(రాఘవ శర్మ)
చుట్టూ ఎత్తైన పచ్చని చెట్లు.
మధ్యలో ప్రశాంత వదనంతో ఓ ఆశ్రమం.
గాంధీజీ నడయాడిన ప్రాంతం.
మహాత్ముడు నిద్రించిన చోటు.
జాతిపిత ప్రారంభించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం.
నెల్లూరుకు పదకొండు కిలోమీటర్ల దూరంలో వందేళ్ళ క్రితం గాంధీజీ అడుగిడడంతో, కులవివక్ష సడలి, శాంతి పల్లవించిన పల్లెపాడు గ్రామం.
అప్పటి వరకు ఆతోట బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే విప్లవ కారులకు ఆశ్రయమిచ్చింది.
బాంబులను తయారు చేసి, వారికి సాయుధ శిక్షణనిచ్చింది.
చరిత్ర చెక్కిలి పై చెరగని సంతకం లా అది ఇలా నిలిచి పోయింది.
ఆ చరిత్రకు మౌనసాక్షిగా పక్కనే పెన్నానది.
ఇప్పుడు తానేమీ ఎరగనట్టు, ఎంతో గంభీర వదనంతో పినాకినీ ప్రశాంతంగా ప్రవహిస్తోంది.
గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున గాంధీజీ ఆశ్రమాన్ని నెలకొల్పారు.
ఆ తరువాత అలాంటి ఆశ్రమమే దక్షిణాదిన తొట్టతొలిసారిగా పల్లెపాడులో వెలిసింది.
గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ 2వ తేదీ ఆదివారం పల్లెపాడు ఆశ్రమాన్ని సందర్శించాను.
నెల్లూరు నుంచి దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమం.
మైపాడు వెళ్ళే దారిలో కొంత దూరం వెళ్ళాక ఎడమ వైపునకు తిరిగితే పల్లెపాడు వెళ్ళేదారి వస్తుంది.
అది 1921 ఏప్రిల్ 7వ తేదీ.
విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే రైలు నెల్లూరు స్టేషన్‌లో ఆగింది.
వందేమాతరం నినాదాలతో రైల్వే స్టేషనంతా మారుమోగుతోంది.
ఒక బోగీలోంచి గాంధీజీ దిగారు.
పొణకాకనకమ్మ, చతుర్వేదుల వెంకట కృష్ణయ్య, దిగుమర్తి హనుమంతరావు, తిక్కవరకు వెంకటరెడ్డి తదితరులు గాంధీజీని వెంటబెట్టుకుని బయటకు వచ్చారు.
ఎద్దుల బండ్లలో పల్లెపాడు బయలుదేరారు.
వెనుక లెక్కలేనన్ని ఎద్దుల బండ్ల కన్వాయ్ కదిలింది.
పెన్నానది పొర్లు కట్టల దిగువ భాగంలో ఇసుకలో గాంధీజీ ఎక్కిన ఎద్దుల బండి మొరాయించింది.
కొందరు చక్రాలను తిప్పినా ముందుకు కదలడం లేదు.
ఎద్దులను కొడుతున్నారు, తొక మెలిపడుతున్నారు.
అయనా లాభం లేదు.
తన వల్ల ఎద్దులు దెబ్బలు తింటున్నాయని గాంధీజీ బండినుంచి దూకేసి, పంచె బిగించి నడక ప్రారంభించారు.
అప్పటికే గాంధీజీని చూడడానికి పల్లెపాడుకు వేలాదిమంది జనం తరలివచ్చారు.
ఆ గ్రామస్తులు గాంధీజీని ఆహ్వానించారు.
కానీ ఆయన గ్రామంలోకి ప్రవేశించలేదు.
పల్లెపాడు బ్రాహ్మణ అగ్రహారం.
ఒక ప్రధాన వీధి వీధంతా బ్రాహ్మలే!
అక్కడ సామాజికంగా వారిదే ఆధిపత్యం, పెత్తనం.
భూములున్న రెడ్లు అయినా, ఎంత ఆసాములైనా ఆ వీధిలో చెప్పులు చేతపట్టుకుని నడవాల్సిందే.
చెప్పులు వేసుకుని పొలాల్లోకి వెళ్ళాలంటే, పక్కనే ఉన్న మాల వాడ మీదుగానే వెళ్ళాలి.
ఆ వీధిలోకి హరిజనులకు అసలు ప్రవేశమే లేదు.
బ్రాహ్మణ వీధిలోకి చెప్పులతో హరిజనులను రానిస్తేనే తాను గ్రామంలోకి ప్రవేశిస్తానని గాంధీజీ పట్టు బట్టారు.
గ్రామ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు.
ఎట్టకేలకు గాంధీజీ షరతులకు ఒప్పుకున్నారు.
ఆరోజు 1921 ఏప్రిల్ 7వ తేదీ .
తొలిసారిగా హరిజనులు, బ్రాహ్మణేతరులు చెప్పులతో గాంధీజీ వెంట బ్రాహ్మణ వీధిలో నడిచారు.
బ్రాహ్మణ వీధిలో ఎవరైనా సరే నడవడానికి ఉన్న ఆంక్షలు అప్పటి నుంచి తొలగిపోయాయి.
పినాకినీ నది ఒడ్డున పూరిపాకల్లో పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీజీ ప్రారంభించారు.
గాంధీజీ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడే సాయుధ పోరాట సన్నాహాలు ప్రారంభ మయ్యాయి.
ఆ సన్నాహాలకు పొణకాకనకమ్మ ఆద్యులు.
తమిళనాడుకు చెందిన సాయుధ విప్లవ నాయకుడు వి.ఓ . చిదంబరం పిళ్ళైతో, ఉన్నవ లక్ష్మినారాయణతో వెన్నెల కంటి రాఘవయ్య సంబంధాలు పెట్టుకున్నారు.
రహస్యంగా రివాల్వర్లు, బాంబులు దాచడానికి, తుపాకుల శిక్షణకు అనువుగా ఉంటుందని పెన్నానది ఒడ్డున 20 ఎకరాల భూమిని పొణకాకనకమ్మ 1918లో కొనుగోలు చేశారు.
సాయుధ కార్యకలాపాలు కొంత కాలం సాగాయి.
సాయుధ శిక్షణ పొందుతున్న చతుర్వేదుల వెంకట కృష్ణయ్య సాయుధ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి, దిగుమర్తి హనుమంత రావుతో కలిసి సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ వద్ద శిక్షణ పొందుతున్నారు.
గాంధీజీ సూచన మేరకు వారిరువురు నెల్లూరు బయలు దేరి గాంధీ ఆశ్రమానికి సన్నాహాలు చేశారు.
పొణకాకనకమ్మ తానుకొన్న భూమినంతా ఆశ్రమానికి ఇచ్చేశారు.
గాంధీజీ ఇక్కడ ఆశ్రమాన్ని ప్రారంభించడడంతో రహస్య కార్యకలాపాలు ఆగిపోయాయి. అంతా గాంధీజీ అడుగుజాడలలో నడవడం ఆరంభించారు.
అప్పటి నుంచి జిల్లాలో పల్లెపాడు స్వాతంత్ర్యోద్యమానికి కేంద్రమైంది.
గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్య మం, శాసనోల్లంఘన ఉద్యమానికి ఈ ఆశ్రమం కేంద్రమైంది.
స్వాతంత్ర్యోద్యమంలో పొణకాకనకమ్మ సహా అనేకమంది జైళ్ళపాలయ్యారు. గాంధీజీ 1929 మేనెలలో నెల్లూరు జిల్లాలో రెండవ సారి పర్యటించారు.
ఈ సందర్భంగా పొణకాకనకమ్మ తన ఒంటిపైన ఉన్న నగలనన్నిటినీ తీసి స్వాతంత్ర్యోద్యమానికి అర్పించారు.
అప్పటి నుంచి మరెప్పుడూ ఆమె నగలను ధరించలేదు.
గాంధీజీ మైపాడు ప్రాంత గ్రామాలలో పర్యటించినప్పడు ఈ పినికినీ ఆశ్రమంలోనే ఒక రాత్రి బస చేశారు.
గాంధీజీ కోరిక మేరకు దక్షిణాఫ్రికాలో ఆయన స్నేహితుడు రుస్తుంజీ ఈ ఆశ్రమానికి పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
ఆ డబ్బుతో 1925లో పెంకులతో ఆశ్రమ భవనాన్ని నిర్మించారు. దానికి రుస్తుంజీ భవనం అని నామకరణం చేశారు.
ఈ ఆవరణలోనే గాంధీజీ చిత్రాల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
గుజరాత్‌కు చెందిన దాతలు తమ నిర్మాణ శైలిలో మట్టితోనే ఒక అతిథి గృహాన్ని ఇక్కడ నిర్మించారు.
ఈ ఆశ్రమంలోని పొలాలను రైతులకు కౌలుకు ఇచ్చారు.
మూడెకరాలలో మామిడి తోటను పెంచారు.
దాదాపు నాలుగు ఎకరాలభూమి పెన్నానది కోతకు గురైంది.
రివిట్ మెంట్‌తో కరకట్ట నిర్మించకపోతే మరెంత భూమి కోతకు గురవుతుందో తెలియదు.
గాంధీజీ ఆశయం మేరకు మద్యనిషేధంలో భాగంగా డీఅడిక్షన్ సెంటర్ పెట్టాలన్నది ఈ ఆశ్రమ కమిటీ ఆశయం.
నిధుల కొరతతో ఆది ముందుకు సాగడం లేదు.
గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా మూడు సార్లు పనిచేసిన ఐసిఎస్ అధికారి రావు బహద్దూర్ రామచంద్రరావు ఈ ఆశ్రమంలోనే వసారా వేయించుకుని ఉండేవారు.
ఉద్యోగ విరమణ తరువాత కూడా ఆయన ఆ ఆశ్రమ వసారాలోనే ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన వారు ఉద్యోగ రీత్యా ఎక్కడ స్థిర పడినా, గాంధీజీ జయంతికి, వర్ధంతికి ఈ ఆశ్రమానికి వస్తారు. సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆశ్రమం ప్రశాంత వాతావరణంలో ఉంది.
ఒకపక్క పెన్నానది పరవళ్ళు, మరొక పక్క పచ్చని చెట్ల మధ్య ఆశ్రమం.
గాంధీజీ జ్ఞాపకాలు, పొణకాకనకమ్మ, వెన్నెలకంటి రాఘవయ్య వంటి స్వతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ఈ పినాకినీ ఆశ్రమం పులకించిపోతోంది.
ఇదొక చారిత్రక ప్రాంతం. ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రం.
(రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)