పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పత్రికా ప్రకటన తిరుపత న‌వంబ‌రు 20: ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండువగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.45 గంటలకు మిథున లగ్నంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు.

గజపట ప్రతిష్ఠ :

ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు. కంకణభట్టార్‌ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

సకలదేవతలకు ఆహ్వానం :

ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి మాట్లాడుతూ , కరోనా కారణంగా రెండు సంవత్సరాల తర్వాత అమ్మవారి వాహన సేవలు బయట నిర్వహిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం, సాయంత్రం వాహన సేవలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈవో దంపతులతో పాటు , జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఆలయ అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి, ఏవిఎస్వో శ్రీ శైలేంద్ర బాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *