర్థం అయ్యి చచ్చేది కాదు.
ఆ అరుపుల్లో, సంగీతంలో కొట్టుకుపోయేవాళ్ళం.
పెద్దయ్యాక ఈ పాట ఉన్న ‘జంగ్లీ’ సినిమా చూశాను.
మహ్మద్ రపీ పాటకు షమ్మీ కపూర్ పిచ్చిపట్టినట్టు ఎగిరాడు.
జోష్ లో ఇద్దరూ పోటీ పడ్డారు.
‘ యాహూ..” అన్న అరుపునకు ఆరోజుల్లో భారతీయ సినీ లోకమంతా ఒక్క సారి ఉలిక్కిపడి లేచింది.
మహ్మద్ రఫీ పాడిన ‘ యాహూ..” ఎంత వేగంగా ఉంటుందో, ‘చౌదవీన్ కచాంద్ హెూ’ పాట అంత నిదానంగా, అంత మాధుర్యంగా ఉండేది.
‘ఉహుహుహు హూ..’ అంటూ సాకీతో మొదలయ్యే సంగీతం మా మనసుల్ని దూది పింజల్ని చేసి గాలిలోకి గాలిపటాల్లా ఎగిరేసేది.
‘చౌదవీన్ కచాంద్ హెూ యాఆఫ్ తాబ్ హెూ
జోబీ హెుతుమ్ ఖుదాకె కసమ్ లా జవాబ్ హెూ..”
(నువ్వు నిండు చంద్రుడివా..సూర్యుడివా
భగవంతుడి వద్దకు ప్రయాణంలో వీటన్నిటితో నీకు పోలికే లేదు)
‘జుల్ ఫె హై జైసె కాందేపె బాదల్ జుకెహుయె
అంఖే హై జైసేమెకి పెయాల్ భరే హుయి’
(నీ కురులు సన్నని మేఘాల్లా తేలాడుతూ భుజాలను ముద్దెడుతున్నాయి)
చాలా నిదానంగా సాగే మహ్మద్ రఫీ పాట మైమరపించేది.
పదవతరగతిలో నా క్లాస్మేట్ రఘునాథాచారికి హిందీ పాటల అర్థాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది.
వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ళ నాన్న ఒక స్నేహితుడిలా వీటికి అర్థాలు చెప్పేవారు.

మా రాధ మామయ్య, సలాం కలిసి ‘చౌదవీన్ క చాంద్ హో ‘పాట ఎంత బాగా పాడేవారో!
పెద్దయ్యాక ‘చౌదవీన్కచాంద్’ సినిమా చూశాను.
ఈ పాటకు గురుదత్, వహీదారహమాన్ ఎంత బాగా నటించారో!
అలా నటించడం అనితర సాధ్యం.

‘బార్ బార్ దేఖో.. హజార్ బార్ దేఖో..
కె దేక్నేక చీజ్ హై హమారెదిల్రుబా..
టాలి హెూ .. టాలి హెూ.. టాలి హెూ..
హా.. జిహా.. ఔర్ బి హెూంగెదిల్ దార్ యహా..
లాఖోం దిలోంకి బహార్ యహా..
పర్ ఏ బాత్ యహా..
ఏ బీమ్ సాల్ హుస్నే లా జబాబే అదా..
టాలి హెూ.. టాలి హెూ.. టాలి హెూ..’
గ్రాంఫోన్ రికార్డులో ఈ పాటను రోజూ వేసే వాళ్ళు.
‘చైనా టౌన్’ సినిమాలో షమ్మీ కపూర్ పక్కన షకీల కోపం, ప్రేమ కలగలిపి నటించింది.
ఈ పాటలో హెలెన్ కూడా కనిపిస్తుంది.

‘మై కా కరూ రా ముజె బుడ్డా మిల్ గయా
మై కా కరూ రా ముజె బుడ్డా మిల్ గయా
హై హై బుడ్డా మిల్ గయా
హై హై బుడ్డా మిల్ గయా ‘
ఇలాంటి పాటను లతామంగేష్కర్ గొంతు నుంచి ఊహించలేం.
ఈ పాటలు పాడనని లతాజీ మొదట్లో మొండికేసిందట!?
రాజ్ కపూర్ ‘సంగం’లో ఉన్న ఈ పాటకు వైజయంతి మాల ఎగిరిని ఎగురుడు అంతా ఇంతా కాదు.
రాజ్ కపూర్ ను అల్లరి పట్టించేలా ఈ పాటలో వైజయంతిమాల వయ్యారాలు ఒలకబోస్తూ తెగ గంతులేసింది.
ఈ పాటలో వైజయంతి మాల షమ్మీకపూర్ను మించిపోయింది.
అందుకే నేమో ‘వన్నెల చిలకా వైజయంతి మాల’ అన్న పాట తెలుగులో వచ్చింది.
ఆనాటి వైజయంతి మాలను, ఎనభైయవ పడిలో పడిన ఈ నాటి వైజయంతి మాలను పోల్చుకోలేం.
పోల్చుకుంటే బాధనిపిస్తుంది.
మనిషిలో కాలం ఎంత మార్పు తెస్తుంది!?

‘మై కా కరూ రామ్ ముజె బుడ్డా మిల్ గయా బుడ్డా మిల్ గయా’ అంటూ మేం కూడా కోరస్ అందుకునే వాళ్ళం ఆడుకుంటూ ఆడుకుంటూ.
అర్థం తెలియకపోయినా పదాలు భలేగా ఉండేవి.

మరో మధురమైన పాట..
‘హే.. నీలె గగన్ కె తలె.. ధ ర్తి కా ప్యార్ పలె
ఐసీహి జగ్ మే ఆతీహై సుబ హోం జు ఐసేహి శ్యా ము దలే’
ఎంతో నిదానంగా సాగే పాట.
హిందీ సినిమా నేపథ్య గానాన్ని 1960-70 మధ్య ఏలుతున్న మహ్మద్ రఫీ, ముఖేష్ మధ్య ‘ హే నీలె గగన్ కె తలె’ అంటూ ఒక మధురమైన గొంతు వినిపించింది.
ఇది గ్రాంఫోన్ రికార్డులో విన్నాం.
ఇది ఎవరు పాడారో ఆరోజుల్లో తెలియదు.
ఎంతో నిదానంగా సాగినా హృదయాన్ని తాకేది.
పెద్దయ్యాక తెలిసింది మహేంద్రకపూర్ పాడాడని.
అంతవరకు మహేంద్రకపూర్ పేరు వినకపోవడం నా తెలియని తనమే!
కాలేజీలో వర్క్షాప్ ఫోర్మెన్ సీతాపతి పెద్ద కొడుకు వెంకటేష్ సైకిల్ వెనుక నేను కూర్చున్నప్పుడు తరచూ ఈ పాట పాడేవాడు.
ఎంత బాగుండేదో!
ఇటీవల మహేంద్రకపూర్ మునిమ ను మడు తాతగారికి ఏ మాత్రం తీసిపోకుండా ఇదే పాట పాడాడు.

ఈ పాట విన్నప్పుడల్లా ప్రాణం లేచొస్తుంది.

‘మేరే మన్కి గంగా ఔర్ తేరీ మన్కి జమునా కా
బోల్ రాధా బోల్ సంఘం హెూగా కే నహి
మేరే మన్కి గంగా, ఔర్ తేరీ మన్కి జమునా థా
అరె భోల్ బోల్ సంఘం హెూగాకే నహి
కితనీ సదియా బీత్ గయీహై హాయ్ తుజే సంజానేమే
మేరే జైసా ధీరజ్ వాలా హైకోయి ఔర్ జమానామే’
‘సంగం’లో ముఖేష్ పాడిన ఈ సరదా పాట ఎంత ఉత్సాహాన్ని నింపేదో!
ముఖేష్ గొంతులో ఒక విషాదం నిండిన మాధుర్యం ధ్వనిస్తుంది.
విషాద గీతాలకు ముఖేష్ పెట్టింది పేరు.
అలాంటిది సరదా పాట పాడినా ఎక్కడో అంతరంగంలో కాస్త విషాదం తొంగిచూస్తుంది.
బ్యాగ్ పైపర్ పట్టుకుని రా రాజ్ కపూర్ ఈ పాట పాడుతూ వైజ యంతి మాలను అల్లరి పెడతా డు.
మధ్యలో ‘హెూగా.. హెూగా.. హెూగా..’ అంటూ ప్రేమ, కోపం నిండిన ఆమె గొంతులో విసుగు ధ్వనిస్తుంది.

ప్యాలస్ దక్షిణ దిక్కు

లతామంగేష్కర్ గొంతు నుంచి మరో జోష్ నింపే పాట.
‘హెూ మైనే ప్యార్ కియా..
ఒయ్ హెూ క్యా జురుమ్ కియా..
హెూ మైనే ప్యార్ కియా..
ఒయ్ హెూ క్యా జురుమ్ కియా..
ఇన్ ఆంఖోంక రంగ్ హెూగయా గులాబి గులాబి
హయ్ హయ్ హయ్ హయ్
దిల్కి హలాత్ ష శరాబి శరాబి’
ఎంత ఉత్సాహం, ఎంత మధురం.
ఆ ఉత్సాహానికి ఏ మాత్రం తీసి పోని విధంగా పద్మిని నటన!
ఆ రోజులే వేరు, ఆ సంగీతమే వేరు, ఆ పాటల గాన మాధుర్యమే వేరు.
షమ్మీ కపూర్ కోసం మహ్మద్ రఫీ గొంతు నుంచి మరో ఉత్సాహం ఉరకలెత్తింది.
‘అయ్యయ్యా కరూమై క్యా సూకు.. సూకు..
అయ్యయ్యా కరూన్ మై క్యా సూకు.. సూకు..
హెూగయ దిల్ మేరా సూకు.. సూకు..
అయ్యయ్యా సూకు..సూకు..’
ఈ ‘సూకు..సూకు’ ఏంటో తెలియదు కానీ, పిల్లల నోళ్ళలో తెగపలికేది.
పెద్ద వాళ్ళ నోటి నుంచి కూడా ఆ పాటలకు కోరస్ పలికేది.
మహ్మద్ రఫీ, షమ్మీ కపూర్ కలిసి పాటలతో, డ్యాన్సులతో ఆనాటి వృద్ధ తరానికి మళ్ళీ బాల్యాన్ని, యవ్వనాన్ని అందించారు. వాటిని గుర్తు చేసుకుంటే, ఈ నాటికీ ఆ బాల్యపు మందహాసం తొంగిచూస్తుంది.

‘తెరీ ప్యారీ ప్యారీ సూరత్కో
కిసీకి నజర్ న లగే చష్మై ఎ బద్దూర్
తెరీ ప్యారీ ప్యారీ సూరత్కో కిసీకి నజర్ న లగే చప్మె బద్దూ
ముఖ్ కొ ఛుపాలొ అంచల్మె కహిన్ మెరె నజర్ న లగె
చప్మె బద్దూ…..
యూన అకేలె ఫిదా కరో
సబ్కి నజర్ సె డరా కరో
పూల్ సె జ్యాదా నాజుక్ హెూ తుమ్
చాల్ సంబల్ కర్ చలా కరో”
మహ్మద్ రఫీ గొంతు నుంచి జాలువారిన ఏం పాట ఇది!
రాజేంద్ర కుమార్ సరసన బి. సరోజ ఎంత నాజూకుగా నటించిందో!
ఇలా ఎన్ని పాటలని గుర్తు చేసుకుంటాం?
ఊహ తెలిసినప్పటి నుంచి పుష్కర కాలం పైగా ఈ పాటల పూతోటలోనే పెరిగాను.
వనపర్తి ప్యాలెస్ ఆవరణలో నా బాల్యం పాటల మకరందాన్ని ఎంత జుర్రకుకుందో తెలియదు.
తెలుగు పాటలు పెద్దగా వేసే వాళ్ళుకాదు.
పాటలు వింటుంటే స్వర్గ సీమలో విహరిస్తున్నట్టుండేది.
ఆ హిందీ పాటలు వింటుంటే గాలిలో తేలిపోతున్నట్టే ఉండేది.
ఎప్పుడైనా ఆ పాటలు వినిపిస్తే, ఆ నాటి బాల్యం కళ్ళ ముందుకొచ్చి మళ్ళీ కదలాడుతుంది. ‘గయా లేగయాతో జీవన్ సబ్సే మస్త్ కుషీ మస్త్’

(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

One thought on “గ్రాంఫోన్ పాటల పూదోట ప్యాలెస్

  1. మధుర మంజుల చిననాటి మది దొంతుల సొదల సూదులు ఆలూరు రాఘవ శర్మ తలపులు.ధన్యోస్మి.

    దేవేంద్రనాధ రెడ్డి మల్లం
    విశ్రాంత విద్యుత్ ఎస్.ఇ,
    ఎపిఎస్పిడిసియల్, తిరుపతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *