“అక్టోబర్ 1 ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రకటించాలి.”
శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిందనీ, శ్రీబాగ్ ఒడంబడిక ఆధారంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు అక్టోబర్ 1 ననే అధికారికంగా నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి సంజీవనగర్ గేట్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 అక్టోబర్ 1 న అవతరించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో 1956 నవంబరు 1 న తెలంగాణ ప్రాంతం కలిసిందని, 2014 జూన్ 2 వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయిందని ఆయన వివరించారు. దీంతో అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగుతున్నదని వివరించారు. సాంకేతికంగా అక్టోబర్ 1 నే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు, కావున అక్టోబర్ 1 ననే అవతరణ దినోత్సవం గా చేపట్టడం సహేతుకం అని వివరించారు.
శ్రీ బాగ్ ఒడంబడిక స్ఫూర్తితో తెలుగు రాష్ట్రం ఏర్పడినా రాయలసీమ అన్ని రంగాలలో వెనుకబడి మరింత దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాయలసీమ మౌలిక అంశాలే పట్టనట్లు రాజకీయ వ్యవస్థ మారడం, ప్రభుత్వం కూడా రాయలసీమ పట్ల సవతి తల్లి ప్రేమ కనపరచడం బాధిస్తోందని అన్నారు. తక్షణమే పెండింగ్‌లో వున్న రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, సముద్రం పాలవుతున్న వరద జలాలను రాయలసీమకు మళ్ళించి అవసరమైన రిజర్వాయర్లు నిర్మించి రాయలసీమ శాశ్వత కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నం కాకుండా నదీ పరీవాహక ప్రాంతం, న్యాయరాజధానిలో భాగమైన కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాలలో అక్టోబర్ 1 వ తేదీన, అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గుర్తుగా అక్టోబర్ 1 వ తేదీననే ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని దశరథరామిరెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మిల్క్ డైరీ విశ్రాంత AGM శివశంకర్ రెడ్డి, టెలికాం విశ్రాంత ఇంజనీర్ వెంకటసుబ్బయ్య, పశు సంవర్ధక శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ మీనిగ రామిరెడ్డి, పాణ్యం మండల రైతు నాయకులు ఏరువ రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కృపాకర్, మాలిభాష, కొమ్మా శ్రీహరి, ఇంజనీర్ రాఘవేంద్ర గౌడ్, పట్నం రాముడు, కళాకారుడు నారాయణ గౌడ్, వై.యన్. రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.