ఇలా అయితే రాయలసీమ రాష్ట్ర ఉద్యమం తప్పదు

 

ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం: బొజ్హా దశరథరామిరెడ్డి.

ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు.

అహింసామార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మాగాంధీ, జైజవాన్ – జై కిసాన్ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు నడిపించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లకు ఆదివారం నంద్యాల గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..

అహింసామార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మాగాంధీ, జైజవాన్ – జై కిసాన్ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు నడిపించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లు కన్న కలలు పాలకుల నిర్లక్ష్యం వలన రతనాల సీమ రాళ్ళ సీమగా, కరువు సీమగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో త్రాగడానికి గుక్కెడు నీరు లభించని ప్రాంతంగా రాయలసీమ నిలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ దుస్థితి, కరువుపై స్పందించాల్సిన ప్రభుత్వం, పాలక, ప్రతిపక్ష పార్టీలు ఆ ఊసే ఎత్తడం లేదని, రాయలసీమ ప్రజా ప్రతినిధులు కూడా నోరు విప్పకపోవడం బాధిస్తోందన్నారు.

శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజదాని లేదా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు, రాష్ట్ర విభజన చట్టం లోని రాయలసీమ అంశాలు పోలవరం – పట్టిసీమ ద్వారా ఆదా అయిన కృష్ణా జలాలు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించడం, కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు, రాయలసీమలో జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కడపలో ఉక్కు కర్మాగారం, అనంతపురంలో ఎయిమ్స్ ఆసుపత్రి, గుంతకల్లులో రైల్వే జోన్, బుందేల్ ఖండ్ తరహాలో కేటాయిస్తామన్న రాయలసీమ ప్రత్యేక నిధులు కేంద్రం నుండి సాధించడంలో గత, ఇప్పటి పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాయలసీమ సమస్యలను కళ్ళుండి చూడని‌, చెవులుండి వినని రాజకీయ పార్టీల వైఖరిని నిరసిస్తూ మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాయలసీమ సమస్యల పట్ల స్పందించేందుకు పాలకులకు, అన్ని రాజకీయ పార్టీలకు మంచి బుద్ది ప్రసాదించమని నల్ల బ్యాడ్జిలు కళ్ళకు, చెవులకు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ మహాత్మాగాంధీ విగ్రహం ముందు బైఠాయించారు.

రాయలసీమ పట్ల రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించకపోతే రాయలసీమ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం, రైతులు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు, యువత, విద్యార్థులతో కలిసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు వై.యన్. రెడ్డి, కొమ్మా శ్రీహరి, ఏర్వ రామచంద్రారెడ్డి, పర్వేజ్, పట్నం రాముడు, మహేశ్వరరెడ్డి, రాఘవేంద్ర గౌడ్, శ్రీనివాసపాండే, కాని చిన్నయ్య, కృష్ణమోహన్ రెడ్డి,వెల్లాల లక్ష్మీవెంకటరెడ్డి, M.V.రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు గులాం వుశేన్, కళాకారులు నారాయణ గౌడ్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *