మునుగోడు ఎన్నికల ఫలితంపై ఒక వ్యాఖ్య!

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

“పెద్దశత్రువుపై యుద్ధం లో చిన్నశత్రువుతో కల్సి మనం ఫాసిజాన్ని ఓడించాం. ఇదో పెద్ద విజయం.” ఇది మనవాళ్ల నుండి వినిపించేవాణి. మౌనంగా ఉండలేక స్పందిస్తున్నా.

తాత్విక, సిద్ధాంత కోణాల్లోకి వెళ్లడం లేదు. సామాన్య పాఠకుల్ని దృష్టిలో ఉంచుకున్నా.

మేకల దొడ్డి మధ్యలో పెద్దపులి ఉంది. మేకల్ని తింటున్నది. చుట్టూ కంచె ఉంది. అవతల సింహం ఉంది. కంచె విరగ్గొట్టుకొని దూకాలని పొంచి ఉంది. రెండూ క్రూర మృగాలే.

స్వభావరీత్యా రెండూ క్రూర మృగాలే. స్వరూపం రీత్యా గుణాత్మక తేడా వుంది. ఒక దానిని సాధు జంతువుని చూసే దృష్టి ఎంతతప్పో, అవి దొందూ దొందే అనడమూ తప్పే!

పెద్దపులి రోజుకో మేకను తింటే, సింహం నాలుగు భక్షిస్తుంది. గాన పులి కన్న సింహం ప్రధాన శత్రువే.

పులిని తక్షణ శత్రువుగా మేకలు భావిస్తాయి. కంచె ఆవల గల సింహం వాటికి తక్షణశత్రువు కాదు. పైగా పులి క్రూరత్వంపై సింహం ఖండిస్తోంది. మేకల దొడ్డికి తనని పీఠాధిపతిని చేస్తే, సాధువుగా ఉంటానని హామీ ఇస్తోంది. మేకల ఉదాసీనత రాజకీయ విమర్శ చేసేది కాదు.

మేకల దృష్టికీ, మేకల కాపరి దృష్టికీ తేడా ఉంది. సింహాన్ని మేకల దొడ్లోకి రానివ్వని దృష్టి మేకల కాపరిది. తమను భక్షించే పెద్దపులికి అధికారాన్ని ఇవ్వని దృష్టి మేకలది.

పెనంపై వేడి భరించలేక పొయ్యులో దూకే తత్వం మేకలది. పొయ్యు కంటే పెనమే మెరుగైనదనే దృష్టి మేకల కాపరిది. పెనం నుండి పొయ్యులో దూకాలనుకునే మేకలు తమ కాపరికి దూరం కావడానికి వెనకాడవు.

ఏ పరిస్థితుల్లోనూ మేకల్ని వదులుకోలేని నిబద్ధత మేకల కాపరిది. మేకలు లేకుండా మేకల కాపరి వృత్తికి అర్ధం లేదు. కాపరికి దూరమయ్యే స్వేచ్ఛను మేకలు కలిగి వుంటాయి. కానీ మేకల్ని దూరం చేసుకునే ఉద్దేశ్యం కాపరికి వుండదు. వాటి మధ్య మౌలిక తేడా ఇదే!

ప్రజలది ప్రాప్తకాల దృష్టి. కమ్యూనిస్టులది దీర్ఘకాలిక దృష్టి. వీటి సమన్వయం ఎలా?

మన వర్గ పునాదిని కాపాడుకుంటూ సింహం తో పోరులో పెద్దపులితో చేతులు కలపడమా? లేదా పునాది చేజారినా, సింహం మీద పోరాడే ఒంటరి యోధులుగా నిలబడితే సరిపోతుందా? ఇదో సమీక్షా అంశమే.

పులిని మిత్రుడిగా భావించాల్సిన బాధ్యత మనదా? లేదా మనం ప్రాతినిధ్యం వహిస్తున్న పీడిత ప్రజలదా? ఇదీ ఓ సమీక్షా అంశమే.

ప్రస్తుత స్థితిలో ప్రజల మిత్రుడుగా మనకి మనం అంచనా వేసి పెద్దపులికి మద్దతిస్తే సరిపోతుందా? లేదా మనం ప్రాతినిధ్యం వహించే పీడిత ప్రజలు గుర్తించే ప్రాతిపదికతోనే మద్దతు ఇవ్వాలా? ఇదీ ఓ సమీక్షా అంశమే.

మనం ప్రాతినిధ్యం వహించే ప్రజల విశ్వాసం పొందకుండా పెద్దపులితో చేతులు కలిపితే, ప్రజల దృష్టిలో మనకూ పులికీ మధ్య అనుచిత పొత్తు క్రిందికి వస్తుందనీ, మన వర్గ పునాది చేజార్చుకునే స్థితికి దారి తీస్తుందని చరిత్ర చెప్పింది. మనని అది ఆచరణలో స్వంత సేనని కోల్పోయిన సైన్యాధికార్లుగా చేస్తుంది. ఆ చరిత్ర పాఠాల్ని ఇక్కడ ఎలా అన్వయించాలి?

బ్రిటీష్, ఫ్రెంచ్ రాజ్యాల వలసవాదం కంటే జర్మన్, ఇటలీ ఫాసిజం ఎక్కువ ప్రమాదకరమని 1942లో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం భావించింది. అది ప్రపంచ ప్రజాయుద్ధ పిలుపునిచ్చింది. అట్టి సాధారణ అంతర్జాతీయ సూత్రానికి కట్టుబడుతూ బ్రిటీష్, ఫ్రెంచ్ ఆక్రమిత వలస దేశాల కమ్యూనిస్టు పార్టీలు అన్వయింపు చేసి అద్భుతమైన ఫలితాల్ని పొందాయి. బ్రిటీష్, ఫ్రెంచ్, డచ్చి సామ్రాజ్యవాద పాలనపై పోరాడుతూనే, తగు నిర్దిష్ట డిమాండ్లపై ఆయా సామ్రాజ్యవాద ప్రభ్యత్వాలపై నిర్ధిష్ట పోరాటాలు సాగించి వాటి నుండి నిర్దిష్ట విజయాల్ని సాధిస్తూ మాత్రమే నాడు ఫాసిజానికి వ్యతిరేక పోరాటంలో ప్రజాపునాది బలపడింది. అది మనకు మార్గదర్శకం కావాలా?

1942లో మన భారత కమ్యూనిస్టు పార్టీ ఏ పెద్ద చారిత్రక తప్పిదం చేసిందో తెల్సిందే. క్విట్ ఇండియా పోరాటానికి దూరంగా ఉండి నష్టపోయింది. అది మనకి మార్గదర్శకమా?

మునుగోడు ఎన్నికల్లో సింహంపై పోరులో పెద్ద పులితో కలిసి పోరాడిన విధానంలో తప్పొప్పుల్ని సమీక్షకి వదిలేద్దాం. ఆ ఎత్తుగడల ప్రకారమైనా ఏమి చేసి ఉండాల్సింది?

మునుగోడు ఎన్నికలు హఠాత్తుగా ఊడిపడ్డవి కాదు. నూరు రోజుల ముందే తెలుసు. నాడు ఏం చేసి ఉండాల్సింది?

రైతాంగం, వ్యవసాయ కూలీలు, ఆదివాసీలు, కార్మికుల వంటి వివిధ వర్గాల ప్రజల కోర్కెలపై; మైనార్టీలు, దళితులు, స్త్రీల వంటి ప్రజల కోర్కెల పై రాష్ట్ర సర్కార్ ని ఏం డిమాండ్ చేసాం? ఏజెన్సీ ఆదివాసీ భూమి పట్టాలపై ఏ హామీలను పొందాం? ఇవీ సమీక్షా అంశాలే.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వుల్ని ఇచ్చి ప్రజలకి మేలు చేకూర్చే హక్కులు, సౌకర్యాలు, కోర్కెల మీద నిలదీశామా? వీటిపై మీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇస్తే తప్ప బీజేపీ వ్యతిరేక ఐక్యత సాధ్యం కాదని పబ్లిక్ గా రాష్ట్ర సర్కార్ కి తేల్చి చెప్పామా? ఇదీ ఒక సమీక్షా అంశమే.

వెంటనే ఉత్తర్వులతో చట్టపరంగా ఫలితాలు సాధించే అవకాశం లేని డిమాండ్లపై అత్యవసర శాసనసభ జరిపి సభా ముఖంగా హామీ కోసం షరతు విధించామా? మునుగోడు ఫలితాల తర్వాత ఎన్ని రోజుల్లో ఏఏ డిమాండ్లపై జీవో ల్ని ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం నుండి బహిరంగ హామీల్ని తీసుకున్నామా? ఇది కూడా సమీక్షా అంశమే.

మోడీపై ముఖ్యమంత్రి నిప్పులు కక్కితే ఫాసిజం పై యుద్ధం చేసినట్లేనా? మంత్రముగ్ధ ప్రసంగాలతో బాధిత ప్రజల కడుపు నిండుతుందా? ఐక్యతతో నడవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించకుండా సింహం పై పోరాటంలో మనకి మనం పెద్దపులి వెంట నడిస్తే, ప్రజలు మనతో నడుస్తారా? ఇదీ ఒక సమీక్షా అంశమే.

ఒకవేళ మన ప్రజలు గుర్తించకపోతే జరిగేది ఏమిటి? ఆ సమయంలో మనతో రాలేని మన వర్గ ప్రజలు ఏ వైపు వెళ్ళాలి?

కారణాలు ఏమైనా, మనం ఇప్పటికే మన వర్గ పునాదిని చాలా వరకు కోల్పోయాం. మిగిలిన ప్రజపునాదిలో మూడు భాగాలుగా చీలి పోవచ్చు. ఒక భాగం పెద్దపులి పై మనం పోరాటం వదిలి వేసామనే భావానికి గురై మనల్ని వదిలేసి సింహం చెంతకు చేరవచ్చు. మరో భాగం ప్రజలు మనతో పాటు పెద్దపులి వెంట నడిచి, దాని వెంటే ఉండి పోతారు. (పెద్దపులితో మున్ముందు విడగొట్టుకొని మనం వెనక్కి వచ్చినా, వారు దాంతోనే ఉండి పోతారు) మూడో భాగం మనతోనే ఉండిపోతారు. గత చరిత్ర సాక్షిగా ఉంది. ఇదే రేపటి నిజంగా కూడా మారితే… చూద్దాం.

ఒకవేళ పైన పేర్కొన్నట్లు జరిగితే, నేటి మునుగోడు మన వర్గ పునాదిలో పెద్ద భాగం ప్రజల్ని వర్గశత్రువు నిశ్శబ్దంగా కబ్జా చేస్తాడు. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య తీవ్ర సంఘర్షణ క్రమంలో పెరిగే ఫాసిస్టు శక్తులు అత్యంత రక్షణ స్థితిలో ఉంటాయని చరిత్ర చెప్పింది. నిశ్శబ్ద రాజకీయ ప్రక్రియ ద్వారా పెరిగే ఫాసిస్టు శక్తులు అత్యంత దూకుడుగా దాడికి దిగుతాయి. పై ప్రక్రియ నిశ్శబ్ద ప్రతీఘాత రాజకీయ ప్రక్రియకి దారి తీస్తుందా? మునుగోడు ఆ రాజకీయ ప్రయోగశాల అవుతుందా?

పై పరిణామం జరిగితే నేటికీ మిగిలిన కొద్దిపాటి మన వర్గ పునాదిలో ఓ మూడో వంతుమంది మునుగోడు పరాజితుని ద్వారా మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ శిబిరానికి నేడు చేరితే, మరో మూడో వంతు మంది నేటి విజేత ద్వారా రేపు చేరతారు. మన తప్పుడు అంచనా, ఎత్తుగడలతో మనమే ప్రజల్ని ఫాసిస్టు నరక కూపంలోకి తోసే చారిత్రక తప్పిదం అవుతుంది.

జనంలో మమేకమై, జనంతో కల్సి పోరుతూ జనం పక్షంగా వుంటే, జనాన్ని సరైన దారిలోకి నడిపించవచ్చు. ఒకవేళ అరుదుగా సింహం పై పెద్దపులితో కలవడానికి సిద్ధం కాకపోయినా మనం జనంతోనే నడవాలి. ఐతే యాంత్రికంగా కాదు. అది టైలిజం అవుతుంది. తప్పుడు దారి నుండి మనప్రజల్ని అనుభవాల వెలుగులో సరైన దారికి మళ్లించే రాజకీయ అప్రమత్తతతో వారిని అనుసరించాలి. ప్రధమ రష్యన్ విప్లవానికి కారణమైన బ్లడీ సండే అనుభవం ఉండనే ఉంది. పెద్దపులిపై కోపంతో సింహం దారికి వెళ్లే మన ప్రజల్ని వారి మానాన వారిని వదిలేసే హక్కుని చరిత్ర మనకి ఇవ్వలేదు.

ఫాసిజానికి మోడీ లేదా మోడీ సర్కార్ మూల కారణమనేదే అశాస్ట్రీయ అవగాహన. బీజేపీ కంటే, ఫాసిజానికి నూరురెట్లు విస్తృతి ఉంది. బీజేపీ ఓడితే ఫాసిజం ఓడినట్లు కాదు. టీఆరెస్ గెలిస్తే కూడా ఓడినట్లు కాదు. పులిపై యుద్ధం చేస్తూ పొందే వర్గ ప్రజాపునాది అభివృద్ధి చెందితే రేపు సింహంపై యుద్ధం చేసి ఓడించి శక్తి సమకూరే సందర్భాలు ఉంటాయి. ఈ బ్యాలెట్ ఫలితాలను ముమ్మాటికీ పరిగాణన లోకి తీసుకోవాల్సిందే. కానీ ఇవి సర్వస్వం కాదు. వీటి కంటే వర్గ పునాది నూరురెట్లు బలమైనది.

మునుగోడు ఫలితంలో ఫాసిజం ఓటమిని తప్ప గెలుపును చూడలేకపోతే ఫాసిజాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేనట్లే! గెలిచిన TRS ద్వారా ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమానికి పెరిగే నికర బలం కంటే, ఓడిన బీజేపీ ద్వారా పెరిగే ఫాసిస్టు రాజకీయ శక్తుల బలమే ఎక్కువని అంచనా వేయలేకపోతే మనం చారిత్రక తప్పిదం చేసిన వారమౌతాము. జర్మన్, ఇటలీ సోషల్ డెమొక్రటిక్ పార్టీలు ఇలాంటి తప్పుడు రాజకీయ అంచనాలు, అవగాహనలతోనే ఫాసిజం బలపడటానికి కారణమయ్యాయి. ఇది చరిత్ర నిరూపించింది. చరిత్రని మళ్లీ చదివి పాఠాలు నేర్చుకుందాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *