రాయలసీమ ధర్మదీక్ష సక్సెస్

* ఆందోళన ఉదృతం చేసేందుకు 1000 మంది రైతు నేతల నిర్ణయం

*KRMB కర్నూలులో ఏర్పాటు కొరకు పలువురు ప్రజాప్రతిధుల మద్దతు.

*ముఖ్యమంత్రి కి లేఖలు వ్రాసిన ప్రజా ప్రతినిధులు

*రాయలసీమ ధర్మదీక్షకు సంఘీభావం ప్రకటించిన ప్రొద్దటూరు మాజీ ఎం.యల్.ఎ.వరదరాజులరెడ్డి

క్రిష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన రాయలసీమ ధర్మదీక్షలో పాల్గొన్న వందలాది మంది రైతాంగం

***

ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను గౌరవించి పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో *రాయలసీమ ధర్మదీక్ష* రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్. రెడ్డి అద్యక్ష్యతన జరిగిన ఈ కార్యక్రమంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…


రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నది నీటి నిర్వహణ చేయడానికి, కృష్ణా జలాల వినియోగంపై వివాదాలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలన్న నిబంధన వుందని ఆయన తెలిపారు. పాలకుల నిర్లక్యంతో రాయలసీమ తరతరాలుగా వివక్షకు గురవుతూ తమకు లభించిన పూర్తి నీటి హక్కులను వినియోగించుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డును కృష్ణా నది జలాల పంపిణీలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులో ఏర్పాటు అయితే రాయలసీమ ప్రాంతానికి సక్రమంగా నీరు లభిస్తుందని భావించామని కానీ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కృష్ణా నది కి ఏ మాత్రం సంబంధం లేని విశాఖపట్నం లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం రాయలసీమ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సభలో ప్రసంగిస్తున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి

ఉభయ తెలుగు రాష్ట్రాల నీటి వినియోగానికి, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైనది శ్రీశైలం రిజర్వాయర్ అని, కృష్ణా జలాల నిర్వహణ, వినియోగంపై పర్యవేక్షణకు శ్రీశైలం రిజర్వాయర్ అత్యంత కీలకమని ఆయన తెలిపారు. రాయలసీమకు నికర జలాల హక్కులున్న ప్రాజెక్టులతో సహా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతులు పొందిన నాలుగు కీలకమైన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు – నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు లభించడానికి శ్రీశైలం రిజర్వాయర్ లో సక్రమ నీటి నిర్వహణ అత్యంత కీలకం, ఆవశ్యకత అని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాల నుండి రైతుల మద్దతుతో రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనీ, ఇందులో భాగంగా జనవరి 6, 2021 న విజయవాడలోనూ, జనవరి 9 , 2023 న నంద్యాలలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలలో కృష్ణా నది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించి, ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతూ ఈ విషయమై ముఖ్యమంత్రి గారు పునఃసమీక్ష చేయాలని కోరామన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి కూడా కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖలు కూడా వ్రాసామని ఆయన తెలిపారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు అత్యంత అనుకూలమైన, ఆవశ్యకత కలిగిన ప్రాంతం అవడం వలన కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ సమాజం బలంగా కోరుకుంటోందనీ,పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రకటించిన ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగంలో రోజువారీ వివాదాల పరిష్కారానికి కీలకమైన న్యాయవ్యవస్థలో భాగమైన కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటును కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి తొలి అడుగులు వేయాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు.

ధర్మదీక్షకు సంఘీబావంగా విచ్చేసిన కడప జిల్లా ప్రొద్దటూరు మాజీ M.L.A. నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ…

రాయలసీమ అభివృద్ధి కోసం, సాగునీటి హక్కుల కోసం చేపట్టే ఏ ఉద్యమానికైనా నా సంపూర్ణ మద్దతు ఉంటుందనీ, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు కొరకు ఉద్యమం ఉదృతం చేయవలసిన అవసరం ఎంతైనా వున్నదని ఆయన అన్నారు.

భారతీయ కిసాన్ సంఘ్ కడప జిల్లా అద్యక్షులు మాట్లాడుతూ…
కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేసేటట్లుగా కడప ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళామనీ వారు సానుకూలంగా స్పందించారనీ తెలుపుతూ కడప ప్రజాప్రతినిధులు వ్రాసిన లేఖలను ధర్మదీక్ష వేదికగా అందచేసారు.

వై ఎస్ ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు కర్నూలు చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు ఆవశ్యకతను వివరించడంతో పాటు, ఈ విషయంపై కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధుల ముఖ్యమంత్రి గారికి వ్రాసిన లేఖలను దశరథరామిరెడ్డికి అందచేసారు.

ధర్మదీక్ష కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ సమాఖ్య అద్యక్షులు చలసాని కోటిరెడ్డి, విజయవాడ కార్యదర్శి వేణుగోపాల రావు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, అభివృద్ధి వికేంద్రీకరణ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ, రాయలసీమ సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ మహాజన సభ అధ్యక్షులు డాక్టర్ నాగన్న, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్, పాణి, అఖిల భారత రైతు కూలీ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జున, పారిశ్రామిక వేత్త ఆత్మకూరు రవి , సుదర్శన్ రెడ్డి, నందిరైతు సమాఖ్య కార్యదర్శి మధుసూధనరెడ్డి, యాగంటి బసవేశ్వర స్వామి రైతు సంఘం అధ్యక్షులు M.C.కొండారెడ్డి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలు ప్రజాసంఘాల నాయకులు,వందలాది మంది రైతులు దీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *