బిఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండాలి?

బీజేపీ కాంగ్రెస్ కంటే ఉన్నత ఆశయాలతో
ముందుకు పోతే ప్రజలు ఆదరించ వచ్చు!

 

వడ్డేపల్లి మల్లేశము

రాజకీయ పార్టీకి ప్రధానమైన అంశం బలమైన సిద్ధాంత ప్రాతిపదిక అది ప్రజా కోణంలో , రాజ్యాంగానికి లోబడి, స్వప్రయోజనాలు ప్రలోభాలు అతి వాగ్దానాలు ఉచితా ల తో మాత్రమే పరిపాలన చేయడానికి సిద్ధ పడకుండా, నిర్మాణాత్మకంగా వ్యవహరించ గలగాలి . ప్రజల సమస్యల పైన అవగాహన, ప్రాంతాల సమస్యలపైన జాతుల సమస్యలపైన పరిష్కార ధోరణి, ఇతర దేశాలతో సంబంధాల పట్ల సమన్వయ ధోరణి ఉన్నప్పుడు మాత్రమే ఒక జాతీయ పార్టీ దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలదు. కొంతవరకైనా ప్రజలు మెచ్చిన పాలన అందించగలదు. 1947 నుండి 1991 వరకు దేశంలో కొనసాగిన టువంటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని పరిపాలన అత్యవసర పరిస్థితి వంటి కొన్ని లోపాలు ఉన్నా నాటితరం విద్యావంతులు కావడం సామాజిక చింతన తో స్వార్థపూరితంగా చట్టసభగల్లో పని చేసిన కారణంగా పరిపాలన సజావుగానే సాగింది అనడంలో సందేహం లేదు.

1991 తర్వాత ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ కారణంగా సామ్రాజ్యవాద ధోరణి ప్రబలంగా ప్రపంచమంతా వ్యాపించిన వేల నాటి పీవీ నరసింహారావు గారి ప్రభుత్వము ప్రైవేటీకరణ వైపుగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఆ తదనంతర కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు కర్మాగారాలు క్రమంగా ప్రైవేటుపరం కావడం కొనుగోలు శక్తి తగ్గి ప్రజాజీవనం చిన్నాభిన్నమై జీవనప్రమాణాలు తగ్గిపోయిన మాట వాస్తవం. 1978 ప్రాంతంలో వచ్చిన జనత పార్టీ పరిపాలన మధ్యలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇటీవల 2014 నుండి కొనసాగుతున్న టువంటి ఎన్డీఏ నాయకత్వంలోని ప్రభుత్వాలు కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా కొంత సొంత ఎజెండాతో పాలిస్తున్న కారణంగా ప్రజలు అసంతృప్తికి గురవుతున్న మాట వాస్తవం. ఇటీవలికాలంలో పార్లమెంటులో చర్చ సరిగా లేకుండా ఏకపక్షంగా బిల్లును ఆమోదించిన ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉంటే సుప్రీంకోర్టు కూడా ధృవీకరించిన సందర్భాలు అనేకం. అంతేకాకుండా ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి ఏకపక్షంగా బిల్లును ఆమోదించిన అపప్రధ కేంద్ర ప్రభుత్వానికి ఉండనే ఉన్నది . ప్రభుత్వ రంగ సంస్థలను క్రమంగా ప్రైవేటుపరం చేస్తూ విద్య వైద్యం న్యాయము ఉచితంగా అందించకుండా ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా నిర్వీర్యం చేసిన పాలన ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇటీవల సుప్రీం కోర్టులో ఉచితాల పైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మతతత్వ పార్టీ అని ముద్రవేసి ప్రతిపక్షాలు ఇంతకంటే మెరుగైన పాలన అందిస్తామని కాంగ్రెస్ మిగతా పార్టీలతో పాటు కొత్తగా వస్తున్న పార్టీలు ప్రచారం చేయడాన్ని గమనించవచ్చు.
బిజెపి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం పరిపాలనకు సంబంధించిన అంశాల పైనే కాకుండా కేంద్ర పాలసీకి సంబంధించిన విషయాల పైన కూడా విమర్శిస్తూ తూర్పారబడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన సందర్భాలు కూడా అనేకం.

కెసిఆర్ నాయకత్వంలో బి.ఆర్ఎస్. పార్టీ

రాష్ట్రాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దినట్లు దేశంలో అన్ని రంగాల్లో నంబర్వన్గా కొనసాగుతున్నట్లు మంత్రులు కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే వల్లిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా ఘర్షణలకు పాల్పడటమే కాకుండా అన్ పార్లమెంటరీ పదజాలంతో రోజు విమర్శలు కొనసాగుతున్న వేల బిజెపి ప్రభుత్వం కంటే మెరుగైన పాలన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మార్చనున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించి అక్టోబర్ 2, 2022 ఆదివారం రోజున అన్ని జిల్లాల అధ్యక్షులు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది భారత్ వికాస్ సమితి ,భారత రాష్ట్ర సమితి అనే పేర్లను ప్రతిపాదించిన ప్పటికీ చివరికి ఆ వైపే మొగ్గు చూపినట్లు గా కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఒక పార్టీ పెట్టేముందు జాతీయ దృక్పథం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన అవగాహన, ఇతర దేశాలతో సంబంధాలు, జాతుల సమస్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వంటి కీలకమైన అంశాలపైన స్పష్టమైన అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటివరకు భారత్ రాష్ట్ర సమితి పక్షాన ఏర్పడబోయే పార్టీ యొక్క విధి విధానాలు ఎజెండా ఏరకంగానూ ప్రకటించడం జరగలేదు . కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల కొన్ని రాష్ట్రాలను పర్యటించిన సందర్భంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో తద్వారా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసి ప్రధానమంత్రి కావాలని ఈ పార్టీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను కొడుకు కేటీఆర్ కు అప్పగించడానికి మాత్రమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన వస్తున్న విమర్శలను అడ్డుకోవడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి మాత్రమే బి ఆర్ఎస్ తెరమీదికి వచ్చిందని కూడా కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు .

ఎజెండా ప్రకటించిన తర్వాతనే పార్టీ స్థాపించడం శ్రేయస్కరం 

అక్టోబర్ 5 రెండువేల 22 బుధవారం దసరా పండుగ రోజున పార్టీని ప్రకటించనున్న ట్లు ఆ తర్వాత ఏదో ఒక ప్రాంతంలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి కోరుకున్నట్లు కొడుకు కేటీఆర్ ను రాష్ట్ర చీఫ్ గా నియమించనున్నట్లు కరీంనగర్ టైమ్స్ వంటి కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురించబడిన వేళ పార్టీ ఎ జెండా లోని అంశాలు ఏమిటి ?మేనిఫెస్టో ఎలా ఉంటుంది? నిబంధనావళి ఏమిటి? అనే అంశాలను ప్రకటించకుండా పార్టీని ప్రకటించినంత మాత్రాన ప్రజలు స్పందించే అవకాశం అంతగా ఉండదు. బీజేపీతో సహా కాంగ్రెస్ ఇతర దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఘాటుగా విమర్శిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత టిఆర్ఎస్ పార్టీ దానికి భిన్నమైన రీతిలో తమ ఎజెండా అంశాలను ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. మేధావులు ఆలోచిస్తారు. ప్రేమిస్తారు. విశ్లేషకులు చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది అని నాయకత్వం గ్రహించవలసి ఉన్నది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఏ రకంగా అయితే విమర్శిస్తున్నారో ఆ వైఫల్యాలు పునరావృతం కాకుండా ఉండడం కోసం మీ ప్రణాళిక ఏమిటి? అని ఇతర పార్టీలు, ప్రజలు, ప్రశ్నించినప్పుడు సమాధానము ఉండాలంటే ముందుగా విధివిధానాలను ఖరారు చేయడమే ఉత్తమము. ప్రజల కోణంలో అజెండా ప్రకటించన టువంటి ఏ పార్టీ కూడా రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు అనేది నగ్నసత్యం .

ఇప్పటికే టిఆర్ఎస్ పైన కొన్ని విమర్శలు 

తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న టువంటి తెరాస పార్టీ గత8 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఏరకంగా పరిపాలించినది అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆలోచించి పరిశీలించే అవకాశం ఉంటుంది . గూట్లో రాయితీని వాడు ఏట్లో రాయ్ తీస్తాడా అనే సామెత మనకు ఉన్నది. అందుకోసమే రాష్ట్రాన్ని ఏ రకంగా సమర్థవంతంగా పరిపాలన చేసాడో దానికి ఆనవాళ్లను పరిశీలించినప్పుడు సవాలుగా తీసుకొని చూపెట్టడానికి రుజువులు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని వైఫల్యాలను ప్రస్తావించక తప్పదు . 1గుట్టల ప్రకృతి విధ్వంసం కొనసాగుతున్నది ప్రభుత్వం ఏనాడూ కూడా అడ్డుకోలేదు. ఇచ్చిన అనేక హామీలు తుంగలో తొక్క బడినవి అఖిలపక్ష ప్రజాసంఘాల తో సమావేశం జరగలేదు. ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించిన దాఖలా లేదు పైగా ప్రశ్నించిన ఎటువంటి హక్కుల కోసం పోరాడిన టువంటి రైతులకు బేడీలు వేసిన టువంటి ఘనచరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది. 2దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని భూమిలేని పేదలకు మూడు ఎకరాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. 3ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పటికీ కోట్లాది రూపాయల అవినీతితో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది.4 మిషన్ భగీరథ పేరును ఐదు వేల కోట్లతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకం వృధాగా పోవడమే కాకుండా ఆ నీటిని తాగడానికి ఎవరు ఉపయోగించడం లేదు పైగా రోడ్ల విధ్వంసం కొనసాగింది. 5 గత ప్రభుత్వాల కంటే మిన్నగా కార్యాలయాల్లో అవినీతి విచ్చలవిడిగా కోట్ల రూపాయలతో కొనసాగుతున్న అత్యాచారాలు జరిగినప్పుడు విద్యాసంస్థలలో ఫుడ్ పాయిజనింగ్ తో సమస్యలతో అనేక మంది రోడ్డున పడి చనిపోయినప్పుడు వీఆర్ఏ లాంటి చిరు ఉద్యోగులు నెలల తరబడి సమ్మె చేసినా స్పందించి నటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతారు అని చరిత్రకారులు సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. 6బతుకమ్మ పండుగకు 360 కోట్ల రూపాయల ఖర్చుతో చీరలను ప్రజలకు అందించినప్పటికీ గత నాలుగైదు సంవత్సరాలుగా సరఫరా చేస్తున్న నాసిరకం చీరలు మీ ఇంటి ఆడవాళ్ళు వీటిని కట్టుకుంటారా అని ప్రశ్నించిన అనేక మంది వాటిని తగులబెట్టిన సందర్భాలను కూడా మనం చూసినాము. 7 పేదరికము నిర్మూలనకు తగిన చర్యలు లేవు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగాల భర్తీ అసలే జరగలేదు . కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో నియామకం ఉండదని అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు .8 ఉచిత విద్య వైద్యం అనేవి నినాదాలు గానే మిగిలి పోయిన వి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు విభిన్న వర్గాల వారు తమ హక్కులకోసం పోరాటం చేస్తే నిర్బంధం ఎక్కడికక్కడ ఉద్యమాలను అణచి వేయడం జరిగింది. ఇవి మచ్చుకు కొన్ని వైఫల్యాలు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉండే ప్రజలు తమ సమస్యల కోసం పోరాడిన ప్పుడు బిజెపి ప్రభుత్వము వలనే నిర్బంధం అణచివేతకు గురి చేసినట్లు అయితే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? కొత్తదనం ఏమున్నది ?

టిఆర్ఎస్ ఎజెండాలో ఉండాల్సిన మౌలిక అంశాలు

కొత్తగా ప్రకటించబోతున్న భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రజలు డిమాండ్ చేసిందో, కోరినదో, అడిగిందో కాదు . కేవలం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు జరుగుతున్న విఘాతాన్ని మరిచిపోవడానికి అధికారాన్ని విస్తృతం చేసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శల ద్వారా ప్రజల దృష్టిని దేశవ్యాప్తంగా ఉన్న నాయకులతో పరిచయాలు కోసం ఈ రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా అనేక మంది భావిస్తున్నారు . అయితే రాజకీయ పార్టీ పెట్టుకునే అధికారం అర్హత ఎవరికైనా ఉంటుంది .కానీ శ్రీశ్రీ గారు అన్నట్లు” వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం” అన్నట్లుగా భారత రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ పెడితే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. ప్రతిఘటిస్తారు. గత ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన కోసం డిమాండ్ చేస్తారు అనే విషయాన్ని నాయకత్వం మరిచిపోకూడదు . అందుకోసమే మరింత మెరుగైన సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వస్తే కొంత వరకు ప్రజలు ఆదరిస్తారు కావచ్చు. ఆ అభిప్రాయం స్పష్టంగా ఉంటేనే తప్ప పార్టీని మొక్కుబడిగా ఏర్పాటు చేయడం భావ్యం కాదు అందుకోసమే ఈ క్రింది ఎజెండా అంశాలను దృష్టికి తీసుకు వస్తున్నాం.

– 300కు పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కనీస స్థాయికి చేరుకున్నవి. తిరిగి యధాతథంగా వాటిని ప్రభుత్వ రంగ సంస్థలు గా కొనసాగించాలి.

– జీవిత భీమా వంటి సంస్థలతో పాటు ఓడరేవులు రైల్వేలు రక్షణ రంగం అంతరిక్ష రంగం విమానాశ్రయాలు అన్నింటిపైనా ప్రభుత్వానికి అదుపు లేకుండా పోయినది ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా నిర్ణయం తీసుకోవాలి.

— గత ప్రభుత్వం ప్రకటించిన రైతు చట్టాలు విఫలమైన కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మెరుగైన చట్టాల ద్వారా ఆర్థిక ప్రయోజనం జరిగే విధంగా చూడాలి .

– తెలంగాణలో అమలవుతున్న అటువంటి రైతుబంధు దళిత బంధు వంటి పథకాలు అనేక లోపభూయిష్టంగా ఉన్నాయి రైతుబంధు ఐదు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలి. అది క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే అందించాలి. కౌలు రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక దళిత బంద్ కూడా దళితుల లో పేద వర్గాలకు మాత్రమే ఇవ్వాలి. అప్పులు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటే వాటికి ఆ ప్రభుత్వమే వహించే విధంగా ఎజెండాలో అంగీకరించాలి .

– అంబేద్కర్ సూచించినట్లు విద్య వైద్యం న్యాయం మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైనది అందించాలి. ఉచితాలు ప్రలోభాలు వాగ్దానాలు వంటివి అమలు చేయకూడదు ప్రజల కొనుగోలు శక్తిని పెంచినప్పుడు వాళ్లే అన్ని అవసరాలను సమకూర్చుకుంటారు.

— తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక ఉచిత పథకాల కారణంగా అప్పులపాలు అయినటువంటి రాష్ట్ర పరిస్థితి దేశానికి ఏ రకంగా ఆదర్శం అవుతుందో నాయకత్వం ఆలోచించుకోవాలి.

— దేశం లో ఉన్నటువంటి సహజ ప్రకృతి వనరులు అయినటువంటి నదులు గనులు అడవులు భూమి వంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండాలి.
– ఆదేశిక సూత్రాలలో తెలిపినట్లుగా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడాన్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకునే సత్తా ఉండాలి.

– కుటుంబానికి సంపద భూమి నిర్ణీత పరిధిలో ఉండే విధంగా నిర్ణయించినప్పుడు జాతి సంపద ప్రజల అందరికీ సమానంగా చెందుతుంది .

— అసమానతలు అంతరాలు వివక్షత వంటివి రూపుమాపాలి .

– పార్టీ ఫిరాయింపుల చట్టం ని సమగ్రంగా తయారుచేసి దోషులకు తగు శిక్ష విిధి0చాలి.- ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకత్వం మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొ నాలి కానీ ముఖ్యమంత్రి మంత్రులు ప్రధాన మంత్రి వంటి పాలకులు పాల్గొనకుండా చట్టాలు తేవాలి .

– స్వప్రయోజనం కోసం రాజకీయ పార్టీలు చట్టాలు తేవడానికి ఇష్టపడ నప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని పాలకుల తప్పుడు విధానాలకు కట్టడి చేయడానికి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండాలి ఆ స్వేచ్ఛను న్యాయవ్యవస్థకు ఇవ్వాలి.

– పేదరిక నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి సమగ్రమైనటువంటి శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వారిని పైకి తీసుకు వచ్చి మానవాభివృద్ధి ని చట్టబద్ధం చేయాలి.

– పాలక పక్షం తో సహా దేశంలోని రాజకీయ పార్టీలు రాజకీయ అవినీతికి పాల్పడిన సందర్భంలో న్యాయస్థానము తో పాటు ప్రజాకోర్టులో తగిన శిక్షలు విధించాలి.

– కవులు కళాకారులు మేధావులు సామాజికవేత్తలు ప్రజల పక్షాన పని చేస్తున్నప్పుడు వారి సహకారాన్ని తీసుకొని మెరుగైన సమాజంకై ఆలోచించాలి గానీ వారి మీద నిర్బంధము అణచివేతను కొనసాగించడానికి వీలు లేదు.
/ పెట్టుబడిదారీ కార్పొరేట్ వ్యవస్థలను నిరుత్సాహ పరిచే విధంగా ఆ వర్గాలకు వంత పా డకుండా ప్రజల పక్షాన పని చేయడం ద్వారా దీర్ఘకాలికంగా సమసమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా ప్రకటించాలి.

రాష్ట్ర పరిపాలన లోనే అనేక వైఫల్యాలు ఎదుర్కొన్న టువంటి తెరాస పార్టీ భారత రాష్ట్ర సమితి పేరునా జాతీయ పార్టీగా ఏర్పడి అధికారానికి రావాలని సిద్ధపడుతున్న సందర్భంలో ప్రజలు ఆదరించి గెలిపిస్తే పనిచేయడానికి ప్రజా ఎజెండా లేకపోతే అభాసుపాలు కాక తప్పదు. కనుక ప్రజా ఎజెండాతో పాటు ఆ అంశాలపైన చిత్తశుద్ధిగా నిబద్ధత గా పని చేయడానికి సిద్ధపడి నప్పుడు మాత్రమే ఎజెండా ప్రకటించాలి. పార్టీని విస్తృతం చేయాలి ఎన్నికల్లో పోటీ చేయాలి సాధ్యం కాదు అనుకుంటే మొదట్లోనే విరమించుకోవడం శ్రేయస్కరం. లేకుంటే అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, అఖిల పక్షాలు, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాయని పారదర్శకంగా జవాబుదారితనం వహించక తప్పదు అని గుర్తిస్తేనే పార్టీని ప్రకటించాలి. ముందుకెళ్లాలి.

ఇక ఇతర రాష్ట్రాలలో ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్లు కూడా ప్రజల కోసం పని చేస్తామని ఆరాటపడుతున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీని విస్తృతం చేయడం అంత సులభం కాదు. తెలంగాణ లో పని చేసినటువంటి చరిత్రను కొలమానంగా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక్కమాఱు తెరాస పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని తప్పులను సవరించుకొని ప్రక్షాళన చేసుకుంటేనే భవిష్యత్తులో లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుందని ప్రజాస్వామిక వాదులు విశ్లేషకులు చరిత్రకారులు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని ఆ వర్గాలకు చెందిన నిపుణులు మేధావులతో ముందుగా చర్చించిన తర్వాతనే పార్టీని ప్రకటించడం శ్రేయస్కరం .

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *