* నేడు వావిలాల గోపాలకృష్ణయ్య 117 వ జయంతి
(నిమ్మరాజు చలపతిరావు)
ఆజన్మాంతం నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు పద్మభూషణ్ ‘‘వావిలాల గోపాల కృష్ణయ్య!’’ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశారు. తెలుగునాట మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పేరిందేవి, నరసింహం దంపతులకు 1906 సెప్టెంబరు 17న గోపాలకృష్ణయ్య జన్మించారు. చిన్న తనం నుంచి స్వాతంత్రోద్యమంలో చురకైన పాత్ర పోషించడంతో పెద్ద చదువులకు విఘాతం కలిగింది. ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిరాడంబర జీవితం గడిపిన వావిలాల ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి ‘‘స్వరాజ్య భిక్ష’’ పేరుతో బియ్యం, జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించారు.
‘‘పలనాడు పుల్లరి’’ సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1925లో సత్తెనపల్లిలో ‘‘శారదా నిలయం’’ పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు. గ్రంథాలయ ఉద్యమంలో ఆయన కృషి చిరస్మరణీయం. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టుల మద్దతుతో శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లి నుంచి వరుసాగా 4 సార్లు శాసన సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వావిలాల కృషి ప్రశంసనీయమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘ అధ్యక్షునిగా నియమితులయ్యారు. తెలుగు అమలుకు ప్రభుత్వం నిధులు, విధులు నిర్ణయించనందుకు బహిరంగంగానే విమర్శించేవారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే చేయడానికి విశేషంగా కృషి చేశారు.
1990 నుంచి సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘‘కళాప్రపూర్ణ’’, కేంద్ర ప్రభుత్వం ‘‘పద్మభూషణ్’’ పురస్కారాలను ప్రదానం చేశాయి. శివాజీ, మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి, విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమం వంటి 45 గ్రంథాలతో పాటు, ఇంగ్లీషులో 16 గ్రంథాలను రచించారు. 1952లో చైనా, రష్యాలో అంతర్జాతీయ శాంతి సభల్లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. చివరి రోజులలో అనారోగ్యానికి గురై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన 2003 ఏప్రిల్ 29న పరమపదించారు.
సుదీర్ఘకాలం పాత్రికేయునిగా పనిచేసిన శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య సత్తెనపల్లిలో ఆంధ్ర పత్రిక విలేకరిగా పనిచేస్తూ 1970-78 మధ్యకాలంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా తొలి అధ్యక్షుడిగా కుడా పని చేశారు. యాదృచ్ఛికంగా నేను 1981-91 (ఆంధ్రపత్రిక మూతపడే రోజు ఆఖరి క్షణం వరకు) తెనాలి…ఆపై గుంటూరులో పని చేయడం అటుంచి…. శ్రీ వావిలాల అడుగుపెట్టిన ఏపీయూడబ్ల్యూజే లో గడిచిన 40 ఏళ్లుగా నేను కొనసాగటం…. గుంటూరు జిల్లాలో 1988-2000 మధ్యకాలంలో కన్వీనర్… కార్యదర్శి… అధ్యక్షునిగా పనిచేయటం అదృష్టంగా గర్వకారణం గా భావిస్తూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను.