‘కన్యాశుల్కం’ గొప్పేమిటో చెప్పిన కాకరాల

పురుషాధిక్య ప్రతినిధి గిరీశం:  కాకరాల

 

(రాఘవ శర్మ)

“కన్యాశుల్కంలో మధురవాణే సూత్రధారి, పాత్రధారి.
నాటకంలో ఆవిడ కేంద్ర బింధువు.

సహజంగా సాని జీవితంలో ఉండే లక్షణాలతో గురజాడ మధురవాణిని సృష్టించారు.
బ్రిటిష్ వాడు తన అవసరాల కోసం రూపొందించిన గిరీశం అప్పటి సమాజంలో ఉన్న పాత్రే” అంటారు ప్రముఖ రంగస్థల, సినీ నటులు కాకరాల.

వైద్యం కోసం ప్రముఖ నటుడు, సాహితీవేత్త  కాకరాల తిరుపతి వచ్చిన సందర్భంగా గురువారం కన్యాశుల్కం నాటకం గురించిన తన అనుభవాలను, అనుభూతులను, జ్ఞాపకాలను ఇలా పంచుకున్నారు.

‘గురజాడ గిరీశాన్ని సృష్టించ లేదు. గుర్తించాడు’ అన్న హరిపురుషోత్తం రావు మాటను గుర్తుచేశారు.
“గిరీశం భారతదేశంలో ఉండే పురుషాధిక్యత సమాజానికి ప్రతినిధి.
అచ్చోసి న ఆంబోతు, మదమెక్కిన మకురు దున్నపోతు.
అంత తేలిగ్గా ఎవరికీ లొంగడు.

గిరీశం లక్షణాలు చాలామంది మొగవాళ్ళలో ఉన్నాయి.
ఇలాంటి వారికి ముకుతాడు వేయకపోతే స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తారు.
నాటకాన్ని గిరీశం నడిపించినట్టు కనిపిస్తాడు కానీ, మధురవాణి నడిపిస్తుంది” అంటారు కాకరాల.

“మధురవాణి అనే కేంద్ర బిం ధువును పురుషుడి వేషంతో చెప్పే ప్రయత్నంతో ‘సాయంకాలమైంది’ అన్న గిరీశం మాటతో నాటకం ప్రారంభమవుతుంది.

గిరీశం ఎంత ప్రమాదకారో అతని మాటలలోనే గురజాడ చెపుతారు.
తనను తాను పొగుడుకోవడం, అన్నిటినీ నాశనం చేసేది స్త్రీనే అన్న ధోరణితో వచ్చి గిరీశం కథ నడిపిస్తాడు.
గిరీశం వర్ణనతో నాటకం మొదలైనప్పటికీ, మధురవాణి ప్రవేశించడంతో వీళ్ళను ఎక్స్ పోజ్ చేస్తూ కథను నడుపుతుంది.

కాకరాల

గిరీశం స్వభావాన్ని సౌజన్యారావు బైట పెట్టిన తరువాత మధురవాణిని, గిరీశాన్ని ఒక దగ్గర నిలబెట్టి, ఆవిడ ఎంత గొప్పదో, గిరీశం ఎంత నీచుడో చెప్పే చివరి వాక్యాలతో ముగిస్తారు”

“కన్యాశుల్కం నాటకాన్ని రమణమూర్తి, సోమయాజులు వేయించగా నాలుగైదు సార్లు నేను చూశాను.
ఆ నాటకంలో నేను ఫొటో గ్రాఫర్ పంతులు వేషం వేశాను.
సిద్ధాంతి వేషం కూడా వేశాను.
రమణమూర్తి కాన్సెప్ట్ నాకు నచ్చలేదు.
ఆయనది హీరో కాన్సెప్ట్.
తరువాత ఏ.ఆర్. కృష్ణ కన్యాశుల్కం నాటకం వేశారు.
అందులో ఏ.ఆర్. కృష్ణ రామప్పంతులు వేషం వేశారు.
ఆయన మంచి నటుడు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను ఉపయోగించుకుని నాటకాలు వేశారు.
గరికపాటి రాజారావు గారు మాత్రం ప్రభుత్వ సదుపాయాలను ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఎదురు దెబ్బలు తిన్నారు.

చలసాని ప్రసాద్ కూడా కన్యాశుల్కం నాటకం వేయించారు. అందరికంటే బాగా వేయించారు.
కాకపోతే మధురవాణి పాత్ర ధారిణి మరీ లావుగా ఉంది. కన్యాశుల్కం నాటకం నాటకంగా వేయిస్తే 8 గంటలు పడుతుంది’ అని వివరించారు.

