“ప్రభుత్వానికి ఇంత దుర్నీతి అవసరమా?”

(టి. లక్ష్మీనారాయణ)

వికేంద్రీకరణ ముసుగేసుకొని, మూడు రాజధానులంటూ, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ, అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి, విధ్వంసకర విధానాలను అమలు చేస్తూ, రాజధాని నిర్మాణం కోసం రైతులిచ్చిన భూములను పేదల పేరిట పందారం చేస్తానంటూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడం, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి రావడం చూస్తుంటే ప్రభుత్వ దుర్నీతి ఎంత వినాశకరమైనదో బహిర్గతమవుతున్నది.

రైతులు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను పందారం చేయడానికి, రాజధాని అందరిదీ కదా! అక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదా! అంటూ తమ కుటిల రాజనీతి నీతిని కప్పిపుచ్చుకొంటూ ప్రభుత్వం, పాలక పార్టీ వారు ఎదురు దాడి చేస్తున్నారు. అమరావతిలో పేదలకు సెంటు భూమి చొప్పున ఇళ్ళ స్థలాలు ప్రభుత్వం ఇస్తుంటే వ్యతిరేకిస్తున్నారంటూ కాకిగోల చేస్తున్నారు. అమరావతి రాజధానిలో మురికివాడల నిర్మాణానికి శతవిధాలా ప్రయత్నిస్తూ, పేదల ఉద్ధారకులమంటూ కబుర్లు చెబుతున్నారు.

ఒక నీటి పారుదల ప్రాజెక్టు లేదా ప్రభుత్వ రంగ పరిశ్రమ లేదా సంస్థ నెలకొల్పడం లాంటి ఏ ప్రజా ప్రయోజనాల కోసమైనా ప్రభుత్వం రైతుల నుండి భూములు తీసుకుంటుందో, ఆ ప్రయోజనాల కోసమే వినియోగించకపోతే ప్రతిఘటన తప్పదు.

ఉదాహరణకు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్) ప్రకారం ప్రభుత్వం మరియు అటవీ భూమి మినహా 1,55,464.88 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించాల్సి ఉందని నిర్ధారించింది. అందులో భూములిచ్చిన వారికి భూమికి భూమి ఇవ్వడానికి 26,729.92 ఎకరాలు మరియు నిర్వాశితులకు పునరావాస కాలనీల నిర్మాణానికి 8,581.05 ఎకరాలు, మొత్తం 35,310.97 ఎకరాలు, అందులో 12,873.36 ఎకరాలను ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించి సేకరించింది. ఇప్పుడా భూమి ప్రభుత్వానిది. ఆ భూమిని నిర్దేశిత లక్ష్యాలైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు భూమికి భూమి, నిర్వాశితులకు పునరావాస కాలనీల నిర్మాణానికి వినియోగించకుండా పేదలకు భూ పంపిణీ పథకం ముసుగులో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి కేటాయించడం సాధ్యమా!

రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని భూసమీకరణ చట్టం ప్రకారం ఒక్క పైసా నష్ట పరిహారం తీసుకోకుండా సిఆర్డీఏతో మాస్టర్ ప్లాన్ మేరకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేసి, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్స్ ఇవ్వాలి మరియు అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో నిర్వాసితులైన పేదలకు గృహ సముదాయాలు నిర్మించి శాశ్వత నివాసం కల్పించాలి. అటుపై సిఆర్డీఏ అధీనంలో ఉండే భూమిని భవిష్యత్తులో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం జవాబుదారీతనంతో వినియోగించుకోవచ్చు. అంతే కానీ, రాజకీయ ప్రయోజనం కోసం, ఇష్టారాజ్యంగా రైతులిచ్చిన భూములను పందారం చేస్తామంటే ఎలా చెల్లుబాటు అవుతుంది!

T Lakshminarayana
T Lakshminarayana

(టి. లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *