బెజవాడ బీసెంట్ రోడ్ (కవిత)

ఆదివారం కవిత:

బెజవాడ బీసెంట్ రోడ్

వసుధ

” బే ఆఫ్ బెంగాల్ ” అంత వుండే బెజవాడలో
నా కెంతో ఇష్టమైంది
గుండెకాయంటి బీసెంట్ రోడ్డే !
ఇటు ఏలూరు రోడ్ ..అటు బందరు రోడ్ లను
కలిపే ఈ రోడ్డు…
రోజూ ఎందరెందరిని కలుపుతూ ఉందో..!?

నగరంలో ఏ యిద్దరు కలవాలన్నా
ఆ కలయిక ఇక్కడే!
ఏ ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకోవాలన్నా
ఆ వీడ్కోలు ఇక్కడే !

సీతారామపురం లో రెండేళ్లు
మొగల్రాజపురంలో రెండేళ్లు వున్నా
ఆపైన ఎప్పుడు వచ్చినా
మిత్రులతో నా కలయక ఇక్కడే..!
నడకలు చకచకా సాగంది ఇక్కడే !

నిండుగా తిని రెండో నెంబరు బస్సెక్కి
అప్సరా టాకీస్ పక్కనే బస్సు దిగి
గబగబా వెనక్కి పరుగెత్తి
బీసెంట్ రోడ్డు చేరగానే
ఆదిలోనే స్వాగతించే వినాయక్ పెన్ కార్నర్
నేను కొన్న ఎన్నో పెన్నులకు పుట్టిల్లు !
ఇక మొదలు మా యాత్ర..సర్వత్రా
అడుగడుగునా పలకరించే అంగళ్లు
మా ఆనందాలకు వాకిళ్ళు
నిజానికిదే అప్పటి డీ మార్ట్, షాప్పింగ్ మాళ్ళు
చూడబోతే ఇదే పెద్ద తిరునాళ్ళు!

వస్తూ పోతూ వుండే జనం
రాసుకుంటూ పూసుకుంటూ
ఒక్కోసారి ఢీ కొట్టుకుంటూ…!
అంత సందట్లోనూ ఆగని అచ్చట్లు
ఇంత ఇరుకులోనూ సాగే ముచ్చట్లు
వరసాగా దుకాణాల వారీగా కొనుగోళ్లు
రుమాళ్ళు, నైల్ కట్టర్లు, పాకెట్ దువ్వెనలు
ముందుకేళితే బెల్ట్ లు, పక్కనే కలరా ఉండలు
మతిపోగొట్టే పద్మినీ ధూప్ ష్టిక్ లు
ఇటు చూస్తే టార్చ్ లైట్లు, సాక్స్ లు
కాలి బూట్లు హవాయి చెప్పులు
నైట్ ఫాంట్లు, లోదుస్తులు..దుప్పట్లు తువ్వాళ్ళు
అన్నీ అక్కడే. ..అన్నీ సరసమైన ధరలకే..!
ఓ పక్క నాడార్స్ కాఫీ పొడి ఘుమ ఘుమలు
మరోపక్క ముక్కులు ఆదరగొట్టే
మిర్చి బజ్జీ సువాసనలు…
నోరూరించే భలే రుచులు…!

రద్దీలో తోపిడి లో తెగిన చెప్పుకు..
ఎదురుగానే చెప్పుల వాడి రిపేరు దుకాణం
చెప్పు సిద్ధమయ్యే లోగా
పక్కనే నాలుగు బజ్జీలు ఆబగా స్వాహా!
ఘాటుతో గూబ గుయ్యిమన్న నోటికి
పక్కనే సందులో చల్లని రంగు సోడాతో
సత్వర చికిత్స…ఆహా !
మొదలై గంటయినా సాగింది సగమే!


మొదటి సందు దాటాక
బృందావన్ హోటల్లో మళ్లీ చిరు తిళ్ళు
తోసుకుంటూ పోయే తోపుడు బళ్లు
తోవకడ్డంగా మరిన్ని బళ్లు
వాటిపై పేర్చిన పచ్చని తాజా పళ్ళు,
మామిడి ముక్కలు ఉప్పు కారం కలిసి ఊరిస్తూ..
ముంత మాషాలా బళ్లు ,సోడా బళ్లు
ఆనుకుని చేప చికెన్, స్నాక్స్
వాల్ డెకరేషన్ లు రూమ్ స్ప్రేలు పాలీషులు
స్కూల్ బాగ్ లు యూనిఫామ్ లు

రెండో సందు దాటామో లేదో
అటు అన్నపూర్ణ జైహింద్ జనాలు
ఇటు నవరంగ్ ప్రేక్షకులు ..
హడావిడిగా 5,13 బస్సులు పరుగులు
ఆధునికతను పెనవేసుకున్న వస్త్ర ప్రపంచాలు
సందుల్లో ప్రాచీనతను రంగరించుకున్న దుకాణాలు!

మూడో సందు చేరామోలేదో
స్వచ్చమైన తాజా కూరలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ల తడి పరిమళాలు
తాజా పూల ఘుమాయింపులు ..!

ముందుకే సాగే మా నడక
బందరు రోడ్డును తాకే దాకా..!
ప్రవాహాన్ని తలపించే బందరు రోడ్డు పై జనం
రోడ్డును దాటలేని వైనం..
రారమ్మని పిలిచే ఠాగూర్ గ్రంథాలయం..
రోడ్డు దాటి పోలేక..మళ్లీ వెనకకే నడక
చూడని వాటిని తేరిపారా చూస్తూ
చూసిన వాటిని మళ్ళీ మళ్ళీ చూస్తూ..!

ఇక్కడ కులాలకు తావు లేదు
మతాలకు చోటు లేదు
వున్నవాడు లేనివాడు మధ్యవాడు అంతా
ఇక్కడ కాలినడకన నడవాల్సిందే !
అంతా ఇక్కడ భాయీ భాయీ అనాల్సిందే !
ఓ రెండు గంటలు గడిచాక..
పర్సులు,జేబులు నిండుకున్నాక..
దిగిన చోటనే తిరిగి తిరుగు బస్సెక్కాల్సిందే..!

గడిచిన ఆ గంటలు…చెరగని ఆ స్మృతులూ
ఇంకా మదిలో ప్రతిధ్వనిస్తూ….
మదిలో అల్లరి చేస్తూ….నాటి అల్లరి గుర్తుచేస్తూ
.
రోజులు నెలలు సంవత్సరాలు దాటేసినా
నగరం తన సరిహద్దులని ఎప్పుడో మార్చేసినా
సాంప్రదాయాన్ని పసుపులా ముఖమంతా పూసుకుని
ఆధునికతని అందమైన బొట్టుబిళ్ళలా
నుదుటిన తీర్చుకుని
నవ్వుతో వందలమందిని
నిత్యం ఆప్యాయంగా ఆదరిస్తూ
ఆహ్వానించే బీసెంట్ రోడ్డు…
నగరం నడిబొడ్డున నేలపై కొలువైన మరో దుర్గమ్మే !

ఎన్నేళ్లకు తిరిగొచ్చినా ఆ స్మృతులు
ఎప్పటికీ పదిలమే… పంచేది ఆ పరిమళమే !
వినిపించేది అప్పటి హృదయ నాదమే !
నినదించేది నాటి ఐక్యతా రాగమే!

*******
( ఇటీవల ఓరోజు తీరిగ్గా విజయవాడ బీసెంట్ రోడ్డు లో నెమ్మదిగా నడుస్తున్నప్పుడు 47 ఏళ్ళ కిందటి స్మృతులు చుట్టుముట్టినప్పుడు..)

(ఫోటో కర్టెసి: s s)

“వసుధ” 9490832787

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *