ఇదే వెంకయ్య నాయుడి విశేషం: సిపిఐ నారాయణ

(డా. కె నారాయణ)

వాక్చాతుర్యంలో వారికి వారే సాటి. వారే ముప్పవరపు వెంకయ్య నాయుడు. జీవరాసుల్లో మానవజన్మ గొప్పది. అయితే సమాజాన్ని నడిపించేందుకు ఒక చుక్కాని కావాలి. దాన్నే రాజకీయ వ్యవస్థగా అంగీకరించాం. ఎవరికివారు త్రికరణశుద్ధిగా నమ్మి నచ్హిన పార్టీలో చేరుతారు.

నేను విద్యార్ధి దశలోనే విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయ వ్యవస్థను ఎంపిక చేసుకున్నాను. ఆ రాజకీయాలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పవిత్రమయిందని నమ్మాను. అందులోనే కొనసాగుతున్నాను. అలాగే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కూడా నెల్లూరులో విద్యార్ధి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావిత విద్యార్థి పరిషత్‌ ద్వారా జనసంఫ్‌ులోకి, అనంతరం జరిగిన సంస్థాగత మార్పుల కారణంగా బీజేపీలోకి చేరి చిత్తశుద్ధితో ఆ పార్టీకి అంకితమయ్యారు.

సమయస్పూర్తి,  కాలానుగుణమైన ఎత్తుగడలు, కలుపుగోలుతనం, మంచి మాట, మర్యాద వారి సొంతం. ఎంతటి సమూహంలో కలిసినా వారి నిబద్దత దాటరు. ఏదైనా పని ఉండి వారిని కలిసి సాయం అడిగితే మీరు అడిగిన స్థానానికి తమ పార్టీ వారు ఎవరైనా సిఫార్సు కోరితే ముందు వారినే సిఫార్సు చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేవారు. ఇటువంటి సందర్భం నాకు కూడా ఎదురయ్యింది.

నెల్లూరు నుంచి విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చేరిన అనంతరకాలంలో  జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున పడగవిప్పింది. ఆ ఉద్యమం లో వెంకయ్యనాయుడు చురుకైన పాత్రవహించారు. సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాశ్‌ నారాయణ నడిపిన ఉద్యమంలో వారితో పాటు పాటు పర్యటించి అనువాదకులుగా రాణించారు. తెలుగు తేజం ఎన్‌టీ రమారావు పదవీచిత్తుడైన తరుణంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో జరిగిన ఉద్యమం లోనూ చురుకైన పాత్రవహించారు. స్వతహాగానే మంచి ఉపన్యాసకుడు కావడంతో పాపులారిటీకి అది ఉపయోగపడిరది.

వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, లోపలా బయటా ఎన్నియిబ్బందులొచ్చినా ఓర్పుగా, నేర్పుగా అధిగమించేవారు. సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఇంతింతై… వటుడిరతింతై అన్న చందాన వెంకయ్య ఎదిగారు. వ్యవస్థలో అత్యున్నమైన ఆ చివరి మెట్టు కూడా ఎక్కుతాడని అందరూ ఊహిచారు. నేను తప్ప. అధ్యక్ష స్థానం అనేది నిస్సందేహంగా సానుకూలంగా ఉండాలి. అయితే ఇప్పుడున్నది స్వతంత్ర ఆలోచనలున్న వాజ్‌పాయ్‌ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం కాబట్టే ఆమ్రపాలి అటలోలా ఉవ్వెత్తున ఎగసి ముగింపు పలకాల్సి వచ్చింది. నమ్మిన విధానాలకు అంకితం అవ్వడం. తాత్కాలిక ప్రలోభాలకు గురికాకుండా ఉంటే సంతృప్తి మిగులుతుంది. సంతృప్తిని మించిన సంపద మానవజీవితానికి ఎదీ లేదు.

వెంకయ్య నమ్మిన సిద్ధాంతానికి మా సిద్దాంతానికి దూరమే కాదు వైరం కూడా. అయినా నమ్మిన విధానానికి కట్టుబడి పని చేసిన వెంకయ్యనాయుడి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. పదవీ విరమణ సాంకేతికమే, జీవిత సాఫల్యం కొరకు అనేక మార్గాలుంటాయి. ఆమార్గాలను ఎన్నుకునే శక్తి వారికే ఉంటుంది. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తున్న వెంకయ్యనాయుడి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

(కె నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *