డ్రోన్ లతో కొడితే పెస్టిసైడ్ అమృత మవుతుందా ?

(కన్నెగంటి రవి)

తెలంగాణా లో పరిపాలన శాస్త్రీయ దృక్పధం తోనో, దూరదృష్టితోనో కాకుండా ఫ్యాన్సీ ఆలోచనలతో సాగుతుందని పదుల కొద్దీ ఉదాహరణలు ఇవ్వొచ్చు . ఈ ఫ్యాన్సీ ఆలోచనలతో వచ్చిన ప్రమాదం ఏమంటే , అవి సుస్థిరంగా ఉండవు. దీర్ఘకాలం మన్నవు. కానీ , దూరం నుండీ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని అమలు చేసిన పాలకుల ఎన్నికల ప్రయోజనాలను నెరవేరుస్తాయి. అవినీతి పరుల జేబులు నింపుతాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపేసి , భవిష్యత్ తరాలకు మోయలేని భారంగా మిగులుతాయి.

అత్యంత ఖరీదైన సాగు నీరు అవసరమయ్యే కోటి ఎకరాల మాగాణం, రాష్ట్రంలో లోతైన భూములు లేని ప్రాంతాలు ఎక్కువని తెలిసినా కోటి ఎకరాల పత్తి సాగు, రాష్ట్ర వాతావరణానికి అనువు గాని లక్షల ఎకరాల ఆయిల్ పామ్ విస్తరణ , సరైన డిజైన్లు, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే , లక్ష కోట్లతో భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి ముంపుకు గురి చేయడం, విద్యుత్ బిల్లులు, భూగర్భ జలాల పట్టింపు లేకుండా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా , వందల కోట్లు వృధా చేసి నిర్మించిన పాలీ హౌజ్ లు , సాగు చేయని భూములకూ చెల్లిస్తున్న రైతు బంధు , చదువుకునే బడులు కూలిపోతున్నా సరే పట్టించుకోకుండా వందల కోట్లతో అట్టహాసంగా గుడుల నిర్మాణాలు – ఇవన్నీ అందులో కొన్ని మాత్రమే .

ఇప్పుడు తాజాగా వీటికి మరో అంశం తోడైంది. అత్యంత ప్రమాదకరమైన పురుగు విషాలను డ్రోన్ల తో రైతుల పంట పొలాలపై పిచికారీ చేయడం. రాష్ట్రంలో సరైన చర్చ జరగకుండానే, భవిష్యత్ ప్రమాదాలను పట్టించుకోకుండానే, ఆచరణలోకి వెళ్ళిపోయిన ఈ కార్యక్రమం , రైతులకు, రాష్ట్రానికి ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ , బహుళ జాతి విష రసాయనాల తయారీ కంపెనీలకు , డ్రోన్ ల తయారీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండిస్తుంది.

నిజానికి రాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళలో రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడానికి ప్రభుత్వం కనీస చర్చ కూడా చేయలేదు. అడ్డ గోలుగా పంటల ప్రణాళికలు ముందుకు తెస్తూ, రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. రాష్ట్ర పర్యావరణం విష పూరితమయ్యేలా, రసాయనిక ఎరువుల, పురుగు, కలుపు విషాల వినియోగం పెరిగిపోతున్నా , ఈ విష వలయం నుండీ బయట పడేయడానికి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధాన రూపకల్పన గురించిన చర్చ చేయలేదు. కనీసం కేంద్రం ప్రకటించిన పరం పరాగత్ కృషి వికాస్ యోజన (పి‌కే‌వి‌వై ) లాంటి పథకాలను కూడా రాష్ట్రంలో సరిగా అమలు చేయ లేదు .

ఫలితంగా పంటల సస్య రక్షణలో , కలుపు నివారణలో విష రసాయనాల వినియోగం ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నది. 2014-15 లో 2806 టన్నుల పెస్టిసైడ్స్ వాడిన తెలంగాణాలో 2016-2017 నాటికి 3436 టన్నులకు , 2017-2018 నాటికి 4866 టన్నులకు, 2018- 2019 నాటికి 4894 టన్నులకు, 2019-2020 నాటికి 4915 టన్నులకు వినియోగం పెరిగిపోయింది.

రసాయన ఎరువుల , పురుగు, కలుపు విషాల వినియోగం పెరగడమంటే మొత్తం రాష్ట్ర పర్యావరణం కలుషితం కావడమే. గాలి, నీరు, నేల, అందులో పండే ఆహారం మొత్తం విష పూరితం కావడమే, తేనెటీగలు తగ్గిపోవడానికి ,తద్వారా సగటు దిగుబడులు పడిపోవడానికి ఈ విషాలే కారణం. భూమి లో సూక్ష్మ జీవుల సంఖ్య తగ్గిపోవడానికి, రాష్ట్రంలో భూ సారం తగ్గి పోవడానికి, భూ గర్భ జలాలలో నైట్రైట్ పరిమాణం పెరిగిపోవడానికి, ఫలితంగా రాష్ట్రంలో క్యాన్సర్ లాంటి జబ్బులు విజృంభించడానికి, ఈ విష రసాయనాలే కారణం. క్యాన్సర్ కు నేరుగా కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నిషేధిత గ్లైఫోసేట్ కలుపు విషం ఇంకా రాష్ట్ర మార్కెట్ లో రైతులకు అందుబాటులో ఉందంటే , మన నియంత్రణ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ దశలోనే , రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ విశ్వ విద్యాలయం గుడ్డిగా కళ్ళు మూసుకుని గుజరాత్ కు చెందిన ధనుకా అనే విషాలు అమ్మే కంపెనీతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నది. చైనా, అమెరికా లాంటి ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో ఈ విషాల వినియోగం తక్కువగా ఉందనీ, వీటి వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందనీ నమ్ముతున్న వ్యాపార సంస్థ ఇది. డ్రోన్ లాంటి మానవ రహిత వైమానిక పరికరాలతో పురుగు విషాలు చిమ్మాలని ఉవ్విళ్లూరుతూ ప్రోత్సహిస్తున్న UPL లాంటి పెస్టిసైడ్స్ అమ్మే సంస్థలు కూడా ఇవాళ తెలంగాణా వ్యవసాయంలో లాభాలు చేసుకోవడానికి పరుగులెత్తుతున్నాయి.

కేంద్ర వ్యవసాయ శాఖ క్రిమిసంహారక చట్టం, 1968 పరిధిలో క్రిమిసంహారకాలను నియంత్రించేందుకు నియమించబడిన సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డు (CIBRC) డ్రోన్ ల ద్వారా పురుగు విషాలు చిమ్మడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (SOP) పేరుతో ఒక డాక్యుమెంట్ కూడా విడుదల చేసింది . ఆ శాఖ వెబ్ సైట్ లో ఇంగ్లిష్ లో ఉన్న ఈ పత్రంలో అంశాలు ఇప్పటికీ స్థానిక భాషలలొ అందుబాటులో లేవు. అందులో ఉన్న అంశాలు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు, రైతులకు ,స్థానిక గ్రామ పంచాయితీలకు తెలియవు.

ఇప్పటివరకు, పౌర విమాన యాన సంస్థ డైరెక్టర్ జనరల్ (DGCA) డ్రోన్‌ల ద్వారా ఏరియల్‌గా పురుగు విషాలను పిచికారీ చేయడానికి షరతులతో కూడిన మినహాయింపులు ఇస్తోంది. అటువంటి మినహాయింపులను ఇచ్చే అధికారం నిజానికి DGCA కి లేదు. క్రిమి సంహారకాల చట్టం, 1968 ప్రకారం, డ్రోన్‌ల ద్వారా వైమానిక స్ప్రేయింగ్‌ను అనుమతించే ఏకైక అధికారం CIBRC కి ఉంది. కానీ వాళ్ళు మౌనంగా ఉంటున్నారు.

ఈ నియమాలలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే , నీటి వనరు మరియు డ్రోన్ లతో పిచికారీ చేసే ప్రాంతం మధ్య 100 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని చెప్పారు .పెస్టిసైడ్ పిచికారీ చేయడానికి ఉద్దేశించిన పంటకు , దాని పక్కనే ఉన్న ఇతర పంటలకూ మధ్య కూడా బఫర్ జోన్ ఉండాలని చెప్పారు. డ్రోన్‌ను నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాస పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటి నుండి 100 మీటర్ల దూరంలో నడపాలి.
డ్రోన్ ల ద్వారా పిచికారీ చేయాలనుకుంటే ఆ విషయాన్ని స్థానిక గ్రామ పంచాయితీకి 24 గంటల ముందుగా తెలియ చేయాలని నియమం ఉంది. అలాగే ఆ ప్రాంతంలోని వ్యవసాయ అధికారికి కూడా సమాచారం ఇవ్వాలి. అయితే, ఈ సమాచారంతో ఏమి చేయాలనే దానిపై గ్రామ పంచాయతీకి నిర్దిష్ట మార్గదర్శనం లేదు. ప్రభుత్వం సంబంధిత పనిని గెజిట్ చేయలేదు. పంచాయితీ చట్టాలలో అటువంటి నిబంధన కూడా లేదు.

డ్రోన్ లతో పిచికారీ చేసినప్పుడు పిచికారీ కార్యకలాపాలతో సంబంధం లేని జంతువులు, వ్యక్తులు నిర్దిష్ట కాలానికి అటువంటి ప్రాంతాలలోకి ప్రవేశించకుండా నిరోధించాలనేది మరో నిబంధన.
అగ్రి డ్రోన్‌లను ఎగరేయడానికి DGCA సర్టిఫైడ్ పైలట్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది అని మరో నిబంధన పెట్టారు. సాధారణంగా, DGCA సర్టిఫికేషన్ డ్రోన్ ఎగిరే సామర్ధ్యం గురించి ఉంటుంది తప్ప పురుగు విషాలను చల్లడం గురించి కాదు. ప్రమాదకర పురుగు విషాలను పే లోడ్‌ లుగా నిర్వహించడంలో పైలట్‌లకు ప్రత్యేక శిక్షణ అవసరం. కానీ ఇప్పుడు డ్రోన్ లు వాడుతున్న వాళ్ళు ఈ శిక్షణ తీసుకున్నారో లేదో రైతులు చూసుకోవాలి. పై చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నారో లేదో వ్యవసాధికారులు పర్యవేక్షించాలి.

నిజానికి , పంటల సస్య రక్షణలో సమర్ధ వంతమైన పాత్ర పోషించేవి, బహుళ పంటల సాగు, అంతర పంటలు, సరిహద్దు పంటలు . ఇవే కాక ఫిరమోన్ ట్రాప్స్ , వేప ఉత్పత్తులు , మన చుట్టూ ఉండే అనేక మొక్కల భాగాలతో చేస్తున్న కషాయాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు రుజువైన విషయం ఇది.

కానీ ఇప్పుడు గాలి వాటం నియంత్రణలో లేని పరిస్థితిలో , డ్రోన్ ల తో విషాల పిచికారీ చేస్తున్నప్పుడు , టార్గెట్ చేసిన పంట కాకుండా, దానికి దగ్గర లోనే ఉన్న ఇతర పంటలపై ఆ విషం ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఆ పంటల మధ్య లోనే ఎవరైనా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే , వాటి పరిస్తితి ఏమిటి ?

డ్రోన్ లు పెరిగిన కొద్దీ, అందరూ ఒకే పంట, ఒకే సారి వేస్తేనే డ్రోన్ లను ఉపయోగించుకోవచ్చు అనే అభిప్రాయం రైతులలో బలపడే అవకాశం ఉంది.
ఇలాంటి మోనో క్రాపింగ్ సృస్టించే విధ్వంసాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం . అది డ్రోన్ ల వల్ల మరింత పెరుగుతుంది. పైగా కొన్ని బహుళ జాతి కంపెనీలకు విత్తనాలు , రసాయనాల అమ్మకాలపై గుత్తాధిపత్యానికి ఇది దారి తీయవచ్చు. బహుళ పంటలతో పాటు, చిన్న చిన్న కమతాలు కూడా మాయమై , నాటే యంత్రాలు , డ్రోన్ లు , బడా హార్వెస్టర్లు లాంటివి ఈజీగా తిరగడానికి వీలుగా సాగు భూములు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం కావచ్చు. ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ కు దారి తీయవచ్చు.

డ్రోన్ ల కొనుగోలుకు సబ్సిడీలు ఇచ్చేలా , కంపెనీలు ప్రభుత్వాల దగ్గర లాబీ చేస్తున్నాయి. రైతు సహకార సంఘాల ను కూడా డ్రోన్ లు కొనుక్కోమని ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో డ్రోన్ విలువ 10 లక్షలు ఉండొచ్చనీ , అందులో 75 శాతం సబ్సిడీ ఇవ్వాలనీ (7.5 లక్షలు) చర్చలు సాగుతున్నాయి. అంటే ఒక రాష్ట్రంలో 5000 డ్రోన్ లు వస్తాయి అనుకున్నా , 375 కోట్ల సబ్సిడీ మొత్తం అన్నమాట . ఇంత ఖర్చు పెట్టి పథకాన్ని అమలు చేసినా, డ్రోన్ లతో పురుగు విషాలు పిచికారీ చేసినా రైతుల కేమీ ఖర్చు తగ్గదు . పురుగు విషం అమృతంగా మారదు.

కేంద్రంలో అధికారం చెలాయిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్న గుజరాతీ రాజకీయ నాయకత్వంతో పోరాడుతూ, మరో వైపు గుజరాతీ పురుగు మందుల కంపెనీలను , గుజరాతీ అమూల్ లాంటి కార్పొరేట్ పాల ఉత్పత్తుల సంస్థలను నెత్తిన పెట్టుకోవడం వల్ల రైతులకు గానీ , మన రాష్ట్రానికి గానీ ఏమీ ఉపయోగం లేదు. దేశానికే మార్గం చూపించిన మన ములకనూరు, ఎనబావి లాంటి గ్రామాలను ప్రోత్సహిస్తే అందరికీ క్షేమం.

(కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక ,
ఫోన్: 9912928422)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *