నేతన్న బీమా పథకం అంచనాలకే పరిమితమా? 

 

– వడ్డేపల్లి మల్లేశము

భారతదేశంలో కులవృత్తులు చేతి వృత్తుల లో పనిచేస్తున్న కోట్లాదిమంది శ్రమజీవులు ఒకవైపు భద్రత లేకుండా మరొకవైపు చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా దారిద్ర్యరేఖ దిగువన ఉన్న 20 శాతం లో మెజారిటీ ప్రజలు చేతి వృత్తులకు సంబంధించిన వారే కావడం గమనార్హం. ఉత్పత్తిలో భాగస్వాములై దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కార్మికులు, చేతివృత్తుల వాళ్లు, రైతులు జాతి సంపదను అనుభవించడంలో మాత్రం పనికిరాకుండా పోతున్నారు . వివక్షత, నిర్లక్ష్యం, పెట్టుబడిదారులకు వంత పాడుతున్న ప్రభుత్వాలు సామాన్యుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో మాత్రం విఫలమవుతున్నాయి.

ఈ లోటును భర్తీ చేసుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి, ప్రలోభాలు వాగ్దానాలు బూటకపు ప్రచారాలతో ,ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి చేసే క్రమంలో రైతుబంధు, దళిత బంధు, ఉచిత బీమా వంటి ప్రణాళికలు ప్రకటించి వాటిని కూడా అమలు చేసే సందర్భంలో విపరీతమైన అటువంటి అవినీతి చోటుచేసుకోవడాన్ని గమని0చవచ్చు.

పాలకులు సామాన్య ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు, బీసీలు, అట్టడుగు వర్గాలు, దళిత బహుజనుల పట్ల, ఉత్పత్తి రంగాలలో క్రియాశీలక భూమిక పోషించే కులాల పట్ల చూపించేది కేవలం కపట ప్రేమ అని తెలుస్తున్నది.

ఉపాధికల్పన ను మెరుగుపరచాలి:-

దేశంలో ఉన్న ప్రకృతి మానవ వనరులను సద్వినియోగం చేసుకునే క్రమంలో అర్హులైన, నిపుణులైన యువతకు ఉపాధి విషయంలో పెద్ద పీట వేసే విధంగా ప్రభుత్వం యువజన విధానాన్ని ప్రకటించి ఆదుకోవాలి. మరొకవైపు ఆయా రంగాలలో పని చేస్తు కనీసం 65 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వారందరికీ నామమాత్రపు ఆదాయం కాకుండా మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.

ఆదాయ మార్గాలను అన్వేషించ కుండా, మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రభుత్వాలు ఆలోచించకుండా, మధ్యేమార్గంగా ఏదో కారణం వల్ల చనిపోతే ఈ పరిహారాన్ని ప్రకటించి చేతులు దులుపుకునే పనిచేయడం” చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం వంటిదే”. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలకు ఉచిత బీమా పథకం సంవత్సరం క్రితం ప్రకటించి ఇప్పటి వరకు అమలు కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి మచ్చుతునక.

నేతన్నకు ప్రకటించిన ఉచిత బీమా పథకం నేపధ్యం...

ప్రజల ఆరోగ్యం ,అభివృద్ధి, జీవన ప్రమాణం ,మెరుగైన ఆదాయం, కుటుంబ సంక్షేమం పట్ల పూర్తి సమయాన్ని కేటాయించవలసిన ప్రభుత్వాలు పై అంశాలను తుంగలో తొక్కి కేవలం వారి స్వప్రయోజనాలకు, ఎన్నికల్లో గెలుపొంద డానికి ,అక్రమ సంపాదనకు, అనుచరులకు ఎక్కువగా తోడి పెట్టడానికి మాత్రమే పరిమితమవుతున్న పాలకులు సందర్భోచితంగా ఇచ్చిన హామీలను ఏళ్ల తరబడిగా మర్చిపోతూనే ఉన్నారు.

ప్రజలను గొర్రెలు గా, బానిసలుగా, తలవంచుకుని బతికే వాళ్లు గానే చూస్తున్నారు అనేది నగ్నసత్యం. కానీ ఈ గొర్రెలు బానిసలే ప్రతిఘటించే రోజు తప్పక వస్తుందనే వాస్తవం ప్రభుత్వాలు గుర్తించడం చాలా అవసరం.

ఉచిత బీమా పథకం -రూపకల్పన

ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరమగ్గాలు చేనేత పై ఆధారపడి లక్షల సంఖ్యలో పని చేస్తున్న వాళ్లు చాలీచాలని ఆదాయంతో బ్రతుకుతున్న విషయం వాస్తవం.

 

ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడి ,మానసిక క్షోభ తో, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు ఒకవైపు ,అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు మరొకవైపు సమాజాన్ని ఆలోచింపజేసిన సందర్భాలు అనేకం. ప్రజల మాన రక్షణకు నిరంతరం తపిస్తున్న నేతన్నలు ఆరోగ్యంగా సుభిక్షంగా కుటుంబాలను పూర్తిస్థాయిలో పోషించుకునే విధంగా ఉన్నతంగా జీవించాలని కోరుకోవడంలో తప్పులేదు. సమాజంలోని భిన్న వర్గాలు కూడా నేతనల పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పదు.

అయితే వ్యక్తిగతంగా ఉపాధి కల్పించుకుని వస్త్ర ఉత్పత్తి లో పాల్గొనేవారు, చేనేత సహకార సంఘాలు ఇతరత్రా పని చేస్తున్నటువంటి నేత కార్మికులు తమ ఇబ్బందులను ఎవరితో చెప్పుకోలేక ,నూలు ధరలు, రంగుల ధరలు పెరిగి, గిట్టుబాటు కాని పరిస్థితిలో, దినసరి కూలీ కూడా యజమానులు తక్కువగా చెల్లిస్తున్న కారణంగా రోజువారి ఆదాయము నామమాత్రంగానే ఉండిపోవడం కూడా వీరి దుస్థితికి కారణం అవుతున్నది .

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వీరు అప్పుడప్పుడూ తమ హక్కుల రక్షణ కోసం, ఆదాయ పెరుగుదల కోసం, కూలి రేట్లు పెంచాలని నిరసనలు తెలిపిన సందర్భాలు కూడా లేకపోలేదు. అదే క్రమంలో యజమానులు కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని మర మగ్గాలు చేతి మగ్గాలను బందు చేసి వారు కూడా నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

కాబట్టి ప్రభుత్వాలు యజమానులను కార్మికులను సమన్వయ పరిచే విధంగా పరిశ్రమ ఎదురుకుంటున్న ఆర్థిక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. నేత కార్మికుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచడానికి ఆలోచించకుండా చనిపోయిన వారికి మాత్రం ఐదు లక్షల బీమా ఇస్తామని ప్రకటించడం కూడా” కొండను తవ్వి ఎలుకను తీయడం లాంటిదే “అని కొంతమంది విమర్శిస్తున్నారు కూడా.

అనివార్యమైన పరిస్థితిలో…

అనివార్యమైన పరిస్థితిలో ఉచిత బీమా పథకానికి నేతన్నలు అంగీకరించక తప్పడం లేదు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు గత సంవత్సరం జూలైలో సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో రెండు మూడు నెలల్లో ఉచిత బీమా పథకాన్ని నేత కార్మికులకు వర్తింప చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది .కానీ ప్రకటన చేసి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు మార్గదర్శకాలు రూపొందించక పోవడం ప్రభుత్వ విధానంలోని డొల్లతనానికి నిదర్శనంగా భావించవచ్చు.

నేత విభాగంలో పనిచేస్తున్న 18 నుంచి 59 సంవత్సరాల లోపు కార్మికులకు చనిపోయిన సందర్భంలో 5 లక్షల ఉచిత బీమా ను అమలు చేయడానికి ప్రకటించిన బీమా పథకం అంచనాలకు మాత్రమే పరిమితమై పోయినది. 2022-23సం. కి ప్రకటించిన బడ్జెట్ లోనూ ఈ పథకాన్ని పొందుపరిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని రైతులకు వర్తింప చేసిన విధంగానే నేత కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం ద్వారా పేద కుటుంబాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం ఆశించిన ప్పటికీ గత సంవత్సర కాలంగా అనేకమంది పేదరికం, అనారోగ్యం, ఆకలి చావులతో కుటుంబాలకు దూరమైనా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయని కారణంగా అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి సవాలుగా మారినది.

పథకం పట్ల ప్రభుత్వ ఆలోచన

ఈ పథకం కింద రాష్ట్రంలోని 55,072 మంది నేతన్నలు అర్హులని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించి గత బడ్జెట్ లో 29.88 కోట్లు మంజూరు చేయడం జరిగింది. రైతు భీమా పథకం వలనే ఈ పథకాన్ని కూడా జీవితబీమా సంస్థ ద్వారా అమలు చేయించడానికి ఆలోచించిన ప్రభుత్వం నేత కార్మికుల పేరిట బీమా ప్రీమియం 4,599 రూపాయలతో పాటు జీఎస్టీ కింద 828 కలుపుకుని మొత్తం 5,426 రూపాయలను రాష్ట్రప్రభుత్వం చెల్లించే విధంగా ప్రతిపాదనలు తయారుచేసి చేనేత వస్త్ర పరిశ్రమ శాఖ ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపినట్లుగా తెలుస్తున్నది.

అమలుకు నోచుకోవడం లేదు ఎందుకు?

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతోనే ఈ పథకానికి సంబంధించి చేనేత జౌళి శాఖ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఆమోదము కానీ విధి విధానాలు ఖరారు కాని కాకపోవడం విచారకరమే. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేత కార్మికుల ఉచిత బీమా పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని ముఖ్యమంత్రితో సహా మంత్రి కేటీఆర్ కూడా హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కార్యాచరణ ప్రకటించక పోవడం నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది.

అనేక పథకాలను, ఉపాధి అవకాశాలను, ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలను ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు నామమాత్రంగానే ఉన్నది అని చెప్పడానికి నేతన్నల ఉచిత బీమా పథకం ఒక ఉదాహరణ గా నిలిచిపోతుంది. ప్రకటనలకు పరిమితమై, ప్రజల దృష్టిని మళ్లించి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూపుతున్న శ్రద్ధ ప్రజల సమస్యల పట్ల చూపని కారణంగా అనేక పథకాలు గాలిమేడలు గానే మిగిలి పోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సంబంధితు లందరికీ అమలు చేయాలని నేతన్నలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ పథకంపై అందుతున్న కొన్ని సూచనలు:-

ప్రకటించి ఏడాది అయినా ఇప్పటికీ అమలు కాకపోయినప్పటికీ ఈ పథకం యొక్క అమలులో మరింత పారదర్శకత ఉండేవిధంగా కొన్ని సూచనలను సంబంధిత కార్మికులు, ప్రజలు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి అందజేస్తున్నాయి.

– నేత విభాగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు ఆయా కుటుంబాల అవసరాలను బట్టి 65 సంవత్సరాల వరకు కూడా పని చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఈ బీమా పథకాన్ని 59 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల కనీసం 50 శాతం కార్మికులకు ఈ పథకం వర్తించకుండా పోయే ప్రమాదం ఉన్నది. కనుక ఈ పథకాన్ని 65 సంవత్సరాల వరకు పొడిగించాలని కార్మికులు కోరుతున్నారు.
– ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని కారణంగా, ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచడానికి చొరవ చూపని కారణంగా కుటుంబాలు వీధిన పడుతూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యజమానులు కారణాలేవైనా మృత్యువాత పడుతున్నారు. కనీసం వారి కుటుంబాలను అయినా పోషించుకోవడానికి తక్షణమే ఉచిత బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు అయినా చేదోడుగా నిలవాలని జాప్యం పనికిరాదని కార్మికులు, రచయితలు, మేధావులు, ప్రజాసంఘాలు కోరుతున్నారు.
– ఈ పథకాన్ని కేవలం రైతులకు నేత కార్మికులకు మాత్రమే కాకుండా ఇతర చేతివృత్తులు కుల వృత్తుల లో పని చేస్తున్నటువంటి లక్షలాది కార్మికులకు కూడా వర్తింప చేయడం ద్వారా వృద్ధాప్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇతర కార్మికులు కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఈ ఆలోచన దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల లో కూడా నిర్బంధంగా అమలు చేయడం ద్వారా కుటుంబాల ఆదాయం పెంచడానికి అనాథలుగా మారిన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుందని ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా అమలు చేయడమే తక్షణ కర్తవ్యమని మనమందరం ఈ సందర్భంగా కోరుకుందాం.

Vaddepalli Mallesam
Vaddepalli Mallesam

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత. హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *