నాధుడు లేని తిరుపతి రుయా ఆసుపత్రి

నవీన్ కుమార్ రెడ్డి

రాయలసీమకే తలమానికంగా ప్రతి పేదవారికి అనుభవం కలిగిన వైద్యులతో సంజీవినిలా కార్పొరేట్ వైద్యం అందిస్తున్న “రుయా”ఆసుపత్రి పట్ల రాష్ట్ర ప్రభుత్వం,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి! ఆసుపత్రికి నెలలు గడుస్తున్నా రెగ్యులర్      సూ ప రింటెండెంట్ ను పోస్ట్ చేయడం లేదు. దీని వల్ల చాలా సమస్యలు వాడుతున్నాయి.

ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ “వెంటిలేటర్” లో ఉంది. ప్రభుత్వాసుపత్రులలో అనుభవం కలిగిన వైద్యులు ఉన్నారు కానీ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పేద ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దిన దిన గండంగా గడుపుతున్నారు!

“రుయా” ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో చెన్నై నుంచి రాకపోవడంతో అనేకమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతగల సూపరిండెంట్ అధికారి పర్యవేక్షణలో రుయాలో పేద ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలి!

రుయా లో రెగ్యులర్ సూపరిండెంట్ కు “చెక్” పవర్ ఉంటుంది రోగులకు అత్యవసరంగా మందులు,సర్జరీ పరికరాలు కొనుగోలు చేయాలన్నా నిధుల విడుదల చేసేందుకు సూపరిండెంట్ స్థాయి అధికారి కీలకం!

రుయాలో నీటి బోరు చెడిపోయి నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందితోపాటు అడ్మిట్ అయిన రోగులు వారి సహాయకులు సైతం నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే లేదు!

తిరుపతి పరిసర ప్రాంతాలలోని హైవే రోడ్లలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు జరిగితే క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం వెంటనే రుయా క్యాజువాలిటీకి తరలిస్తారు అలాంటి సందర్భంలో క్యాజువాలిటీలో వైద్య విద్యార్థులతో పాటు అనుభవం కలిగిన వైద్య నిపుణులను 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి!

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వి. రజిని గారు ఇటీవల తిరుపతి వచ్చిన సందర్భంగా “రుయా” ఆస్పత్రిని సందర్శించకపోవడం,అక్కడి వైద్యులతో సిబ్బందితో ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై కనీసం “రివ్యూ” మీటింగ్ కూడా నిర్వహించకపోవడం పేదల ఆసుపత్రి పట్ల మంత్రిగారికి వున్న నిర్లక్ష్యానికి నిదర్శనం!

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు తన శాఖకు సంబంధించిన సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయం!

రాష్ట్ర ప్రభుత్వం,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి,అధికారులు,అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి పేద ప్రజలకు వైద్యపరంగా సేవలందిస్తున్న రుయా ఆసుపత్రికి “రెగ్యులర్ సూపరిండెంట్” ను నియమించాలని డిమాండ్ చేస్తున్నాను.

(నవీన్ కుమార్ రెడ్డి,
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
INTUC జిల్లా గౌరవాధ్యక్షులు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *