(భూమన్)
ఒక మారు మొదలైతే ఈ కాలినడకల అన్వేషణ ఆగేట్టుగా లేదు. ఆగటం తెలిసిన స్పృహ ఉండి సరిపోయింది కానీ.. ప్రపంచపు నలుమూలలకు పోయేట్టున్నవి ఈ పాద ముద్రలు. ట్రెక్కింగ్ ఒక అలవాటుగా మారిన తర్వాత ఆరోగ్యం గురించి కాకుండా ఇంకేదో అన్వేషణకు దారి తీసేట్టుగా ఉంది. అడవులు, నదులు, జలపాతాలు, ఎడారులు.. ఏవేవో రహస్యాలు విప్పి చెబుతున్నట్లు ఉన్నాయి. చెవొగ్గి వినాలనే గాని జీవితపు తాత్విక చింతన లేవో స్పందించేట్టుగా ఉన్నాయి. ఇన్నేళ్ల నా ట్రెక్కింగ్ లా అనుభవాలు చాలా చాలా రహస్యాలను విప్పి చెబుతున్నాయి.
ట్రెక్కింగ్ అంటేనే గవేషణ కొండలు, బండలు, అడవులు, నదీనదాలు, ఎడారిలో మంచి పర్వతాలు ప్రకృతి విశ్వరూపంలో మన కాలినడకల సవ్వడిలా సాహస విన్యాసమే ట్రిక్కింగ్. ఆ సాహసమే ఎన్నెన్నో జీవిత రహస్యాలను విప్పి చెబుతుంది. నువ్వేమిటో కనుగొనమని ప్రశ్నిస్తుంది. ఆ తాత్విక చింతనా యావ… మనం సంచరించే సమాజాన్ని సంస్కరించమని.. ఆరోగ్యప్రదంగా ఉంచమని.. చెబుతుంది.
అడవుల్లోని చెట్లు, చేమ, పక్షులు, జంతువులు, క్రిమి కీటకాదులు.. వాటి పెరుగుదల, ముగింపు ఒక పాఠం.. ప్రత్యక్ష ప్రసారం. అక్కడ లేని కులం, మతం, ఆర్థిక వ్యత్యాసాలు, వివక్ష.. గమనించమని చెబుతాయి. అక్కడి ప్రకృతి సూత్రాలు చిన చేపను.. పెద చేప మింగటంలోని ఆంతర్యాలు మానవ సమాజానికి పోల్చుకుని చూసేలా చేస్తాయి ట్రిక్కింగ్లు.
మన పూర్వీకులు అందరూ ఈ ట్రిక్కింగ్ల మూలానే తాత్వికచింతన అందజేశారు. బుద్ధుడు కాలినడకన తిరిగి లక్షలాది మందిని ప్రభావితం చేసినాడు. మరెందరో మహానుభావులు హిమాలయాల వరకు నడిచి ఎన్నెన్నో తాత్విక చింతనలందజేస్తున్నారు. అడవి మన అస్తిత్వం. మనమే అడవి. అందుకే అన్ని రకాల పోరాటాలకు అడవే కేంద్రమయింది.
ఈ పేరెందుకు వచ్చిందని మా యానాది మార్గదర్శకుడు మణి ని అడిగితే… అప్పుడెప్పుడో ఏళ్ళ క్రితం గిరిజన గూడెం మీదుగా ఎలుగుబంట్లు దాడి చేసి గూడెం పెద్ద బామ్మర్దిని చంపేస్తే ఆ నేలకు బామ్మర్ది బండలని పిలుపు వచ్చిందట.
అట్టాంటి దట్టమైన అడవి మధ్యలోకి వంద మైళ్ళ దూరం ప్రయాణం చేసి మనిషేత్తు బోద, చీక్కంప, వెదురు… దాటుకుంటూ మొదటిసారిగా ఈ బామ్మర్ది బండలకు చేరుకున్నాము…
డాక్టర్ భాస్కర్ బృందం మా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డితో కలిసి. అదొక అద్భుతమైన మిరమిట్లు గొలిపే నీటి చలమల సముదాయం. వెండి బండల మీదుగా పారుతున్నట్లుగా.. నీటి గల గలలు.. చుట్టూ ఎంత దూరం చూసినా ముగింపు లేని ఆ పచ్చదనం చూసి పరవశించిపోయాను.
అడవి నిండా గూడేలు గూడేలుగా ఉన్న అడవి బిడ్డలు మాయమై… ఎర్రచందనపు కసాయి గాళ్లు మిగిలి ఉండటమే నేటి వైచిత్రి.
రోజంతా అటు ఇటు తిరిగి.. ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తూ.. డాక్టర్ భాస్కర్ చేతి వంట, విశ్వనాథ్ రుచులను ఆస్వాదిస్తూ మరపురాని జ్ఞాపకాలతో ఇరవై మందిమి చీకటి పడకల నీడల్లో తిరుగు ప్రయాణమైనాము.
ట్రెక్కింగ్ వల్ల భౌతిక, మానసిక భౌద్దిక వికాసం కలగటమే కాకుండా మందితనం అలవడుతుంది. ఒక అత్యుత్తమమైన జీవన విధానాన్ని ట్రెక్కింగ్ అలవరిస్తుందనటంలో ఎంత మాత్రం సందేహం లేదు.
ట్రిక్కింగ్ ఒక జీవనోత్సాహం.. ఒక అబ్బురమైన మార్మిక కళ. అప్పుడప్పుడు ట్రెక్కింగుల్లో పాలుపంచుకొని ప్రతి ఒక్కరు తమల్ని తాము శుద్ధి చేసుకోవాలని నా ఆశంస.
మా ట్రెక్కింగ్ ల ద్వారా వేలమంది ప్రభావితులవటం నాకు తెలుస్తూనే ఉంది. ఎక్కడెక్కడి నుంచో ట్రెండింగ్ న్యూస్ చదివి సంప్రదిస్తుండటం గొప్ప ఫలితం. ఆ వచ్చేవాళ్ళు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తుండటం చూసి.. యువత ఎంత క్రమశిక్షణగా ఉన్నదో.. అది ఆ దేశ భవిష్యత్తును సరైన దారిలో పెడుతుందనే నమ్మకం బలపడుతున్నది. యువత పెడదారులు పడుతున్నదనే కొంకర బుద్ధులను.. వీటిని చూడమని ఒక మారు విన్నవిస్తున్నా.
ఈ ట్రెక్కింగ్ లో నేనేం చేశాను.. ఏం గ్రహించానో.. ఏం అనుభవించి పరవశించినానో.. గ్రహింపుకొస్తున్న ఈ తరుణంలో.. ముందు ముందు మరిన్ని చింతనలందజేస్తుందని గట్టిగా నమ్మగలుగుతున్నాను.