ఏమి సాధించారని దేశానికి విలువలు నేర్పుతారు?

తెలంగాణా లో ఏమి సాధించారని
భారత దేశానికి విలువలు నేర్పుతారు?

(కన్నెగంటి రవి) 

పాము ఎన్ని మెలికలు తిరిగినా పుట్టలోకి సక్కగానే వెళుతుందని నిరూపిస్తూ, బీజీపీ పార్టీని ఓడించడానికి కూటమి కడతాం అని ప్రగల్భాలు పలికి దేశమంతా తిరిగి, చివరికి బిజెపి పార్టీకీ లాభం చేసేలా కేసిఆర్ భారత్ రాష్ట్ర సమితి ( నిజానికి ఇది బీజీపీ రాష్ట్ర సమితి) పార్టీని నిన్న ప్రకటించారు.

దేశానికి గానీ ,రాష్ట్రానికి గానీ బీజీపీ ప్రవచిస్తున్న ఎజెండా అత్యంత ప్రమాదకరమైనది అనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు . రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా అఖండ భారత్ లక్ష్యంగా , ముస్లిం మైనారిటీలపై తీవ్ర ద్వేషాన్ని ప్రజలలో ప్రోత్సహిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ , బీజీపీ శ్రేణులు వివిధ రూపాలలో సాగిస్తున్న ప్రచారం, కార్యక్రమాలు తెలంగాణాలో మరింత విస్తరించకుండా , తగిన కార్యాచరణను , ప్రజల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంచుతూ తగిన కార్యక్రమాలను ప్రజాస్వామిక వాదులందరూ తప్పకుండా చేపట్టాల్సి ఉంది .

కానీ ఈ మొత్తం బాధ్యతను , కే‌సి‌ఆర్ భుజస్కంధాలపై పెట్టి , ఆయనను వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని ఎవరైనా భావిస్తే, భ్రమిస్తే, అది రాష్ట్రానికి మళ్ళీ తీవ్ర నష్టం చేయడమే అవుతుంది . కేవలం ఎన్నికల ద్వారా బీజీపీ భావజాలాన్ని ఓడించడం సాధ్యం కాదని, గత రెండు దశాబ్ధాలుగా అనేక సార్లు రుజువైన వాస్తవం.

బీజీపీ పార్టీ తెలంగాణాలో బలపడకుండా చూడాలని , అందుకోసం తెరాస ను మళ్ళీ అధికారం లోకి తేవాలని కోరుకుంటున్న వాళ్ళు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న తెరాస పార్టీ పాలనా తీరు గురించి ఏం భావిస్తున్నారు ? బీజీపీ పాలనా తీరుకు భిన్నంగా , ఇక్కడ రాజ్యాంగ బద్ధ . ప్రజాస్వామిక పాలన సాగుతున్నదని భావిస్తున్నారా ? . బిజెపి కి భిన్నంగా ఏ విలువలను తెరాస పార్టీ అనుసరిస్తున్నది? ప్రజలకు స్పష్టం చేయాలి.

నాకంటే పెద్ద హిందువు ఎవరు ? అని ప్రశ్నించడం ద్వారా, ముఖ్యమంత్రి హోదాలో యజ్ఞాలూ, యాగాలూ , దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడం ద్వారా బీజీపీ ఎజెండాను తన ఖాతాలో వేసుకుని హిందువుల ఓట్లను గుండు గుత్తగా దండుకోవాలని , సుధీర్ కమీషన్ రిపోర్టు లో పేర్కొన్న ముస్లిం ప్రజల నిజమైన సమస్యలను పరిష్కరించకుండా, కేవలం మతతత్వ ఎజెండా కలిగిన MIM ను పక్కన ఉంచుకోవడం ద్వారా , ముస్లిం ఓటర్ల ఓట్లను కొల్లగొట్టాలనే యావ తప్ప నిజంగా కే‌సి‌ఆర్ భారత రాజ్యాంగం ప్రవచించిన లౌకిక స్వభావాన్ని, ప్రజాస్వామిక దృక్పథాన్ని ఎప్పుడూ కలిగి లేరు .

భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో ప్రజలలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంచడం ప్రభుత్వాల , పాలకుల బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. మరి కే‌సి‌ఆర్ ఆచరణ అందుకు అనుగుణంగా ఉందా ?

వచ్చే ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా కే‌సి‌ఆర్ వేసే అనేకానేక ఎత్తుగడలలో, ప్రస్తుతం బీజీపీకి వ్యతిరేకంగా దండెత్తడం కూడా ఒక భాగం. బీజీపీని దేశ వ్యాపితంగా ఓడించడానికి అవసరమైన , నిబద్ధత కలిగిన కార్యాచరణ గతంలో ఎప్పుడూ ఆయన చేపట్ట లేదు. కాంగ్రెస్ ను దూరంగా పెట్టి , మిగిలిన బీజీపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితం కూడా ఇవ్వలేదు .

ఇప్పుడు తాజాగా , తెలంగాణా అనుభవాలతో, దేశానికి ఎజెండా రూపొందిస్తామని , ఇది కేవలం ఎన్నికలలో ఒక పార్టీని దించి , ఇంకో పార్టీని ఎక్కించడం కోసం కాదని , దేశ సమగ్ర అభివృద్ధికి ఉపయోగ పడేలా తమ ఎజెండా ఉంటుందని అంటూ కే‌సి‌ఆర్ BRS పార్టీని ప్రకటించారు .

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కే‌సి‌ఆర్ పరిపాలనా తీరును గమనిస్తున్నవాళ్లకు ఈ ప్రకటన మరింత ప్రమాదకరంగా కనపడుతున్నది. రాష్ట్రంలో అమలవుతున్న ఏ అంశాలను జాతీయ స్థాయికి తీసుకు వెళతారు ? ఈ రాష్ట్రంలో చాలా గొప్ప పథకాలు, కార్యక్రమాలుగా కే‌సి‌ఆర్ ప్రభుత్వం, తెరాస పార్టీ ప్రచారం చేసుకుంటున్న అంశాలు నిజంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నాయా ? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించుతున్నాయా ? రాష్ట్రంలో కొందరి ఆస్తుల పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయా ? రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సూచీ పెరుగుదలకు తోడ్పడుతున్నాయా ? లోతుగా పరిశీలించాల్సిన అంశాలు కదా ఇవి?

దేశంలో ప్రజాస్వామిక పాలన అంటే ఏమిటి అన్నది రాజ్యాంగం ఎప్పుడో నిర్వచించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చేయవలసిందల్లా అటువంటి పాలనను ప్రజలకు అందించడమే. కానీ రోజు వారీ పరిపాలనలో అటువంటి లక్షణాలు ప్రదర్శించకుండా , దేశానికి ఒక కొత్త అజెండాను ఏమి రూపొందిస్తారు ? రాజరిక లక్షణాలతో పరిపాలన సాగించే వాళ్ళు ప్రజల కోసం ప్రజాస్వామిక అభివృద్ధి ఎజెండాను ఎలా రూపొందిస్తారు ?

రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో గొప్ప ముందడుగు వేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను, కొన్ని వేల కోట్ల తోనే పూర్తి చేయడానికి అవకాశం ఉండగా, వాటిని పక్కన పడేసి , తిరిగి రీ డిజైనింగ్ పేరుతో రూపొందించిన ప్రాజెక్టుల కోసం చేసిన అప్పు ఎంత ? సాధించిన ఫలితం ఎంత ? కొత్తగా సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం ఎంత?
తప్పుడు డిజైన్లతో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురై ప్రజలకు జరుగుతున్న నష్టం ఎంత?

ఈ నీటిని నిజంగా వ్యవసాయానికి అందించడానికి ఉన్న పంటల ప్రణాళిక లేమిటి ? కోకో కోలా లాంటి కంపెనీలకు నీటిని తక్కువ ధరలకే ధారాదత్తం చేయడానికి చేసుకున్న ఒప్పందాలేమిటి ? విద్యుత్ ఖర్చు పెట్టి నదుల నుండి రిజర్వాయర్ల లోకి ఎత్తి పోసిన నీళ్లెన్ని? సరైన ప్రణాళిక లేకుండా వానా కాలంలోనే మళ్ళీ నదుల లోకి తిప్పి పోసిన నీళ్ళెన్ని ? వీటన్నిటికీ జవాబులు వెతకాలి కదా ?

ఇక్కడి లాగానే దేశ వ్యాపితంగా వేల కోట్ల అవినీతి చేయడానికి , కమీషన్లు సంపాదించడానికి ,ఇక్కడి కాంట్రాక్టర్లను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడానికి తప్ప ఈ రంగంలో మంచి అనుభవాలు ఏమున్నాయని?

నీటి పారుదల ప్రాజెక్టుల కోసం సాగు భూములను బలవంతంగా సేకరించి , గ్రామాలను కూడా ఖాళీ చేయించిన ఈ ప్రభుత్వం, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా , మొదట్లో 123 జీవోనూ, తరువాత 2016 లో రాష్ట్ర స్థాయిలో మరో భూ సేకరణ చట్టాన్నీ తెచ్చి నిర్వాసితులకు అన్యాయం చేసింది .

పారిశ్రామిక ప్రాజెక్టుల పేరుతో, రంగా రెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసమూ , జహీరాబాద్ ప్రాంతంలో NIMZ కోసమూ భూములను ఇదే పద్ధతిలో ప్రభుత్వం లాక్కుంటున్నది . రీజనల్ రింగ్ రోడ్డు కోసమూ, జిల్లాలలో ఫుడ్ పార్కుల పేరుతోనూ ఇదే పద్ధతిలో భూములను కొల్ల గొడుతున్నది . ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కున్న ఈ చేదు అనుభవాలనే జాతీయ స్థాయి ఎజెండా లోకి తీసుకు వెళతారా ?

వ్యవసాయ రంగంలో గొప్ప ముందడుగులు వేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం సంక్షోభం నుండి రైతులను బయట పడేయక పోగా , నిజానికి మరింత సంక్షోభంలోకి నెట్టింది. రైతు బంధు పథకం సరిగా అమలు చేస్తే రైతులకు ఉపయోగపడే మంచి పథకం .

రైతులను సంక్షోభం నుండి బయట పడేయడానికి ఈ పథకం తెచ్చామని మొదటి జీవో లో చెప్పుకున్నప్పటికీ , దాని ఉద్దేశ్యం పక్కదారి పట్టింది . వాస్తవ సాగు దారులుగా ఉన్న 20 లక్షల మంది కౌలు రైతులను గుర్తించకుండా , వారికి ఈ పథకం క్రింద ఒక్క రూపాయి కూడా సహాయం అందించకుండా, వారి ఆత్మహత్యలకు కారణమైంది.

రైతు బీమా పథకం కూడా అంతే.. మొత్తం గ్రామీణ కుటుంబాలకు ఉపయోగ పడకుండా,కేవలం స్వంత భూమి ఉన్న వారికే ఉపయోగ పడే పథకంగా ఉంది.

సాగు చేయని భూ యజమానులకు , సాగు చేయని రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు సహాయం అందించి, వేల కోట్ల నిధులను ప్రతి సంవత్సరం దుర్వినియోగం చేస్తున్నది . రైతు బంధు సహాయం చేస్తున్నాం అనే పేరున పంటల బీమా పథకాలను ఎత్తేసింది . పంట రుణాలపై వడ్డీ రాయితీ మానేసింది. యాంత్రీకరణ , విత్తన సబ్సిడీ పథకాలకు కోత పెట్టింది.

రుణమాఫీ హామీని అమలు చేయడం లో వైఫల్యం రైతులను అప్పుల ఊబిలోకి దించింది. సంస్థాగత రుణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పంటల బీమా పథకాలను పూర్తిగా నిలిపి వేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్ట పోయినా రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయడం లేదు.

సన్న, చిన్నకారు రైతుల కోసం కాకుండా , పరోక్షంగా పెద్ద రైతులకూ , భూస్వాములకూ , వ్యవసాయేతర రియల్ ఎస్టేట్ యజమానులకూ సహాయం అందించడానికి అమలు చేస్తున్న ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో కే‌సి‌ఆర్ భిన్నంగా అమలు చేస్తారా ?

రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు . భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పథకాన్ని నామ మాత్రంగా అమలు చేసి, ఇప్పుడు పూర్తిగా నిలిపి వేసింది. ఎస్‌సి , ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులను చట్టం ఉన్నప్పటికీ కేటాయించిన దానిలో కనీసం సగం కూడా ఖర్చు చేయలేదు. పైగా చట్టం స్పూర్తికి భిన్నంగా ఆ నిధులను పక్కదారి పట్టించింది. జాతీయ స్థాయి కే‌సి‌ఆర్ సామాజిక న్యాయం ఇలాగే ఉండబోతుందా ?

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేసి , భూముల రీ సెటిల్ మెంట్ చేసి , 1973 భూ సంస్కరణల చట్టం ప్రకారం మిగులు భూములను తేల్చి , భూమి లేని పేదలకు పంచడానికి అసలు చర్చే చేయని కే‌సి‌ఆర్, పాస్ బుక్ చట్టం లో సవరణలు చేసి , దశాబ్ధాలుగా రికార్డులలో ఉన్న కౌలు రైతులను తొలగించిన కే‌సి‌ఆర్, రాష్ట్ర రైతుల రెవెన్యూ రికార్డులను తారు మారు చేసి మొత్తం రెవెన్యూ వ్యవస్థను “ధరణి” పేరుతో అతలాకుతలం చేసిన కే‌సి‌ఆర్ జాతీయ స్థాయిలో భూసంస్కరణల ఎజెండాను చేపడతారా? రెవెన్యూ వ్యవస్థను బాగు చేస్తారా ?

ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి , ఆ రాష్ట్ర విద్యా రంగం కీలక పాత్ర పోషిస్తుంది . కానీ మన రాష్ట్ర విద్యా రంగం , ముఖ్యంగా ప్రాధమిక విద్యారంగం మరణ శయ్యపై ఉందని సోషల్ డెమాక్రటిక్ ఫోరం(SDF) నివేదిక తేల్చి చెప్పింది . కే‌జి నుండి పి‌జి వరకు ఉచిత విద్యా బోధన పథకం ఎంతగా అమలయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం .

లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎట్లా అటకెక్కిందో , ఏడు వేల మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్ళనే జాతీయ స్థాయి ఎజెండాగా కే‌సి‌ఆర్ మారుస్తారా ?

రాష్ట్రాన్ని మద్యం వాడకం లో అగ్రస్థానానికి తీసుకు వెళ్లి, మద్యం పన్నుల ఆదాయంపై మొత్తం సంక్షేమ పథకాలను నడిపిస్తున్న KCR రేపు దేశానికి కూడా ఈ అంశంలో ఆదర్శంగా నిలుస్తారా?

అందుకే ఈ సంధి దశ లోనే మనం జాగరూకులై ఉండాలి . మనం బీజీపీ మతతత్వ ఎజెండాను నిలువరించాల్సిందే . అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వ నియంత పాలనను కూడా ఓడించాలి . మనం కోరుకోవాల్సింది ప్రజాస్వామిక పాలనను .

బలమైన ప్రజాస్వామిక ఉద్యమాల నిర్మాణం తో మాత్రమే అది సాధ్యం.

కన్నెగంటి రవి
కన్నెగంటి రవి

(కన్నెగంటి రవి , రైతు స్వరాజ్య వేదిక ,
ఫోన్: 9912928422)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *