‘గాంధీజీ మాత్రమే గాంధేయవాది’

 

(గాంధీజీ 153వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పల్లెపాడు గాంధీ ఆశ్రమంలో అక్టోబర్ 2 వ తేదీన ఆదివారం శ్రీరాఘవ శర్మ గారు, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, తిరుపతి, మన సాహితి సమూహం లో సభ్యుడి ప్రసంగం)

నేను గాంధేయ వాదిని కాదు.

ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణమైన గాంధేయ వాది కాదు.

ఒక్క గాంధీజీ మాత్రమే సంపూర్ణమైన గాంధేయ వాది.
అయినా గాంధీజీ ప్రభావం నా పైన ఉంది.
నా పైనే కాదు, దేశం మొత్తం పైన గాంధీజీ ప్రభావం ఉంది.
మొత్తం మానవాళి పైన అంతో ఇంతో ఉంది.
నన్ను తొలుత ప్రభావితం చేసిన హనీయుడు గౌతమ బుద్ధుడు.

తరువాత గాంధీజీ, ఆతరువాత కారల్ మార్క్స్.
సత్యం, అహింసను పాటించడం, నిరాడంబరంగా జీవించడం గాంధీజీ లాగా ఎవ్వరికీ సాధ్యం కాదు.
అందుకే గాంధీజీ ఒక్కరు మాత్రమే గాంధేయవాది అని చెపుతున్నాను.

అసలు గాంధీజీ ఏం చెప్పారు?

సత్యం, అహింస, నిరాడంబరత. అంతే కదా!
ఇవి చెప్పినంతతేలికకాదు అనుసరించడం.

ప్రేమ, త్యాగం, ధైర్యం, కారుణ్యం, ఔదార్యం, నిశ్చలత్వం; ఈ లక్షణాలున్న వారు మాత్రమే అహింసను పాటించగలరు. అన్నీ కాకపోయినా, ఈ లక్షణాలు కొన్నైనా మనలో ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఉండబట్టే గాంధీజీ జీవితాంతం అహింసా మార్గాన్ని అనుసరించారు.
అహింసను తొలుతబోధించిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. తరువాత ఏసు క్రీస్తు.
వారిద్దరి ప్రభావం గాంధీజీ పైన ఉంది,

“ఉత్తమ లక్ష్యాన్ని అధమ సాధనంతో సాధించగలమా?” అని ప్రశ్నిస్తారు గాంధీజీ. ‘హింస అధమ సాధనమా?” అన్న ప్రశ్న వెంటనే ఉదయిస్తుంది.
‘హింస ను స్థితి ప్రజ్ఞతతో ప్రయోగిస్తే, అది అధమ సాధనం కాకపోవచ్చు. స్థిత ప్రజ్ఞతను ఎందరు ప్రదర్శించగలరు?” అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు.

‘రక్త పాతం ద్వారా స్వేచ్ఛను పొందడానికి మారుగా, కొన్ని శతబ్దాలైనా స్వాతంత్ర్య సిద్ధికి నేను వేచి చూస్తాను’ అంటారు గాంధీజీ. బ్రిటిష్ వారి దాస్యం కింద విసుగెత్తిపోయిన గాంధీజీ ‘ఈనీచదాస్యంకంటే హింసే సహేతుకమేమో!?” అని రాజీ పడడానికి ప్రయత్నిస్తారు.
కానీ, రాజీపడడు.

మళ్ళీ ఆయనే ‘హింస ద్వారా వచ్చే స్వాతంత్ర్యం నాకు అవసరం లేదు’ అంటారు.

చాలా దేశాలు అణ్వస్త్రదేశాలుగా మరాక, గాంధీజీ అహింసా సిద్ధాంతం అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ అవసరం అవుతోంది. ఈ సమయంలో అహింసను కోరకపోతే మానవ జాతి సర్వనాశనమైపోతుంది.
‘ది లా దట్ వెన్ పాజిబుల్ నాన్ వాయిలెన్స్, వెన్ నెసిసరీ వాయిలెన్స్’ అంటారు అంబేద్కర్ మహాశయుడు .
‘వీలయితే అహింసను, అవసరం అయితే హింసను ప్రయోగాంచడమే న్యాయం’ అన్నది అంబేద్కర్ అభిప్రాయం.

ఈ అభిప్రయాంతో కూడా గాంధీజీ ఏకీభవించరు.
సుభాస్ చంద్రబోస్ ఎంత గొప్పదేశభక్తుడు!
అయినా ఆయనతో గాంధీజీ విభేదించారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బోసుకు, భోగరాజు పట్టాభి సీతారామయ్యకు మధ్య పోటీ జరిగింది.
గాంధీజీ మద్దతు తెలిపిన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. ‘ఈ ఓటమి పట్టాభి సీతారామయ్యదు కాదు, నాది’ అని గాంధీజీ ప్రకటిస్తారు.
ఇలా ప్రకటిండం ఎంత మందికి సాధ్యమవుతుంది.
అదే గాంధీజీలో ఉన్న స్థిత ప్రజ్ఞత. అది ఒక్క గాంధీజీకే సాధ్యమవుతుంది.

భగత్ సింగ్ విషయంలో కూడా గంధీజీ కఠువుగానే ఉన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు సుఖ దేవ్ లు పార్లమెంటులో బాంబులు విసిరారు. ఆ శబ్దానికి అంతా పరుగులు తీశారు. కొందరు కుర్చీల్లోంచి పడిపోయారు.
ఒక‌క మోతీలాల్ నెహ్రూ మాత్ర‌మే తొణ‌క కుండా బెణ‌క కుండా ఉండిపోయారు.

‘మేం బాంబులు విసిరింది ఎవరినో చంపడానికి కాదు. బ్రిటిష్ వారు మా దేశం విడిచి వెళ్ళిపొమ్మని హెచ్చరించడానికే’ అని భగత్ సింగ్, రాజగురు,సుఖదేట్లు ప్రకటించారు. అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉన్నా వారు పారిపోలేదు.

భగత్ సింగ్, రాజ్ గురు సుఖ దేవ్ లకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్ష ఖరారు చేసింది. ఆ సమయంలోనే ఇర్విన్ ఒడంబడిక జరుగనుంది.

లార్డ్ ఇర్విన్ తో గాంధీజీ సమావేశమవుతారు.
దేశమంతా ఒక ఉద్విగ్న వాతావరణం అలుముకుంది.
భగత్ సింగ్, రాజ్ గురు సుఖ దేవ్ లను ఉరి నుంచి విముక్తి కలిగించమని గాంధీజీ లార్డ్ ఇర్వినను కోరతారని దేశమంతా ఆశించింది.

ఇర్విన్తో గాంధీజీ సమావేశం ముగిసింది.
కానీ, ఆ సమావేశంలో వారి ఉరి శిక్ష రద్దు గురించి గాంధీజీ ప్రస్థావించలేదు. ఆవేశంగా ఉన్న దేశభక్త యువత గాంధీజీ చర్యలకు నివ్వెరపోయింది. లార్డ్ ఇర్విన్ కూడా తన డైరీలో ఇలా రాసుకున్నారు. ‘భగత్ సింగ్, రాజ్ గురుసుఖ దేవ్ ఉరి గురించి గాంధీజీ ప్రస్థావిస్తారేమో అనుకున్నాను.

కానీ, ప్రస్థావించలేదు. ఆశ్చర్యపోయాను.
గాంధీజీ కనుక ఉరి గురించి ప్రస్థావించినట్టయితే, ఉరిని నిలిపివేసే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించేది’ అని.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి!?

నావరకు నాకు ఇది అస్సలు మింగుడు పడని సంఘటన.
ఈ విషయంలో గాంధీజీని ఆమోదించలేను.
గాంధీజీ ఇంత మొండిఘటమా!? ఆయన అహింసా విధానం ముగ్గురి ప్రాణాలు పోకుండా నిలబెట్టలేకోపోయిందే !? అటువంటప్పుడు అహింసకు అర్థం ఏమిటి!? గాంధీజీ అహింసా విధానం ప్రకారమే అయితే దేశానికి సైన్యం ఉండకూడదు.
పోలీసులు, పారామిలటరీ బలగాలు ఉండకూడదు.
ఆయుధాలు ఉండకూడదు,యుద్ధాలు జరగకూడదు.
అస్సలు ఏమాత్రం హింస ఉండకూడదు.
ఇవి లేకుండా జాతీయ ప్రభుత్వం మనగలదా!?
సైన్యం, భద్రతా బలగాలు లేకుండా ఉండాలంటే , ఒక సంపూర్ణమైన శాంత సామ్రాజ్యం ఏర్పడాలి.
ఒక్క భారత దేశంలో ఏర్పడితే చాలదు, ప్రపంచమంతా శాంత సామ్రాజ్యాలు ఏర్పడాలి.
కనుచూపు మేరలో అది ఎక్కడా కనిపించడం లేదు.
ఇవ్వన్నీ ఆలోచిస్తే గాంధీజీ అహింస కొంత ఊహాజనితమనిపిస్తుంది.

గాంధీజీ హిందూ మతంలో పుట్టారు.
బాలగంగాధర్ తిలక్ గాంధీజీకి గురుతుల్యులు.
భగవద్గీత అంటే తిలక్ లాగా గాంధీజీకి కూడా భక్తి భావం ఎక్కువ.

కానీ, గాంధీజీ పైన హిందూ సంస్కృతి ప్రభావం చాలా తక్కువ. బౌద్ధ, జైన, క్రైస్తవ మత సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది.

బౌద్ధ, జైన, క్రైస్తవ మత సిద్ధాంతాల సారాన్నంతా కలిపి గాంధీజీ సత్యం, అహింస అన్న రెండు పదాలలో కుదించారు. వాటిని సంపూర్ణంగా అనుసరించడం చాలా కష్టతరమైనవి. సత్యం, అహింస ప్రేరేపితులైన గాంధీజీ ఆ మార్గంలోనే నడిచారు.

వాటి వెంట నడిచే వారు అనేక త్యాగాలు చేయాలి, కష్టాలను ఎదుర్కోవాలి, కడగండ్ల పాలు కావాలి, ప్రతిఫలాన్ని ఆశించరాదు, ప్రతీకారేచ్ఛ కోరుకోకూడదు.
చివ‌రికి ఆత్మార్పణ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
నిజ‌మైన బౌద్ధ భిక్షువులు, రోమన్ క్యాథలిక్కుల వలె ‘నేను’ ‘నాది’ అనేది చంపుకోవాలి. రవీంద్రనాథ్ టాగూర్ లాగా గాంధీజీ కూడా భిన్న మతాలు, భిన్న సంస్కృతుల సమన్వయాన్ని ఆకాంక్షించారు.

‘భారత దేశం హిందూ రాజ్యం కావాలని కోరడం మనజాతీయ లక్ష్యానికి విరుద్ధం’ అంటారు గాంధీజీ.
ప్రాచీన సందేశాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అనుసంధానించడం గాంధీజీ ప్రత్యేకత.

1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది.
ఆ రోజు దేశానికి పర్వదినం.
దేశమంతా స్వాతంత్ర్యోత్సవ సంబరాలు జరుగుతున్నాయి.
ఊరూవాడా జాతీయ పతాకాలు ఎగురవేస్తున్నారు.
కానీ గాంధీజీ ?

ఆరోజు ఢిల్లీ నుంచి కలకత్తా వెళ్ళిపోయారు.
జాతీయపర్వదినం అని అంతా పండుగ చేసుకుంటుంటే గాంధీజీ మాత్రం నిరాహార దీక్ష చేశారు. దేశ విభజన ఆయన మనసును తీవ్రంగా గాయపరిచింది.
దేశాన్ని రెండు ముక్కలుగా చేసి, లక్ష మంది ప్రాణాలను బలిగొన్న స్వాతంత్ర్యం గాంధీజీ దృష్టిలో అసలు స్వాతంత్ర్యమే కాదు.

పాకిస్థాన్ లో ఉన్న హిందువులు భారత్ వచ్చేస్తున్నారు.
భారత్ లో ఉన్న ముస్లింలు పాకిస్థాన్ తరలి వెళ్ళిపోతున్నారు. దేశమంతా హిందూ ముస్లిం గొడవలతో హింస చెలరేగింది. ‘ఇంత హింసతో వచ్చేది నిజమైన స్వాతంత్ర్యం కాదు’ అన్నది గాంధీజీ అభిప్రాయం.
ఈ హింసాకాండలో లక్ష మంది చనిపోయారు.
అందుకునే ఆయన మనసు బాగా గాపడింది.
‘దేశంముక్కలైతే పండగలేమిటి?’అన్నారు.
‘హింస కారణంగా వచ్చినది నిజమైన స్వాతంత్ర్యం కాదు’ అని గాంధీజీ అంటారు. ఇతరులు చాలా మంది ఇది నిజమైన స్వాతంత్ర్యం కాదన్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనే కవి ఒక్క అరుపు అరిచాడు. ఏ ఆజాదీ ఝటీ హై’ అని.
అంటే ‘ఈ స్వాతంత్ర్యం బూటకం’ అని.
ఆ అరుపునకు ఇక్కడ కూడా ప్రతిధ్వనులు వినపించాయి.
‘ఈ స్వాతంత్ర్యం ఒక బూటకం. ఈ ఎన్నికలు ఒక నాటకం’ అన్నాడు అరుద్ర. ‘అసలిది స్వాతంత్ర్యమే కాదు కేవలం అధికార మార్పిడి’ అన్నారు కొందరు.
. ‘మనకు ఆర్థిక స్వాతంత్ర్యం రాలేదు, కేవలం రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే వచ్చింది’ అని మరి కొందరు అన్నారు.

స్వాతంత్ర్యం రాలేదని, వచ్చినా పాక్షికమని చెప్పడానికి ఎవరి కారణాలు వారికున్నాయి.

దేశవిభజన సమయంలో హింస ప్రజ్వరిల్లింది.
‘లక్షమంది ప్రాణాలను బలిగొన్న స్వాతంత్ర్యం స్వాతంత్ర్యమా!? అన్నది గాంధీజీ ప్రశ్న.
‘జీవితేచ్ఛ నాలో నశిస్తున్నది’ అని అనేవారు గాంధీజీ.
‘త్వరాలో వెళ్ళిపోవాలి’ అని కూడా అనేవారు చివరి రోజుల్లో.

‘ఎంత త్వరగా వెళ్ళిపోతే అంతమంచిది’ అనే వారు.
గాంధీజీ కన్న కలలు పీడకలగా మారిపోయాయి.
ఆయన కట్టిన సౌధాలు కళ్ళముందే పేకమేడల్లా కూలిపోయాయి.

నిజానికి గాంధీజీ మరణాన్ని ఎప్పుడూ కోరుకోలేదు.
అదే సమయంలో మరణానికి ఎప్పుడూ వెనుకాడనూ లేదు. గాంధీజీని 1948 జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే హత్యచేశాడు.
గాంధీజీ ప్రబోధాల ప్రకారం అయితే గాంధీని చంపిన గాడ్సేని శిక్షించకుండా వదిలేయాలి.
గాడ్సేని వ‌దిలేయ‌డం సాధ్యమా!?
గాంధీజీ జీవించిన నాటి కంటే ఇప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి బాగా జరిగింది.
కానీ, మన నైతిక విలువలు, సత్యానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా దారుణంగా దిగజారిపోయాయి.
‘నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారు పుట్టుకతో తెలివి తక్కువ వారు’ గా పరిగణించబడుతున్నారు.
అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, అప్లైశ్వర్యాల సంపద ; ఇవే రాజకీయనాయకుల లక్ష్యం.

ఈ రోజు గాంధీజీ బతికుంటే ఆయనకు ఊపిరాడేదికాదు.
నీళ్ళలోంచి బయటపడిన చేపలా గిలిగిలా కొట్టుకునే వారు.

ప్రేమకు మారుగా ద్వేషం, జీవకారుణ్యానికి మారుగా హింసకు మన హృదయంలో స్థానమిచ్చినప్పుడల్లా మనం గాంధీజీని హత్య చేస్తూనే ఉన్నాం.
సంఘ క్షేమాన్ని వ్యక్తిగత ప్రయోజనానికి బలి పెట్టినప్పుడు, దేశాభివృద్ధిని స్వీయాభివృద్ధికి బలి పెట్టినప్పుడు మనం గాంధీజీని హత్య చేస్తూనే ఉన్నాం.
నిరుపేదల గొంతునుంచి ‘అన్నమో రామచంద్రా’ అని వినిపించినప్పుడల్లా మహాత్ముని గుండె చీరుకుపోతోంది.
‘మానాన్ని కాపాడుకోవడానికి బట్టలులేవు కదా’ అని పేదలు నిట్టూర్పు విడిచినప్పుడల్లా , ఆ ప్రతి నిట్టూర్పు ఆయన వెన్నులో బాకులా దిగుతోంది.

ఈ పరిస్థితిని కొనసాగించడం వల్ల ప్రతి ఏడాది కొన్ని వేల సార్లు, కాదు కొన్ని లక్షల సార్లు, కాదు కాదు కొన్ని కోట్ల సార్లు మహాత్ముని మనం హత్యచేస్తూనే ఉన్నాం.
బుద్ధుడు జన్మించిన దేశంలో బౌద్ధానికి స్థానం లేదు.
అలాగే గాంధీజీ జన్మించిన దేశంలో ఆయన తత్వానికి స్థానం లేకుండా పోయింది.

‘కొల్లాయితో పిచ్చి పుల్లాయి వలె నుండు ఆయన దీక్ష లోకానికి రక్ష’ అంటారు కరుణశ్రీ.
గాంధీజీ పిట్టలా, పీలగా ఉన్నా, తత్వంలో ఉక్కు సంకల్పం. ప్రతి ద్వందులను కూడా తనపక్కక్కు తిప్పుకోగల సామర్థ్యం గలవాడు.
ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకునే వాడు.
‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’ అని శ్రీశ్రీ అంటే, దానికంటే ముందే గాంధీజీ ‘తాజ్ మహల్ నిర్బంధ కాయకష్టానికి చిహ్నం’ అంటారు.
గాంధీజీ భారతదేశానికి అపురూపమైన ప్రతినిధి.
కొల్లాయి గట్టుకుని, భారత రైతాంగానికి ప్రతినిధిగా నిలిచిపోయారు.

స్వరాజ్య సాధన, అస్పృశ్యతా నివారణ, జాతి, మత విద్వేషాల నివారణ, కుటీర పరిశ్రమల పునరుద్ధరణ, మద్యపాన నిషేధం వంటివన్నీ పట్టుదలతో ఎంతో కొంతైనా గాంధీజీ సాధించినవే.

‘రాజ్యద్రోహాన్ని ప్రేరేపించిన అర్ధదిగంర సన్యాసి’ అని నిందించిన బ్రిటిష్ వారే ఆ తరువాత తమ మాటలకు సిగ్గుపడ్డారు.

గాంధీజీ శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇచ్చారు.
కేవలం మేధస్సుతో పనిచేస్తే చాలదు, ప్రతిమనిషి కొంతైనా శారీరక శ్రమచేయాలంటారు.
గాంధీజీ రోజుకు 15 కిలోమీటర్ల వరకు నడిచేవారు.
కేవలం ఆరు గంటలే నిద్రపోయేవారు.
తన క్షవరం తానే చేసుకునే వారు. చీపురు పట్టుకుని ఊడ్చేవారు.
మరుగుదొడ్లను శుభ్రం చేసేవారు.
బద్దకం, భయం, అసహ్యం ఆయనకు తెలియదు.
పత్రికలకు వ్యాసాలు రాసేవారు.
తన వ్యాసాలను తానే టైప్ చేసేవారు.
నూలు వడికేవారు.
బట్టలు నేయడం కూడా వచ్చు.
రాట్నం వడకడం పరిశ్రమలకు ప్రత్యామ్నాయం కాదు.
నిరుపేదల నగ్న శరీరాలను కప్పడానికే రాట్నం చేపట్టారు.

ఆకలితో ఉన్నవారిని చూసి మనం కలత చెందకపోతే గాంధీజీపట్ల మనకు ప్రేమ లేనట్టే.
ఒంటి నిండా దుస్తులు లేక చలికి , ఎండకు బాధపడే వారిని చూసి మనం బాధపడకపోతే గాంధీజీ పట్ల మనకు ప్రేమలేనట్టే.

సాంఘిక దురాచారాల పట్ల మనకు జుగుప్స లేకపోతే, సంఘ వంచితుల పట్ల మనకు కలవరం లేకపోతే గాంధీజీ స్మృతికి మనం అపచారం చేసినట్టేలెక్క.
గాంధీజీ ప్రభోదాలను పుస్తకాలలో కాదు, మన హృదయంలో నిలపాలి.

అందరికీ తిండి, బట్ట, ఇల్లు, ఆరోగ్యం, చదువు, విజ్ఞానం, శాంతి, భద్రతను గాంధీజీ ఆకాంక్షించారు.
అవిసాధించినప్పుడే గాంధీజీకి మనం అర్పించే నిజమైన నివాళి.

గాంధీ నిరాడంరతను,నిజాయితీని ఇతరులకంటే కమ్యూనిస్టులే ఎక్కువగా అనుసరించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారిని చూశాను.

ఆయన సామ్యవాద భావాలున్న వారు.
గుంటూరులో ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాను.
ఎంత నిరాడంబరం! ఒక గదిలో చెక్క బెంచీ పైన దుప్పటి వేసుకుని పడుకునే వారు.
దానిపైనే కూర్చునే వారు.
గదిలో అంతాపుస్తకాలు.
గాంధీ లాగా కొల్లాయి కట్టారు.
ఖద్దరు చొక్కా వేసుకునే వారు.
చేతిలో గుడ్డసంచి. బతికినంతకాలం చాలా నిరాడంబరంగా బతికారు.

సుందరయ్య గారు ఎంత నిరాడంబరంగా, నిజాయితీగా జీవించారో వేరే చెప్పనవసరం లేదు.
చండ్ర రాజేశ్వరరావుగారు కూడా అంత నిరాడంబరులు.
గాంధీజీ చనిపోయేనాటికి ఆయనకు జతచెప్పులు, కళ్ళద్దాలు, పుస్తకం, గిన్నె ఉన్నాయి.
చండ్ర రాజేశ్వరరావు వీలునామా చదివితే ఆశ్చర్యం వేస్తుంది.

‘నాకున్న రెండు పంచెలు, రెండు చొక్కాలు పేదలకు ఇవ్వండి. పుస్తకాలు లైబ్రరీకి ఇవ్వండి’ అని వీలునామా రాశారు.

గాంధీ ప్రాపంచిక దృక్పథాన్ని కమ్యూనిస్టులు అంగీకరించకపోవచ్చు.
కానీ, నిరాడంబరతను, నిజాయితీని కాంగ్రెస్ వారి కంటే కమ్యూనిస్టులే ఎక్కువగా ఆచరించారు.
గాంధీజీ ఆర్థిక విధానాలు నచ్చకపోవచ్చు.
ఆయన రాజకీయాలు నచ్చకపోవచ్చు.
ఆయన మత సూత్రాలు నచ్చకపోవచ్చు.
సాంఘిక సంస్కరణలు నచ్చకపోవచ్చు.
కానీ ఆయన ప్రభావం భారతదేశంలో చాలా మంది పైన ఉంది.

గాంధీ మహాత్ముడు మన మధ్య జన్మించడం మన అదృష్టం. ఆ మహాత్ముడు మన మధ్యనే హత్యకు గురికావడం మనకు సిగ్గు చేటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *