డాక్టర్ శాంతారాం కోట్నిస్ 80 వ వర్ధంతి: నివాళి

 

డాక్టర్ . యస్. జతిన్ కుమార్ ( 9849806281)

అంతర్జాతీయ మానవతకు రూపంగా, భారత చైనా మైత్రికి  ప్రతీకగా  నిలిచిన  డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం  కోట్నీస్  జీవిత స్పూర్తి అజరామరం. 10-10-1910 న భారత దేశం షోలాపూర్ నగరంలో జన్మించి, 9-12-1942 న చైనాలో అసువులు బాసిన ఒక 32 సంవత్సరాల యువకుని జీవన వికాసం ఒక చారిత్రక  ఆదర్శంగా మన ముందు దీప్తిని వెదజల్లుతూ వుంది. వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భారతీయ ఉద్యమాల వారస త్వాన్ని పుణికి పుచ్చుకుని, జాతీయ భావాలను, దేశభక్తిని నింపుకున్న కోట్నీస్  జాతీయ ఉద్యమంలో పాల్గొన్న    కారణం గా కాలేజీ నుండి బహిష్కరించబడినా తన ఉద్యమ నిమగ్నతను వీడలేదు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడటం భారతీయులందరి హక్కు అని భావించాడు. విద్యాలయ అధికారులు కోరినట్లు క్షమార్పణ పత్రం ఇవ్వకుండా మరో కాలేజీలో విద్యను పూర్తి చేశాడు.

ఈ జాతీయవాది – అంతర్జాతీయ మానవతావాదిగా మారటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చైనా ప్రజలు జపాన్ ఫాసిస్ట్ దురహంకారానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాలపట్ల ఆయన సహానుభూతిని పెంచుకున్నాడు. చైనా కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్ధనపై భారత కాంగ్రెస్ పంపిన ఒక వైద్య సహాయ బృందంలో 1938 లో స్వచ్చందంగా చైనా వెళ్ళాడు. తాను స్వయంగా యుద్ద భూమిలో నిలబడి రోజుకు 18 గంటలు పైగా వైద్య సేవలు అందించాడు. ఐదుగురి బృందంలో మిగతా డాక్టర్లు తిరిగి ఇండియా వచ్చేసినా తాను అక్కడే వుండిపోయాడు. ఫాసిస్టుల పై చైనా తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసంతో వారికి తన లాటి డాక్టర్ల అవసరం చాలా వుందని భావించి, అక్కడి అతి శీతల వాతావరణం వల్ల తన  ఆరోగ్యం శిధిలమవుతున్నా, లెక్క చేయ కుండా అహర్నిశలూ పని చేస్తూ అక్కడే వుండిపోయాడు.

కెనడా నుండి వచ్చి చైనాలో పనిచేస్తూ అసువులు బాసిన డాక్టర్ నార్మన్ బేతూన్  అడుగుజాడలు అనుసరిస్తూ, బేతూన్ స్మారకార్థం నిర్మించిన మిలిటరీ హాస్పిటల్ కె  డైరెక్టరుగా వ్యవహరించి, రోగులకు ఒక తల్లిలా సేవలు చేస్తూ “నల్ల తల్లి” అని ప్రజల గౌరవం పొందాడు.యుద్ధ రంగం లోనే పనిచేస్తున్న ఒక నర్సును [చైనా యువతిని] వివాహ మాడాడు.వారికి ఒక కొడుకు జన్మించాడు. భారత చైనా సంస్కృతుల సంగమానికి చిహ్నంగా ఆ పిల్లవాడికి యింగ్-హువా [ భారత చైనా ] అని పేరు పెట్టుకున్నాడు. చైనా భాషను నేర్చుకుని యుద్ధ రంగంలో అవసరమయిన ప్రధమ చికిత్స, తీవ్రంగా గాయపడ్డవారికి అందించవలసిన తక్షణ ప్రాధమిక చికిత్స, అందుబాటులో వున్న పరికరాలు, సాధనాలతోనే  ప్రాణ రక్షణకై  చేయవలసిన శస్త్ర చికిత్సల గురించి  సాధారణ మెడికల్  సిబ్బందికి సైతం తగు నిపుణత కలిగించే వైద్య గ్రంధాన్ని రాశాడు.

విశేష మేమంటే ఆయన చదివింది కేవలం ఎం. బి. బి. ఎస్ మాత్రమే, సర్జరీలో ఉన్నత విద్య చదవాలని అనుకున్నాడు కానీ అది వదిలివేసి చైనా వెళ్ళాడు . యుద్ధ రంగం లోనే ఇతర సీనియర్ల తో పని చేస్తూ, స్వయం కృషి తోను  తన జ్ఞానానికి పదును పెట్టుకుని ఆరితేరిన వైద్యునిగా మారాడు. దీనికి కావలసింది  అపరిమిత జ్ఞాన సంపద కాదు,  అన్ని వసతులు, వనరులు వున్న కాలేజీల లో  శిక్షణ కాదు; అనువు గాని చోట కూడా, చికిత్స చేసి ప్రజల  ప్రాణాలు కాపాడాలనే  మానవీయ దృక్కోణం. దాన్ని ఆచరించి సత్ఫలితాలు సాధించే అంకిత భావం,  విద్యుక్త ధర్మం నిర్వహించే సంస్పందన.

తన స్వసుఖాలను వొదులుకుని, డాక్టరుగా  తాను పొందే  ఆహార రేషను కూడా  బలహీనంగా వున్న రోగులకు పంచి, చివరకు తనకు అందిన పాదరక్షలు కూడా యుద్ధం చేస్తున్న సైనికులకే ఇచ్చి వేసి-  తాను చినిగిపోయిన బూట్లతో, లాంతరు బుడ్లు, టార్చి  లైట్ల వెలుగులో కూడా ఆపరేషన్లు  చేస్తూ అపూర్వమైన త్యాగ శీలత తో సామ్రాజ్యవాద  వ్యతిరేక  పోరాట పటిమను ప్రదర్శించిన ఆదర్శ మానవుడు డాక్టర్ కోట్నిస్. ఆ పోరాటానికి సరిహద్దులు లేవు. నిజమైన విశ్వ మానవునిగా, మానవతా మూర్తిగా సేవలు జేస్తూ,  చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం  కూడా పొందాడు.

చైనా చేరిన నాలుగు సంవత్సరాల లోపే  ఆరోగ్యం మరింత క్షీణించి అక్కడే  ప్రాణాలు కోల్పోయాడు. అమరజీవిగా మిగిలిపోయాడు, ఏ దేశపు  డాక్టర్ల కయినా ఒక ఆదర్శ శిఖరంలా  ఉన్నత లక్ష్య నిర్దేశం చేసి చూపించాడు డాక్టర్. కోట్నిస్,

భారత స్వాతంత్ర్య ఉద్యమ దీప్తికి, చైనా విముక్తి పోరాట క్రాంతికి, మానవాళి సాగించిన ఫాసిస్టు వ్యతిరేక యుద్ధ ధృతికి, అంతర్జాతీయ మానవతా సంఘీభావానికి, భారత చైనాల మధ్య సౌహార్దానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిన డాక్టర్ కోట్నీస్ జీవితం అజరామరం. మనకు ఎనలేని మానవతా వారసత్వ సంపదను అందించిన ఉత్తమ భారత పుత్రుడు కోట్నీస్. ఆ మహోన్నత త్యాగాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం ఆయన స్మృతి చిహ్నంగా వైద్యశాలలు, మ్యూజియంలు నెలకొల్పి ఇప్పటికీ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నది.

భారత సందర్శనకు వచ్చిన చైనా ప్రధాని  లేక అధ్యక్షులు డాక్టర్ కోట్నీస్ కుటుంబీకులను కలసి మాట్లాడి తమ గౌరవాన్ని ప్రకటిస్తారు. ఆయన స్పూర్తితో  రెండు దేశాల మధ్య స్నేహ సహకారాలు పునరుద్ధరించు కోవాలని వాంఛిస్తారు. ఆయన గౌరవార్ధం  2008 లో ఆయన వియద్య సహాయ  బృందం చైనాలో అడుగు పెట్టిన 70 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల ప్రధాన మంత్రులు బీజింగ్ లో భారత-చైనా సంయుక్త మెడికల్ మిషన్స్ ఆరంభించారు.

తదుపరి మన ప్రభుత్వం ఈ కార్య క్రమం లో పాల్గొనక పోయినా డాక్టర్  కోట్నిస్ శత జయంతి ఉత్సవాలలో మొదలు పెట్టి, 2010 నుండి  భారత చైనా మిత్రమండలి దానిని కొనసాగిస్తున్నది. కరొన విపత్తు తరువాత ప్రస్తుతం 2019 నుండి ఈ పర్యటనలు జరగటం లేదు. కోట్నిస్ చూపిన స్నేహ మార్గాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి.  ప్రస్తుత ప్రపంచంలో ఆధిపత్యవాద  శక్తులు ఏదో ఒక మూల ప్రతి నిత్యం యుద్ద జ్వాలలు రగిలిస్తున్నాయి. సామ్రాజ్యవాద దోపిడి కూడా కొనసాగుతున్నది. అగ్రరాజ్య అధిపత్యాలను వ్యతిరేకిస్తూ ప్రపంచ ప్రజలు బరిలోకి దిగుతున్నారు. పీడిత దేశాలన్నీఏకమై పోరాడ వలసిన ఆవశ్యకత రోజు రోజుకూ పెరుగుతున్నది. అంతర్జాతీయ సంఘీభావ వారసత్వాన్ని నిలబెట్టుకోవలసిన  ఈస్థితిలో మనం  డాక్టర్ కోట్నీస్ స్మృతిని ఒక స్పూర్తి దీపంగా గుర్తు చేసుకోవాలి. ఆ కాంతి రేఖలతో జీవితాలను జాగృతం చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *