కొండా లక్ష్మణ్ బాపూజీ దార్శనికత ఎమిటి?

 

“జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రసంగించిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ”

– ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, దార్శనికత అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రసంగించిన జనగామ ప్రముఖ రచయిత మోహనకృష్ణ..

గజ్వేల్, 17 గురువారం : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవకు జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రత్యేక గౌరవం దక్కింది. నేడు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, తెలుగు అధ్యయన శాఖ, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA), సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలుగు జాతీయ సాహిత్య సదస్సులో “బహుజన స్పూర్తి ప్రదాతలు” అనే అంశంపై పలువురు ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు, విశ్లేషకులు, విమర్శకులు, అధ్యాపకులతో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించారు.

అందులో భాగంగా జనగామ నుండి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ పత్ర సమర్పణ చేసి ప్రసంగించాల్సిందిగా అధికారిక ఆహ్వానం లభించింది. కాగా మోహనకృష్ణ ఈ సదస్సులో పాల్గొని “ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం – దార్శనికత” అనే అంశంపై పత్ర సమర్పణ చేసి సాహిత్య మహామహులు పాల్గొన్న అద్భుత వేదికపై ప్రసంగించారు. బాపూజీ ప్రథాన పాత్ర పోశించిన మూడు తరాల ఉద్యమ నేపథ్యాలను ప్రస్తావిస్తూ వారి సామాజిక, రాజకీయ స్పూర్తిని కొనియాడారు.

ఈ సందర్భంగా సదస్సు సంచాలకులు, తెలుగు శాఖాధ్యక్షులు, సాహిత్య విమర్శకులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ మాట్లాడుతూ మోహనకృష్ణ సాహిత్యంలో చేస్తున్నటువంటి విస్తృత రచనలు, కవిత్వంతో ప్రజల్లో చైతన్యాన్ని తీస్కువస్తున్నారని. సృజనాత్మక శైలితో వారు రచించి ప్రచురించిన పోగు బంధం పుస్తకం రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీస్కువచ్చిందని అన్నారు. పిన్న వయసులోనే అనేక వ్యాసాలు ప్రచురించిన అనుభవంతో పాటు రాష్ట్ర సాహిత్య పురస్కారాలని కూడా అందుకున్నారని గుర్తు చేశారు. అందువల్ల మోహనకృష్ణ పత్రసమర్పణ చేయవలసిందిగా ప్రత్యేక ఆహ్వానం మరియు ప్రసంగించేందుకు అవకాశం కల్పించినట్లు తెలుపుతూ, వారు చేసిన ప్రసంగం శ్రోతలను, సాహితీ వేత్తలను అలరించిందన్నారు‌‌.

మోహనకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారికి, సభాధ్యక్షులు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు వివిధ శాఖల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ ఐఏఎస్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్, ఉస్మానియా తెలుగు శాఖాధ్యక్షులు ప్రొఫెసర్ సిహెచ్‌. కాశీం, ప్రముఖ తెలంగాణ సాహిత్య విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *