(గాదె ఇన్నయ్య)
సుమారు 125 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ త్యాగాల కారణంగా స్వదేశి పరిపాలన ప్రారంభమైంది. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల కబంద హస్తాల నుండి అధిపత్యం, దోపిడి, నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ వందేమాతర గీతాలతో, నినాదాలతో భారతావని నలుదిక్కుల పిక్కటిల్లిన నిరసన, పోరాటాలు బ్రిటీష్ సామ్రాజ్యవాదులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఫలితంగా గత్యంతరంలేని పరిస్థితిలో అనేక సంప్రదింపులు, రాయబారాలు ఒకవైపు జరుపుతూ, మరొకవైపు చీలిక ప్రయత్నాలు కొనసాగిస్తూ “విభజించు పాలించు” అన్న సూత్రాన్ని ప్రయోగించినా భారత ప్రజల పటిష్ఠమైన ఐక్యత ముందు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు తలవంచక తప్పలేదు. హిందూ ముస్లిం చీలిక, కులాల గందరగోళం సృష్టించాలని చేసిన కుట్రలు ఏవీ ఫలించలేదు. అనేక సంస్థానాధీశుల ద్వారా, స్థానిక వ్యాపార, భూస్వామ్య వర్గాల ద్వారా వివిధ రకాల ప్రయత్నాలు సాగలేదు. కేసులు, జీవిత కారాగారవాసము, ఉరిశిక్షలు, భయంకరమైన హత్యలు, నిత్యావసరాలు దక్కకుండా చేసిన హత్యలు అన్ని-ఇన్ని కావు. మతాల మధ్య మంటలు లేపి తమ సామ్రాజ్యవాద దోపిడి కొనసాగించాలనే చివరి ప్రయత్నాలు కూడా (కొంతమంది సహకరించినప్పటికీ) ఎక్కువ కాలం నిలువలేదు.
కొన్ని వందల సంవత్సరాలు కొనసాగిన భారత ప్రజల సహజీవనం భిన్నత్వంలో ఏకత్వం సూత్రీకరణ ద్వారా భారతీయులమంతా ఒక్కటే అంటు ఐక్య పోరాటం కొనసాగించినారు. హిందూ, ముస్లిం, బౌద్ధం, జైన్, సిక్కు, క్రిస్టియన్ మొదలగు మతాలవారు మత సామరస్యాన్ని పాటిస్తూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల వలస దోపిడీ పోవాలనే లక్ష్యం ముందు బ్రిటీష్ పాలకుల ద్వంద్వ నీతి ఏమి చేయలేకపోయింది. ఎవరి మత విశ్వాసాలను వారు కాపాడుకుంటూ కొనసాగించిన భారత జాతీయోద్యమం ఆనాడు ప్రపంచం ఉలిక్కి పడేలాగా చేసింది. రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక, ఆర్దిక, సాంస్కృతిక, మతపరమైన ప్రజస్వామ్యయుతమైన హక్కులతో భారతదేశం ఏర్పడాలని ప్రజలు కోరుకున్నారు. కూటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వరుల దాక ప్రజలు ఆదివాసీలు, దళితులు, బహుజనులు, సంపన్న వర్గాల వారు తమ బాధ్యతగా స్వాతంత్ర్య పోరాటంలో సమరం సాగించారు. కొందరు సమిధలైనారు. లింగ బేధం లేకుండా అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, అన్ని రకాల తెగలు, కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు కలిసికట్టుగా సాధించినదే భారతదేశం.
వివిధ పేర్లతో ఉన్న స్వాతంత్ర్య సంస్థలు, వేదికలు, పార్టీలు వేరువేరుగా కొంత, ఉమ్మడిగా ఎక్కువ కార్యక్రమలు చేసి చరిత్రలో ఆదర్శ ఘట్టాలుగా నిలిచాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాదాలను పారద్రోలడంతో పాటు ఏర్పాటయ్యే నూతన భారతావనిలో న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదంతో ప్రపంచ ప్రజలు గర్వించదగిన స్థాయిలో భవిష్యత్ భారతదేశం ఉండాలని ఎందరో త్యాగమూర్తులు కలలుగన్నారు. రాజకీయ స్వాతంత్ర్యంతోపాటు సామాజిక సమానత్వం, ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించి పౌరుల సమానత్వ విలువలతో కూడిన రాజ్యం ఏర్పడాలని కోరుకున్నారు. పౌరులందరికీ స్వేఛ్చ, సమాన హక్కులు ఉండాలని బలంగా విశ్లేషించారు. చట్టాలు అందరికి సమన్యాయంగా (అనగా ఆర్ధిక, కుల, మత, హోదా, బట్టి కాకుండా) ఉండాలని ఆశించారు.
భారత స్వాతంత్రోద్యమ ఆకాంక్షల గురించి, 75 ఏళ్ళ తరువాత కూడా మాట్లాడుకునే పరిస్థితి రావడం సిగ్గుచేటు, అవమానకరం.
1947 నుంచి దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు స్వయం ఆధారిత విధానాలను కొనసాగించలేదు. నయా వలస విధానాలతో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సోషలిజం, లౌకికతను పెదవులపై వల్లించే పదాలుగా పరిమితం చేసి ఆచరణలో పెట్టుబడిదారుల, భూస్వాముల అనుకూలమైన దోపిడీ విధానాలను అమలు చేస్తూ వచ్చాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హఠావో లాంటి విధానాలు అన్నీ అంతిమంగా పై వర్గాలకు మాత్రమే ఉపయోగపడినాయి. వాటితో దేశంలో అభివృద్ధి జరగకపోగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. లౌకిక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న పార్టీలు మత విద్వేషాలను పెంచుతూ పాలనా అవసరాలు తీర్చుకుంటున్నారు.
1991 తర్వాత అమల్లోకి వచ్చిన నయా ఉదార విధానాల వలన దేశం మరింత సంక్షోభంలోకి చేరుకుంది. దేశంలో గుత్త పెట్టుబడిదారీ సంస్థలైన బహుళజాతి కంపెనీల దోపిడీ పెరిగిపోయింది. దేశంలో ప్రాకృతిక సంపదల దోపిడీతో పాటు చౌక పరిశ్రమ పేరిట శ్రామికులను దోపిడీ చేయడం జరిగింది. సర్వం ప్రైవేటు అంటూ, ప్రభుత్వ సంస్థలను తెగ నమ్మడం పెరిగి పోతున్నది.
2014 లో అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా ప్రభుత్వ రంగ సంస్థలైన పరిశ్రమలు, బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వే, ఇండియన్ ఎయిర్ లైన్స్, BSNL, ఫార్మా కంపెనీలు, రక్షణ అవసరాలు తీర్చే పరిశ్రమలు మొదలైన వాటిని దివాలా తీయిస్తూ అమ్మేస్తున్నారు. ప్రజల కనీస అవసరాలైన విద్యా, వైద్యం, ఉపాధి, పౌర హక్కులను తుంగలో తొక్కుతూ పాలనా బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రజల సంపద పరిరక్షణ బాధ్యత సోయి లేకుండా పోయింది. చివరకు వ్యవసాయ రంగంలో కూడా బహుళజాతి కంపెనీల లాభాల వేటకు అనుమతులు ఇస్తున్నది. అంకుర పరిశ్రమల్లో వేలాది, కోట్లాది విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిచ్చి, చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తున్నది. ఎంఎస్ఎంఈలకు బ్యాకు ఋణాలు, ఇతర సహాయాలు అందజేయడం లేదు. ఆదానీ, అంబానీలకు అన్ని రకాలుగా ప్రాధాన్యతనిచ్చి వారికి ఉపయోగపడే విధానాలను అమలుచేస్తూ, తక్కిన పెట్టుబడిదారులకు కూడా సహకారాన్ని అందజేయడం లేదు. జాతీయ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, విదేశీ పెట్టుబడులకోసం అర్రులు చాస్తున్నది. రాజ్యాంగం, దేశభక్తి అని అరిచే భాజపా ప్రభుత్వం రాజ్యాంగంలోని సోషలిజం, లౌకిక పదాలను తొలగించడానికి పూనుకుంటున్నది. విదేశీ పెట్టుబడులకు సులభతర వ్యాపారాన్ని చేయడానికి అడ్డంకిగా ఉన్న 1500 చట్టాలను రద్ధు చేసింది. దేశంలో ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వారిని వర్ణాశ్రమ ధర్మంలో భాగంగా చూస్తూ వారిపట్ల అసహనంతో వ్యవహరిస్తున్నది. అంబేడ్కర్ ను ఘనంగా సన్మానిస్తూనే ఆయన ఆశయాల్లో భాగమైన దళితుల విముక్తి, రాజ్యాంగ హక్కులను కాలదన్నుతున్నది. మతాల ప్రాతిపదిక మీద ప్రజల మధ్య విభజన చేసి తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడమే కాక, ఇతర మతాలను టార్గెట్ చేస్తూ బ్రాహ్మణీయవాద రాష్ట్ర ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేస్తున్నది.
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, డీమానిటైజేషన్ లాంటి విధానాలతో పెట్టుబడికి పెద్దపీట వేస్తున్నది. జీఎస్టీతో ప్రజల నడ్డీ విరుస్తున్నది. ప్రభుత్వ శాఖల్లో చివరకు న్యాయ శాఖను కూడా బ్రాహ్మణీయవాద శక్తులతో నింపివేసింది. అగ్నిపథ్ పేరిట బ్రాహ్మణీయవాద భావజాలాన్ని సైన్యంలో కూడా ప్రవేశపెడుతున్నది.
మొత్తంగా దేశ ప్రజలు స్వేఛ్చ, సమానత్వంతో జీవించడం కాకుండా ఎమర్జెన్సీని తలదన్నే భయానక పరిస్థితుల్లో జీవించేలాగున పాలన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిస్థితి పైన తెలిపిన విధంగా ఉండగా, రాష్ట్రాలలో పరిపాలక పార్టీల స్థితి దీనికి వేరుగా లేదు. BJP, కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా సంపూర్ణ ప్రజాస్వామ్యయుత పాలన కొనసాగించకపోవడం వలన ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. కొన్ని పార్టీలు కుటుంబ పాలన సాగించడం వలన తీవ్ర నిరసన ఉన్నది. బ్రాహ్మణీయవాదుల పాలన అంతమొందించాలంటే లేక ఎదుర్కోవాలంటే ఈ ప్రభుత్వాలు, పార్టీలు కూడా ప్రజాస్వామీకరించుకోవాలి. అవినీతి రహిత పాలన లక్ష్యంగా ప్రజల సంక్షేమ పథకాలపై శ్రద్ధచూపాలి. విద్యా, వైద్య రంగాలను 90% ప్రభుత్వమే నిర్వహణ చేయాలి. ఉపాధి రంగం ద్వారా ప్రజల జీవనానికి భద్రత ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం అనగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను ప్రయారిటీ ఆర్డర్ లో అభివృద్ధి చేయడానికి సంకల్పం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.
మూడు రంగుల జెండాపై, భారత దేశం నామకరణంపై 98% ప్రజల అభిప్రాయం ఒకరకంగా ఉంటే, మిగిలిన 2% కుహనా దేశభక్తుల అభిప్రాయం మరొకరకంగా ఉంటున్నది. బ్రిటీష్ పాలకుల తొత్తులుగా, జాతీయోద్యమ ద్రోహులుగా ఉన్న ఈ 2% వర్ణ వ్యవస్తీకులు 98% ప్రజల ఆకాంక్షను దెబ్బతీయడానికి, నీరు గార్చడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ధర్మం, జాతి పదాలకు వికృత అర్థాలనిస్తూ చిత్ర, విచిత్ర వాదనలు చేస్తున్నారు. రామరాజ్యం, హిందూరాజ్యం అని కొత్త వింత నినాదాలు లేవనెత్తుతున్నారు. సామాజిక న్యాయం అనే పదానికున్న గొప్ప అర్ధాన్ని సంకుచిత ధోరణితో, వక్రభాష్యాలు చేస్తున్నారు. ఇటలీ పాసిస్ట్ ముస్సోలినీ, జర్మన్ నాజీ హిట్లర్ ఆదర్శంగా విద్వేషాలను రెచ్చగొట్టే భావజాలంతో రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని కొనసాగించాలనే వ్యూహంతో ప్రజా సంక్షేమానికి వ్యతిరేకమైన కుట్రలతో మోసపూరిత సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నారు.
భారత ప్రజలు శాసన పరమైన, పాలనాపరమైన, న్యాయపరమైన, వాక్ స్వాతంత్ర్యంతో కూడిన గణతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని కాంక్షించారు. భారత స్వాతంత్ర్యోద్యమ త్యాగధనుల కలలుగాని, 40 కోట్ల ప్రజల ఆశలుగాని ఆచరణ సాధ్యం కాలేదు. కలలు కలలుగానే మిగిలిపోగా, ఆశలు అడియాశలు అయినాయి. తెల్లదొరల పాలనను మరిచిపోలేని విధంగా నల్లదొరల పాలన కొనసాగుతున్నది. ప్రజల మధ్య ఉన్న చిన్నచిన్న వ్యత్యాసాలు, వైరుధ్యాల ఆధారంగా చిచ్చుపెడుతూ ఆరని మంటలు రాజేస్తూ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని చలాయించడానికి నిరంతరం పాట్లు పడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు మతాన్ని, జాతిని, ప్రాంతాన్ని వాడుకుంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మెజారిటీ ప్రజల ప్రయోజనం కాకుండా కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. నాగరికతను పెంపొందించుకుంటూ ప్రజలు అభివృద్ధి చెందే దిశగా పనిచేయవలసిన పార్టీలు అనాగరిక చర్యల ద్వారా భారతావనిని బజారుకీడుస్తున్నారు, బహుళ జాతి కంపెనీల కబంధ హస్తాలలో బంధీని చేస్తున్నారు. భారతదేశ సర్వమత సౌభ్రాతృత్వానికి ఉన్న గుర్తింపును సర్వనాశనం చేస్తున్నారు. పౌర, ప్రజాస్వామిక కనీస హక్కులను పాతాళంలో తొక్కుతున్నారు.
మత ప్రాతిపదికన రాజ్యాలుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ పాకిస్తాన్ (1978-88) దేశాల ప్రజల పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్లుపోడుస్తుంది. మత చాంధసవాదం మానవ సమాజంలో ఎన్నిరకాల భయంకరమైన వికృత చేష్టలకు గురైనదో మనం చూశాం. మానవత్వాన్ని మంటగలిపి, మానవ విలువలను తుంగలో తొక్కుతూ నరమేధం సృష్టించిన చరిత్ర ఆనవాళ్ళు ఇంకా మాసిపోలేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఈ మతం ఆ మతం అని కాకుండా అన్ని మతాలకు ఈ రక్తసిక్త చరిత్రను మూటకట్టుకున్న పాలక వర్గాలు వున్నారు. మత విశ్వాసాలకు స్వార్ధ రాజకీయ రంగు పులిమి దోపిడీ ఆధిపత్యం చలాయిస్తూ తమ పైశాచికత్వాన్ని, మూర్ఖత్వాన్ని ప్రజలపై రుద్ధి మతోన్మాదంతో వెకిలి ఆనందం అనుభవిస్తున్నారు. మతమే శాసనాలై ఆ సమాజంలో ఎంత భయంకరమైన నరమేధం జరుగుతున్నదో చుస్తున్నాము. భారతదేశాన్ని కూడా మత ఛాందసవాదం తోటి ఒక సిరియా, సౌదీఅరేబియా, ఇరాక్, ఇజ్రాయిల్, ఆఫ్ఘానిస్తాన్ మొదలగుదేశాల లాగా చేయాలనీ విభిన్న శక్తులు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. భక్తి, మతం, విశ్వాసం మూఢనమ్మకమైనపుడు కొందరి ప్రయోజనాల కోసం అందరు బలి కావల్సి వస్తుంది. ఏ మత ఉగ్రవాదమైనా ప్రజాస్వామ్యనికి గొడ్డలిపెట్టే.
ఒక వర్గం మతాన్ని రక్షించే పేరుతో భక్షిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, విచక్షణారహిత నరమేధం సృష్టిస్తూ తామే “దేశభక్తులు” అని ప్రచారం చేసుకుంటున్నారు. అన్నిరకాల మత, ఉగ్రవాద నాయకులందరు లోపాయికారిగా పరస్పరం సాన్నిహిత్యంగా ఉండి, కుట్రపూరిత ఎజెండాతో మానవాళిని బలితీసుకుంటున్నారు. అన్ని మతాల చాంధసవాదులు, ఉగ్రవాదులు ద్వంద్వ నీతితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాథూరాంగాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే “ఫ్రంట్ లైన్” పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు చదివితే హిందూమతం ముసుగులో జరుగుతున్న కుట్రలు అర్ధమవుతాయి (1994 జనవరి 28 సంచిక). మానవత, సమన్యాయం, సమానత్వం సూత్రాలను ఏ మత చాంధసవాదులు ఒప్పుకోరు. మత చాంధసవాదం మనుషులను వ్యక్తిత్వం లేని రోబోలుగా తయారుచేస్తుంది. మహిళలను (మాతృమూర్తులను) ముడిసరుకుగా, వినోద వస్తువుగా పరిగణించే నీచ సంస్కృతిని, సంప్రదాయాన్ని కలిగి ఉంటుంది.
ఏ ఉద్యమాలైనా, పోరాటాలైనా వ్యతిరేకత లేదా ఒకానొక అంశంలో వైరుధ్యాల నుంచి ఉత్పన్నమవుతాయి. ఫాసిస్ట్ భాజపాకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడం కోసం దాని ప్రత్యేకతలో ఉన్న వైరుధ్యాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక ఫాసిస్ట్ పార్టీగా భాజపాకు దానంతట దానిలో విశ్వజనీన, ప్రత్యేక అంశాలు ఉన్నాయని అర్థం చేసుకుందాం. దాని విశ్వజనీన అంశాలలో బ్రాహ్మనీయవాద ఆధిపత్య రాజకీయాల క్రమంతో పోలిక కనిపిస్తున్నది. భాజపా భారతీయ ప్రాంతీయ, నిర్ధిష్ట, చరిత్రను, నిర్ధిష్ట సమాజ సామాజిక పొందికను వక్రీకరిస్తున్నది, కాషాయీకరిస్తున్నది.
అన్ని రకాల మత ఛాందసవాదానికి, ప్రత్యేకంగా హిందుత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్య సంఘటన ఏర్పాటు ద్వారానే మత ఉగ్రవాదాన్ని అరికట్టి, ప్రజలకు కనీస ప్రజస్యామ్య విలువలతో కూడిన పాలన కొనసాగేలా చేయవచ్చు. మత ఛాందసవాదులే కాదు… ఉగ్రవాదులు వారి పాసిస్ట్ ఆలోచనలతో ప్రజల ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ కళలను, సంస్కృతి సంప్రదాయాలను, బాషను, విద్యను, ఆహారపు అలవాట్లను, భక్తి విశ్వాసాలను వక్రంగా పునర్వ్యవస్థీకరించడానికి నిరంకుశత్వంతో శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మతతత్వం క్రమంగా మతోన్మాదంగా, పాసిజంగా, నాజిజంగా రూపాంతరం చెందుతూ మానవత్వ విలువలను మంట కలుపుతూ ఉగ్రవాదిగా, విచ్ఛిన్నకర శక్తిగా మారుతున్న చరిత్రను మనందరం చూస్తున్నాము. మత ప్రార్థనా స్థలాలు ఎలాంటి వివక్ష, కుల ఆధిపత్యం లేకుండా మత సామరస్యాన్ని పెంపొందిస్తూ ధర్మాన్ని కాపాడే వేదికలుగా ఉండాలని భావించాలి. నాగరికుడు అనుకునే మనిషి మతోన్మాదంతో విచక్షణ కోల్పోయి సిద్ధాంత రాద్ధాంతాలతో చరిత్రను వక్రీకరిస్తూ ఉన్మాదిగా మారి సమజాన్ని అంధకారంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ ఉన్మాద, అరాచక, అమానవీయ, ఆలోచనలకు పాలనాధికారం తోడైనపుడు సమాజం ఇంకా భయంకరంగా తయారవుతుంది. ఈ ఉన్మాద పాలకులు ప్రజల సామరస్య సహజీవనాన్ని విచ్ఛిన్నం చేస్తూ స్వార్ధ రాజకీయాలతో ఆధిపత్య ధోరణులతో ప్రజాసామ్య వాతావరణాన్ని భూస్థాపితం చేస్తారు. ఈ ఉన్మాద పాలకులు కపట ప్రేమను ఒలకబోస్తూ ప్రజల కనీస అవసరాల ఆధారంగా నినాదాలు రూపొందిస్తూ ప్రజాసామ్య ముసుగు ధరించి ప్రజల బలహీనతలపై రాజకీయం చేస్తున్నారు. ఈ తేనె పూసిన కత్తులను ప్రజలు తెలుసుకునేలోపునే మనుషుల్లాగా బతుకుతున్న ప్రజలను చంపేస్తున్నారు. బుద్ధిజీవులు కూడా ఈ విషపు కోరలకు బలవుతున్నారు. ముఖ్యంగా యువత వీరి ఆకర్షణీయమైన కపట ఉదారవాద పద్ధతుల వలన మోసపోతున్నారు. మతతత్వ విభజన చాలా భయంకరమైనది, వినాశనకరమైనది. అది సమాజంలో వేళ్ళూనుకుంటే తొలగించటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కులాల మధ్య విభజన, భాషల మధ్య విభజన, ఆచార వ్యవహారాల మధ్య విభజన, కొంతమేరకు ఆర్థిక అసమానతల, వాదాల మధ్య విభజనలను పోగొట్టడం తేలిక. మతతత్వ విభజన మనిషిలోని కనీస మానవ విలువలను ధ్వంసం చేసి విద్వేషాలను రెచ్చగొడుతుంది. హిందు, ముస్లీం, సిక్కు, క్రైస్తవ మతతత్వాలు అన్నీ కూడా పోటీపడుతూ విద్వేషాలను రెచ్చగొట్టడం చూస్తున్నాం.
మతతత్వం ప్రారంభంలో గొప్ప విలువలను ప్రభోదిస్తున్నట్లుగా, సమాజ శ్రేయస్సు కోరుతున్నట్లుగా, ప్రజాస్వామ్య విలువలతో కూడినదిగా ఉన్నట్లుంటుంది. క్రమంగా అది చాంధస వాదంగా, విద్వేషపూరితంగా, ఉన్మాదంగా, ఉగ్రవాదంగా రూపాంతరం చెందుతుంది అనేది చారిత్రక సత్యం. సామాజిక, ఆర్థికపరమైన ఘర్షణలను వాటి స్వభావాన్ని, ఉద్దేశ్యాలను మార్చి మతతత్వాన్ని అంటగట్టి భారతీయ వాస్తవికతను నీరుగార్చుతూ ఆర్థిక అసమానతలను బలోపేతం చేస్తున్నారు. భారత స్వాతంత్ర్యోద్యమాన్ని కూడా కుహానా మతోన్మాదులు విచ్ఛిన్నం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నపటికి జాతీయవాదమంటూ కుప్పిగంతులేస్తున్నారు.
ఆగష్టు 15, జనవరి 26 పండుగని చేసుకొని పప్పుబెల్లాలు పంచుకోవడం మాత్రమే స్వాతంత్ర్యం కాదు. మహానీయుల జయంతులు, వర్ధంతులు జరుపుకుంటూ సెలవులు పొందడం మాత్రమే సరిపోదు. ఇది నిజమైన నివాళి కూడా కాదు. కుటుంబపెద్ద గాడి తప్పితే కుటుంబసభ్యులు చక్కదిద్దుతున్నట్లుగా, పాలకులు మతితప్పి గాడితప్పినపుడు ప్రజలు పాలనను చక్కదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. “నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేస్తుంటే నోరుండి ఊరికే కూర్చున్న ప్రతివాడు నేరస్థుడే” అవుతాడు కాబట్టి ఆలస్యం, నిర్లక్ష్యం విడనాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని కాపాడుకోవలిసిన బాధ్యత మన అందరిపై ఉన్నది.
రోమ్ తగలబడుతుంటే పాలకులు ఫిడేల్ వాయించినట్లుగా భారతదేశం తగలబడుతుంటే ఇంకాఇంకా అంటూ ఆనందోత్సాహాలతో భారత పాలకులు ఉన్నారు. భారత పాలకులు పొందుతున్న ఈ వికృత ఆనందం ఇప్పట్లో ముగియదు. విద్వేషపూరిత మంటలకు ఆజ్యంపోస్తూ తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే కోరికతో ఉన్న పరిస్థితిలో ప్రజలుగా, ప్రజస్వామ్యవాదులుగా, బుద్ధిజీవులుగా మన బాధ్యత ఏమిటి? ఈ మంటలను చూస్తూ ఊరుకుందామా? మంటల్లో ఆహుతి అవుదామా? లేక ఈ మంటలను ఆపడానికి ప్రయత్నం చేద్దామా? లేదా! బ్రిటీష్ సామ్రాజ్యవాద కబంధ హస్తాల్లో బంధీ అయిన దేశాన్ని మన ముందు తరాల వాళ్ళు మన కోసం విముక్తి చేసి సాధించి ఇచ్చిన భారతదేశాన్ని కాపాడుకుందామా? లేదా?
త్రివర్ణ పతాకాన్ని, భారతదేశం పేరును, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామా? లేదా! నేడు భారతదేశంలో ఎవరు దేశభక్తులు అనే చర్చ కొనసాగుతున్నది. దేశభక్తికి చారిత్రక ఆధారంలేని, దూరమైన సత్యవాదనలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారత జాతీయతపై కూడా తీవ్రమైన గందరగోళం సృష్టిస్తూ విషపూరిత ప్రచారానికి దేశ విచ్ఛిన్నకర శక్తులు పూనుకుంటున్నాయి.
జాతీయ స్వాతంత్రోద్యమ ఆకాంక్షల పరిరక్షణ….
మతసామరస్యం, లౌకికవాద పరిరక్షణ….
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)