“కన్యాశుల్కం సినిమాలో గిరీశం పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావును అడిగారు.
‘అది నెగెటివ్ క్యారెక్టర్. నాటకం కూడా నెగెటివ్. నేను వేయను’ అన్నారు.

తరువాత ఎన్టీ రామారావును ఎంపిక చేశారు. గిరీశం పాత్రలో ఎన్టీరామారావు గిరీశంలా కాకుండా, ఎన్టీరామారావు లానే కనిపిస్తారు. ఆ పాత్రకు ఆయన సూట్ కాలేదు. పేకేటి శివరాం అయితే కరెక్టుగా సరిపోతుంది” అని కాకరాల వ్యాఖ్యానించారు.

కన్యాశుల్కాన్ని వీధి నాటకంగా వేయాలి

“మనం వేసే నాటకాల్లో దుస్తులు మనవి కావు, సంగీతం మనది కాదు.
అసలు ఆ నాటకాలు మనవి కావు. మనవైన నాటకాలు రావాలి.
మనవైన నాటకాలంటే బెజవాడ కాళేశ్వరరావు మార్కెట్లో కూడా నాటకం వేయగలుగుతాం” అని నాటక కర్త రాఘవ (బళ్ళారి రాఘవ కాదు) అన్న మాటలను కాకరాల గుర్తు చేశారు.

“కన్యాశుల్కం లాంటి నిడివిగల నాటకాలు మనదైన విధంగా ప్రదర్శించడానికి మనం అనుసరించవలసిన విధానం ఏమిటంటే, నాటకాన్ని ఎక్కడపడితే అక్కడ వేసేలా సిద్ధపరుచుకోవాలి.
మహాభారతానికి కూడా ఇంగ్లీషులో స్క్రీన్ ప్లే చేశారంటే, అలాంటిది దేనినైనా చేయగలగాలి.
వీధి నాటకం రూపంలోకి కన్యాశుల్కాన్ని తీసుకురావాలి.
మహాభారతాన్ని వీధి నాటకంగా వేసినప్పుడు కన్యాశుల్కాన్ని వీధి నాటకంగా ఎందుకు వేయకూడదు?

“సూచన లేని సృజన లేదు’ అంటారు బాదల్ సర్కార్.
ఆయ‌న‌ నాటకాన్ని నడిపిస్తానంటారు.
ఆయన నుంచే వీధినాటకాలు వచ్చాయి.

కన్యాశుల్కాన్ని ఎన్ని విధాల వేయగలమో, అన్ని విధాల ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి.
నేను అర్థం చేసుకున్నంతవరకు కన్యాశుల్కంలో విస్తృతమైన జీవితాన్ని ఇమిడ్చారు.
జీవితాన్ని విస్తృతంగా ఇమడ్చడంలో ఆయన సాధించింది ఏమిటంటే, మనం చర్విత చరణంగా దాన్ని ముందుకు వెనక్కు నడిపించి, నడుస్తున్నట్టుగా దాని సారాన్ని మనం గ్రహించేలా గురజాడ తయారుచేశారు.
కన్యాశుల్కాన్ని కూడా వీధి నాటకంగా తీసుకెళ్ళ వచ్చు.” అని వివరించారు కాకరాల.

“అల్లూరి సీతారామరాజు నాటకాన్ని పడాల రామారావు విస్తృతంగా వేశారు.
నాటకంగా వేయడానికి అది అనుకూలంగా లేదు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా వేయడానికి రాజారావు ప్రయత్నం చేశారు.
ఆకుల సుబ్రమణ్యం రాసిన స్క్రిప్ట్ ఆయనకు నచ్చింది.
ఒకే స్టేజిపైన వేయగలగాలి. కర్టెన్, సెట్ మారుతుంటాయి కానీ, స్టేజి మారదు.
అలాంటి కాన్ సెఫ్ట్ ను దృష్టిలో పెట్టుకోవాలి” అని సూచించారు.

“కన్యాశుల్కం నాటకాన్ని వేసేవారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సారాన్ని గ్రహించి విస్త్రుతంగా జనంలోకి తీసుకెళ్ళే వారు మాత్రం రావలసి ఉంది.” అని ముగించారు.

Aluru Raghava Sarma
Aluru Raghava Sarma

(రాఘవ శర్మ, రచయిత, విమర్శకుడు,  సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *