విజయవాడలో రా.వి శాస్త్రి శతజయంతి సభ

*జనసాహితి నిర్వహణలో 30-7- 2022  శనివారం
సాయంత్రం 5.00గంటలకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి శతజయంతి సభ!

*చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయం
శిఖామణి సెంటర్ ప్రజాశక్తి నగర్  విజయవాడలో

***

రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలు ఆధునిక తెలుగు సాహిత్యానికొక కొండ గుర్తు !
క్షీణ దోపిడీ వ్యవస్థపై సెర్చ్ లైట్ రావి శాస్త్రి సాహిత్యం.
*”రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందోనని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను భావిస్తాను. మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను. ఇది తెలుసుకొందికి తెలియ చెప్పటానికి నేను ఇదంతా రాశాను.”* అన్నారు రావి శాస్త్రి.
1922 జూలై 30వ తేదీన అనకాపల్లి దగ్గర తుంపాల గ్రామంలో పుట్టిన రావి శాస్త్రి,
1993 నవంబరు 10న మరణించేదాకా 40 సంవత్సరాల పాటు నిర్విరామంగా రచనలు చేశారు. కథ, నవల, నాటకం, వ్యాసం, పొట్టికథలు ప్రక్రియలలో గొప్ప సాహిత్య సృజన చేశారు.
ఆయన రాసిన *ఆరు సారా కథలు, మరో ఆరు సారో కథలు , కలకంఠి , బాకీ కథలు* ఇంకా శ్రీశ్రీ మహాప్రస్థానంలో ‘ కాదేదీ కవిత కనర్హం ‘ అంటూ రాసిన *రుక్కులు* కవితలోని 9 అంశాల పైనా కథలు రాశారు. ఖచ్చితమైన కొలతలతో రూపొందిన ఆయన కథలలో ఒక వాక్యం తీసివేయలేము చేర్చలేము అన్నట్లు ఉంటాయని విమర్శకులు చెప్తారు.
ఇంకా నవలలలో *అల్పజీవి, రాజు – మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, రత్తాలు – రాంబాబు, ఇల్లు, మూడు కథల బంగారం, సొమ్మలు పోనాయండి* మొదలైనవి జగత్ ప్రసిద్ధి చెందినవి. నాటకాలలో ‘విషాదం’ ‘నిజం’ ‘తిరస్కృతి’ చాలా పేరు గడించినవి.
సత్యం చెప్పేవాడిని హత్య చేసి అమాయకుడిని ఉరితీసే రాజకీయ పోలీసు న్యాయవ్యవస్థల తీరుతెన్నులను 60 ఏళ్ల క్రితమే ‘నిజం’ నాటకంగా ఎక్స్ రే తీసి, సమాజం ముందు దృశ్యమానం చేసినవాడు రావి శాస్త్రి.
“సమాజాన్ని వేయికళ్లతో కనిపెట్టిన వాడు రావిశాస్త్రి” అని శ్రీశ్రీ ప్రశంసించాడు.
విశాఖపట్నంలో ఆయన పేరెన్నికగన్న న్యాయవాది. పేదల న్యాయవాదిగా సుప్రసిద్ధుడు.
*విరసం* ఏర్పడిన తొలి సంవత్సరాలలో ఆయన ఉపాధ్యక్షుడిగా కొంతకాలం ఉన్నారు. ఆయన చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన రాస్తూనే ఉన్నారు.రావిశాస్త్రి మరణించిన నెల తిరగకుండానే 1993 డిసెంబర్లో ఆయనపై *ప్రజాసాహితి* ఒక ప్రత్యేక సంచిక వెలువరించింది. ఈ జూలై నెలలో ఆయన శతజయంతిని పురస్కరించుకుని మరొక ప్రత్యేక సంచికను ప్రజాసాహితి తెచ్చింది.
ఆ సంచికను ఈ సభ సందర్భంగా ఆవిష్కరించుకుందాం.!
రావిశాస్త్రి శత జయంతి సందర్భంగా ఆయన సాహిత్య సమాలోచన జరుపుదాం!!
అందరికీ ఇదే మా ఆహ్వానం!!

***

కార్యక్రమం

సభాధ్యక్షులు : వేములపల్లి రాధిక (జనసాహితి)
ప్రత్యేక సంచిక ఆవిష్కరణ:: దుగ్గిరాల సత్యనారాయణ రెడ్డి (రిటైర్డ్ జిల్లా జడ్జి)

ఉపన్యాసకులు

*తాటి శ్రీకృష్ణ (రావిశాస్త్రి సాహిత్య పరిశోధకులు)
*బి. అరుణ (జన సాహితి ప్రధాన కార్యదర్శి)
*అరసవిల్లి కృష్ణ (విరసం అధ్యక్షులు)
*పెనుగొండ లక్ష్మీనారాయణ (అరసం జాతీయ నాయకులు)
*వొరప్రసాద్ (సాహితీ స్రవంతి)
*సింగంపల్లి అశోక్ కుమార్
(శ్రీ శ్రీ సాహిత్య నిధి)
*బండ్ల మాధవరావు (కవి)
*దివికుమార్* (అధ్యక్షుడు జన సాహితి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *